ఆయుష్

ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ ఇతివృత్తం 'స్వీయ, సమాజం కోసం యోగా' ను ఉద్ఘాటించిన కేంద్ర ఆయుష్ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్


శ్రీనగర్ వేదికగా 2024 అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలు

వ్యక్తిగతంగా, సమాజ శ్రేయస్సును పెంపొందించడంలో యోగా యొక్క ద్వంద్వ పాత్రకు ప్రాధాన్యత

బ్రెయిలీ లిపిలో 'కామన్ యోగా ప్రోటోకాల్', పిల్లల కోసం ప్రొఫెసర్ ఆయుష్మాన్ కామిక్ పుస్తకాల ఆవిష్కరణ

గడచిన పదేళ్లలో నాలుగు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ నెలకొల్పిన యోగా దినోత్సవం.

Posted On: 18 JUN 2024 2:49PM by PIB Hyderabad

ఈ ఏడాది అంతర్జాతీయ యోగా దినోత్సవ ఇతివృత్తం 'స్వీయ, సమాజం కోసం యోగా' ను కేంద్ర ఆయుష్ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్ ఉద్ఘాటించారు. వ్యక్తిగత, సామాజిక శ్రేయస్సును పెంపొందించడంలో యోగా ద్వివిధ పాత్రను ప్రస్తావించారు. యోగ సామాజిక సామరస్యాన్ని పెంపొందించడంతో పాటు శారీరక, మానసిక, ఆధ్యాత్మిక ఎదుగుదలకు దోహదపడుతుందన్నారు. "ఇటీవలి కాలంలో లక్షలాది మంది ప్రజలు ఇందులో ఉత్సాహంగా పాల్గొనడం సమాజంపై యోగా విస్తారమైన ప్రభావాన్ని ప్రతిబింబిస్తుంది." అని మంత్రి పేర్కొన్నారు. క్షేత్రస్థాయిలో యోగా భాగస్వామ్యాన్ని పెంచేందుకు, గ్రామీణ ప్రాంతాల్లో యోగా వ్యాప్తిని ప్రోత్సహించేందుకు దేశంలోని ప్రతి గ్రామ సర్పంచ్‌లకు ప్రధానమంత్రి లేఖలు రాశారని ఆయన పేర్కొన్నారు. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన మరోసారి అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు శ్రీనగర్‌లో జరగనున్నాయి.

10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర ఆయుష్ సహాయ మంత్రి (స్వతంత్ర హోదా) శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

యోగాకు ప్రపంచ వ్యాప్త గుర్తింపు తీసుకురావడంలో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ  కీలక పాత్ర పోషించారు. 2015 నుంచి ప్రధానమంత్రి అంతర్జాతీయ యోగ దినోత్సవ వేడుకలను ప్రఖ్యాత ప్రదేశాలైన దిల్లీలోని కర్తవ్య పథ్, చండీగఢ్, డెహ్రాడూన్, రాంచీ, జబల్‌పూర్, న్యూయార్క్ లోని ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయాల్లో పాల్గొన్నారు. ఆయన నాయకత్వం యోగాకు ప్రపంచవ్యాప్త ఆదరణ, గుర్తింపును గణనీయంగా పెంచిందని మంత్రి పేర్కొన్నారు.

సెప్టెంబర్‌, 2014 లో ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చేసిన ప్రతిపాదన మేరకు  ప్రతి ఏటా జూన్ 21వ తేదీని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా నిర్వహించాలని ఐరాస 11 డిసెంబర్ 2014 రోజున ఏకగ్రీవంగా తీర్మానించినట్లు ఆయన తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో భారత్‌కు ఇది ముఖ్యమైన దౌత్య విజయంగా పేర్కొన్నారు. ఈ ప్రయత్నం యోగాకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావడానికి దారితీసింది.
అంతర్జాతీయ యోగ దినోత్సవం సందర్భంగా, గత పదేళ్లలో నాలుగు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులను నెలకొల్పింది. 2015లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి 35,985 మంది భారతీయులు రాజ్ పథ్‌లో యోగాలో పాల్గొన్నారు. మొత్తం 84 దేశాల్లో భిన్న ప్రాంతాల్లో ఓకేసారి యోగా సెషన్ లో పాల్గొన్నాయి. క్రమంగా ప్రతి ఏడాది ప్రపంచవ్యాప్తంగా ఈ యోగ వేడుకల్లో పాల్గొనే వారి సంఖ్యలో పెరుగుతోంది. గత ఏడాది 2023 లో, ప్రపంచవ్యాప్తంగా మొత్తం 23.4 కోట్ల మంది యోగ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు.

కంటి చూపు లేని వారి కోసం సౌకర్యవంతంగా యోగా నేర్చుకునేందుకు, అభ్యసించడానికి ఆయుష్ మంత్రి 'కామన్ యోగా ప్రోటోకాల్ బుక్ ఇన్ బ్రెయిలీ' పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం యోగాపై ప్రొఫెసర్ ఆయుష్మాన్ కామిక్ పుస్తకాన్నిఆవిష్కరించారు. "ఈ పుస్తకం పిల్లల్లో ఆసక్తిని పెంపొందిస్తూ, వినోదంతో యోగా నేర్చుకోవడానికి, అభ్యసించడానికి సహాయపడుతుంది" అని మంత్రి పేర్కొన్నారు.

2024 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఈ ఏడాది 'యోగా ఫర్ స్పేస్' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. కామన్ యోగా ప్రోటోకాల్ మార్గదర్శకాల ప్రకారం ఇస్రో శాస్త్రవేత్తలు, అధికారులందరూ కలిసి యోగా చేయనున్నారు. గగన్‌యాన్ ప్రాజెక్టు బృందం కూడా ఈ యోగా సాధన చేయడం ద్వారా అంతర్జాతీయ యోగా దినోత్సవం యొక్క ప్రపంచవ్యాప్త ప్రచారంలో పాల్గొంటుంది.

