రాష్ట్రపతి సచివాలయం
పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ ఫిజికల్ డిసెబిలిటీస్ ను సందర్శించిన గౌరవ రాష్ట్రపతి
Posted On:
20 JUN 2024 1:25PM by PIB Hyderabad
భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము నేడు (జూన్ 20, 2024) న్యూఢిల్లీలోని పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ ను సందర్శించారు. అక్కడ రాష్ట్రపతి దివ్యాంగ చిన్నారులు, విద్యార్థులతో సమయం గడిపారు. వారి సాంస్కృతిక ప్రదర్శనను వీక్షించారు. పునరుద్ధరించిన ప్రోస్తెసిస్, ఆర్థోసిస్ సెంటర్ ను సందర్శించి రోగులతో మాట్లాడారు.
ఒక దేశం లేదా సమాజం యొక్క పురోగతిని ఆ దేశ ప్రజలు లేదా సమాజం దివ్యాంగుల పట్ల చూపించే సున్నితత్వాన్ని బట్టి కొలవవచ్చని రాష్ట్రపతి అన్నారు. సున్నితత్వం, సమ్మిళితత్వం మన సంస్కృతి, నాగరికతలో అంతర్భాగమని ఆమె ఈ సందర్భంగా పేర్కొన్నారు.
దివ్యాంగుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మనం చేసే ప్రయత్నాలు సున్నితంగా ఉన్నప్పుడు సాధారణ జీవితాన్ని గడపడానికి ఏ శారీరక పరిస్థితి అడ్డంకి రాదని రాష్ట్రపతి అన్నారు. దివ్యాంగులు తమ నైపుణ్యాలు, ప్రతిభతో ప్రతి రంగంలోనూ నూతన శిఖరాలను అధిరోహిస్తున్నారని ఆమె సంతోషం వ్యక్తం చేశారు. దివ్యాంగులైన దీపా మాలిక్, అరుణిమా సిన్హా, అవని లేఖారా వంటి క్రీడాకారులను, కేఎస్ రాజన్న వంటి సామాజిక కార్యకర్తలను ఉదహరిస్తూ, అంకితభావం, సంకల్పంతో అన్ని రకాల శారీరక పరిమితులను అధిగమించవచ్చు అనే దానికి వారంతా ఉదాహరణలని ఆమె అన్నారు.
వికలాంగుల సాధికారత కోసం పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఫర్ పర్సన్స్ విత్ ఫిజికల్ డిజేబిలిటీస్ గత కొన్ని దశాబ్దాలుగా కృషి చేస్తోందని రాష్ట్రపతి సంతోషం వ్యక్తం చేశారు. దివ్యాంగుల సామాజిక, ఆర్థిక సాధికారత కోసం ఈ సంస్థతో సంబంధం కలిగి ఉన్న వారందరి కృషిని రాష్ట్రపతి ఈ సందర్భంగా అభినందించారు.
***
(Release ID: 2027260)
Visitor Counter : 78