ప్రధాన మంత్రి కార్యాలయం
మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారంపై ప్రధానమంత్రికి ప్రపంచ నాయకుల నుంచి కొనసాగుతున్న అభినందన సందేశ పరంపర
వారందరి అభినందనలు.. శుభాకాంక్షలకు ప్రధాని ధన్యవాద సందేశాలు
Posted On:
10 JUN 2024 12:00PM by PIB Hyderabad
భారత ప్రధానమంత్రిగా శ్రీ నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేసిన నేపథ్యంలో ప్రపంచ నాయకుల అభినందన సందేశ పరంపర ఇంకా కొనసాగుతోంది. వీటిపై ప్రధాని శ్రీ మోదీ స్పందిస్తూ- సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’ ద్వారా వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ మేరకు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు శ్రీ బిల్ గేట్స్ పోస్టుకు జవాబిస్తూ:
‘‘బిల్ గేట్స్ గారూ! మీ సందేశం ద్వారా నాకెంతో గౌరవం లభించడంపై సంతోషిస్తున్నాను. కొన్ని నెలల కిందట మనిద్దరి మధ్య సమావేశంలో మీరెంతో సానుకూల, సునిశిత రీతిలో సంభాషించడాన్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నాను. పరిపాలన, ఆరోగ్య సంరక్షణ రంగాల్లో సాంకేతిక పరివర్తన పాత్ర, వాతావరణ మార్పుసహా సుస్థిర ప్రగతికి భారత్ నిబద్ధత వగైరాలపై మనం చర్చించుకున్నాం. మానవాళి విస్తృత ప్రయోజనాల దిశగా ఆవిష్కరణలను ప్రోత్సహించడంలో మన భాగస్వామ్యానికిగల విలువకు ఇది నిదర్శనం’’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ మాజీ అధ్యక్షుడు గౌరవనీయ హమీద్ కర్జాయ్ పోస్టుకు బదులిస్తూ:
‘‘నా మిత్రుడు హమీద్ కర్జాయ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినందుకు నా ధన్యవాదాలు’’ అని ప్రధాని పేర్కొన్నారు.
ఉగాండా అధ్యక్షుడు గౌరవనీయ యోవేరి కె ముసెవెని పోస్టుకు సమాధానం పంపుతూ:
‘‘అధ్యక్షుడు యొవేరి కె ముసెవెనీ గారూ! మీ హృదయపూర్వక శుభాకాంక్షలపై నేనెంతో సంతోషిస్తున్నాను. ఉగాండాతో మా బలమైన భాగస్వామ్యాన్ని మేం మరింత ముందుకు తీసుకెళ్తాం. జి-20కి భారత్ అధ్యక్షత సందర్భంగా కూటమిలో ఆఫ్రికా సమాఖ్యకు శాశ్వత సభ్యత్వం లభించడంపై మేమెంతో గర్విస్తున్నాం. మన చారిత్రక అనుబంధం అన్ని రంగాల్లోనూ మరింత పటిష్ఠం కావాలి’’ అని ప్రధానమంత్రి ఆకాంక్షించారు.
స్లొవేనియా ప్రధానమంత్రి గౌరవనీయ రాబర్ట్ గొలోబ్ పోస్టుకు జవాబిస్తూ:
‘‘ప్రధానమంత్రి గౌరవనీయ రాబర్ట్ గోలోబ్ గారూ! మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు. మూడోసారి నా ప్రధాని పదవీ కాలంలో భారత్-స్లోవేనియాల మధ్య సన్నిహిత భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే కృషిని కొనసాగిస్తాం’’ అని ప్రధానమంత్రి హామీ ఇచ్చారు.
ఫిన్లాండ్ ప్రధానమంత్రి గౌరవనీయ పెట్టేరి ఓర్పో పోస్టుపై స్పందిస్తూ:
‘‘ప్రధాని పెట్టేరి గారూ! మీ హృదయపూర్వక శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు. భారత్-ఫిన్లాండ్ సంబంధాలలో మరింత ఉత్తేజానికి, మన భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మీతో సన్నిహితంగా కృషి చేయడం కోసం నేను సదా సిద్ధంగా ఉంటాను’’ అని ప్రధానమంత్రి బదులిచ్చారు.
