ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

ఆయుష్మాన్ భారత్, గుణవత్ స్వస్థ్ కార్యక్రమం కింద మూడు చొరవలను ప్రారంభించిన కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రులు శ్రీ ప్రతాప్ రావు గణపతిరావు జాదవ్, శ్రీమతి అనుప్రియా సింగ్ పటేల్


కార్యక్రమంలో భాగంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు, ఐపిహెచ్ఎస్ డాష్ బోర్డ్, ఫుడ్ వెండర్లకు స్పాట్ ఫుడ్ లైసెన్స్ కోసం వర్చువల్ ఎన్ క్యుఏఎస్ లు ప్రారంభం

‘‘అందరికీ ఆరోగ్య సంరక్షణ’’; వెల్ నెస్ కు ప్రోత్సాహం కోసం ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ కీలక చొరవలు ప్రారంభం : శ్రీ ప్రతాప్ రావు గణపతిరావు జాదవ్

వర్చువల్ ఎన్ క్యుఏఎస్ తో ప్రజారోగ్య కేంద్రాల్లో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ మెరుగుదల; స్పాట్ ఫుడ్ లైసెన్స్ తో దేశంలో వ్యాపార సౌలభ్యం మెరుగుదల : శ్రీమతి అనుప్రియా పటేల్

ఇదే కార్యక్రమంలో ఇంటిగ్రేటెడ్ ప్రజారోగ్య లేబరేటరీల కోసం నాణ్యతా హామీ ప్రమాణాలు; కాయకల్ప్ కోసం సవరించిన మార్గదర్శకాలు విడుదల

Posted On: 28 JUN 2024 7:54PM by PIB Hyderabad

ఇక్కడ జరిగిన ఆయుష్మాన్ భారత్, గుణవత్ స్వాస్థ్య కార్యక్రమంలో భాగంగా మూడు చొరవలను కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రులు శ్రీ ప్రతాప్ రావు గణపతిరావు జాదవ్, శ్రీమతి అనుప్రియా పటేల్ ప్రారంభించారు. ఆరోగ్య సంరక్షణ సేవల నాణ్యత మెరుగుదల, దేశంలో వ్యాపార సౌలభ్యత మెరుగుదలలో ఈ కార్యక్రమాలు ప్రధానపాత్ర పోషిస్తాయి. 

ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల (ఏఏఎం) కోసం వర్చువల్ నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ ప్రమాణాల (ఎన్ క్యుఏఎస్) అసెస్ మెంట్;  జాతీయ, రాష్ర్ట, జిల్లా స్థాయి ఆరోగ్య సంస్థలకు డాష్ బోర్డు; ఇండియన్ పబ్లిక్ హెల్త్ ప్రమాణాల (ఐపిహెచ్ఎస్) కట్టుబాటు పర్యవేక్షణ, అందుకు అనుగుణంగా కార్యాచరణల వసతులు; ఫుడ్ వెండార్లకు స్పాట్ ఫుడ్ లైసెన్స్, రిజిస్ర్టేషన్ కార్యక్రమాలను కూడా వారు ప్రారంభించారు. 

ఈ కార్యక్రమం సందర్భంగా కేంద్ర మంత్రులు వర్చువల్ గా అసెస్ చేసిన ఎన్ క్యుఏఎస్ ఏఏఎం-ఎస్ సి సర్టిఫికెట్లు ప్రదానం చేశారు.
ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ లేబరేటరీలకు (ఐపిహెచ్ఎల్) ఎన్ క్యుఏఎస్ ను కూడా  ఈ సందర్భంగా కేంద్రమంత్రులు విడుదల చేశారు. లాబ్ ల నివేదికలపై క్లినిక్ ల నిర్వాహకులు, రోగులు, ప్రజల విశ్వాసం పెంచడానికి; టెస్ట్ ఫలితాల విశ్వసనీయత పెంచడానికి ఐపిహెచ్ఎల్ ప్రమాణాలు దోహదపడతాయి. కాయకల్ప్ కు సవరించిన మార్గదర్శకాలు కూడా విడుదల చేశారు. 

