ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

రాజ్యసభలో రాష్ర్ర్టపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రధానమంత్రి ఆంగ్ల సమాధానం

प्रविष्टि तिथि: 09 FEB 2023 6:34PM by PIB Hyderabad

గౌర‌వ అధ్య‌క్షా, 
రాష్ట్ర‌ప‌తి ప్ర‌సంగానికి ధ‌న్య‌వాదాలు తెలిపే తీర్మానంపై చ‌ర్చ‌లో నేను పాల్గొంటున్న సంద‌ర్భంగా తొలుత‌ గౌర‌వ రాష్ర్ట‌ప‌తికి ధ‌న్య‌వాదాలు, అభినంద‌న‌లు తెలియ‌చేస్తున్నాను. గౌర‌వ అధ్య‌క్షా పార్ల‌మెంటు ఉభ‌య స‌భ‌ల స‌మావేశంలో ప్ర‌సంగించిన సంద‌ర్భంగా ఆమె అభివృద్ధి చెందిన భార‌త్ కు బ్లూప్రింట్ ఆవిష్క‌రించ‌డంతో పాటు అభివృద్ధి చెందిన భార‌త సంక‌ల్పాల సాధ‌న‌కు ప్ర‌ణాళిక కూడా ఆవిష్క‌రించారు.

గౌర‌వ అధ్య‌క్షా, 
చ‌ర్చ‌లో పాల్గొన్న స‌భ్యులంద‌రికీ నేను ధ‌న్య‌వాదాలు తెలియ‌చేస్తున్నాను. వారు నా ఆలోచ‌న‌ల‌కు దీటుగానే చ‌ర్చ న‌డిపించ‌డానికి ప్ర‌య‌త్నించారు. స‌భ‌లోను, చ‌ర్చ‌లోను పాల్గొన్నందుకు గౌర‌వ స‌భ్యులంద‌రికీ నా ధ‌న్న‌య‌వాదాలు తెలుపుతున్నాను.

గౌరవ అధ్యక్షా, 
ఇది రాష్ర్టాలకు సంబంధించిన సభ. గత కొన్ని దశాబ్దాలుగా ఎందరో మేథావులు ఈ సభ నుంచి దేశానికి దిశానిర్దేశం, మార్గదర్శకం చేశారు. తమ వ్యక్తిగత జీవితాల్లో ఎన్నో విజయాలు సాధించిన, ఎన్నో గొప్ప పనులుచేసిన మిత్రులెందరో ఈ సభలో ఉన్నారు. అందుకే ఈ సభలో ఏం జరిగినా దేశం యావత్తు దాని గురించి ఆవేదన చెందుతుంది. జాతి ఇక్కడ జరిగే విషయాలన్నీ నిశితంగా పరిశీలించి వాటి గురించి ఆలోచిస్తుంది. 
కొందరు సభ్యులు కేవలం బురద చల్లడానికి ప్రయత్నిస్తారు, కాని నా దగ్గర గులాల్  పౌడర్ ఉంది. మీరందరూ ఎంత బురద చల్లితే అంత మంచిది. కమలం అంతగా వికసిస్తుంది. అందుకే కమలం వికసించడానికి ప్రత్యక్షంగా గాని, పరోక్షంగా గాని మీలో ఎవరు ఎలాంటి ప్రయత్నం చేసినా వారందరికీ నేను ధన్యవాదాలు తెలుపుతూనే ఉంటాను. 

గౌరవ అధ్యక్షా,
నిన్న ప్రతిపక్షానికి సంబంధించిన గౌరవ సభ్యుడు శ్రీ ఖర్గేజీ ‘‘మేం 60 సంవత్సరాలుగా బలమైన పునాది నిర్మించాం’’ అన్నారు. మేం పునాది నిర్మిస్తే ఆ ఘనత అంతా మోదీ కొట్టేస్తున్నాడు అనే ఆయన బాధ. కాని గౌరవ అధ్యక్షా, 2014 సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన అనంతరం నేను అన్ని విషయాలను నిశితంగా పరిశీలించాను. నా అంతట నేను చాలా సమాచారం సేకరించాను. 60 సంవత్సరాలుగా కాంగ్రెస్ కుటుంబం బలమైన పునాది నిర్మించేందుకు ప్రయత్నించిందన్న విషయంలో నేనేమీ వ్యాఖ్యానించదలచుకోలేదు. వారి ఉద్దేశం బలమైన పునాది నిర్మించడమే కావచ్చు, కాని వారు గోతులు మాత్రమే తవ్వగలిగారు. గౌరవ అధ్యక్షా, వారు గోతులు తవ్వడానికే 6 దశాబ్దాలు వ్యర్ధం చేశారు. అదే కాలంలో ప్రపంచంలోని చిన్న దేశాలు కూడా విజయంలో కొత్త శిఖరాలు అధిరోహించి పురోగమించాయి. 