కెనడా ప్రధాని గౌరవనీయ జస్టిన్ ట్రూడో పోస్టుపై స్పందిస్తూ పంపిన సందేశంలో:
‘‘మీ అభినందన సందేశానికి నా కృతజ్ఞతలు. పరస్పర అవగాహన, రెండు దేశాల ఉమ్మడి అంశాలపై గౌరవభావం ప్రాతిపదికన కెనతో సంయుక్త కృషికి భారత్ సదా సిద్ధంగా ఉంటుంది’’ అని ప్రధానమంత్రి బదులిచ్చారు.
సెయింట్ కిట్స్-నెవిస్ ప్రధానమంత్రి డాక్టర్ టెరెన్స్ డ్రూ పోస్టుకు జవాబిస్తూ:
‘‘ప్రధాని టెరెన్స్ డ్రూ గారూ! ధన్యవాదాలు. సెయింట్ కిట్స్-నెవిస్, భారతదేశ ప్రజల మధ్య శతాబ్దాల నాటి సంబంధాలు కొనసాగడం మాకెంతో గర్వకారణం. దక్షిణార్ధ గోళంలో కీలక కరీబియన్ భాగస్వామిగా బలమైన ప్రగతి సహకార విస్తృతి దిశగా మీతో సంయుక్త కృషికి సదా సిద్ధంగా ఉంటాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
యెమెన్ ప్రధాని గౌరవనీయ అహ్మద్ అవద్ బిన్ ముబారక్ పోస్టుకు ప్రత్యుత్తరమిస్తూ:
‘‘ప్రధానమంత్రి అహ్మద్ అవద్ బిన్ ముబారక్ గారూ! మీ శుభాకాంక్షలకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. యెమెన్‌తో చారిత్రక-స్నేహపూర్వక సంబంధాలకు మేమెంతో విలువనిస్తాం. దేశ ప్రజలందరికీ శాంతి, భద్రత, స్థిరత్వం, శ్రేయస్సు సమకూరాలని ఆకాంక్షిస్తున్నాం’’ అని ప్రధానమంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.
టెస్లా సంస్థ ముఖ్య కార్యనిర్వహణాధికారి (సీఈవో) గౌరవనీయ ఎలాన్ మస్క్ అభినందన సందేశానికి బదులిస్తూ:
‘‘ఎలాన్ మస్క్ గారూ! మీ శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు. ప్రతిభావంతులైన భారత యువత, మా జనాభా, సరళ విధానాలు, సుస్థిరమైన ప్రజాస్వామ్య రాజకీయాలు వంటివన్నీ మా భాగస్వాములందరికీ వ్యాపార సౌలభ్య వాతావరణ కల్పన దిశగా సదా కొనసాగుతాయి’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఎస్వాటిని ప్రధానమంత్రి గౌరవనీయ రస్సెల్ మిసో డ్లామిని పోస్టుపై స్పందిస్తూ:
‘‘రస్సెల్ మిసో డ్లామిని గారూ! హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపినందుకు మీతోపాటు రాజ కుటుంబానికి, ఎస్వాటిని దేశ స్నేహపూర్వక ప్రజానీకానికి నా ధన్యవాదాలు. మన భాగస్వామ్యం మరింత బలోపేతమయ్యే దిశగా మనం సంయుక్తంగా కృషి చేద్దాం’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
బెలీజ్ ప్రధానమంత్రి గౌరవనీయ జాన్ బ్రిసెనో పోస్టుకు జవాబిస్తూ:
‘‘ధన్యవాదాలు ప్రధానమంత్రి జాన్ బ్రిసెనో గారూ! బెలీజ్‌తో స్నేహానికి మేమెంతో విలువనిస్తాం. ఈ బంధం బలోపేతం దిశగానే కాకుండా దక్షిణార్థ గోళ దేశాల ప్రగతి, శ్రేయస్సు కోసం మీతో కలసి కృషి చేయడానికి సదా సిద్ధంగా ఉంటాం’’ అని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు.
