మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ
ఉన్నత విద్య కోసం భారతీయ భాషలో పాఠ్యపుస్తకాల రచనపై వర్క్ షాప్ ను ప్రారంభించిన డాక్టర్ సుకాంత మజుందార్
విద్యావిధానం దేశంలోని విస్తారమైన భాషా వైవిధ్యాన్ని ప్రతిబింబించాలి - డాక్టర్ సుకాంత మజుందార్
3 ముఖ్యమైన ప్రాజెక్టులు ప్రారంభం : 22 భాషల్లో 5 సంవత్సరాలలో 22000 పుస్తకాలను తయారు చేసేందుకు అస్మిత; బహుభాషా నిఘంటువులను సృష్టించడానికి బహుభాషా శబ్దఖోష్ ; అనువాద సామర్థ్యాలను పెంపొందించడానికి రియల్ టైమ్ ట్రాన్స్ లేషన్ ఆర్కిటెక్చర్
Posted On:
16 JUL 2024 7:36PM by PIB Hyderabad
ఉన్నత విద్య కోసం భారతీయ భాషలో పాఠ్యపుస్తకాల రచనపై వైస్ ఛాన్సలర్ల ఒక రోజు వర్క్ షాప్ ను కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి డాక్టర్ సుకాంత మజుందార్ మంగళవారం ఢిల్లీలో ప్రారంభించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యుజీసి), భారతీయ భాషా సమితి (బి బి ఎస్) సంయుక్తంగా ఈ వర్క్ షాప్ ను నిర్వహించాయి.
విద్యా మంత్రిత్వ శాఖ లోని ఉన్నత విద్యా శాఖ విభాగం కార్యదర్శి కె.సంజయ్ మూర్తి; భారతీయ భాషా సమితి చైర్మన్ ప్రొఫెసర్ చాము కృష్ణశాస్త్రి; యు జి సిbచైర్మన్ ప్రొఫెసర్ ఎం.జగదీశ్ కుమార్ , 150కి పైగా విశ్వవిద్యాలయాల వైస్ చాన్స్ లర్లు, ప్రముఖ విద్యావేత్తలు, ఇతర ప్రముఖులు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు.
వివిధ ఉన్నత విద్యా కోర్సులకు భారతీయ భాషల్లో స్టడీ మెటీరియల్ ను సిద్ధం చేయవలసిన అవసరాన్ని వర్క్ షాప్ ప్రారంభ సెషన్ లో డాక్టర్ సుకాంత మజుందార్ వివరించారు. విద్యావిధానం దేశంలోని విస్తారమైన భాషా వైవిధ్యాన్ని ప్రతిబింబించాలని, విద్యార్థులకు వారి మాతృభాషల్లో విజ్ఞానం అందుబాటులో ఉండేలా చూడాలని అన్నారు. 'వికసిత్ భారత్' లక్ష్యాన్ని నెరవేర్చడంలో దార్శనిక నాయకత్వాన్ని అందించినందుకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జాతీయ విద్యావిధానం 2020 దేశ నిర్మాణంలో భాగస్వాములు అయ్యేలా యువతను ప్రేరేపించడానికి పునాది వేస్తుందని డాక్టర్ మజుందార్ అన్నారు. ఎన్ ఇ పి 2020 అమలును ముందుకు తీసుకువెళ్ళినందుకు శ్రీ ధర్మేంద్ర ప్రధాన్ కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
భారతీయ భాషలు దేశ ప్రాచీన చరిత్రకు, తరతరాలుగా సంక్రమించిన జ్ఞానానికి నిదర్శనాలని డాక్టర్ మజుందార్ అన్నారు. యువ తరాలను సంరక్షించుకోవాలని, సుసంపన్న సాంస్కృతిక, భాషా వారసత్వంపై వారి నమ్మకాన్ని బలోపేతం చేయాలని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ప్రొఫెసర్ చాము కృష్ణ శాస్త్రి భారతీయ భాషా పర్యావరణ వ్యవస్థను అభివృద్ధి చేయాల్సిన అవసరాన్ని వివరించారు. శ్రీ ఎం.జగదీష్ కుమార్ కొన్ని విలువైన అభిప్రాయాలను పంచుకున్నారు.