గౌరవ అధ్యక్షా, 
పంచాయత్ నుంచి పార్లమెంట్ వరకు ప్రభుత్వం నడిపేందుకు అనుకూలమైన వాతావరణం వారికి ఉంది.  ఎన్నో ఆశలు, అంచనాలతో  దేశం కూడా వారికి మద్దతు ఇచ్చింది. కాని ఒక్క సవాలుకు కూడా శాశ్వత పరిష్కారం కనుగొనలేని విధంగా వారి పని తీరు మలుచుకున్నారు. ఏదైనా గందరగోళం ఏర్పడితే  వారు దాని పరిష్కారానికి, పరిపూర్ణత సాధనకు ప్రయత్నిస్తున్నట్టు కనిపించే వారు గాని ఎన్నడూ గట్టి ప్రయత్నం చేయలేదు. సమస్యలను పరిష్కరించడం వారి బాధ్యత. దేశ ప్రజలు ఎన్నో సమస్యలతో పోరాడుతున్నారు. ఆ సమస్యలు పరిష్కారం అయితే ఎంతో ప్రయోజనం ఉంటుందని వారికి తెలుసు. కాని వారి ప్రాధాన్యతలు వేరు, వారి ఉద్దేశాలు వేరు. అందుకే వారు ఏ ఒక్క దానికి శాశ్వత పరిష్కారం కోసం ప్రయత్నించలేదు. 

గౌరవ అధ్యక్షా, 
మేం చేస్తున్న కృషి, ఒక దాని వెంట ఒకటిగా మేం తీసుకుంటున్న చర్యలే మా ప్రభుత్వానికి గుర్తింపు తెచ్చిపెట్టాయి. నేడు మేం శాశ్వత పరిష్కారాలు కనుగొనే దిశగా కదులుతున్నాం. ప్రతీ ఒక్క సమస్యను స్పృశించి పారిపోయే మనస్తత్వం మాది కాదు. దేశానికి చెందిన మౌలిక అవసరాలన్నింటికీ శాశ్వత పరిష్కారాలు సాధిస్తూ ముందుకు సాగడమే మా వైఖరి. 

గౌరవ అధ్యక్షా, 
నీటినే ఉదాహరణగా తీసుకుందాం. ఒక గ్రామంలో ఒక చేతి పంపు ఏర్పాటు చేసినట్టయితే వారం రోజుల పాటు వాహనాల రాకపోకల హడావిడి, వేడుకలు నిర్వహించిన సందర్భాలున్నాయి. సభలో అత్యధిక స్థానాలు సంపాదించి పెట్టిన ముఖ్యమంత్రి ఒక నగరంలో ఒక వాటర్ టాంక్ ప్రారంభించడానికి వెళ్తే పత్రికల్లో మొదటి పేజీలో పతాక శీర్షికలో వార్త వచ్చేది. ఆ రకంగా సమస్యలను పరిష్కరిస్తున్నట్టుగా హడావిడి చేయడం తప్పితే పనిని తప్పించుకునే సంస్కృతి వారు అనుసరించారు. మేం కూడా నీటి సమస్య పరిష్కరించే ప్రయత్నం చేశాం. అందులో భాగంగా జల సంరక్షణ, నీటి పారుదల వంటి అన్ని అంశాల పైన దృష్టి సారించాం. ‘‘వాన నీటిని పట్టండి’’ అంటూ ప్రజల భాగస్వామ్యంతో ప్రచారం నిర్వహించాం. ఇంకో విషయం ఏమిటంటే దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన నాటి నుంచి మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే వరకు కేవలం 3 కోట్ల ఇళ్లకు కుళాయిల ద్వారా నీటి సౌకర్యం ఏర్పడింది. 

