వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ

దోహాలో జరిగిన భారత్ – ఖతార్ సంయుక్త కార్యాచరణ బృందం సమావేశంలో పాల్గొన్న భారత ప్రతినిధి బృందం


పరస్పర సహకారం నిమిత్తం ఔషధ రంగం, సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలు, ఆభరణాలు/రత్నాలు, ఆహార తయారీ రంగాల గుర్తింపు

Posted On: 12 JUL 2024 1:26PM by PIB Hyderabad

వాణిజ్య మంత్రిత్వ శాఖ, ఇతర మంత్రిత్వ శాఖలు, సంస్థల అధికారులతో కూడిన భారత ప్రతినిధి బృందం జులై 10, 2024న ఖతార్ ప్రతినిధి బృందంతో దోహాలో జరిగిన సంయుక్త కార్యాచరణ బృంద సమావేశంలో పాల్గొంది.

ఆహార భద్రత, సహకార రంగాలకు సంబంధించిన అవగాహన ఒప్పందాల నిమిత్తం జరుగుతున్న చర్చల పురోభివృద్ధిని ఇరుపక్షాలూ సమీక్షించాయి. సులభతర వాణిజ్యం, వస్తువులపై కస్టమ్ సుంకం నియంత్రణలకు సంబంధించి ముందస్తు సమాచారం ప్రాముఖ్యాన్ని గుర్తిస్తూ చర్యలను వేగవంతం చేయాలని అంగీకరించాయి. ద్వైపాక్షిక వాణిజ్యంలో ఎదురవుతున్న ఇబ్బందులను వీలైనంత త్వరలో గుర్తించి, వాటిని అధిగమించడం ద్వారా ఇరుదేశాల మధ్య వాణిజ్యాన్ని నూతన స్థాయికి చేర్చాలని నిర్ణయించాయి.    

వాణిజ్య సహకారం, పెట్టుబడులలో సహకారమే కాక,  ప్రైవేటు రంగం ప్రతిపాదనలను అమలు  చేసేందుకు సంయుక్త కార్యాచరణ బృందం అనుసరించవలసిన వ్యూహాన్ని గురించి ఇరుపక్షాలు చర్చించాయి.

పరస్పర వాణిజ్యం, ఆర్ధిక సహకారాల్లో ఇటీవల సంభవించిన పరిణామాలను లోతుగా విశ్లేషించిన ఇరుపక్షాలు, ద్వైపాక్షిక సంబంధాలను నూతన స్థాయికి తీసుకువెళ్ళే అవకాశాలు మెండుగా ఉన్నాయని అభిప్రాయపడ్డాయి. ఈ మేరకు ఇరుదేశాల మధ్య వాణిజ్యం మరిన్ని రంగాలకు విస్తరణ, పరస్పరం లబ్ధి చేకూర్చే సహకార రంగాలను భారత్ ఖతార్ ప్రతినిధి బృందాలు గుర్తించాయి. కస్టమ్స్ అధికారుల మధ్య సహకారం, స్థానిక  కరెన్సీ లో లావాదేవీలు, ఔషధ రంగం, ఆభరణాలు/రత్నాలు, ఆహార తయారీ పరిశ్రమ, ఆహార భద్రత, సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమల రంగాలు వగైరాలు పరస్పర సహకారానికి అనువుగా ఉన్నట్లు గుర్తించారు.  

సంయుక్త కార్యాచరణ బృందం సమావేశాలకు  భారత వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ, వాణిజ్య విభాగం ఆర్ధిక సలహాదారు ప్రియా పి. నాయర్, ఖతార్ వాణిజ్య పరిశ్రమల శాఖ, అంతర్జాతీయ సహకారం, వాణిజ్య ఒప్పందాల విభాగం డైరెక్టర్ సలేహ్ అల్-మనా సహ అధ్యక్షత వహించారు.

భారత ఖతార్ దేశాల మధ్య 2023-24లో 14.08 బిలియన్ అమెరికన్ డాలర్ల మేర వాణిజ్యం జరిగింది. ఖతార్ కు  భారత్ రెండవ అతి పెద్ద వాణిజ్య భాగస్వామి.  సంయుక్త కార్యాచరణ బృందం తదుపరి సమావేశం 2025లో న్యూఢిల్లీ లో జరిపేందుకు ఇరు దేశాలు అంగీకరించాయి. భారత్ - ఖతార్ దేశాల సంయుక్త కార్యాచరణ బృందపు తొలి సమావేశాలు సుహృద్భావ వాతావరణంలో, భవిష్య సంబంధాల పట్ల ఆశను రేకెత్తించే విధంగా పూర్తై,  ఇరు దేశాల మధ్య గల స్నేహ సంబంధాలు, ప్రత్యేక అనుబంధానికి తార్కాణంగా నిలిచాయి.

***



(Release ID: 2032921) Visitor Counter : 19