ఆహార భద్రత, కంప్లయెన్స్ వ్యవస్థ (ఫాస్కాస్) కింద తక్షణ లైసెన్సుల జారీ, రిజిస్ర్టేషన్ల కోసం స్పాట్ ఫుడ్ లైనెస్స్ చొరవను కూడా ప్రారంభించారు. అన్ని రకాల ఆహార నియంత్రణ అవసరాలకు అనుగుణంగా రూపొందించిన దేశవ్యాప్త, అత్యాధునిక ఐటి వేదిక ఫాస్కాస్. ఇది లైసెన్సింగ్, రిజిస్ర్టేషన్ ప్రక్రియను సులభతరం చేసి, యూజర్ అనుభవాన్ని పెంచుతుంది. 

శ్రీ ప్రతాప్ రావు జాదవ్ ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ ‘‘అందరికీ ఆరోగ్యం’’; సంరక్షణ ప్రోత్సాహానికి ప్రభుత్వ ప్రయత్నాల కొనసాగింపులో భాగంగా ఈ మూడు చొరవలను ప్రారంభించినట్టు తెలిపారు. దేశంలో 1.73 లక్షల ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ఏర్పాటు, 2014 నుంచి వైద్య కళాశాలల సంఖ్య రెట్టింపు, ఎయిమ్స్ సంఖ్య 7 నుంచి 23కి పెంపు; 2014 నుంచి ఎంబిబిఎస్, పిజి సీట్ల సంఖ్య రెట్టింపు పైబడి పెంపు వంటి ప్రభుత్వ విజయాల గురించి మంత్రి వివరించారు. ‘‘వైద్యంలో వర్తమాన, భవిష్యత్ సవాళ్లను పరిష్కరించేందుకు మరింత నిపుణులైన మానవ వనరులు, నాణ్యమైన మౌలిక వసతులతో ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది’’ అని ఆయన అన్నారు.
ప్రజారోగ్య వ్యవస్థలో నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవల మెరుగుదలకు వర్చువల్ ఎన్ క్యుఏఎస్ అసెస్ మెంట్, డాష్ బోర్డు దోహదపడుతుందని శ్రీమతి అనుప్రియా పటేల్ అన్నారు. అలాగే స్పాట్ ఫుడ్ లైసెన్స్ దేశంలో వ్యాపార సరళతను పెంచుతుంది.

‘‘అందరికీ ఆరోగ్య సంరక్షణ అందుబాటులో ఉంచడం మాత్రమే కాదు, నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యం’’ అని శ్రీమతి పటేల్  నొక్కి చెబుతూ ప్రధానమంత్రి విజన్ కు అనుగుణంగా 2047 నాటికి శక్తివంతమైన, నాణ్యమైన ఆరోగ్య మౌలిక వసతులు నిర్మించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. 

పౌరులకు నాణ్యత, వ్యాపార సరళత అందించడం కోసమే ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర నొక్కి చెప్పారు. ఎన్ క్యుఏఎస్ సర్టిఫికేషన్ పొందేలా కేంద్ర ప్రభుత్వం రాష్ర్టాలకు ప్రోత్సాహకాలు అందిస్తుందని ఆయన చెప్పారు. అలాగే ఆరోగ్య సర్వీసుల్లో కనీస నాణ్యత పాటించని ఆరోగ్య కేంద్రాలను నిరుత్సాహపరచడం కూడా అవసరమని ఆయన అన్నారు. 
ఫాస్కాస్ ద్వారా తక్షణ లైసెన్సులు, రిజిస్ర్టేషన్ జారీ వల్ల వ్యాపార సరళత పెరుగుతుందని; సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే ప్రధానమంత్రి విజన్ సాకారం అవుతుందని  ఎఫ్ఎస్ఎస్ఏఐ సిఇఒ శ్రీ జి.కమలవర్ధనరావు అన్నారు.  

అంతకు ముందు వివిధ ఆరోగ్య కేంద్రాలకు చెందిన ఆరోగ్య కార్యకర్తలు ఎన్ క్యుఏఎస్ శిక్షణలో తమ అనుభవాలు పంచుకోవడంతో పాటు తమ వ్యవస్థలకు ఎన్ క్యుఏఎస్ సర్టిఫికేషన్ సాధించే దిశగా తమ అనుభవాలను, సర్టిఫికేషన్ లో వచ్చిన మార్పులను వివరించారు. తమ స్టాల్స్ కు ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్, రిజిస్ట్రేషన్ సాధించడంలో తమ అనుభవాలను దేశంలోని విభిన్న ప్రాంతాలకు చెందిన ఫుడ్ వెండార్లు తెలియచేశారు. 

