శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
సాంక్రమిక వ్యాధుల సన్నద్ధత ఆవిష్కరణల బృందం (సీఈపీఐ) పరిధిలో ఆసియాలో మొదటి ఆరోగ్య పరిశోధన సంబంధిత ‘‘చికిత్స పూర్వ యంత్రాంగ కేంద్రం’’ ప్రారంభించిన కేంద్ర మంత్రి డా. జితేంద్ర సింగ్
పరిశోధన-అభివృద్ధి దిశగా పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల్లో సూక్ష్మజీవ సంవర్ధక నిలయంగా వ్యవహరించేలా జన్యుపరంగా నిర్దేశిత మానవ అనుబంధ సూక్ష్మజీవ సంవర్ధక సంగ్రహణ (జీఈ-హ్యూమిక్) కేంద్రాన్ని ఆవిష్కరించిన డా. జితేంద్ర సింగ్
టీకా అభివృద్ధి కోసం ప్రైవేటు రంగంతో డజనుకు పైగా ఒప్పందాలు, ఎంవోయూలు కుదుర్చుకున్న డా. జితేంద్రసింగ్ నాయకత్వం వహిస్తున్న సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బయోటెక్నాలజీ విభాగం
Posted On:
16 JUL 2024 4:10PM by PIB Hyderabad
సాంక్రమిక వ్యాధుల సన్నద్ధత ఆవిష్కరణల బృందం (సీఈపీఐ) పరిధిలోని ఆసియాలో మొదటి ఆరోగ్య పరిశోధన సంబంధిత ‘‘చికిత్స పూర్వ యంత్రాంగ కేంద్రాన్ని’’ కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ ఫరీదాబాద్ లోని ‘‘పరివర్తిత ఆరోగ్య శాస్త్ర, సాంకేతిక సంస్థ (టీహెచ్ఎస్టీఐ)’’లో నేడు ప్రారంభించారు.
సాంక్రమిక వ్యాధుల సన్నద్ధత ఆవిష్కరణల బృందం (సీఈపీఐ) బీఎస్ఎల్ 3 వ్యాధికారకాలను నిర్వహించగల సామర్థ్యం ప్రాతిపదికన బ్రిక్ – టీహెచ్ఎస్టీఐని చికిత్స పూర్వ యంత్రాంగ ప్రయోగశాలగా ఎంచుకుంది. ఇది అంతర్జాతీయంగా 9వ యంత్రాంగ ప్రయోగశాల, ఆసియా మొత్తంలో ఆ తరహాలో మొదటిది కూడా. మిగతా ప్రయోగశాలలు యూఎస్ఏ, ఐరోపా, ఆస్ట్రేలియాలో ఉన్నాయి. ప్రయోగాత్మక జంతు సంరక్షణ కేంద్రం దేశంలోని అతి పెద్ద చిన్న జంతు కేంద్రాలలో ఒకటి. అందులో రోగనిరోధకత తక్కువగా ఉన్న ఎలుకలు సహా దాదాపు 75వేల ఎలుకలు, కుందేలు, సీమ ఎలుకలు, గినియా పందులు మొదలైన ఇతర జాతులు ఉన్నాయి.
కేంద్ర సైన్స్ అండ్ టెక్నాలజీ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), భౌగోళిక శాస్త్ర సహాయ మంత్రి (స్వతంత్ర హోదా), పీఎంవో, అణుశక్తి శాఖ, అంతరిక్ష విభాగ సహాయ మంత్రి; సిబ్బంది వ్యవహారాలు, ప్రజా ఫిర్యాదులు, పింఛను శాఖ సహాయమంత్రి డా. జితేంద్ర సింగ్ పరిశోధన-అభివృద్ధి దిశగా పరిశోధన సంస్థలు, విశ్వవిద్యాలయాలు, పరిశ్రమల్లో సూక్ష్మజీవ సంవర్ధక నిలయంగా వ్యవహరించేలా జన్యుపరంగా నిర్దేశిత మానవ అనుబంధ సూక్ష్మజీవ సంవర్ధక సంగ్రహణ (జీఈ-హ్యూమిక్) కేంద్రాన్ని కూడా ఆవిష్కరించారు.
విద్యా సంస్థలు - హాస్పిటళ్లు, పరిశ్రమల మధ్య జాతీయ, అంతర్జాతీయ సహకారాన్ని పెంపొందించే నోడల్ వనరుల కేంద్రంగా ఇది సేవలందిస్తుంది. ఇది దేశంలో పరిశోధకులకు ఉపయోగపడేలా జన్యుపరంగా వర్గీకృతమైన నిర్దిష్ట వ్యాధికారక రహిత జంతువుల (శీతల స్థితిలో భద్రపరిచిన పిండాలు, స్పెర్మ్ సహా) నిలయంగా కూడా ఉంటుంది.