గౌరవ అధ్యక్షా, 
కాని గత 3-4 సంవత్సరాలుగా 11 కోట్ల ఇళ్ళకు కుళాయల ద్వారా నీటి సరఫరా సౌకర్యం ఏర్పడింది. నీరు అనేది ప్రతీ కుటుంబానికి ఒక సమస్యే. నీరు లేకుండా జీవితం సాగదు. భవిష్యత్తును పరిగణనలోకి తీసుకుని ఆ సమస్య పరిష్కారానికి మేం ప్రయత్నిస్తున్నాం. 

గౌరవ అధ్యక్షా, 
మరో అంశం నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. అదే సగటు ప్రజల సాధికారత. పేదలకు బ్యాంకింగ్ హక్కు కల్పించే సాకుతో బ్యాంకులను జాతీయం చేశారు. కాని దేశ జనాభాలో సగం మందికి పైగా ప్రజలు బ్యాంకు ముంగిటికే చేరలేకపోయారు. ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం మేం కనుగొని ‘‘జన్ ధన్ ఖాతాల’’ ప్రచారం ప్రారంభించాం. బ్యాంకులను చైతన్యపరిచి వారిని మాతో నడిపించాం. ఈ కారణంగా కేవలం గల 9 సంవత్సరాల కాలంలో 48 కోట్ల జన్ ధన్ ఖాతాలు ప్రారంభమయ్యాయి. వాటిలో 32 కోట్ల ఖాతాలు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోనే తెరిచారు. పురోగతి అనేది దేశంలోని గ్రామీణ ప్రాంతాలకు చేరాలనేందుకు ఇది ఉదాహరణ. మోదీజీ పదే పదే నా నియోజకవర్గానికి వస్తున్నారు అని ఖర్గేజీ నిన్న ఫిర్యాదు చేశారు. మోదీజీ కల్బుర్గి వస్తున్నాను అన్నారు. నా పర్యటన గురించి ఫిర్యాదు చేసే ముందు కర్ణాటకలో 1 కోటి 70 లక్షల జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు తెరిచిన విషయం గుర్తించాలని ఖర్గేజీకి చెప్పాలనుకుంటున్నాను. 8 లక్షలకు పైగా ఖాతాలు ఖర్గేజీ నియోజకవర్గం అయిన కల్బుర్గిలోనే తెరిచారు.

అధ్యక్షా,
లెక్కకు మించి ఖాతాలు తెరవడం ప్రధానమా లేక సాధికారత, చైతన్యం కల్పించడం ప్రధానమా...చెప్పండి. ఖాతాలు తెరిచిన పలు సంవత్సరాల తర్వాత అవి మూతపడుతున్నాయి. నేను వారి బాధను గుర్తించాను. దళితులను ఓడిస్తున్నారని కొన్ని సందర్భాల్లో వారు అనడం విని నేను ఆశ్చర్యపడ్డాను. కాని అదే ప్రాంత ప్రజలు మరో దళితుని గెలిపిస్తున్నారు. నేడు ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తున్నారు, మిమ్మల్ని అధికారం నుంచి తొలగిస్తున్నారు, మీ ఖాతాలు మూసేస్తున్నారు. అందుకు మీరు కన్నీరు కారుస్తున్నారు.

గౌరవ అధ్యక్షా,  
గత కొద్ది సంవత్సరాల కాలంలో జన్ ధన్, ఆధార్, మొబైల్ త్రయంతో రూ.27 లక్షల కోట్లు ప్రత్యక్ష నగదు బదిలీ విధానంలో పౌరుల బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ అయ్యాయి. ప్రత్యక్ష నగదు బదిలీ టెక్నాలజీతో మధ్యదళారుల చేతుల్లోకి వెళ్లే రూ.2 లక్షల కోట్లు ఆదా అయ్యాయని తెలియచేయడానికి నేను సంతోషిస్తున్నాను. అది దేశానికి పెద్ద సేవ చేసింది. కాని తప్పుడు విధానాల ద్వారా రూ.2 లక్షల కోట్లు ప్రయోజనం కొల్లగొట్టిన వారు మాత్రం  ఇందుకు బాధ పడడం సహజమని నాకు తెలుసు. 

