ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

‘‘గడచిన 6 రోజుల్లో బలమైన అజెండా, చర్చల ద్వారా ప్రపంచ ఆరోగ్య భవిష్యత్తును రూపొందించే తుది నిర్ణయాలు తీసుకున్నాం’’: కేంద్ర ఆరోగ్య కార్యదర్శి


‘‘అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల్లో మార్పులు చేసి అందరినీ ఏకీకృతం చేయడం ద్వారా భవిష్యత్తులో రాబోయే వ్యాధుల నుంచి ప్రపంచాన్ని రక్షించవచ్చు.’’

‘‘అందరికీ ఆరోగ్యం – ఆరోగ్యానికై అందరూ’’ అనే అంశంతో ప్రేరణ పొంది ఉమ్మడి లక్ష్యం కోసం ఒకే కుటుంబంగా పనిచేశాం. ప్రపంచమంతా ఒకటే అనే ఈ భావనను భారత్ లో వసుధైవ కుటుంబకం అని అంటాం. ఉమ్మడి లక్ష్యాన్ని సాధించే దిశగా పరిష్కారాలు వెతుకుతూ అజెండాను అర్థం చేసుకుని ముందుకు సాగుదాం.

Posted On: 02 JUN 2024 3:32PM by PIB Hyderabad

జెనీవాలో నిన్న జరిగిన 77 వ వరల్డ్ హెల్త్ అసెంబ్లీ లో భాగంగా కమిటీ ‘ఎ’ కు కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర అధ్యక్షత వహించారు. కమిటీ ‘ఎ’ ద్వారా గత ఆరు రోజులుగా జరిగిన సమావేశాలకు సంబంధించిన వివరాలను ఆయన సమర్పించారు. బలమైన అజెండా, చర్చల ద్వారా తీసుకున్న నిర్ణయాలు ప్రపంచ ఆరోగ్య రంగ భవిష్యత్తుకు రూపకల్పన చేస్తాయని ఆయన అన్నారు.

కొవిడ్ అనంతర కాలంలో జరుగతున్న ఈ అసెంబ్లీ ద్వారా రాబోయే నాలుగు సంవత్సరాల కాలవ్యవధి 2025 – 2028 కి సంబంధించి విస్తృతమైన ఆరోగ్య అజెండాపై కమిటీ ‘ఎ’ ప్రధానంగా దృష్టి సారించినట్టు కేంద్ర ఆరోగ్య కార్యదర్శి  తెలిపారు. ‘‘నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడానికి అవసరమయ్యే వనరులు, స్థిరమైన నిధుల సమీకరణ, ప్రపంచ ఆరోగ్య సంస్థ పెట్టుబడులతో పాటు సరిహద్దులను చెరిపేస్తూ అనుకున్నది సాధించేలా చర్చలు జరిపాము. అత్యవసర సమయాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు పనిచేసే వ్యవహరించే ఆరోగ్య సంస్థ నిబద్ధతను ప్రశంసించాం’’ అని ఆయన అన్నారు.

అంతర్జాతీయ ఆరోగ్య నిబంధనల్లో జరిపిన సవరణల ఆధారంగా మహమ్మారి వ్యాధుల నివారణ (Pandemic Prevention)సంసిద్ధత, స్పందన తదితర అంశాలను అభివృద్ధి చేసే అంతర ప్రభుత్వ సంప్రదింపుల సంఘం (Intergovernmental Negotiating Body)  ప్రదర్శిస్తున్న గొప్ప పనితీరును కమిటీ ‘ఎ’ గుర్తించింది. శ్రీ అపూర్వ చంద్ర మాట్లాడుతూ ‘‘సమానత్వ దిశగా ముందగుడు వేస్తూ.. ఏకత్వం అనే గొడుగు కిందకు తీసుకురావడం ద్వారా భవిష్యత్తులో ప్రబలే వ్యాదుల నుంచి ప్రపంచాన్ని కాపాడుకోవచ్చు. ఇది మన పిల్లలు, మనవళ్లకు మనం ఇచ్చే కానుక’’ అన్నారు.

నిర్మాణాత్మకంగా, తీవ్రంగా సాగిన చర్చల గురించి ప్రధానంగా ప్రస్తావిస్తూ ‘‘ఉమ్మడి లక్ష్యం చేరుకునేందుకు పరిష్కార మార్గాలను అన్వేషించడం, వాటిని అర్థం చేసుకోవడం ద్వారా మన అజెండాను ముందుకు తీసుకువెళ్లగలిగాం. ‘అందరికీ ఆరోగ్యం - ఆరోగ్యానికై అందరూ’ అనే నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఒకే కుటుంబంగా మనం కలసి పనిచేశాం. ఇలా ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భావనను వసుధైవ కుటుంబకంగా భారత్ లో వ్యవహరిస్తాం’’ అని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పేర్కొన్నారు.

 

‘‘మొత్తం 600 వాంగ్మూలాలతో అజెండాను తీర్చిదిద్దడంతో పాటు నిర్దేశిత అంశాలను పూర్తి చేసేందుకుగాను రోడ్ మ్యాప్ సిద్ధం చేశాం. 9 తీర్మానాలు, 3 నిర్ణయాలను కమిటీ ‘ఎ’ ఆమోదించింది. సాంకేతిక అంశాలకు సంబంధించి 24 నివేదికలను సైతం పరిశీలించింది’’ అని ఆయన వివరించారు.

 

అసెంబ్లీకి హాజరైన వివిధ దేశాల ప్రతినిధులతో పాటు సభ్య దేశాల సమావేశాన్ని నిర్వహించిన డబ్ల్యూహెచ్ఓ సెక్రటేరియట్ కు ధన్యవాదాలు తెలుపుతూ తన ప్రసంగాన్ని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి ముగించారు. ‘‘కమిటీ ఎ కు అధ్యక్షత వహించడాన్ని గౌరవంగా భావిస్తున్నాను. ఈ బాధ్యత నిర్వర్తించడానికి నన్ను ఎన్నుకొని నా మీద నమ్మకం ఉంచినందుకు ధన్యవాదాలు’’ అంటూ ప్రసంగం ముగించారు. 

***



(Release ID: 2022723) Visitor Counter : 63