ముగింపు సమావేశంలో శ్రీ కె.సంజయ్ మూర్తి మూడు ముఖ్యమైన ప్రాజెక్టులను ప్రారంభించారు. అవి అస్మిత ( ఆగ్మెంటింగ్ స్టడీ మెటీరియల్స్ ఇన్ ఇండియన్ లాంగ్వేజెస్ త్రూ ట్రాన్స్ లేషన్ అండ్ అకడమిక్ రైటింగ్- అనువాదం, అకడమిక్ రచన ద్వారా భారతీయ భాషలలో స్టడీ మెటీరియల్ ను పెంచడం); బహుభాషా నిఘంటువులను సృష్టించడానికి బహుభాషా శబ్దఖోష్ ; అనువాద సామర్థ్యాలను పెంపొందించడానికి రియల్ టైమ్ ట్రాన్స్ లేషన్ ఆర్కిటెక్చర్. ఈ ప్రాజెక్టులన్నింటికీ రూపకల్పన చేయడంలో ప్రధాన పాత్ర టెక్నాలజీ అని, వీటిలో ఎన్ ఇ టి ఎఫ్, బి బి ఎస్ లు కీలక పాత్ర పోషిస్తాయని శ్రీ మూర్తి అన్నారు.
భారతీయ భాషా సమితి సహకారంతో యు జి సి నేతృత్వంలోని అస్మిత కింద వచ్చే ఐదేళ్లలో 22 షెడ్యూల్డ్ భాషల్లో 22000 పుస్తకాలను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. సెంట్రల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ (సీఐఐఎల్ ) ఆధ్వర్యంలో బహుభాషా శబ్దఖోష్ కింద భారతీయ భాషా సమితి సహకారంతో బహుభాషా నిఘంటువుల బృహత్తర భాండాగారాన్ని రూపొందించేందుకు విస్తృత చొరవ తీసుకుంటున్నారు. భారతీయ భాషా సమితి సహకారంతో నేషనల్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఫోరం (నెఫ్ట్) నేతృత్వంలో రియల్ టైమ్ ట్రాన్స్ లేషన్ ఆర్కిటెక్చర్ భారతీయ భాషలో రియల్ టైమ్ అనువాద సామర్థ్యాలను పెంచడానికి సాంకేతిక దృక్కోణం సృష్టించడానికి దోహదపడుతుంది.
దేశవ్యాప్తంగా 150 మందికి పైగా వైస్ చాన్స్ లర్లు ఈ వర్క్ షాప్ లో పాల్గొన్నారు. వైస్ ఛాన్సలర్లను 12 మేథో మదన బృందాలుగా విభజించారు. ఒక్కొక్క బృందం 12 ప్రాంతీయ భాషల్లో పాఠ్యపుస్తకాల తయారీ ప్రణాళికలు రూపొందించడానికి , అభివృద్ధి చేయడానికి అంకితమయ్యారు. ముందుగా దృష్టి సారించిన భాషల్లో పంజాబీ, హిందీ, సంస్కృతం, బెంగాలీ, ఉర్దూ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, తమిళం, తెలుగు, ఒడియా భాషలు ఉన్నాయి. ఆయా నోడల్ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ ల అధ్యక్షతన ఈ బృందాలు జరిపిన చర్చలు విలువైన ఫలితాలను ఇచ్చాయి.
భారతీయ భాషలో కొత్త పాఠ్యపుస్తకాల సృష్టిని నిర్వచించడం, పుస్తకాలకు 22 భారతీయ భాషల్లో ప్రామాణిక పదజాలాలను ఏర్పాటు చేయడం, ప్రస్తుత పాఠ్యపుస్తకాలకు మెరుగుదల అవకాశాలను గుర్తించడం, ఆచరణాత్మక , సైద్ధాంతిక పరిజ్ఞానాన్ని జోడిస్తూ భారతీయ విజ్ఞాన వ్యవస్థలను (ఐకెఎస్) ఒక మూలాంశంగా స్పష్టం చేయడం పై ప్రధానంగా చర్చల్లు జరిగాయి. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రశ్నోత్తరాల సెషన్ లో ప్రశ్నలకు ప్యానెల్ సమాధానాలు ఇచ్చింది.
***
(Release ID: 2033929)
Visitor Counter : 53