గౌరవ అధ్యక్షా, 
గతంలో ప్రాజెక్టులను నిలిపివేయడం, జాప్యం చేయడం, దారి మళ్లించడం వారి పని సంస్కృతిలో భాగం. వారి పనితీరు అది. ఫలితంగా పన్ను చెల్లింపుదారులు ఎంతో శ్రమించి సంపాదించిన సొమ్ముకు నష్టం జరిగేది. నేడు మేం ‘‘పిఎం గతిశక్తి మాస్టర్ ప్లాన్’’ పేరిట ఒక టెక్నాలజీ వేదికను తయారుచేశాం. మౌలిక వసతుల ప్రాజెక్టులకు సంబంధించిన సమాచారం 1600 అంచెల ద్వారా లభించడంతో పనులు వేగవంతం అయ్యాయి. ఆధునిక భారత నిర్మాణానికి భారీ ఎత్తున మౌలిక వసతుల ప్రాజెక్టులు అత్యంత కీలకం అని మాకు తెలుసు గనుక గతంలో నెలల వ్యవధి పట్టే ప్రణాళికలు నేడు వారాల వ్యవధిలోనే పూర్తి చేయగలుగుతున్నారు. అలాగే వేగం ప్రాధాన్యం కూడా మాకు తెలుసు గనుక టెక్నాలజీతో శాశ్వత ఆకాంక్షలకు పరిష్కారాలు  సాధించేందుకు మేం ప్రయత్నిస్తున్నాం.

గౌరవ అధ్యక్షా, 
ఎవరైనా ప్రభుత్వంలోకి వస్తే దేశం కోసం, ప్రజల కోసం ఏదైనా చేయాలనే హామీతోనే వస్తారు. కాని భావ ప్రకటన ఒక్కటే చాలదు. ‘‘గరీబీ హటావో’’ నినాదం వలెనే ‘‘మేం అది చేస్తాం, ఇది చేస్తాం’’ అనడం మామూలే. కాని 4 దశాబ్దాలు గడిచిపోయినా ఏమీ జరగలేదు. అందుకే  అభివృద్ధిలో ఎంత వేగం ఉండాలి,  అభివృద్ధి లక్ష్యం ఏమిటి,  అభివృద్ధి దిశ ఏమిటి,  అభివృద్ధి ఫలితం ఏమిటి అనేదే ప్రధానం. మేం ఇది చేయాలనుకుంటున్నాం అని చెప్పడంతోనే సరిపోదు.

గౌరవ అధ్యక్షా, 
ప్రజల ప్రాధాన్యతలు పరిగణనలోకి తీసుకుని వాటికి అనుగుణంగా మే కష్టించి పని చేస్తున్నాం. అందుకే పెద్ద పెద్ద పనుల కోసం మాపై ఒత్తిడి పెరుగుతోంది. మేం మరింత కష్టపడి పని చేయాల్సి వస్తోంది. మహాత్మా గాంధీ ‘‘శ్రే’’ (ప్రతిభ), ‘‘ప్రియ’’ (సన్నిహితత్వం) అని చెప్పేవారు. కాని మేం ‘‘శ్రే’’ను (ప్రతిభ) మాత్రమే నమ్ముకున్నాం.  సగటు ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడానికి రేయింబవళ్లు శ్రమించాల్సిన బాటనే ఎన్నుకున్నాం. ఆకాంక్షలను విజయాలుగా మార్చేందుకు...తద్వారా  అభివృద్ధి సాధనకు మేం శ్రమించి పని చేయడాన్ని కొనసాగిస్తాం. అన్ని కలలను ముందుకు నడిపించడం మా ప్రత్యేకత.

గౌరవ అధ్యక్షా, 
దేశానికి స్వాతంత్ర్యం సిద్దించిన నాటి నుంచి 2014 సంవత్సరం వరకు కేవలం 14 కోట్ల ఎల్ పిజి కనెక్షన్లు మాత్రమే ఉండేవి. ఎల్ పిజి కోసం డిమాండు కూడా చాలా ఎక్కువగా ఉండేది. ఎల్ పిజి కనెక్షన్లు పొందడానికి ప్రజలు ఎంపిల వద్దకు వెళ్లాల్సివచ్చేది. ప్రజలు అలాగే వేచి ఉండాల్సివచ్చేది. కాని ప్రతీ ఇంటికీ ఎల్ పిజి కనెక్షన్ ఇవ్వాలని మేం నిర్ణయించాం. మేం కష్టించి  పని చేయాలని, చాలా డబ్బు ఖర్చు చేయాలని, ప్రపంచం అంతటి నుంచి గ్యాస్ తీసుకురావాలని మాకు తెలుసు. సమాంతరంగా ఒత్తిడి ఉంటుందని మాకు తెలిసినా నా దేశ పౌరుల ప్రయోజనమే మా ప్రాధాన్యత. అందుకే మేం 32 కోట్లకు పైగా కుటుంబాలకు గ్యాస్ కనెక్షన్లు ఇచ్చాం. కొత్త మౌలిక వసతులు కల్పించాలి, అందుకు భారీగా ఖర్చు చేయాలి.