పూర్వాపరాలు
ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ కు వర్చువల్ అసెస్ మెంట్ 
ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ ఉపకేంద్రాల వర్చువల్ సర్టిఫికేషన్ (ఏఏఎం-ఎస్ సి) ప్రజారోగ్య కేంద్రాల నాణ్యతా ప్రమాణాల్లో ఇన్నోవేషన్ కు దోహదపడుతుంది. ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ స్కీమ్ కింద పౌరులందరికీ సమగ్ర ఆరోగ్య సేవలందించడం కోసం లక్ష్యంగా ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు (ఏఏఎం) ఏర్పాటు చేశారు. ప్రస్తుతం దేశంలో 1,70,000 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలు పని చేస్తున్నాయి. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ సారథ్యంలో నడిచే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోని ఏఏఎంలు ప్రజలకు ప్రాథమిక ఆరోగ్య సేవలందించడంతో పాటు మెరుగైన చికిత్స అందించేందుకు రోగులను పై స్థాయి ఆరోగ్య వసతులకు రిఫర్ చేస్తాయి. దీని వల్ల సమాజానికి చేరువలో పని చేస్తున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అవసరమైన రిఫరల్ లింకేజిలు కలిగి ఉండి సెకండరీ, ఉన్నత స్థాయి ఆరోగ్య కేంద్రాలపై భారం తగ్గుతుంది. ఆరోగ్య సమస్యలను సకాలంలో గుర్తించి, తగు నివారణ చర్యలు తీసుకోవడం వల్ల వ్యాధుల వ్యాప్తి తగ్గుతుంది.

ప్రతీ పౌరునికి నాణ్యమైన ఆరోగ్య సేవలు అందించడం లక్ష్యంగా 2026 నాటికి పూర్తి స్థాయిలో అమలుపరచాలన్న నిర్దేశకత్వంతో జిల్లా ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు; గ్రామీణ, పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలకు (ఉప కేంద్రాలు) జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాలు (ఎన్ క్యుఏఎస్) రూపొందించారు. వర్చువల్ పర్యటనలు; రోగులు, సిబ్బంది, సమాజ సభ్యుల మధ్య సంప్రదింపుల నిర్వహణ కోసం అసెస్ మెంట్ ప్రక్రియను హేతుబద్ధీకరించడానికి ఆన్ లైన్ ఎవాల్యుయేషన్లను ప్రవేశపెట్టారు. ప్రతీ ఆరోగ్య సంరక్షణ కేంద్రం నాణ్యతా సర్టిఫికేషన్ సాధించేందుకు వీలుగా ఎంఓహెచ్ఎఫ్ డబ్ల్యుకు చెందిన జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాల మదింపుదారులు మదింపు చేయడానికి వీలుగా తీవ్ర స్థాయిలో బహుముఖీన అసెస్ మెంట్ ప్రాసెస్ కు లోనవుతుంది.

ఇంటిగ్రేటెడ్  ప్రజారోగ్య ప్రయోగశాలలు (ఐపిహెచ్ఎల్)
ప్రాణాలను కాపాడేందుకు అవసరమైన చికిత్సలు అందించడం, సమర్థవంతమైన వ్యాధి నిరోధం కోసం అత్యున్నత నాణ్యత గల డయాగ్నోస్టిక్ పరీక్షలు అవసరం. ప్రజారోగ్య కేంద్రాల్లో శక్తివంతమైన ప్రయోగశాలల సేవలు లేకపోతే రోగులు తరచు ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సివస్తుంది. వారు ఆరోగ్య వ్యయాలు తమ జేబులోంచి పెట్టాల్సివస్తుంది. ఫలితంగా వారిపై ఆర్థిక భారం పడుతుంది. అందుకే ఇంటిగ్రేటెడ్ ప్రజారోగ్య లేబరేటరీలను (ఐపిహెచ్ఎల్) స్థాపించడం కోసం భారత ప్రభుత్వంలోని ఆరోగ్య, సంక్షేమ మంత్రిత్వ శాఖ పిఎ-ఆయుష్మాన్ భారత్ మౌలిక వసతుల మిషన్ (పిఎం-అభిమ్) కింద లేబరేటరీ వ్యవస్థను పటిష్ఠం చేసింది. సమర్థవంతమైన ఆరోగ్య సేవలకు మూలమైన నాణ్యమైన డయాగ్నోస్టిక్ సేవల లభ్యత, సమర్థత, నాణ్యతకు ఈ లేబరేటరీలు హామీ ఇస్తాయి.  