బెల్జియం ప్రధానమంత్రి గౌరవనీయ అలెగ్జాండర్ డి క్రూ పోస్టుకు ప్రత్యుత్తరమిస్తూ:
‘‘ప్రధానమంత్రి అలెగ్జాండర్ డి క్రూ గారికి నా ధన్యవాదాలు! భారత్-బెల్జియం దేశాల మధ్య ఉత్తేజకర, శక్తిమంతమైన భాగస్వామ్యం కొత్త శిఖరాలను చేరే కృషి నా తాజా పదవీ కాలంలో కొనసాగుతుంది’’ అని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు.
బొలీవియా అధ్యక్షుడు గౌరవనీయ లూయిస్ అర్సే పోస్టుకు ప్రతిస్పందనగా పంపిన సందేశంలో:
‘‘లూయిస్ అర్సే గారూ! మీ శుభాకాంక్షలకు, భారత ప్రజాస్వామ్యంపై మీ హృదయపూర్వక అభినందనలకు నా ధన్యవాదాలు. లాటిన్ అమెరికాలో భారతదేశానికి బొలీవియా ఎంతో విలువైన భాగస్వామి. మన సహకారాన్ని మరింత విస్తృతం చేసుకోవడానికి మేం సదా కట్టుబడి ఉంటాం’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
ఐర్లాండ్ ప్రధానమంత్రి గౌరవనీయ సైమన్ హారిస్ పోస్టుకు బదులిస్తూ:
‘‘ప్రధానమంత్రి సైమన్ హారిస్ గారూ! హృదయపూర్వక శుభాకాంక్షలకు నా కృతజ్ఞతలు. భారత్-ఐర్లాండ్ సంబంధాలు ఉమ్మడి ప్రజాస్వామ్య విలువలతో ముడిపడి ఉన్నాయి. రెండు దేశాల స్నేహబంధం 75వ వార్షికోత్సవం నేపథ్యంలో మన భాగస్వామ్యాన్ని మరింత లోతుకు తీసుకెళ్లడంలో మీ నిబద్ధతను నేను పంచుకుంటాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
జాంబియా అధ్యక్షుడు గౌరవనీయ హకైండే హిచిలేమా పోస్టుకు జవాబిస్తూ:
‘‘అధ్యక్షుడు హకైండే హిచిలేమా గారూ! మీ హృదయపూర్వక అభినందనలకు నా కృతజ్ఞతలు. భారత్-జాంబియా భాగస్వామ్యం నానాటికీ మరింత బలం పుంజుకుంటూనే ఉంటుంది’’ అని ప్రధానమంత్రి భరోసా ఇచ్చారు.
ఇండోనేషియా అధ్యక్ష పదవికి ఎన్నికైన గౌరవనీయ ప్రబోవో సుబియాంటో పోస్టుపై స్పందిస్తూ:
‘‘అధ్యక్ష పదవికి ఎన్నికైన ప్రబోవో సుబియాంటో గారూ! మీ శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు. మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంతోపాటు ప్రాచీన కాలంనుంచి గల మన సంబంధాల బలోపేతం దిశగా మీతో సంయుక్త కృషికి నేను సదా సంసిద్ధుడునై ఉంటాను’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
స్విస్ కాన్ఫెడరేషన్ అధ్యక్షురాలు శ్రీమతి వయోలా అమ్హెర్డ్ పోస్టుపై ప్రతిస్పందిస్తూ:
‘‘ప్రెసిడెంట్ వయోలా అమ్హెర్డ్ గారూ! మీ సౌజన్యపూరిత శుభాకాంక్షలకు నా ధన్యవాదాలు. భారత ‘ప్రజాస్వామ్య మహోత్సవం’ ప్రపంచ దృష్టిని ఆకర్షించడం కాదనలేని వాస్తవం. భారత్-స్విట్జర్లాండ్ భాగస్వామ్య బలోపేతానికి మనం సంయుక్తంగా కృషి చేద్దాం’’ అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
(Release ID: 2024486)
Visitor Counter : 65