గౌరవ అధ్యక్షా, 
మేం ఎంత కష్టించి పని చేయాలో తెలుసుకోవడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అయినా మేం ఆనందంగా, సంతృప్తిగా, గర్వంగా పని చేశాం. సగటు జీవి సంతృప్తిగా ఉన్నాడు, మాకదే సంతోషం. ఒక ప్రభుత్వానికి ఇంతకన్నా పెద్ద సంతృప్తి ఏముంటుంది.

గౌరవ అధ్యక్షా, 
స్వాతంత్ర్యం సాధించిన ఎన్నో దశాబ్దాల తర్వాత కూడా దేశంలో 18,000 పైగా విద్యుత్ సదుపాయం లేని గ్రామాలున్నాయి. వీటిలో ఎక్కువ గిరిజన గ్రామాలే. ప్రజలు నివశిస్తున్న  కొండ ప్రాంతాలు, గిరిజన గ్రామాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఈశాన్య రాష్ర్టాలున్నాయి. కాని ఇవేవీ వారి ఎన్నికల గణాంకాల్లోకి రావు. అందుకే ఈ గ్రామాలకు వారు ప్రాధాన్యం ఇవ్వలేదు. ఈ కష్టమైన పని వారు అందుకే వదిలివేశారు. మే చెరగని ముద్ర వేసే తరహా మనుషులం. చెరిగిపోయే ముద్రలు కాదు. మేం ఈ సవాలును స్వీకరించి ప్రతీ ఒక్క గ్రామానికి విద్యుత్ అందించాలని సంకల్పం తీసుకున్నాం. 18,000 గ్రామాలకు నిర్దేశిత కాలపరిమితి లోగా విద్యుత్ సదుపాయం అందుబాటులోకి తెచ్చాం. ప్రజలు ఈ సవాలును దాటి కొత్త జీవితాన్ని పొందగలిగారు. వారు అభివృద్ధి రుచి చూడడమే కాదు, ప్రధానంగా వారిలో వ్యవస్థ పట్ల విశ్వాసం, నమ్మకం పెరిగాయి. పౌరుల్లో విశ్వాసం నిర్మాణం అయినప్పుడు దేశం లక్షలు, కోట్ల రెట్ల శక్తివంతం అవుతుంది. మేం కష్టించి పని చేసి విశ్వాసం సాధించగలిగాం. అందుకే దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన చాలా సంవత్సరాల తర్వాత మారుమూల గ్రామాల ప్రజల్లో ఒక కొత్త ఆశ చిగురించింది.  వారిలో ఒక రకమైన సంతృప్తి ఏర్పడింది. మేం వారి ఆశీస్సులు పొందగలుగుతున్నాం.