అంతే కాదు లేబరేటరీ పరీక్షల్లో స్థిరత్వం, నిర్దిష్టత, భద్రత కోసం ఐపిహెచ్ఎల్ కు జాతీయ నాణ్యతా హామీ ప్రమాణాలను (ఎన్ క్యుఏఎస్) రూపొందించారు. రోగులు, హెల్త్ కేర్ ప్రొవైడర్లకు  నాణ్యమైన సేవలందించడం; పోటీ సామర్థ్యాన్ని ప్రదర్శించి, నాణ్యతా ప్రమాణాల నిర్వహణ, మెరుగుదలకు జిల్లా, బ్లాక్ స్థాయి ప్రజారోగ్య లేబరేటరీలను ఉత్తేజితం చేయడానికి ఈ ప్రమాణాలు భరోసా ఇస్తాయి. కచ్చితమైన పరీక్షా ఫలితాలు రాబట్టి తప్పులను తగ్గించడానికి; విశ్వసనీయమైన, వేగవంతమైన, పొదుపైన డయాగ్నోస్టిక్ సేవలు సాధించడానికి ఈ ప్రమాణాలు తప్పనిసరి. జిల్లా ఆస్పత్రుల్లోని లాబ్ లు, విడిగా పని చేసే లాబ్ లు పూర్తి స్థాయిలో సమర్థవంతంగా పని చేయడానికి ఐపిహెచ్ఎల్ ప్రమాణాలు దోహదపడతాయి.  జిల్లాల్లో ఐపిహెచ్ఎల్ స్థాయిలో ఎన్ క్యుఏఎస్ అమలుకు రాష్ర్ట, జిల్లా నాణ్యతా హామీ టీమ్ లు బాధ్యత వహిస్తాయి.  

ప్రజారోగ్య వ్యవస్థల వాస్తవిక పర్యవేక్షణకు ఐపిహెచ్ఎస్ డాష్ బోర్డ్ ప్రారంభం
భారత ఆరోగ్య సంరక్షణ అభివృద్ధి విప్లవాత్మక వ్యూహంలో ఐపిహెచ్ఎస్ కంప్లయెన్స్ డాష్ బోర్డు ప్రారంభించడం ఒక భాగం. ఐపిహెచ్ఎస్ మార్గదర్శకాలకు అడ్వాన్స్ డ్ డిజిటల్ టూల్స్ ను అనుసంధానం చేయడం ద్వారా ప్రజారోగ్య సర్వీసుల్లో ఎక్సలెన్స్ కు మంత్రిత్వ శాఖ కట్టుబడినట్టవుతుంది. అలాగే ప్రతీ ఒక్కరికీ అత్యుత్తమ హెల్త్ కేర్ సేవలు అందుబాటులో ఉంచినట్టవుతుంది. ఆరోగ్యం, జాతి సంరక్షణ మెరుగుదలకు తిరుగులేని కట్టుబాటుకు ఇది ఒక నిదర్శనం. 

ప్రజారోగ్య సర్వీసులను వాస్తవిక కాలంలో పర్యవేక్షించే డిజిటల్ వేదిక ఐపిహెచ్ఎస్ డాష్ బోర్డు. జిల్లా ఆస్పత్రులు, జిల్లా ఉప ఆస్పత్రులు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల స్థాయిలో ప్రజారోగ్య వసతుల తీరు, కంప్లయెన్స్ ను సమగ్రంగా మదింపు చేస్తుంది. ఈ అత్యాధునిక డిజటల్ టూల్ ను ఉపయోగించుకోవడం ద్వారా 2022 ఐపిహెచ్ఎస్ నిర్దేశించిన మార్గదర్శకాలకు అన్ని ఆరోగ్య సంరక్షణ సంస్థలు కట్టుబడేలా చూడడం, తద్వారా ప్రతీ పౌరునికి అత్యున్నత నాణ్యత గల ఆరోగ్య సేవలందేలా హామీ కల్పించాలన్నది మంత్రిత్వ శాఖ లక్ష్యం.

