సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ

‘డిఇపిడబ్ల్యుడి’ పథకాలు కీలక కార్యక్రమాల ప్రగతిపై కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ సమీక్ష

Posted On: 16 JUN 2024 11:13AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నిర్దేశించిన తొలి 100 రోజుల కార్యాచరణ ప్రణాళికతోపాటు దివ్యాంగ సాధికారత కల్పన విభాగం (డిఇపిడబ్ల్యుడి) పథకాలు, శాఖాపరంగా కీలక కార్యక్రమాలపై  కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ నిన్న (15.6.2024) సమీక్షించారు. ఈ మేరకు సహాయ మంత్రులు శ్రీ రాందాస్ అథవాలే, శ్రీ బి.ఎల్.వర్మతో కలసి ఒక రోజంతా సుదీర్ఘ చర్చల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘డిఇపిడబ్ల్యుడి’ కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ ఈ విభాగం చేపట్టిన కార్యక్రమాల గురించి సమగ్ర వివరణ ఇచ్చారు. అలాగే భారత కృత్రిమ అవయవ తయారీ కార్పొరేషన్ (ఎఎల్ఐఎంసిఒ) ఆధునికీకరణ దిశగా కృషి గురించి కూడా తెలిపారు. మరోవైపు దివ్యాంగ సంక్షేమ ముఖ్య కమిషనర్ (సిసిపిడి), భారత పునరావాస మండలి (ఆర్‌సిఐ), జాతీయ సంస్థలు (ఎన్ఐ), జాతీయ దివ్యాంగ అభివృద్ధి-ఆర్థిక సహాయ సంస్థ (ఎన్‌డిఎఫ్‌డిసి) సాధించిన కీలక విజయాలను గురించి ఆయా విభాగాల అధిపతులు నివేదించారు.

   ఈ విభాగం విస్తృతి, సామర్థ్యం పెంపు దిశగా వ్యూహాత్మక దిశానిర్దేశం, కార్యాచరణ ప్రణాళికలపై సమావేశంలో పాల్గొన్న వివిధ విభాగాల అధికారులు లోతుగా చర్చించారు. ఈ మేరకు ఆధునికీకరణ ద్వారా దివ్యాంగుల కోసం పరికరాలు, సహాయక ఉపకరణాల తయారీలో విప్లవాత్మక మార్పులు తెస్తామని ‘ఎఎల్ఐఎంసిఒ’ అధికారులు తెలిపారు. ఇక ‘‘సిసిపిడి, ఆర్‌సిఐ , ఎన్ఐ, ఎన్‌డిఎఫ్‌డిసి’’ సాధించిన విజయాలు సార్వజనీన వృద్ధి, సాధికారత సాధనలో ఆయా విభాగాల నిబద్ధతను చాటుతున్నాయని వారు పేర్కొన్నారు.

   అనంతరం కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ మాట్లాడుతూ- సార్వజనీన, సమసమాజ నిర్మాణంలో ఈ కార్యక్రమాలకు ఎనలేని ప్రాముఖ్యం ఉందని నొక్కిచెప్పారు. ‘‘సమాజంలోని అన్ని వర్గాల సాధికారత, సార్వజనీనతకు తోడ్పడే బలమైన చట్రం రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఆ మేరకు ‘ఎఎల్ఐఎంసిఒ’ ఆధునికీకరణతోపాటు మా శాఖ పరిధిలోని వివిధ సంస్థలు సాధించిన విజయాలు ఈ లక్ష్య సాధనలో మా అంకితభావానికి తిరుగులేని రుజువులు’’ అని వ్యాఖ్యానించారు.

   దివ్యాంగ సాధికారత దిశగా చేపట్టిన కార్యక్రమాలను విజయవంతం చేసేదిశగా సాగుతున్న కృషిని సహాయమంత్రులు శ్రీ రాందాస్ అథవాలే, శ్రీ బి.ఎల్.వర్మ కూడా అభినందించారు. ఈ సందర్భంగా కార్యదర్శి శ్రీ రాజేష్ అగర్వాల్ తమ సీనియర్ అధికారులతో కలిసి సకాలంలో, ప్రభావశీల అమలు దిశగా విలువైన దృక్కోణాలు, సమగ్ర ప్రణాళికల గురించి వారికి వివరించారు. ముఖ్యంగా రాబోయే 100 రోజులకు నిర్దేశించిన లక్ష్యాల సాధనతోపాటు భవిష్యత్ ప్రగతికి బలమైన పునాది వేయడంలో నిర్విరామంగా శ్రమించడానికి ప్రభుత్వం నిబద్ధతతో ముందుకు సాగాలని ఏకగ్రీవంగా తీర్మానిస్తూ సమావేశం ముగిసింది.

***



(Release ID: 2025826) Visitor Counter : 44