గౌరవ అధ్యక్షా, 
గత ప్రభుత్వాల హయాంలో కొద్ది గంటలు మాత్రమే విద్యుత్ ఉండేది. వాస్తవంలో విద్యుత్ అందినట్టుగానే ఉండేది. గ్రామం మధ్యలో ఒక పోల్ మాత్రం వేసే వారు. దాని వార్షికోత్సవం ప్రతీ సంవత్సరం నిర్వహించే వారు. నేడు విద్యుత్ ప్రతీ గ్రామానికి చేరడం మాత్రమే కాదు, 22 గంటలు విద్యుత్ సరఫరా అందించడంలో కూడా విజయం సాధించాం. ఇందుకోసం కొత్త ట్రాన్స్ మిషన్ లైన్లు ఏర్పాటు చేయాల్సివచ్చింది. కొత్తగా విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి వచ్చింది. అందుకు సోలార్ ఎనర్జీని మేం అనుసరించాం. కొత్త పునరుత్పాదక ఇంధన వనరుల కోసం అన్వేషించాం. మేం ప్రజలను విధిలిఖితం అంటూ వదిలేయలేదు. రాజకీయ లాభనష్టాలు  మేం ఆలోచించలేదు. దేశ భవిష్యత్తును ఉజ్వలంగా నిలిపే బాటను మాత్రమే ఎంచుకున్నాం. మాపై మేం ఒత్తిడి పెంచుకున్నాం. ప్రజల డిమాండు పెరిగిన కొద్ది ఒత్తిడి కూడా పెరిగింది. మేం ఎంచుకున్న కష్టపడి పని చేసే విధానం ఫలితాలు నేడు కనిపిస్తున్నాయి. ఇంధన రంగం పురోగతిలో కొత్త శిఖరాలు మేం చేరుకుంటున్నాం. 

గౌరవ అధ్యక్షా,
‘‘ఆజాదీ కా అమృత్’’ కాలంలో మేం ఎంతో సాహసోపేతమైన అడుగు వేశాం. అది సాధించడం అంత తేలిక కాదని మాకు తెలుసు. మేం ప్రతీ దానిలో సంతృప్త స్థాయినే ఎంచుకున్నాం. ప్రతీ పథకం లబ్ధిదారులు నూరు శాతం ప్రయోజనాలు పొందాలని, ఎలాంటి దాపరికం లేకుండా ఆ ప్రయోజనాలు వారికి చేరాలని మేం ఆశించాం. వాస్తవమైన లౌకికవాదం అంటే ఇదే. ప్రభుత్వం నిజాయతీతో ఆ బాటలో పయనిస్తోంది. అమృత కాలంలో మేం సంతృప్తతను ఎంచుకున్నాం. లబ్ధిదారులకు 100 శాతం ప్రయోజనాలు అందేలా చూడడమే బిజెపి ఎన్ డిఏ ప్రభుత్వ తీర్మానం.

గౌరవ అధ్యక్షా,
100 శాతం సంతృప్తత అనేది దేశంలోని పలు సమస్యలకు పరిష్కారం. ఇది దేశంలోని పౌరుల  సమస్యలకు మాత్రమే పరిష్కారం కాదు, దేశ సమస్యలకు కూడా పరిష్కారం అది. మేం అదే పని సంస్కృతితో ముందుకు వచ్చాం. దేశంలో అన్ని విభేదాలను అంతం చేసే మార్గం ఇదే.
సంతృప్తత సాధించడం అంటే అన్ని రకాల వివక్షలను అంతం చేయడమే. తేడాలెక్కడ ఉంటాయో అక్కడ అవినీతి వ్యాప్తికి ఆస్కారం ఉంటుంది. ఎవరైనా ‘‘నాకు అది తొందరగా ఇవ్వండి’’ అని అడిగితే ‘‘మీరు ఇంత ఇస్తే మాత్రమే నేను అది ఇస్తాను’’ అంటారు. కాని నూరు శాతం లభించాలని కోరుకుంటే మాత్రం ఈ నెలలో కాకపోయినా మూడు సంవత్సరాల తర్వాత అయినా కచ్చితంగా అందుతుందన్న నమ్మకం ఏర్పడుతుంది. విశ్వాసం పెరుగుతుంది. కులం, కుటుంబం, గ్రామం, వర్గం వంటి అన్ని రకాల బుజ్జగింపు ధోరణులు అంతం అయిపోతాయి. స్వార్ధపూరిత ప్రయోజనాలన్నింటినీ నిర్మూలించి సమాజంలో చివరి వ్యక్తి ప్రయోజనాలు పరిరక్షించగలుగుతాం. మహాత్మాగాంధీ సమాజంలోని ఆ వర్గం గురించే వాదించే వారు. సమాజంలోని ఆ వర్గం హక్కులు నిర్లక్ష్యం కాకుండా మేం భరోసా ఇస్తున్నాం. ‘‘సబ్  కా సాత్-సబ్ కా వకాస్’’ అంటే హక్కులకు 100 శాతం రక్షణ కల్పించడమే.
 ప్రభుత్వ యంత్రాంగం అర్హత కలిగిన ప్రతీ ఒక్క వ్యక్తిని చేరేందుకు ప్రయత్నించినప్పుడు వివక్ష లేదా ఆశ్రిత పక్షపాతానికి తావుండదు. అందుకే ‘‘100% సేవా అభియాన్’’ సామాజిక న్యాయానికి శక్తివంతమైన వారధిగా నిలుస్తుంది. ఇదే అసలైన లౌకిక వాదం. 
మేం ఈ తరహా  అభివృద్ధి నమూనా దేశానికి అందించడానికి ప్రయత్నిస్తున్నాం. అందులో భాగస్వాములైన వారందరూ హక్కులు పొందుతారు. దేశం మాతో ఉంది. దేశం పదే పదే కాంగ్రెస్ ను నిరాకరిస్తోంది. అయినప్పటికీ కాంగ్రెస్, దాని మిత్ర పక్షాలు తమ కుట్రలు విరమించుకోవడంలేదు. ప్రజలు ఇవన్నీ గమనిస్తూ ప్రతీ దశలోనూ వారిని శిక్షిస్తూనే ఉన్నారు. 