యోగా రంగంలో సాంకేతికతను, అంకుర సంస్థలను ప్రోత్సహించడానికి, ఆయుష్ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వానికి చెందిన మైగవ్ పోర్టల్, మైభారత్ పోర్టల్‌లో 'యోగా టెక్ ఛాలెంజ్‌'ను నిర్వహిస్తోంది. ఇది యోగా సంబంధిత సాధనాలు, సాఫ్ట్ వేర్, అనుబంధ ఉపకరణాలను అభివృద్ధి చేసిన అంకుర సంస్థలను, వ్యక్తులను గుర్తించి ప్రోత్సహించడం కోసం నిర్వహిస్తున్నారు.
ఆయుష్ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా, అంతర్జాతీయ యోగ దినోత్సవం ప్రారంభమైనప్పటి నుండి దాని ప్రయాణాన్ని ప్రస్తావించారు. ఆరోగ్యాన్ని ప్రోత్సహించడంలో, సామాజిక విలువలను పెంపొందించడంలో, సమాజ భావనను ప్రజల్లో కలిగించడంలో యోగ పాత్రను వివరించారు. యోగా మనస్సు, శరీరాల ఐక్యతను పెంపొందిస్తుందని, సమతుల్యత, స్వీయ నియంత్రణ, సంపూర్ణ వికాసాన్ని ప్రోత్సహిస్తుందని ఆయన అన్నారు. కోవిడ్ మహమ్మారి సమయంలో వర్చువల్ వేడుకలను ఆయన గుర్తు చేశారు. శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా పాత్రను ఆయన ప్రధానంగా తెలిపారు.

ఆయుష్ కార్యదర్శి వైద్య రాజేష్ కొటేచా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని 'సంపూర్ణ ప్రభుత్వ' విధానాన్ని ఆయన ప్రస్థావించారు. వివిధ ప్రభుత్వ శాఖలు సమన్వయంతో చేస్తున్న కృషిని, ప్రతి సంవత్సరం సమ్మిళిత, విస్తృత కార్యాచరణ కోసం రాష్ట్ర ప్రభుత్వాల క్రియాశీలక భాగస్వామ్యాన్ని ఉద్ఘాటించారు. ఐడీవై 2024లో రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా చురుగ్గా పాల్గొంటున్నాయి. దేశవ్యాప్తంగా జాతీయ ఆయుష్ మిషన్ బృందం కూడా ఐడివై కార్యక్రమాల నిర్వహణలో క్రియాశీలకంగా పాల్గొంటోంది. ఈ సహకార ప్రయత్నం సమాజంలోని అన్ని రంగాలలో సంపూర్ణ ఆరోగ్యాన్ని, శ్రేయస్సును ప్రోత్సహించడంలో యోగా ప్రాముఖ్యతను తెలియజేస్తుంది.

ఆయుష్ మంత్రిత్వ శాఖ, దిల్లీలోని ఎన్‌డిఎంసి (న్యూఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్), ఎఎస్ఐ (ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా) డిడిఎ (ఢిల్లీ డెవలప్‌మెంట్ అథారిటీ)తో కలిసి 21 జూన్ 2024 న సామూహిక యోగా కార్యక్రమాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసింది. బ్రహ్మ కుమారీస్, ఆర్ట్ ఆఫ్ లివింగ్, పతంజలి, గాయత్రి పరివార్, ఈషా యోగా సెంటర్, హార్ట్ ఫుల్‌నెస్ వంటి సామాజిక సంస్థల నుంచి కూడా మంత్రిత్వ శాఖకు అపారమైన మద్దతు లభిస్తోంది.

ఆయుష్ మంత్రిత్వ శాఖ, యోగ దినోత్సవ కార్యక్రమాల్లో ప్రజలందరిని భాగస్వామ్యం చేసేందుకు, అనేక పోటీలను, కార్యక్రమాలను నిర్వహిస్తోంది. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ (ఐసిసిఆర్) భాగస్వామ్యంతో, మైగవ్ మైభారత్ పోర్టల్స్ లో నిర్వహించిన "యోగా విత్ ఫ్యామిలీ" వీడియో కాంటెస్ట్ ఇందులో ఒక ప్రధా కార్యక్రమం. ఈ పోటీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న కుటుంబాలను ఐడివై 2024 వేడుకలలో పాల్గొనడానికి ప్రోత్సహిస్తుంది. దీని ద్వారా కుటుంబ బంధాలను బలోపేతం చేస్తుంది. ఇందులో పాల్గొనేందుకు చివరి తేదీ 30 జూన్ 2024

#YogaWithFamily వీడియో కాంటెస్ట్ లో పాల్గొనేవారు యోగా ద్వారా ఆరోగ్యం, ఐక్యత సందేశాన్ని ఇవ్వాలి. ఇందులో పాల్గొనే వారు ఉత్తేజకరమైన బహుమతులను గెలుచుకునే అవకాశం ఉంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ యోగ ప్రపంచ వ్యాప్త ప్రచారం కోసం సామాజిక మాధ్యమాల్లో #InternationalDayofYoga2024, #YogaForSelfAndSociety, #YogaWithFamily #IDY2024 హ్యాష్‌ట్యాగ్ లను సృష్టించింది. ప్రజలందరూ వీటిని అనుసరించి, పాల్గొనాల్సిందిగా కోరింది.

 

***



(Release ID: 2026391) Visitor Counter : 57