మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ

ఉన్నత విద్యా శాఖ నిర్వహణలో వ్యవస్థాత్మక ఏర్పాటుగా రాష్ర్టీయ ఇ-పుస్తకాలయ స్థాపన కోసం నేషనల్ బుక్ ట్రస్ట్ తో ఎంఓయు కుదుర్చుకున్న పాఠశాల విద్యా శాఖ

Posted On: 03 JUN 2024 5:16PM by PIB Hyderabad

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన పాఠశాల విద్యా శాఖ రాష్ర్టీయ ఇ-పుస్తకాలయ పేరుతో డిజిటల్ గ్రంథాలయం ఏర్పాటు కోసం విద్యామంత్రిత్వ శాఖ నిర్వహణలోని నేషనల్ బుక్ ట్రస్ట్ తో ఎంఓయు కుదుర్చుకుంది. ఉన్నత విద్యా శాఖ కార్యదర్శి శ్రీ కె.సంజయ్ మూర్తి; పాఠశాల విద్యా శాఖ, అక్షరాస్యత శాఖ (డిఒఎస్ఇ అండ్ ఎల్) కార్యదర్శి శ్రీ సంజయ్ కుమార్, జాయింట్ కార్యదర్శి శ్రీమతి అర్చనా  శర్మ అవస్థి, మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నాన్ ఎకడమిక్ పుస్తకాల ప్రాధాన్యతను శ్రీ కె.సంజయ్ మూర్తి తన ప్రసంగంలో నొక్కి చెబుతూ బాలలు భవిష్యత్తులో ఏ రంగాన్ని ఎంచుకోవాలని నిర్ణయించుకునే విషయంలో అవి సహాయకారిగా నిలుస్తాయన్నారు.  రాష్ర్టీయ ఇ-పుస్తకాలయలో భద్రపరచదగిన మంచి పుస్తకాలు రాసేందుకు ఫ్యాకల్టీ సభ్యులను ఆహ్వానించాలని నేషనల్ బుక్ ట్రస్ట్ కు ఆయన సూచించారు.

పుస్తకాలు చదివే అలవాటును ప్రోత్సహించాల్సిన అవసరాన్ని శ్రీ సంజయ్ కుమార్ నొక్కి చెప్పారు. పాఠకులు ఏ ప్రాంతానికి చెందిన వారు అనే తేడా లేకుండా రాష్ర్టీయ ఇ-పుస్తకాలయ 24 గంటలు అందుబాటులో ఉండి అనేక పుస్తకాలు చదువరులకు అందిస్తుందని ఆయన చెప్పారు.

ఇ-పుస్తకాలయతో చాలా రాష్ర్టాల్లో ‘‘చిట్టచివరి వ్యక్తి’’ వరకు గ్రంథాలయం అందుబాటులో లేని సమస్య తీరుతుందని ఆయన అన్నారు.  ఇ-పుస్తకాలయలో ఏయే పుస్తకాలు అందుబాటులో ఉంచాలనేది కంటెంట్  ఎన్ రిచ్ మెంట్ కమిటీ నిర్ణయిస్తుందని ఆయన చెప్పారు. రాబోయే 2-3 సంవత్సరాల కాలంలో ఇ-పుస్తకాలయలో 100కి పైగా భాషల్లో 10,000 పైగా పుస్తకాలు అందుబాటులో ఉంటాయని ఆయన తెలిపారు.  

రాష్ర్టీయ ఇ-పుస్తకాలయలో నాన్-ఎకడమిక్ పుస్తకాలు అందుబాటులో ఉంచాల్సిన ప్రాధాన్యతను శ్రీమతి అవస్థి నొక్కి చెప్పారు. 23 భాషల్లో వెయ్యికి పైగా పుస్తకాలు ఇందులో ఇప్పటికే అందుబాటులో ఉన్నాయని ఆమె చెప్పారు.