గౌరవ అధ్యక్షా, 
1857 నుంచి స్వాతంత్ర్య పోరాటం సాగిన ఏ దశాబ్దం అయినా, ఏ ప్రాంతం అయినా తీసుకుని పరిశీలించవచ్చు...స్వాతంత్ర్య పోరాటానికి గిరిజనులందించిన సేవలు సువర్ణాక్షరాలతో  లిఖించి ఉంటాయి.  నా గిరిజన సోదరుల స్వాతంత్ర్య కాంక్షకు దేశం గర్విస్తుంది. అయినప్పటికీ దశాబ్దాల పాటు నా గిరిజన సోదరులు  అభివృద్ధి  నిరాకరణకు గురవుతూనే ఉన్నారు. విశ్వాస వారధి ఎన్నడూ నిర్మించలేదు. పైగా పూర్తి అనుమానాలతో కూడిన వ్యవస్థను సృష్టించారు. ప్రభుత్వాల పట్ల యువతలో ప్రశ్నలు పదే పదే మెదులుతూనే ఉన్నాయి. వారే గనుక మంచి ఉద్దేశంలో, గిరిజనుల సంక్షేమం కోసం, మంచి ఆలోచనలతో పని చేసి ఉంటే 21వ శతాబ్దిలోని ఈ మూడో దశాబ్దిలో నేను ఇంత కష్టపడి పని చేయాల్సివచ్చేది కాదు. అది వారు చేయలేకపోయారు. అటల్ బిహారీ వాజ్ పేయి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారిగా గిరిజనుల అభివృద్ధికి ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేశారు. గిరిజనుల సంక్షేమం, అభివృద్ధికి ప్రత్యేకంగా బడ్జెట్  కేటాయింపులు చేశారు. 

గౌరవ అధ్యక్షా, 
మేం అభివృద్ధిలో వెనుకబడిపోయిన 110 జిల్లాలను ఆకాంక్షాపూరిత జిల్లాలుగా గుర్తించాం. భౌగోళికంగా వెనుకబడిన వారికి న్యాయం చేయడం కూడా అంతే ప్రధానం. అందుకే మేం 110 ఆకాంక్షాపూరిత జిల్లాలు గుర్తించాం. ఆ జిల్లాల జనాభాలో అధిక శాతం నా గిరిజన సోదర సోదరీమణులే. దీని ద్వారా మూడు కోట్ల మందికి పైగా గిరిజన సోదరులు ప్రత్యక్ష ప్రయోజనం పొందారు. వారి జీవితాల్లో మార్పు వచ్చింది. మేం ఈ 110 జిల్లాల పైన నిరంతరం ఫోకస్ పెట్టి నిరంతరం పర్యవేక్షించినందు వల్ల ఈ ప్రాంతాల్లో విద్య, ఆరోగ్యం, మౌలిక వసతుల రంగాల్లో కనివిని ఎరుగని మెరుగుదల కనిపించింది. 
ఇక్కడ కొందరు గౌరవ సభ్యులు గిరిజన ఉప-ప్రణాళిక గురించి మాట్లాడారు. అలాంటి మిత్రులు ఎవరైనా బడ్జెట్ అవగాహన చేసుకుని వివరించగల ఒక విద్యావంతుని సహాయం తీసుకోవాలని నేను సూచిస్తున్నాను. మీరు పరిశీలించినట్టయితే 2014 సంవత్సరం ముందు కాలంతో పోల్చితే  ఆ తర్వాత బడ్జెట్లో షెడ్యూల్డ్  తెగల విభాగం నిధులు ఐదు రెట్లు పెరిగనట్టు గమనించగలుగుతారు.

