రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

వెల్లింగ్టన్‌లోని డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజీలో 80వ స్టాఫ్ కోర్సు ప్రారంభం


యుద్ధభూమిలో భిన్నదళాల మధ్య సంయుక్త-సమగ్ర
సహకార విధానాన్ని ప్రోత్సహించే పాఠ్యాంశాల బోధన

Posted On: 03 JUN 2024 3:09PM by PIB Hyderabad

మిళనాడులోని వెల్లింగ్టన్‌లోగల డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (డిఎస్ఎస్‌సి)లో ఇవాళ 80వ స్టాఫ్ కోర్సు ప్రారంభమైంది. భారత సైనిక, నావికా, వైమానిక దళాల్లోని మిడ్-కెరీర్ అధికారులను నిపుణులైన స్టాఫ్ అధికారులు, భవిష్యత్ సైనిక వ్యూహకర్తలుగా రూపొందించడం ఈ శిక్షణ లక్ష్యం. అలాగే ఈ కోర్సు ద్వారా త్రివిధ దళాల సంయుక్త విధి నిర్వహణ వాతావరణంలో సమర్థంగా పనిచేసేలా తగిన విజ్ఞానం, నైపుణ్యాలతో వారిని సన్నద్ధం చేస్తారు. ఇందులో భాగంగా 26 మిత్రదేశాల నుంచి 38 మందిసహా మొత్తం 480 మంది శిక్షణార్థి అధికారులు 45 వారాలపాటు శిక్షణ పొందుతారు. ఈ మేరకు ప్రతి దళం పనితీరు, యుద్ధ సంబంధ వ్యూహాత్మక-కార్యాచరణ అంశాలపై వీరికి లోతైన అవగాహన కల్పించబడుతుంది.

   ఈ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా ‘డిఎస్ఎస్‌సి’ కమాండెంట్ లెఫ్టినెంట్ జనరల్ వీరేంద్ర వత్స్ ప్రసంగిస్తూ- యుద్ధ సంబంధ గతిశీల స్వభావం, ప్రవర్తనల గురించి వివరించారు. అంతేకాకుండా ప్రపంచ పరిణామాల్లో అస్థిరత, అనిశ్చితి, సంక్లిష్టత, అస్పష్టత (వియుసిఎ) లక్షణాలను విశదీకరించారు. వీటన్నిటిపై అవగాహన ద్వారా భవిష్యత్ సవాళ్లను ఎదుర్కొనేలా శిక్షణార్థి అధికారులకు ‘డిఎస్ఎస్‌సి’ ఎలా సాధికారత కల్పిస్తుందో సమగ్రంగా తెలిపారు. అలాగే సైనిక, నావికా, వైమానిక దళాల మధ్య సమన్వయం, ఏకీకరణల కీలకపాత్రను నొక్కి చెప్పారు. ఆధునిక యుద్ధంలో పరస్పర, నిరంతర సహకారం దిశగా ఈ దళాల్లో ప్రతి ఒక్కటీ తనదైన ప్రత్యేక సామర్థ్యాన్ని అర్థం చేసుకోవడంలోని ప్రాధాన్యాన్ని స్పష్టం చేశారు. మరోవైపు భారత సైనిక, భద్రత పరిస్థితుల నేపథ్యాన్ని ప్రభావితం చేసే వర్ధమాన సాంకేతికతలు, భౌగోళిక-రాజకీయ అంశాలపైనా శిక్షణార్థి అధికారులు లోతైన అవగాహన పెంచుకోవాల్సిన ఆవశ్యకతను నొక్కిచెప్పారు. తద్వారా సంపూర్ణ సమాచారసహిత నిర్ణయాత్మకత, సమర్థ సైనిక వ్యూహాల రూపకల్పన సుసాధ్యమవుతుందని వివరించారు.

   ప్రస్తుత 80వ స్టాఫ్ కోర్సులో భాగంగా తొలిసారిగా భారత సైనిక, నావికా, వైమానిక దళాలతోపాటు మిత్రదేశాల నుంచి ఎంపిక చేసిన శిక్షణార్థి అధికారుల కోసం ప్రత్యేక పాఠ్యాంశాలను కూడా జోడించారు. ఈ పాఠ్యప్రణాళిక కింద యుద్ధభూమిలో భిన్నదళాల మధ్య సంయుక్త-సమగ్ర సహకార విధానాన్ని ప్రోత్సహించే పాఠ్యాంశాలను బోధిస్తారు. ఇందులో భాగంగా వారి ఉద్యోగ విధుల ఆరంభ సమయంలోనే భిన్నదళాల మధ్య పరస్పర అవగాహన, సహకారం ఆవశ్యకతను అర్థం చేసుకునేలా చూస్తారు. తద్వారా రానున్న ‘థియేటర్ కమాండ్‌’ శకంలో వారు ముందంజ వేసేలా వారిని తీర్చిదిద్దుతారు.

***



(Release ID: 2022721) Visitor Counter : 44