సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

సామ్యవాద.. గణతంత్ర శ్రీలంక సివిల్ సర్వెంట్ల కోసం ముస్సోరీలోని జాతీయ సుపరిపాలన కేంద్రం (ఎన్‌సిజిజి)లో 3వ సామర్థ్య వికాస కార్యక్రమం ప్రారంభం


అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీలు... అసిస్టెంట్ సెక్రటరీలు... డిప్యూటీ
సార్జెంట్లు.. డైరెక్టర్లుగా పనిచేస్తున్న 41 మంది అధికారులు హాజరు;

సామాజిక ప్రగతి దిశగా సమర్థ వ్యూహాల రూపల్పనలో సాంకేతిక పురోగతి
వినియోగంపై అవగాహన కల్పించడమే ఈ రెండు వారాల కార్యక్రమ లక్ష్యం

Posted On: 14 MAY 2024 12:11PM by PIB Hyderabad

   శ్రీలంక ప్రభుత్వ సీనియర్ సివిల్ సర్వెంట్ల కోసం జాతీయ సుపరిపాలన కేంద్రం (ఎన్‌సిజిజి) నిర్వహిస్తున్న 3వ సామర్థ్య వికాస కార్యక్రమం ముస్సోరీలో ఇవాళ ప్రారంభమైంది. ఈ నెల 24వ తేదీ వరకూ.. అంటే- రెండు వారాలపాటు సాగే ఈ కార్యక్రమంలో శ్రీలంక నుంచి వచ్చిన అసిస్టెంట్ డివిజనల్ సెక్రటరీలు, అసిస్టెంట్ సెక్రటరీలు, డిప్యూటి సెక్రటరీలు, డైరెక్టర్లు, సీనియర్ అసిస్టెంట్ సెక్రటరీలు, అసిస్టెంట్ డైరెక్టర్లు, డిప్యూటీ డైరెక్టర్లు, అసిస్టెంట్ డైరెక్టర్లు తదితర హోదాల్లో పనిచేసే 41 మంది సీనియర్ సివిల్ సర్వెంట్ అధికారులు పాల్గొంటున్నారు. వీరంతా ప్రధాని కార్యాలయం, రాష్ట్రపతి సచివాలయం, డిపార్ట్‌మెంట్ ఆఫ్ నేషనల్ పోలీస్ కమిషన్, లంచం-అవినీతి ఆరోపణల దర్యాప్తు కమిషన్, నేషనల్ ఆడిట్ ఆఫీస్, అటార్నీ జనరల్ డిపార్ట్‌మెంట్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎక్స్‌టర్నల్ రిసోర్సెస్, ఫైనాన్స్ కమిషన్, డిపార్ట్‌మెంట్ ఆఫ్ నేషనల్ బడ్జెట్, ఆర్థిక మంత్రిత్వ శాఖ, ఐటి మేనేజ్‌మెంట్ విభాగం తదితరాల్లో విధులు నిర్వహిస్తుంటారు.

   కేంద్ర సిబ్బంది-ప్రజా సమస్యలు-పెన్షన్ల మంత్రిత్వ శాఖ పరిధిలోని పరిపాలన సంస్కరణలు-ప్రజా సమస్యల విభాగం (డిఎఆర్‌పిజి) కింద ఒక స్వయంప్రతిపత్తిగల సంస్థగా ‘ఎన్‌సిజిజి’ పనిచేస్తుంది. భారత ప్రభుత్వం, జాతీయ విధానం మరియు పాలన రెండింటిలోనూ ఆచరణాత్మక పరిశోధన, అధ్యయనాలతోపాటు జాతీయ/అంతర్జాతీయ స్థాయులలో ప్రభుత్వ విధానాలు, సామర్థ్య వికాసం సంబంధిత అంశాలపై ఈ సంస్థ కార్యక్రమాలు నిర్వహిస్తుంది. ‘వసుధైవ కుటుంబకం’ (యావత్ ప్రపంచం ఒకే కుటుంబం) అనే భారతీయ తాత్త్విక ప్రబోధానికి అనుగుణంగా ‘ఎన్‌సిజిజి’ తన కృషిని కొనసాగిస్తోంది. అంతేకాకుండా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, విదేశీ సహకార విస్తృతి తదితరాలపైనా దృష్టి సారిస్తుంది.

