గృహ నిర్మాణం మరియు పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ

పట్టణాభివృద్ధి, గృహ నిర్మాణ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన మనోహర్ లాల్


నూతనోత్సాహంతో అభివృద్ధి ఎజెండాను ముందుకు తీసుకెళ్తామని హామీ

Posted On: 11 JUN 2024 6:35PM by PIB Hyderabad

గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రిగా శ్రీ మనోహర్ లాల్, సహాయ మంత్రి శ్రీ తోఖాన్ సాహు నేడు పదవీ బాధ్యతలు స్వీకరించారు. మంత్రిత్వ శాఖకు చెందిన ఉన్నతాధికారులతో సంయుక్త సమీక్షా సమావేశం నిర్వహించి, శాఖకు చెందిన ప్రధాన కార్యక్రమాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఇప్పటి వరకు పెట్రోలియం, సహజవాయువు శాఖతో పాటు గృహనిర్మాణం, పట్టణాభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించిన కేంద్రమంత్రి శ్రీ హర్‌దీప్ సింగ్ పూరి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.



పరిశుభ్రమైన హరిత నగరాలను తీర్చిదిద్దే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరాన్ని మంత్రి శ్రీ మనోహర్ లాల్ నొక్కిచెప్పారు. మన నగరాలన్నింటినీ 'చెత్తరహితం' గా మార్చే మిషన్‌లో భాగంగా వ్యర్థాలను సంపదగా మార్చడానికి స్వచ్ఛ భారత్ మిషన్ కింద చేస్తున్న ప్రయత్నాలను అభినందించారు.
నగరాలలో నీటి భద్రత, 4,900 పట్టణ స్థానిక సంస్థల్లో నీటి సరఫరా, 500 అమృత్ నగరాల్లో మురుగుశుద్ధి వంటి అమృత్ మిషన్ లక్ష్యాలను సమీక్షా సమావేశంలో మంత్రి ప్రశంసించారు.


పట్టణ ప్రాంతాల ప్రయాణ అనుభవాన్ని సులభతరం చేయడంలో మెట్రో రైలు యొక్క ప్రాముఖ్యతను ప్రధానంగా ప్రస్థావిస్తూ, అన్ని మెట్రో ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయడానికి మంత్రిత్వ శాఖ చేస్తున్న ప్రయత్నాలను రెట్టింపు చేయనున్నట్లు మంత్రి తెలిపారు. మెట్రో రైలు సమాజంలోని అన్ని వర్గాలకు సౌకర్యవంతమైన సురక్షితమైన రవాణా సాధనంగా మారిందని అన్నారు.

స్మార్ట్ సిటీస్ మిషన్ కింద పూర్తయిన ప్రాజెక్టులు దేశంలో పట్టణ ప్రణాళిక, పాలనలో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాయని మంత్రి పేర్కొన్నారు. ఈ నగరాలలో మెరుగైన పట్టణ నిర్వహణ కోసం సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పెరిగింది, నేరాల ట్రాకింగ్, పౌరుల భద్రత, రవాణా నిర్వహణ, ఘన వ్యర్థాల నిర్వహణ, నీటి సరఫరా, విపత్తు నిర్వహణ వంటి వివిధ రంగాలలో ప్రతి 100 నగరాలలో పట్టణ సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయి.

 

 


 


దేశంలోని అన్ని ప్రాంతాల్లోని పట్టణ పేదలకు ప్రధాన మంత్రి స్వనిధి మరియు డీఏవై -ఎన్‌యూఎల్‌ఎం మిషన్ ల ప్రయోజనాల పరిధిని మరింత పెంచాల్సిన అవసరాన్ని కేంద్రమంత్రి శ్రీ మనోహర్ లాల్ తెలిపారు. తద్వారా పట్టణ పేదరికం యొక్క బహుళ కోణాలను పరిష్కారం, వారి ఆదాయ వనరులు, జీవనోపాధిని మెరుగుపరచడం జరుగుతుందని ఆయన తెలిపారు.

ప్రతి కుటుంబం ఇళ్లు కలిగి ఉండటం యొక్క అవసరం గురించి మాట్లాడుతూ, లక్షలాది మంది జీవిత కలను నెరవేర్చే దిశగా  పిఎమ్ఎవై పనిచేస్తోందని, అందువల్ల పిఎమ్ఎవై (అర్బన్) కింద మరో కోటి గృహాలను నిర్మిస్తామని ప్రధానమంత్రి ప్రకటించడం మంత్రిత్వ శాఖ యొక్క కీలక ప్రాధాన్యత అని మంత్రి అన్నారు. గృహనిర్మాణ ప్రాజెక్టులన్నీ సకాలంలో పూర్తయ్యేలా ఎప్పటికప్పుడు రాష్ట్రస్థాయి సమీక్షలు నిర్వహిస్తామని హామీ ఇచ్చారు.

పనితీరును సమీక్షించిన తరువాత, దేశంలో సుస్థిర పట్టణాభివృద్ధి కోసం వ్యూహాత్మక సమగ్ర రోడ్డు మ్యాప్ గురించి ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సమ్మిళిత వికసిత్ భారత్‌ను సాధించడానికి అభివృద్ధి ఎజెండాను మరింత వేగంతో ముందుకు తీసుకెళ్తామని ప్రతిజ్ఞ చేశారు.

 

***



(Release ID: 2024513) Visitor Counter : 39