సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

అక్రమ మైనింగ్, అక్రమ క్రషర్లు, అక్రమ భూ ఆక్రమణదారులు, మాదకద్రవ్యాల పెడ్లర్ల విషయంలో రాజీపడేది లేదని స్పష్టం చేసిన కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్


జమ్మూ డివిజన్‌లో పెరుగుతున్న ఉగ్రవాద సంఘటనలను ఎదుర్కొని సాధారణ పరిస్థితులు తీసుకొచ్చేందుకు ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన పనిచేస్తుంది : డాక్టర్ జితేంద్ర సింగ్


మోదీ ప్రభుత్వ అభివృద్ధి మంత్రం గత పదేళ్లలో ఉధంపూర్-కథువా-దోడా పార్లమెంటరీ నియోజకవర్గాన్ని మార్చింది: డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 13 JUL 2024 6:56PM by PIB Hyderabad

అక్రమ క్రషర్లు, అక్రమ మైనింగ్, అక్రమ భూ ఆక్రమణదారులు, మాదకద్రవ్యాల పెడ్లర్ల విషయంలో రాజీపడేది లేదని కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ, ప్రధాన మంత్రి కార్యాలయం, పర్సనల్, ప్రజా ఫిర్యాదులు, పింఛన్లు, అణు శక్తి, అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారు.

జమ్మూలోని కథువాలో మాట్లాడిన మంత్రి.. అక్రమ క్రషర్లు, అనధికారిక మైనింగ్, భూ ఆక్రమణలతో సంబంధం ఉన్న ఎవరినైనా వదిలిపెట్టబోమని అన్నారు.  ఈ విషయంలో పలుకుబడి, ప్రజాధరణ తమను ఆపలేవని తెలిపారు.

అక్రమ తవ్వకాలకు పాల్పడి, కేడియన్ గాండ్యాల్ వంటి విలువైన వంతెనల పునాదులను ధ్వంసం చేసే హక్కు ఎవరికీ లేదన్నారు. అదేవిధంగా ఇతరుల పిల్లలను మాదకద్రవ్యాలకు బానిసలుగా మార్చి అక్రమాస్తులు సంపాదించే హక్కు ఎవరికీ లేదని, రేపు అలాంటి వారి సొంత పిల్లలు కూడా ఇలాంటి వ్యసనాలకు గురయ్యే అవకాశం ఉందన్నారు.

 

డిప్యూటీ కమిషనర్, ఉన్నతాదికారులతో కలిసి దాదాపు మూడు గంటల పాటు ప్రజాదర్బార్ నిర్వహించిన అనంతరం జితేంద్ర సింగ్ మాట్లాడారు. అక్కడికక్కడే పరిష్కరించే లక్ష్యంతో ప్రజల, పౌర ప్రతినిధులు బృందాల నుంచి ప్రజా ఫిర్యాదులను, డిమాండ్లను ప్రజా దర్భార్‌లో తీసుకున్నారు.

అక్రమ మైనింగ్, మాదకద్రవ్యాల దుర్వినియోగం ఒక విష చక్రం అని, ఇది ఉగ్రవాదం, ఇతర సామాజిక దురాచారాలకు దారి తీస్తుందని వ్యాఖ్యానించారు. ఈ నేరాలకు పాల్పడే వారిపై రాజకీయ అనుబంధాలు, పలుకుబడికి అతీతంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. 25 అక్రమ క్రషర్లపై స్థానిక యంత్రాంగం చర్యలు తీసుకుందని, అలాంటి దాదాపు డజను క్రషర్లపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకునేందుకు తాజాగా జాబితాను సిద్ధం చేస్తున్నామని తెలిపారు.

ప్రజల విశ్వాసాన్ని, శాంతిభద్రతలను పునరుద్ధరించడానికి.. పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలను ఎదుర్కొనేందుకు సాధ్యమైన అన్ని చర్యలు తీసుకుంటున్నామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ఈ చర్యలు త్వరలోనే ఫలిస్తాయని, వారం రోజుల్లో సాధారణ పరిస్థితులు నెలకొంటాయని ఆయన పేర్కొన్నారు.


కఠిన చర్యలు తీసుకుంటామని స్థానిక ఉగ్రవాద సంస్థలను హెచ్చరిస్తూనే..స్థానిక సమాజం అప్రమత్తంగా ఉండాలని, ఈ ప్రాంతంలో ఉగ్రవాదాన్ని ఎదుర్కోవడానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్లో పాలుపంచుకోవాలని డాక్టర్ జితేంద్ర సింగ్ కోరారు. ఉగ్రవాదులను ఎదుర్కొనేందుకు గ్రామ లక్షణ కమిటీలను(వీడీసీ-విలేజ్ డిఫెన్స్ కమిటీ) బలోపేతం చేస్తున్నామని చెప్పారు.

ఈ ప్రాంతంలో పెరుగుతున్న పశువుల స్మగ్లింగ్ సంఘటనల గురించి కూడా మంత్రి ప్రస్తావించారు. నేరాన్ని ఉక్కు సంకల్పంతోని ఎదుర్కొంటామని ప్రతిజ్ఞ చేశారు. మాదకద్రవ్యాల బెడద పంజాబ్ నుంచి కత్రా వరకు విస్తరించిందని, ఇది పవిత్ర నగరానికి అపకీర్తిని తెచ్చిపెట్టిందని అన్నారు. తమ పిల్లల భవిష్యత్‌ను కాపాడుకునేందుకు స్థానికులు వారిని ఈ ముప్పు నుంచి విముక్తి చేయాలని కోరారు. భూ ఆక్రమణల సమస్యపై గురించి మాట్లాడిన ఆయన.. నేరం రుజువైతే ఎవరినీ వదిలిపెట్టబోమని హెచ్చరించారు.

గత పదేళ్లలో మోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి ప్రయాణం ఉధంపూర్-కథువా-దోడా పార్లమెంటరీ నియోజకవర్గ ముఖచిత్రాన్ని మార్చివేసిందని మంత్రి పేర్కొన్నారు. నియోజకవర్గంలో ప్రతి రెండు కిలోమీటర్లకు అభివృద్ధిను చూడొచ్చన్నారు. ఉత్తర భారత మొట్టమొదటి బయోటెక్ పార్కు, విత్తన ప్రాసెసింగ్ ప్లాంట్, ఐకానిక్ అటల్ సేతుతో సహా డజనుకు పైగా వంతెనలు ఈ నియోజకవర్గంలో వచ్చాయని గుర్తు చేశారు. గత ప్రభుత్వాల లోపాలను అధిగమించడానికి మోదీ ప్రభుత్వం చివరి దశాబ్దం అంకితమైందని తెలిపారు. "ఇప్పుడు, ప్రభుత్వం తన కొత్త పదవీకాలంలో గత దశాబ్దపు ఫలాలను పొందటంపై దృష్టి సారించింది" అని అన్నారు.

***



(Release ID: 2033107) Visitor Counter : 25