   ‘ఎన్‌సిజిజి’ డైరెక్టర్ జనరల్, ‘డిఎఆర్‌పిజి’ కార్యదర్శి వి.శ్రీనివాస్ ఇవాళ్టి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ లోగడ తాము నిర్వహించిన తొలి సామర్థ్య వికాస కార్యక్రమంలో శ్రీలంక నుంచి 14 మంది సీనియర్ సివిల్ సర్వెంట్ అధికారుల భాగస్వామ్యం ద్వారా సాధించిన మైలురాయిని ప్రముఖంగా ప్రస్తావించారు. వీరంతా శ్రీలంక ప్రధాని కార్యాలయ కార్యదర్శి శ్రీ అనూర దిశనాయకే నేతృత్వంలో ఆనాటి కార్యక్రమంలో పాల్గొన్నారని గుర్తుచేశారు. భారత్-శ్రీలంక దేశాల్లోని పాలన విధాన సారూప్యాలను, వాటి పరస్పర అనుసరణీయ సామర్థ్యాన్ని శ్రీ శ్రీనివాస్ తన ప్రసంగంలో నొక్కి చెప్పారు. ప్రభుత్వం-పౌరుల మధ్య సన్నిహిత సంబంధాల విస్తరణకు ఈ విధాననాలు ప్రాధాన్యమిస్తాయని ఆయన ఉద్ఘాటించారు. ఈ దృక్కోణంలో ‘‘గరిష్ఠ పాలన-కనిష్ట ప్రభుత్వం’’ అన్నది ప్రధానాంశమని, పౌర-కేంద్రకృ విధానంతో సాగే డిజిటల్‌ పరిపాలన ఔన్నత్యాన్ని ఇది చాటుతుందని పేర్కొన్నారు.

   అధికారిక పరిచయాల సందర్భంగా అసోసియేట్ ప్రొఫెసర్-కోర్స్ సమన్వయకర్త డాక్టర్ ఎ.పి.సింగ్ మాట్లాడుతూ- ‘ఎన్‌సిజిజి’ కార్యాచరణ చట్రం, ఈ సంస్థ ఆరంభం నుంచీ సాధించిన అద్భుత ప్రగతి గురించి ఆలోచనాత్మక సంక్షిప్త వివరణ ఇచ్చారు. భారత్ అనుసరించే పలు విధానాలు, పాలన వ్యూహాలపై అవగాహన దిశగా నిశితంగా రూపొందించిన కార్యక్రమ లక్ష్యాలను కూడా ఆయన విశదీకరించారు. ఇవన్నీ సామాజిక శ్రేయస్సును మెరుగుపరిచేవిగా ఉంటాయని తెలిపారు. అలాగే అఖిలభారత సర్వీసుల సంగ్రహావలోకనం, విధాన రూపకల్పన సంబంధిత రాజ్యాంగ పునాది, భారతదేశంలో వికేంద్రీకరణ తదితర విభిన్న అంశాలను స్పృశిస్తూ కార్యక్రమ వివరాలను డాక్టర్ సింగ్ విడమరచి చెప్పారు. దీంతోపాటు పౌర ఒడంబడికలు, విధానాలు, సమర్థ కార్యాలయ పరిపాలనలో ఇ-ఆఫీస్ పాత్ర, మారుతున్న పాలన విధానాలు సహా పలు కీలకాంశాలపై కార్యక్రమంలో ప్రధానంగా దృష్టి సారించబడుతుంది.

   నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయం, విపత్తుల నిర్వహణ, ఆయుష్మాన్ భారత్-ప్రధానమంత్రి జనారోగ్య యోజన తదితర ఆరోగ్య సంరక్షణ కార్యక్రమాల వంటి నిర్దిష్ట విధాన రంగాలపైనా ఈ కార్యక్రమంలో పరిశీలనాత్మక చర్చలుంటాయి. తద్వారా ఇందులో పాల్గొనేవారు సేవా హక్కు, అందరికీ ఇళ్లు, డిజిటల్ సాంకేతికత ప్రగతి, డిజిటల్ ఇండియా కార్యక్రమం వగైరా పరివర్తనాత్మక విధానాలపైనా అవగాహన పొందుతారు. అంతేకాకుండా పర్యావరణ హిత అత్యాధునిక నగరాల ప్రణాళికలు, సుపరిపాలన సాధనంగా ఆధార్, లైంగికత-ప్రగతి వంటి అంశాలపైనా కార్యక్రమాలుంటాయి. తద్వారా భావోద్వేగ నిర్వహణ-నియంత్రణ, భూమి రికార్డుల నిర్వహణ, జాతీయ భద్రత తదితరాలపైనా సమగ్ర అవగాహన లభిస్తుంది. మరోవైపు భారతదేశంలో ఎన్నికల నిర్వహణ, భారత్-శ్రీలంక సంబంధాలపై  గోష్టులు ద్వారా వ్యూహాత్మక పాలన రంగాలపై అవగాహన మెరుగుపడుతుంది.

   డెహ్రాడూన్‌లోని ఇందిరాగాంధీ జాతీయ అటవీ అకాడమీ (ఐజిఎన్ఎఫ్ఎ), అటవీ పరిశోధన సంస్థ (ఎఫ్ఆర్ఐ)సహా వివిధ ప్రతిష్టాత్మక సంస్థల క్షేత్రస్థాయి సందర్శన కూడా ఈ కార్యక్రమంలో భాగంగా ఉంటుంది. తద్వారా పాలన యంత్రాంగాల పనితీరును ఆచరణాత్మకంగా గ్రహించే వీలుంటుంది. గురుగ్రామ్‌లోని అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఎ)తోపాటు నోయిడాలోని సైబర్ భద్రత విభాగం జాతీయ సౌరశక్తి సంస్థల సందర్శన ద్వారా అత్యాధునిక సాంకేతికతలు, పాలన పద్ధతుల రూపకల్పన తదితరాలపై ప్రత్యక్ష అనుభవం లభిస్తుంది. పరిపాలన ప్రక్రియలపై అవగాహన పెంపు దిశగా గౌతమబుద్ధ నగర్ జిల్లా, ప్రధానమంత్రి సంగ్రహాలయ సహా ప్రపంచ అద్భుతమైన తాజ్ మహల్ సందర్శన కూడా ప్రస్తుత 3వ సామర్థ్య వికాస కార్యక్రమ ప్రణాళికలో భాగంగా ఉన్నాయి.

   విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ భాగస్వామ్యంతో జాతీయ సుపరిపాలన కేంద్రం (ఎన్‌సిజిజి) ఇప్పటివరకూ 17 దేశాల సివిల్ సర్వెంట్లకు శిక్షణనిచ్చింది. ఈ మేరకు బంగ్లాదేశ్, కెన్యా, టాంజానియా, ట్యునీషియా, సీషెల్స్, గాంబియా, మాల్దీవ్స్, శ్రీలంక, ఆఫ్ఘనిస్థాన్, లావోస్, వియత్నాం, నేపాల్, భూటాన్, మయన్మార్, ఇథియోపియా, ఎరిట్రియా, కంబోడియా దేశాల అధికారులు ఇందులో పాల్గొన్నారు. ప్రస్తుత 3వ సామర్థ్య వికాస కార్యక్రమాన్ని అసోసియేట్ ప్రొఫెసర్, కోర్స్ సమన్వయకర్త డాక్టర్ ఎ.పి.సింగ్, సహ సమన్వయకర్త-‘ఎన్‌సిజిజి’ బోధకుడు డాక్టర్ ఎం.కె.భండారీ, ‘ఎన్‌సిజిజి’ కార్యక్రమ సహాయకుడు శ్రీ సంజయ్ దత్ పంత్ పర్యవేక్షిస్తారు.

***



(Release ID: 2020680) Visitor Counter : 51