సాంస్కృతిక మంత్రిత్వ శాఖ

ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన భారతదేశ సుసంపన్న సంస్కృతి.. వారసత్వాలకు ‘‘యుగయుగేఁ భారత్ మ్యూజియం’ ఓ ప్రతీకగా నిలుస్తుంది: కేంద్ర మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్


ప్రపంచంలోనే అతిపెద్ద ప్రదర్శనశాలకు సంబంధించి నాలుగు రోజుల
మేధామథన సదస్సు నిర్వహించిన కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ

Posted On: 29 JUN 2024 5:07PM by PIB Hyderabad

   సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్టులో భాగంగా ‘నార్త్-సౌత్ భవన సముదాయాల్లో నిర్మిస్తున్న ‘‘యుగయుగేఁ భారత్ మ్యూజియం’’పై కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వశాఖ ‘భారత మండపం’లో 4రోజుల మేధామథన సదస్సు నిర్వహించింది. ఇందులో భాగంగా 2024 జూన్ 26 నుంచి 29వ తేదీ వరకూ వివిధ మంత్రిత్వశాఖల పరిధిలోని భాగస్వామ్య సంస్థలతో సంప్రదింపులు సహా సామర్థ్య వికాస కార్యశాలను కూడా నిర్వహించారు. ఇవాళ చివరి రోజు చర్చకు కేంద్ర సాంస్కృతిక-పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్, కార్యదర్శి శ్రీ గోవింద్ మోహన్, భార‌త్‌లో ఫ్రాన్స్ రాయబారి డాక్టర్ థీరీ మాథౌ వంటి ప్రముఖులు కూడా హాజరయ్యారు.

   ఈ సందర్భంగా సాగిన సంప్రదింపుల ప్రక్రియ కింద ‘యుగయుగేఁ  భారత్ (ది టైమ్‌లెస్ అండ్ ఎటర్నల్ ఇండియా) మ్యూజియం’పై చర్చకు ప్రదర్శనశాల పర్యావరణ వ్యవస్థకు చెందిన వ్యక్తులతోపాటు ప్రభుత్వ ప్రతినిధులను కూడా భాగస్వాములను చేశారు. అలాగే సామర్థ్య వికాస కార్యశాలకు ఈ అంతర్జాతీయ మ్యూజియం సంప్రదింపుల సంస్థ అయిన ‘ఫ్రాన్స్ మ్యూజియమ్స్’ నిపుణుల బృందం నేతృత్వం వహించింది.

   సామర్థ్య వికాస కార్యశాల ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర సాంస్కృతిక-పర్యాటక శాఖ మంత్రి శ్రీ గజేంద్ర సింగ్ షెకావత్ మాట్లాడుతూ- ‘‘ఈ మ్యూజియం భారత సుసంపన్న వారసత్వం, దాని అప్రతిహత ప్రగతి స్ఫూర్తికి ప్రతీకగా నిలుస్తుంది. గతంలో బ్లూప్రింట్. ఈ మ్యూజియం సాంప్రదాయ ప్రదర్శనశాలల అనుభవానికి అతీతమైన సార్వజనీన స్ఫూర్తికి ప్రతీకగా ఉంటుంది. ఇదొక ప్రజా ప్రదర్శనశాలగా, సామాజిక కథనాలకు కేంద్రంగా- ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లయిన భారతదేశ వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది’’ అన్నారు.

   న్యూఢిల్లీలోని రైసినా హిల్‌ సమీపాన భారత కేంద్ర పరిపాలన ప్రదేశం పునరుద్ధరణకు ఉద్దేశించిన సెంట్రల్ విస్టా పునరాభివృద్ధి ప్రాజెక్ట్‌లో భాగంగా నార్త్-సౌత్ బ్లాక్‌లో ఈ కొత్త భారత జాతీయ ప్రదర్శనశాల నిర్మితమవుతోంది. మొత్తం 1,54,000 చదరపు మీటర్లలో విస్తీర్ణంలో రూపుదిద్దుకుంటున్న ఈ ప్రదర్శనశాల ప్రపంచంలోనే అతిపెద్దదిగా రికార్డులకు ఎక్కనుంది. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ పరిధిలోని ‘గ్లామ్’ (గ్యాలరీలు, లైబ్రరీలు, ఆర్కైవ్స్, మ్యూజియంలు) విభాగం 18.05.2023న నిర్వహించిన తొలి అంతర్జాతీయ మ్యూజియం ఎక్స్‌ పో ప్రారంభోత్సవంలో దీని సందర్శన వీడియోను ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ మొదట ఆవిష్కరించారు. అనంతరం 2023 జూలైలో ‘భారత మండపం’ ప్రారంభోత్సవం సందర్భంగా పునఃప్రదర్శించారు.

