పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ

పెట్రోలియం-సహజ వాయువు శాఖ మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన శ్రీ హర్దీప్ సింగ్ పూరి


2025 నాటికి 20 శాతం ఇథనాల్ మిశ్రమ లక్ష్యం
సాధించడంపై ప్రభుత్వ నిబద్ధత పునరుద్ఘాటన

Posted On: 11 JUN 2024 6:37PM by PIB Hyderabad

   కేంద్ర పెట్రోలియం-సహజ వాయువు శాఖ మంత్రిగా శ్రీ హర్దీప్ సింగ్ పూరి ఇవాళ న్యూఢిల్లీలో పదవీ బాధ్యతలు స్వీకరించారు. అనంతరం మీడియా ప్రతినిధులతో ముచ్చటిస్తూ- ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దార్శనిక నాయకత్వంలో భారత దేశం ఇంధన లభ్యత, సౌలభ్యం, సుస్థిరత అనే ఇంధన త్రిముఖ సందిగ్ధాన్ని విజయవంతంగా అధిగమించిందని ఆయన చెప్పారు. అయితే, ఇరుగుపొరుగు దేశాలే కాకుండా చివరకు అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఈ విషయంలో సంకటంలో చిక్కుకున్నాయని గుర్తుచేశారు. ఆ మేరకు ఇంధన రేషన్‌, పంపులలో ఇంధన కొరత, నిరంతరం పెరిగే ధరలు వంటి సమస్యలతో సతమతం అయ్యాయని పేర్కొన్నారు. కానీ, ప్రపంచంలోనే రెండున్నరేళ్ల సరిపోలిక వ్యవధిలో ఇంధన ధరలు తగ్గిన దేశం బహుశా భారత్ ఒక్కటేనన్నారు.

 

   ‘‘దేశంలో 2014 నాటికి మన వంటగ్యాస్ కనెక్షన్ల సంఖ్య కేవలం 14 కోట్లు కాగా, 55 శాతం జనాభాకు మాత్రమే సిలిండర్‌ అందుబాటులో ఉండేది. అయితే, నేడు గ్యాస్ వినియోగదారుల సంఖ్య 32 కోట్లకు చేరడమేగాక, మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉజ్వల పథకం పూర్తిగా విజయవంతమైంది. తద్వారా తల్లులు, సోదరీమణులందరికీ ఇవాళ వంటగ్యాస్ సౌలభ్యం కలిగింది’’ అని మంత్రి పేర్కొన్నారు. దేశంలో ముడిచమురు అన్వేషణ, ఉత్పత్తి గురించి శ్రీ పూరి మాట్లాడుతూ- 98/2 నంబరు బావి నుంచి చమురు ఉత్పత్తి రోజుకు 45,000 బ్యారెళ్ల స్థాయికి పెరుగుతుందని చెప్పారు. దీంతోపాటు సహజవాయువు ఉత్పత్తి కూడా త్వరలోనే మొదలు కాగలదన్నారు. ’’పశ్చిమ తీరంలో అంతర్జాతీయ సాంకేతిక భాగస్వామి కోసం ‘ఒఎన్‌జిసి’ ఇప్పటికే టెండర్లు ఆహ్వానించింది. ఈ మేరకు అంతర్జాతీయ చమురు-గ్యాస్ అన్వేషణలో 75 బిలియన్ అమెరికా డాలర్లకన్నా అధిక వార్షికాదాయంగల ప్రధాన సంస్థలన్నిటికీ అవకాశం కల్పించింది’’ అని మంత్రి వివరించారు.

   దేశంలో 2025 నాటికి 20శాతం ఇథనాల్ మిశ్రమం లక్ష్య సాధనపై ప్రభుత్వ నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ- ‘‘ఈ ఏడాది ఒక్క మే నెలలో ఇథనాల్ మిశ్రమ లక్ష్యంలో 15 శాతం స్థాయిని మనం దాటగలిగాం’’ అని వెల్లడించారు. అలాగే ‘‘దేశవ్యాప్తంగా 2030 నాటికి దీన్ని 20 శాతానికి చేర్చాలని ప్రధాని లక్ష్యనిర్దేశం చేసుకున్న సంగతి మీకు తెలిసిందే. అయితే, దీన్ని 2025నాటికే సాధించాలని తాజాగా ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఈ నేపథ్యంలో నా అనుభవంతోపాటు పనితీరు ప్రగతి మేరకు ఈ లక్ష్యం 2025నాటికి కచ్చితంగా నెరవేరుతుంది’’ అని మంత్రి విశ్వాసం వెలిబుచ్చారు.

   చమురు శుద్ధి ప్రక్రియలో శుద్ధి ప్రక్రియలో హరిత ఉదజనిని సమ్మిళితం చేయడంపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని శ్రీ పూరి నొక్కిచెప్పారు. ఈ మేరకు పానిపట్ (10 కెటిఎ), మథుర (5 కెటిఎ), పారాదీప్ (10 కెటిఎ)లలోని చమురుశుద్ధి కర్మాగారాల్లో త్వరలోనే హరిత ఉదజని ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. కాగా, ‘‘ఎన్నికలు కొనసాగుతున్నప్పటికీ తొలి ప్లాంట్ (10 మెగావాట్లు) 2024 మే 27న ప్రారంభించబడింది. మన ప్రభుత్వరంగ చమురు సంస్థలలో అధికశాతం హరిత ఉదజని సరఫరాపై టెండర్ల జారీ ప్రక్రియను మొదలుపెట్టాయి. ఇందులో భాగంగా కొచ్చి విమానాశ్రయం నుంచి బస్సులు నడిపడం కోసం అక్కడ హరిత ఉదజని కేంద్రం ప్రారంభించబడింది’’ అని ఆయన వెల్లడించారు.

   చమురుశుద్ధి రంగంలో రానున్న ప్రాజెక్టుల గురించి చెబుతూ- సరికొత్త శుద్ధి కర్మాగారాల ఏర్పాటులో ‘బిపిసిఎల్’ ఇప్పటికే ముందంజ వేసిందని శ్రీ పూరి తెలిపారు. అలాగే పెట్రో రసాయనాలకు సంబంధించి ఇథేన్ క్రాకర్ యూనిట్ ఏర్పాటుకు ‘గెయిల్’ (జిఎఐఎల్) ప్రణాళిక సిద్ధం చేస్తున్నదని చెప్పారు. అంతేకాకుండా ‘‘బినాలో ‘బిపిసిఎల్’ శుద్ధి కర్మాగారం, చెన్నైలోని ‘ఐఒసిఎల్’  పరిధిలో కావేరి బేసిన రిఫైనరీ సిద్ధమవుతున్నాయి’’ అని మంత్రి వివరించారు.

***



(Release ID: 2024521) Visitor Counter : 31