ఓపెన్ డేటా కిట్ (ఒడికె) సహాయంతో ఈ డాష్ బోర్డ్ వాస్తవిక డేటాను సేకరించి విశ్లేషిస్తుంది. హెల్త్ కేర్ సర్వీసుల పరిస్థితిని తెలుసుకుని ఎక్కడైనా వ్యత్యాసాలుంటే పూడ్చడానికి, అవసరమైన మెరుగుదలలు చేపట్టడానికి ఇది సహాయకారిగా ఉంటుంది. ఆరోగ్య సర్వీసులకు ప్రామాణికమైన మౌలిక వసతులు, పరికరాలు, మానవ వనరులు అందుబాటులో ఉండేలా చూడడం ద్వారా మెరుగైన ఆరోగ్య ఫలితాలు సాధించడం; ఆరోగ్యవంతమైన, మరింత సమానత్వంతో కూడిన సమాజాన్ని నిర్మించడానికి ఈ చొరవ దోహదపడుతుంది.

2014 జూన్  14వ తేదీ నాటికి దేశంలోని 2,16,062 ప్రజారోగ్య సంస్థల్లో 36,730 సంస్థల తీరును మదింపు చేశారు. వాటిలో 8562 కేంద్రాలు ఐపిహెచ్ఎస్ ప్రమాణాలకు లోబడి ఉన్నట్టు గుర్తించారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తొలి 100 రోజుల కాలంలో 70,000 ప్రజారోగ్య సంస్థలు ఐపిహెచ్ఎస్ నిబంధనలకు అనుగుణంగా ఉండేలా చూడాలన్నది లక్ష్యం. 

మరింత సమాచారం కోసం ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ అధికారి వెబ్ సైట్ చూడవచ్చు.

ఫోస్కోస్ 
అన్ని ఆహార భద్రతా అవసరాలను తీర్చగల స్థాయిలో తయారుచేసిన అత్యాధునిక పాన్ ఇండియా ఐటి వేదిక ఫోస్కోస్. ఈ అత్యాధునిక వేదిక లైసెన్సింగ్, రిజిస్ర్టేషన్ ప్రక్రియ సరళతరం చేయడంతో పాటు యూజర్ అనుభవాన్ని పెంచుతుంది. లైసెన్సింగ్, రిజిస్ర్టేషన్లు కాకుండా ఆన్ లైన్ రిటరనుల దాఖలు, ఆహార సేవలందించే సంస్థల పరిశుభ్రత రేటింగ్, భద్రతా ప్రమాణాలకు సంబంధించి థర్డ్ పార్టీ ఆడిట్ల నిర్వహణ వంటి సేవలు కూడా అందిస్తుంది. భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థకు (ఎఫ్ఎస్ఎస్ఏఐ) చెందిన ఇతర ఐటి వేదికలతో  కూడా అనుసందానం కావడం ద్వారా ఆహార వ్యాపార నిర్వాహకులకు సమగ్ర సొల్యూషన్లను ఫోస్కోస్ అందిస్తుంది.

వ్యాపార సౌలభ్యం పెంపును మరింతగా మెరుగుపరిచే చర్యల్లో భాగంగా ఎఫ్ఎస్ఎస్ఏఐ తక్కువ ఆహార రిస్క్ గల వ్యాపార విభాగాల్లో కోరిన వెంటనే లైసెన్సులు, రిజిస్ర్ర్టేషన్ల జారీ విధానాన్ని కూడా ప్రవేశపెట్టింది. ఆహార భద్రతతో రాజీ పడలేదని నిర్ధారించుకునేందుకు డిజిటల్ వెరిఫికేషన్ ద్వారా ఈ విధానం పని చేస్తుంది. ఆహార భద్రత, ప్రమాణాల (ఆహార వ్యాపారాల లైసెన్సింగ్, రిజిస్ర్టేషన్) నిబంధనలు, 2011లో నిర్దేశించిన లైసెన్స్, రిజిస్ర్టేషన్ విధానాల స్థానంలో ఇది అమలులోకి వస్తుంది. 