టీహెచ్ఎస్టీఐ అనేది సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నేతృత్వంలోని బయో టెక్నాలజీ విభాగానికి చెందిన పరిశోధన, ఆవిష్కరణ మండలికి (బీఆర్ఐసీ) చెందిన సంస్థ. ఇది నిఫా వైరస్, ఇన్ఫ్లూయెంజా, ఇతర శ్వాసకోశ వ్యాధులకు టీకా అభివృద్ధి, పరిశోధన కోసం ప్రైవేట్ రంగంతో డజనుకు పైగా ఒప్పందాలు, ఎంవోయూలు కుదుర్చుకోవడానికి అవకాశం కల్పించింది. దేశంలో ఆవిష్కరణాత్మక, అత్యాధునిక ప్రాథమిక పరిశోదనలను కూడా సులభతరం చేస్తుంది; వ్యాక్సిన్, ఔషధ అభ్యర్థుల పరీక్షలో అనువర్తిత పరిశోధనకు దోహదపడుతుంది, వ్యాధి పురోగతి/పరిష్కార సంబంధిత జైవిక సూచకాలను గుర్తిస్తుంది; పరిశ్రమలు- విద్యారంగం మధ్య అనుసంధానతతో అన్ని రంగాలు, వృత్తుల్లో పరిశోధన సహకారాన్ని పెంపొందిస్తుంది.
టీహెచ్ఎస్టీఐ 14వ వ్యవస్థాపక దినోత్సవంలో ప్రసంగిస్తూ, ప్రారంభమైనప్పటి నుంచి దాని ప్రయాణాన్ని డా. జితేంద్ర సింగ్ గుర్తుచేశారు. ఈ కేంద్రం ప్రారంభంలో డా. ఎం.కె. భాన్, ఆయన కృషిని ఆయన గుర్తుచేసుకున్నారు. “14 ఏళ్ల స్వల్ప వ్యవధిలో, ఈ సంస్థ అనేక మైలురాళ్లు దాటింది. కోవిడ్ విపత్తు సమయంలోనూ గ్రాఫ్ ఎగువనే ఉండడం దాని ప్రాధాన్యాన్ని చాటి, ఈ సంస్థ కృషికి గుర్తింపునిచ్చింది” అని మంత్రి అన్నారు. బయో టెక్నాలజీ విభాగం కూడా అంత పాతదేమీ కాదన్నారు.
వనరుల కొరత ఉన్నప్పటికీ డీబీటీ స్థిరమైన పురోగతిని మంత్రి ప్రశంసించారు. కార్యాలయ మౌలిక సదుపాయాలు మొదలైన వాటికి సంబంధించి ఆ విభాగం అవసరాలను పేర్కొని, సహకరిస్తామని ఆయన హామీ ఇచ్చారు.
కోవిడ్ విపత్తు సమయంలో ఈ సంస్థ కీలకపాత్ర పోషించిందని, భారత్ లో అత్యవసర వినియోగానికి అనుమతి పొందిన వ్యాక్సిన్ ను అభివృద్ధి చేసిందని సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి ప్రశంసించారు. డీబీటీలో టీకా అభివృద్ధి, పరిశోధనలను ప్రత్యేకంగా పేర్కొంటూ, “నివారక ఆరోగ్య భద్రతలో భారత్ ముందువరుసలో ఉన్న దేశంగా గుర్తింపు పొందింది’’ అని అన్నారు.
సమకాలీన ఆరోగ్య సమస్యలకు సంబంధించి కొన్ని సవాళ్లను కూడా డాక్టర్ జితేంద్ర సింగ్ వెల్లడించారు. స్వయంగా ఎండోక్రినాలజిస్ట్ అయిన ఆయన భారతీయుల్లో జీవనశైలి సంబంధిత జీవక్రియ వ్యాధుల భారాన్ని ప్రధానంగా పేర్కొన్నారు. టీబీ ముక్తభారత్ పై ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికతను ప్రస్తావిస్తూ, ఆయన కృషిలో అందరూ భాగస్వాములు కావాలని ఉద్ఘాటించారు.
నిఫా మోనోక్లోనల్ ప్రతిరోధకాల అభివృద్ధిలో టీహెచ్ఎస్టీఐ పోషించిన పాత్రను డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రముఖంగా ప్రస్తావించారు. శిశు మరణాలను తగ్గించడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన తక్షణ కంగారూ – తల్లి సంరక్షణను తాజా ఉదాహరణగా ప్రధానంగా పేర్కొన్నారు.
డీబీటీ కార్యదర్శి డా. రాజేశ్ గోఖలే, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు డా. శ్రీకాంత్ రెడ్డి, టీహెచ్ఎస్టీఐ డైరెక్టర్ డా. కార్తికేయన్ కూడా సమావేశంలో పాల్గొన్నారు.
***
(Release ID: 2033931)
Visitor Counter : 113