పౌర విమానయాన మంత్రిత్వ శాఖ

“నాలుగు బిలియన్ డాలర్ల విలువగల నిర్వహణ, మరమ్మత్తుల పరిశ్రమ (ఎమ్ఆర్ఓ) తో, 2030 నాటికల్లా ప్రపంచ విమానయాన రంగంలో ప్రముఖ కేంద్రంగా నిలవాలన్నది భారత్ ఆశయం” - కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు


‘ప్రపంచ విమానయాన కేంద్రం’ హోదా సాధించే దిశగా దేశీయ ఎమ్ఆర్ఓ పరిశ్రమకు ఊతమిచ్చే విధంగా 5% ఏకరీతి సమీకృత వస్తుసేవల పన్ను అమలు

Posted On: 15 JUL 2024 7:31PM by PIB Hyderabad

విమానాలు, ఇంజన్ విడిభాగాలపై 2024 జులై 15 నుండి 5% ఏకరీతి సమీకృత వస్తుసేవల పన్ను (ఐజీఎస్టీ) అమలు చేస్తున్నట్లు కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. భారత్ ‘ప్రపంచ విమానయాన కేంద్రం’ హోదా సాధించే ఆశయంలో భాగంగా చేపట్టిన ఈ చర్య, దేశీయ నిర్వహణ, మరమ్మత్తుల పరిశ్రమ (ఎమ్ఆర్ఓ)లో  మైలురాయిగా నిలవనుంది.

“ఎమ్ఆర్ఓ విడిభాగాలపై 5% ఐజీఎస్టీ అమలు చర్య విమానయాన రంగానికి ఉత్ప్రేరకంగా పనిచేస్తుంది. ఇప్పటి వరుకు వివిధ విడిభాగాలకి వేర్వేరు రేట్లు -  5%, 12%, 18%, 28% వసూలయ్యేది; ఆ విధానం విలోమ సుంకం, ఎమ్ఆర్ఓ అకౌంట్లలో నిధులు పేరుకుపోవడం వంటి   పలు సమస్యలకి దారి తీసేది. నూతన విధానం ఈ అసమానతలు తొలగించి పన్నుల విధానాన్ని సరళతరం చేసి ఎమ్ఆర్ఓ పరిశ్రమ అభివృద్ధికి దోహదపడుతుంది” అని శ్రీ నాయుడు వివరించారు.  

సరికొత్త మార్పులు చేపట్టడంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వ దార్శనికతను ఉటంకిస్తూ, “ ప్రధాని మోదీ మార్గనిర్దేశనంలో ‘ఆత్మ నిర్భర్ భారత్’ ఆశయ సాధనకు మేము కట్టుబడి ఉన్నాం. భారత్ ను విమానయాన రంగంలో ప్రముఖ కేంద్రంగా తీర్చిదిద్దడంలో భాగంగా సరికొత్త విధానానికి ప్రధానమంత్రి అందించిన మద్దతు ఎంతో కీలకమైనది” అని కేంద్రమంత్రి పేర్కొన్నారు.

విధాన సవరింపు సాధనలో పరిశ్రమించిన పౌరవిమానయాన మంత్రిత్వ శాఖ, కేంద్ర ఆర్ధిక శాఖ సహా సంబంధీకులందరికీ కేంద్రమంత్రి కృతజ్ఞతలు తెలిపారు. జూన్ 22, 2024న జరిగిన జీఎస్టీ మండలి 53వ సమావేశంలో విధాన సవరింపుకు సంబంధించి సూచనలు జరిగాయి.  నిర్వహణ ఖర్చుల నియంత్రణ, పన్నులు, ఋణాలకు సంబంధించిన చిక్కుల తొలగింపు, పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యాలుగా 5% ఏకరీతి సమీకృత వస్తుసేవల పన్ను అమలు ప్రారంభమైంది.

 

***



(Release ID: 2033597) Visitor Counter : 71