ప్రస్తుతం దరఖాస్తు దాఖలు చేసిన తేదీ నుంచి ఎఫ్ఎస్ఎస్ఏఐ లైసెన్స్ పొందడానికి 30 రోజుల నుంచి 60 రోజుల సమయం పడుతోంది. లైసెన్స్ కోసం 60 రోజులు, రిజిస్ర్టేషన్ విషయంలో తనఖీ అవసరం లేకపోతే 7 రోజులు, తనిఖీ అవసరం అయితే 30 రోజులు వ్యవధి పడుతోంది. 
హోల్ సేలర్లు, పంపిణీదారులు, రిటైలర్లు, రవాణా ఆపరేటర్లు, వాతవరణ అదుపు+శీతలీకరణ లేకుండా నిల్వ, దిగుమతిదారులు, ఫుడ్ వెండింగ్ ఏజెన్సీలు, డైరెక్ట్ సెల్లర్లు, ఎగుమతి వ్యాపారులు వంటి ఎంపిక చేసిన విభాగాలకు లైసెన్సింగ్ అధికారి ప్రమేయం లేకుండానే తక్షణ లైసెన్సులు జారీ చేయవచ్చు. అలాగే పై వర్గీకరణల్లో చిన్న చిన్న ఆహార వ్యాపారాలు నిర్వహించుకునేందుకు దరఖాస్తు చేసుకున్న వారికి అప్పటికప్పుడే రిజిస్ర్టేషన్ చేసి సర్టిఫికెట్లు అందచేస్తారు. అలాగే స్నాక్స్/టీ దుకాణాలు, హాకర్లు (ఇటినరెంట్/మొబైల్ ఫుడ్ వెండార్లు) వంటి చిన్న వ్యాపారులకు కూడా స్పాట్ రిజిస్ర్టేషన్ చేస్తారు. అయితే పాలు, మాంసం, చేపలు వంటి అధిక రిస్క్ గల వ్యాపారాలకు మాత్రం ఈ పథకం వర్తించదు.

ఆహార వ్యాపారాలపై నిరంతర నిఘా ఉండే సాంప్రదాయిక విధానాల నుంచి ఆహార భద్రతా వ్యవస్థ ఆహార భద్రత, ప్రమాణాల (ఎఫ్ఎస్ఎస్) చట్టం, 2006కు అనుగుణంగా విశ్వాస నిర్మాణం, స్వయం-నియంత్రణ గల వ్యవస్థగా పరివర్తన చెందుతోంది. రెగ్యులేటరీ ప్రక్రియను డిజిటైజ్ చేయడం, వివిధ కంప్లయెన్స్ మాడ్యూల్స్ ను తేలిగ్గా అందుబాటులో ఉంచడం తద్వారా వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని పెంచడం ద్వారా ఆహార భద్రతా నెట్ వర్క్ ను విస్తరించడం దీని లక్ష్యం.

దేశంలో మరింత సమర్థవంతమైన, వ్యాపార మిత్ర వాతావరణాన్ని కల్పించే దిశగా చేస్తున్న ప్రయాణంలో ఇది ఒక మైలురాయి. ఇన్నోవేషన్, ఎంటర్ ప్రెన్యూర్ షిప్, ఆర్థిక వృద్ధి సాధనలో ప్రభుత్వ కట్టుబాటుకు ఇది నిదర్శనం. 

ఆరోగ్య మంత్రిత్వ శాఖలో అదనపు కార్యదర్శి శ్రీమతి ఆరాధనా పట్నాయక్, ఆరోగ్యమంత్రిత్వ శాఖకు చెందిన కీలక భాగస్వాములు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు, రాష్ర్ట ప్రభుత్వాల అధికారులు, హెల్త్ కేర్ ప్రొవైడర్లు, అంతర్జాతీయ ఆరోగ్య సంస్థల ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 

 

***



(Release ID: 2029616) Visitor Counter : 10