దేశంలోనే ప్రప్రథమ డిజిటల్ గ్రంథాలయం ఇ-పుస్తకాలయలో 40కి పైగా ప్రతిష్ఠాత్మక ప్రచురణకర్తలు ప్రచురించిన ఆంగ్లంతో పాటు 22కి పైగా భాషల్లో వెయ్యికి పైగా నాన్ ఎకడమిక్ (విద్యేతర) పుస్తకాలు అందుబాటులో ఉంచడం వల్ల బాలలు, వయోజనుల్లో పుస్తకపఠనం పట్ల జీవితకాల ప్రేమ ఏర్పడుతుంది. విభిన్న భౌగోళిక ప్రాంతాలు, భాషలు, కళా ప్రక్రియల్లో డివైస్ ల ద్వారా చదువుకునేందుకు వీలుండే పుస్తకాలు అందుబాటులో ఉంచడం ఇ-పుస్తకాలయ లక్ష్యం. ఎన్ఇపి (నూతన విద్యా విధానం) 2020 కింద ఈ పుస్తకాలను నాలుగు వయోశ్రేణుల్లో 3-8, 8-11, 11-14, 14-18 వర్గీకరించారు.

ఇ-పుస్తకాలయ యాప్ ఆండ్రాయిడ్, ఐఓఎస్ డివైస్ లు రెండింటి పైన డౌన్ లోడ్ చేసుకోవడానికి అందుబాటులో ఉంటుంది. సాహసం, మిస్టరీ, హాస్యం, సాహిత్యం, ఫిక్షన్, క్లాసిక్స్, నాన్-ఫిక్షన్, సెల్ఫ్-హెల్ప్, చరిత్ర, జీవిత చరిత్రలు, కామిక్స్, బొమ్మల పుస్తకాలు, సైన్స్, పద్యం ఇలా అన్ని ప్రక్రియల్లోని పుస్తకాలు అందుబాటులో ఉంచడం ఇ-పుస్తకాలయ మరో లక్ష్యం. ఈ పుస్తకాలు పాఠకుల్లో వసుధైవ కుటుంబకం స్ఫూర్తికి దీటుగా సాంస్కృతిక చైత‌న్యం, దేశభక్తి, దయాభావం వంటి లక్షణాలు పెంపొందిస్తాయి.  

డిజిటల్ అంతరాన్ని తొలగించి, ప్రతీ ఒక్కరిలోనూ సమ్మిళిత వాతావరణం నెలకొల్పే దిశగా రాష్ర్టీయ ఇ-పుస్తకాలయ అతి పెద్ద అడుగు. ఈ పుస్తకాలు ఎక్కడైనా, ఏ సమయంలో అయినా చదువుకునేందుకు వీలుగా ఉంటాయి. ఈ ఎంఓయుపై సంతకం చేయడం ద్వారా డిఓఎస్ఇఎల్, భారత నేషనల్ బుక్ ట్రస్ట్ దేశంలో విద్యా వాతావరణం మెరుగుపరచడంలో పరస్పర సహకారానికి కట్టుబాటు ప్రకటించాయి.

నాణ్యమైన నాన్-ఎకడమిక్ పుస్తకాలు అందుబాటులో ఉంచడం ద్వారా దేశంలోని యువతలో ఆరోగ్యకరమైన పఠనాసక్తిని పెంపొందించే విషయంలో సహకారపూర్వకమైన చర్యలకు ఈ ఎంఓయు సహాయకారిగా ఉంటుంది.

ఈ సందర్భంగా ‘‘భారతీయ యువతలో పుస్తక పఠనం పట్ల ఆసక్తి పునరుద్ధరణ’’ అనే అంశంపై గోష్ఠిని నిర్వహించారు. భారత ప్రచురణ రంగానికి చెందిన ప్రముఖులు ఈ గోష్ఠిలో పాల్గొని విద్యా మంత్రిత్వ శాఖ, పాఠశాలల ప్రిన్సిపల్స్, ప్రచురణకర్తలు, పండితులు, మీడియా ప్రతినిధులు సహా వివిధ రంగాలకు చెందిన ప్రేక్షకులతో తమ భావాలు పంచుకున్నారు.

***



(Release ID: 2023863) Visitor Counter : 57