హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

'చైతన్యవంత గ్రామాల కార్యక్రమం' అమలుపై న్యూ ఢిల్లీ లో సమీక్ష నిర్వహించిన కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో సరిహద్దు గ్రామాల
సర్వతోముఖాభివృద్ధికి కట్టుబడి ఉన్న కేంద్ర ప్రభుత్వం

సరిహద్దు గ్రామాల నుండి వలసలను నివారించడం, స్థానికులకు
ఉద్యోగావకాశాలు కల్పించడం ప్రస్తుత అవసరం

సరిహద్దు గ్రామాల చుట్టూ మోహరించిన సిఏపిఎఫ్ లు, సైన్యం సహకార సంఘాల ద్వారా
స్థానిక వ్యవసాయ, హస్తకళా ఉత్పత్తుల కొనుగోళ్లకు ప్రోత్సాహం

సమీపంలోని గ్రామాలలో నివసించే వారికి కూడా ఆర్మీ, సిఏపిఎఫ్ ల కోసం
అందుబాటులో ఉన్న ఆరోగ్య సంరక్షణ సౌకర్యాల ప్రయోజనం

పునరుత్పాదక ఇంధన వనరులైన సౌర విద్యుత్, గాలి మరల
గరిష్ట వినియోగంపై దృష్టి

Posted On: 13 JUL 2024 1:49PM by PIB Hyderabad

సరిహద్దు గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి కేంద్ర హోం, సహకార శాఖల మంత్రి శ్రీ అమిత్ షా అన్నారు. ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో "చైతన్యవంత గ్రామాల కార్యక్రమంఅమలు తీరును అయన సమీక్షించారు. సరిహద్దు గ్రామాల నుండి వలసలను నిరోధించడానికి స్థానిక నివాసితులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని చెబుతూ, గ్రామాలతో అనుసంధానాన్ని పెంచాల్సిన అవసరాన్ని శ్రీ అమిత్ షా మరింత స్పష్టం చేశారు. 

సరిహద్దు గ్రామాల చుట్టూ మోహరించిన కేంద్ర సాయుధ పోలీసు బలగాలు (సిఏపిఎఫ్ లు), సైన్యం తమ ప్రాంతాలలోని సహకార సంఘాల ద్వారా స్థానిక వ్యవసాయ, హస్తకళా ఉత్పత్తుల కొనుగోలును ప్రోత్సహించాలని శ్రీ అమిత్ షా సూచించారు. ఆర్మీ, సీఏపీఎఫ్‌ల ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు సమీపంలోని గ్రామాల నివాసితులకు కూడా ప్రయోజనం చేకూర్చేలా  క్రమం తప్పకుండా అందుబాటులో ఉంచాలని ఆయన అన్నారు. సౌరశక్తిని మరియు గాలి మరలు మొదలైన ఇతర పునరుత్పాదక ఇంధన వనరులను గరిష్టంగా ఉపయోగించాలని కేంద్ర హోం మంత్రి స్పష్టం చేశారు.

చైతన్యవంత గ్రామాల కార్యక్రమం కింద సరిహద్దు గ్రామాల సమస్యలను మరింత మెరుగ్గా అర్థం చేసుకునేందుకు సీనియర్ మంత్రులు, అధికారులు చేస్తున్న కృషిని కొనసాగించాలని కేంద్ర హోంమంత్రి ఆదేశించారు. ఇప్పటివరకు, ఈ సరిహద్దు గ్రామాలలో 6000 కంటే ఎక్కువ కార్యక్రమాలు నిర్వహించారు. వీటిలో సుమారు 4000 సేవా డెలివరీ, అవగాహన శిబిరాలు ఉన్నాయి. ఈ గ్రామాలలో ఉపాధి కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం 600కు పైగా ప్రాజెక్టులను మంజూరు చేసింది.  ఈ సమావేశంలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు క్రమ వ్యవధిలో అత్యున్నత స్థాయిలో సమీక్షించడంపై హోంమంత్రి ప్రత్యేక దృష్టి సారించారు.

 

‘చైతన్యవంత గ్రామాల కార్యక్రమం’ అనే ఈ పథకం కింద, రూ.2,420 కోట్లతో 113 ఆల్-వెదర్ రోడ్ ప్రాజెక్ట్‌ల ద్వారా 136 సరిహద్దు గ్రామాలకు కనెక్టివిటీని అందిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో 4జి కనెక్టివిటీ వేగంగా పని చేస్తోంది. డిసెంబర్ 2024 నాటికి, చైతన్యవంత గ్రామాల కార్యక్రమంలోని అన్ని గ్రామాలు 4జి నెట్‌వర్క్ పరిధిలోకి వస్తాయి. ఈ గ్రామాలన్నింటిలో ఆర్థిక చేరికను నిర్ధారించడానికి, తగిన చర్యలు చేపట్టారు. ఇండియా పోస్ట్-పేమెంట్ బ్యాంకులు (ఐపీపీబి) కూడా అక్కడ సౌకర్యాలు కల్పించి సేవలు అందిస్తున్నాయి. 

ఈ వైబ్రంట్ గ్రామాలకు చైతన్యం తీసుకురావడానికి, పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి టూరిస్ట్ సర్క్యూట్‌లను అభివృద్ధి చేసే పని జరుగుతోంది. పర్యాటక మంత్రిత్వ శాఖతో సమన్వయంతో కెపాసిటీ బిల్డింగ్, టూరిజం సంబంధిత మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తున్నారు.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, ఈ ముఖ్యమైన, ప్రతిష్టాత్మక పథకం 2023 ఫిబ్రవరి 14న రూ.4800 కోట్ల కేటాయింపుతో ప్రారంభించారు. ఈ సమావేశానికి కేంద్ర హోం శాఖ కార్యదర్శి, బోర్డర్ మేనేజ్‌మెంట్ సెక్రటరీ, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబిపి) డైరెక్టర్ జనరల్,  హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖలోని సీనియర్ అధికారులు హాజరయ్యారు.

 

***


(Release ID: 2033109) Visitor Counter : 75