ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం

వీక్షిత భారత్ భావన లక్ష్యం మాత్రమే కాదు, పవిత్ర కార్యం– ఉపరాష్ట్రపతి


భారతదేశ వృద్ధిని దెబ్బతీసే, మన సంస్థల ప్రతిష్ఠను మసకబార్చే వక్రీకృత కథనాలను చురుగ్గా తిప్పికొట్టాలని యువతకు ఉపరాష్ట్రపతి పిలుపు

పోటీ పరీక్షలపై సాంప్రదాయక దృష్టికి అతీతంగా ముందుకు సాగాలని యువతకు ఉపరాష్ట్రపతి సూచన

ముంబైలోని నార్సీ మోంజీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ (ఎన్ఎంఐఎంఎస్) విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించిన ఉపరాష్ట్రపతి

Posted On: 12 JUL 2024 4:57PM by PIB Hyderabad

ఉపరాష్ట్రపతి శ్రీ జగదీప్ ధన్ కర్ ఈ రోజు మాట్లాడుతూ వీక్షిత భారత్@2047 భావన ఒక లక్ష్యం మాత్రమే కాదని, అది పవిత్ర కార్యమని వ్యాఖ్యానించారు. ఈ శతాబ్దం భారత్ దేనని స్పష్టం చేస్తూ, ప్రతి పౌరుడు, ప్రతి సంస్థ, సమాజంలోని ప్రతీ రంగం తమ వంతు సహకారాన్ని అందించాలని ఆయన పిలుపునిచ్చారు.

ముంబైలోని ఎన్ఎంఐఎంఎస్ విద్యార్థులు, అధ్యాపకులనుద్దేశించి ప్రసంగిస్తూ, అనేక సానుకూల పాలన కార్యక్రమాల ఫలితంగా, వాణిజ్య వ్యవస్థలో గణనీయమైన మార్పు వచ్చిందని; దేశం ఇప్పుడు పెట్టుబడులు, అవకాశాలకు ప్రముఖ గమ్యస్థానంగా కనిపిస్తోందని స్పష్టంచేశారు.

భారత రాజకీయ ప్రయాణాన్ని రాకెట్ అధిరోహణతో పోల్చిన ధన్కర్ అప్పుడప్పుడు సవాళ్లు ఎదురైనా స్థితిస్థాపకత, పురోగతిని నొక్కిచెప్పారు. ఎయిర్ పాకెట్లు విమాన గమనానికి, గమ్యానికి అంతరాయం కలిగించనట్టే, రాజకీయ సవాళ్లు భారతదేశ ఎదుగుదలకు ఆటంకం కలిగించలేదని ఆయన పేర్కొన్నారు. దేశ గణనీయమైన పురోగతిని ప్రముఖంగా పేర్కొంటూ, ఈ ప్రయాణాన్ని ప్రారంభించడానికి దశాబ్దం క్రితం ఆవశ్యకమైన అపారమైన కృషిని శ్రీ ధన్కర్ ప్రధానంగా ప్రస్తావించారు; ‘‘నన్ను నమ్మండి, వచ్చే ఐదేళ్లలో గురుత్వాకర్షణ శక్తికి అతీతంగా దూసుకెళ్లే రాకెట్ లాగా భారత్ ఎదుగుతుంది’’ అని వ్యాఖ్యానించారు.

ప్రమాదకరమైన ప్రణాళికతో దేశ ప్రగతిని కించపరిచేలా, అపకీర్తి కలిగించేలా కొన్ని దుష్టశక్తులున్నాయన్న ఉపరాష్ట్రపతి, భారతదేశ వృద్ధి పథాన్ని దెబ్బతీసే, మన సంస్థల ప్రతిష్ఠను మసకబార్చే వక్రీకృత కథనాలను చురుగ్గా తిప్పికొట్టాలని యువతకు పిలుపునిచ్చారు.

అధికరణ 370 రద్దు గురించి మాట్లాడుతూ, 1963లో జరిగిన పార్లమెంటరీ చర్చను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. అందులో అప్పటి ప్రధాని ఆ అధికరణ కాలక్రమేణా కనుమరుగవుతుందని, దాని తాత్కాలిక స్వభావాన్ని స్పష్టంగా పేర్కొన్నారని ఉపరాష్ట్రపతి చెప్పారు. 2019లో అధికరణ 370ని రద్దు చేయడంలో నిర్ణయాత్మక చర్య తీసుకున్న పార్లమెంటు సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. డాక్టర్ అంబేద్కర్ అధికరణ 370ని రూపొందించి ఉంటే, లేదా స్వాతంత్ర్యానంతరం జమ్మూ కశ్మీర్ విలీన బాధ్యత సర్దార్ పటేల్ కు అప్పగించి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవని శ్రీ ధన్కర్ పేర్కొన్నారు.

నలంద, తక్షశిల, విక్రమశిల, వల్లభి వంటి దేశంలోని విఖ్యాత విద్యాసంస్థల ఘన చరిత్రను ఉపరాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రముఖంగా పేర్కొన్నారు. ఈ పురాతన విశ్వవిద్యాలయాలు భారతదేశాన్ని విజ్ఞాన శక్తి కేంద్రంగా మార్చాయని, దౌత్య శక్తిని గణనీయంగా పెంచాయని, వాణిజ్య దిశలను రూపొందించాయని వ్యాఖ్యానించారు. ఈ చారిత్రాక విద్యాకేంద్రాల వారసత్వాన్ని ఆలంబనగా చేసుకుని జాతీయాభివృద్ధి, సాధికారతలో ఉన్నత విద్య ప్రాధాన్యాన్ని గుర్తించాలని ఆయన నొక్కిచెప్పారు.

వ్యక్తులను శక్తిమంతం చేసే, సృజనాత్మకతను పెంపొందించే, ఆర్థిక వృద్ధిని ప్రోత్సహించే చోదక శక్తిగా; సామాజిక, జాతీయ పురోగతికి గణనీయంగా దోహదపడే ప్రేరకంగా విద్య పరివర్తన శక్తిని శ్రీ ధన్కర్ అభివర్ణించారు.

సాంప్రదాయక ఆలోచనల నుంచి విముక్తి పొందాలని, ప్రస్తుతం అందుబాటులో ఉన్న విస్తృత అవకాశాలను అందిపుచ్చుకోవాలని ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి యువతను కోరారు. పోటీ పరీక్షలపై సాంప్రదాయక దృష్టికి అతీతంగా, వివిధ రంగాల్లో ఉద్భవిస్తున్న కొత్త, అసాధారణ అవకాశాలను అన్వేషించాలని పిలుపునిచ్చారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వంటి అభివృద్ధి చెందుతున్న రంగాల్లో అపారమైన అవకాశాలున్నాయన్నారు.

ఈ కార్యక్రమంలో డా. (శ్రీమతి) సుదేశ్ ధన్కర్, మహారాష్ట్ర గవర్నర్ శ్రీ రమేశ్ బైస్, రాజ్యసభ సభ్యుడు శ్రీ ప్రఫుల్ పటేల్, ఎన్ఎంఐఎంఎస్ చాన్సలర్ శ్రీ అమ్రిశ్భాయ్ రసిక్ లాల్ పటేల్, వైస్ చాన్సలర్ డా. రమేశ్ భట్, ప్రో వైస్ చాన్సలర్ డా. శరద్ మైస్కర్, అధ్యాపకులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.

***



(Release ID: 2033045) Visitor Counter : 20