   ఈ ప్రదర్శనశాల ఫ్రాన్స్ సహకారంతో ‘సానుకూల పునర్వినియోగ’ విధానంలో రూపొందుతోంది. ప్రాచీన కట్టడాలను సుందరంగా రూపుదిద్దే ఈ విధానంలో ఫ్రాన్స్ నైపుణ్యానికి అక్కడి లౌవ్రే మ్యూజియం ఒక ఉదాహరణ కాగా, ఆ దేశ ఆర్థిక మంత్రిత్వశాఖ కార్యాలయం కూడా ఇప్పుడు ఆ భవనంలో ఉండటం గమనార్హం. పైగా రెండు దేశాల మధ్య సుదీర్ఘ స్నేమ సంబంధాలు కూడా ఈ ప్రాజెక్టులో ఫ్రాన్స్ భాగస్వామ్యానికి దోహదం చేశాయి. తదనుగుణంగా ప్రదర్శనశాలలు-సహకారానికి ప్రాధాన్యమిస్తూ 2020లో రెండు ప్రభుత్వాల మధ్య ‘ఆసక్తి వ్యక్తీకరణ లేఖ’పై సంతకం చేయడానికి ఈ స్నేహమే తోడ్పడింది.

   దీనికి అనుగుణంగా సంక్లిష్ట లక్ష్యాల సాధనను ప్రోత్సహించేలా వరుసగా సామర్థ్య వికాస కార్యశాలల నిర్వహణకు ‘గ్లామ్’ విభాగం నాయకత్వం వహించింది. ఆ మేరకు భాగస్వాముల మధ్య సమన్వయం, ఏకీకృత దృక్కోణ సృష్టికి తోడ్పడింది. వీటిలో మొదటిదిగా భారత ప్రభుత్వ ఇతర మంత్రిత్వ శాఖలు, విభాగాలను ఒకే వేదికపైకి తెచ్చిన జూన్ 14న మేధా మథనం నిర్వహించింది. తద్వారా అంతర విభాగ సమన్వయాన్ని పెరగడమేగాక ఈ ప్రాజెక్టు భారతీయ సమాజంలోని వివిధ కోణాలను ప్రతిబింబించేందుకు తోడ్పడుతుంది.

   అటుపైన తాజాగా జూన్ 26 నుంచి 29 వరకు భారత మండపంలో ప్రభుత్వ ప్రదర్శనశాలల నుంచి ఉన్నతస్థాయి నిర్వహణ సంబంధిత పర్యావరణ వ్యవస్థ భాగస్వాములు సహా పరిరక్షణ వాస్తుశిల్పులు, దృశ్యీకరణ నిపుణులు, ఎగ్జిబిషన్ డిజైనర్లు, ప్రచురణకర్తలు, పరిరక్షకులు, విద్యావేత్తలు వంటి ప్రైవేట్ నిపుణులతో నాలుగు రోజులపాటు మేధామథన సదస్సు కొనసాగింది.

   ఈ కార్యక్రమాల్లో భాగంగా కొన్ని రోజులపాటు సాగిన ముమ్మర మేధామథన సదస్సు, కార్యశాలలు అంతర్జాతీయ స్థాయి ప్రదర్శనశాల ప్రధాన కార్యాచరణకు సంబంధించి అమూల్యమైన దృక్కోణాలను ఆవిష్కరించాయి. అంతేకాకుండా సేకరించిన కళాఖండాల నిర్వహణ, సంరక్షక విధానాలు, ఉత్తమ పాలన పద్ధతులు, సాంకేతికతల వ్యూహాత్మక ఏకీకరణ వంటి సంక్లిష్ట అంశాలపై ఈ సదస్సులు ప్రధానంగా దృష్టి సారించాయి. ఈ మేధామథనం, కార్యశాలల ద్వారా సమకూరిన విజ్ఞాన సారాంశం యుగయుగేఁ భారత్ మ్యూజియం ప్రగతికి ఎంతగానో దోహదం చేస్తుంది.

***



(Release ID: 2029613) Visitor Counter : 47