గౌరవ అధ్యక్షా, 
2014 సంవత్సరంలో వారి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేటాయింపులు 20-25 వేల  కోట్ల స్థాయిలోనే ఉండేవి. ఇది ఎప్పుడో పాత కాలం నాటి మాట కాదు. అయినా వారు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది మేం రూ.1.20 లక్షల కోట్ల కేటాయింపులు చేశాం. గత 9 సంవత్సరాల కాలంలో  గిరిజన సోదర సోదరీమణులు, వారి సంతానానికి ఉజ్వల భవిష్యత్తు అందించడం లక్ష్యంగా మేం 500 కొత్త ఏకలవ్య పాఠశాలలు ఏర్పాటు చేశాం. గతంతో పోల్చితే ఇది నాలుగు రెట్లు అధికం. పైగా ఈ పాఠశాలల్లో 38 వేల ఉపాధ్యాయులు, సిబ్బందిని నియమించేందుకు మేం నిర్ణయించాం. మా ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. అటవీ హక్కుల చట్టం గురించి కూడా మీకు వివరించాలనుకుంటున్నాను.

గౌరవ అధ్యక్షా,
దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 2014 సంవత్సరంలో మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు వరకు గిరిజన కుటుంబాలకు 14 లక్షల భూమి లీజులు మాత్రమే ఇచ్చారు. కాని గత 7-8 సంవత్సరాలుగా మేం 60 లక్షల కొత్త లీజులు మంజూరు చేశాం. ఇది అసాధారణమైన పని. మా ప్రభుత్వం రావడానికి ముందు 23 వేల కమ్యూనిటీ పట్టాలు మాత్రమే మంజూరయ్యాయి. కాని మేం వచ్చిన తర్వాత 80 వేల కమ్యూనిటీ పట్టాలు మంజూరు చేశాం. వారే గనుక ‘‘లోతైన సానుభూతి’’ ముసుగులో గిరిజనుల మనోభావాలతో ఆడుకునే బదులు ఫలవంతమైన పని ఏదైనా చేసి ఉంటే ఈ రోజు నేను ఇంత కష్టపడాల్సి వచ్చేది కాదు. ఎంతో తేలిగ్గా చేయగల ఈ పని కూడా వారు ప్రాధాన్యతా క్రమంలో  చేయలేకపోయారు. 

గౌరవ అధ్యక్షా,  
ఆర్థిక విధానాలు, సామాజిక విధానాలు, రాజకీయాలు ఏవైనా ఓటు బ్యాంక్ ఆధారంగానే సాగాయి. అందుకే వారు ఎల్లప్పుడూ సామాజిక బలాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చారు. స్వయం-ఉపాధితో ఆర్థిక కార్యకలాపాలను పెంచడానికి ప్రయత్నించలేదు. వారికి సంబంధించినంత వరకు ఇలాంటి వారందరూ చెల్లాచెదరుగా విస్తరించి ఉన్న ఎలాంటి విలువ లేని చిన్న, చిన్న ఉద్యోగాలు చేసుకునే తక్కువ స్థాయి వారే. వాస్తవానికి వారు స్వయం-ఉపాధి ద్వారా సమాజానికి భారం కాకుండా జీవితాలను వెళ్లబుచ్చడంతో పాటు విలువను జోడించే వ్యక్తులు. అయినా ఇలాంటి చిన్న పనులు చేసుకునే కోట్లాది మందిని పట్టించుకున్న పాపాన పోలేదు. వీధి వ్యాపారులు, ఫుట్  పాత్ లపై వ్యాపారాలు చేసుకునే వారి గురించి మేం జాగ్రత్త తీసుకున్నాం అని చెప్పేందుకు నేను గర్విస్తున్నాను. గతంలో వడ్డీలు చెల్లించడంలోనే జీవితాలు ఛిద్రం అయిపోయాయి. కష్టించి సంపాదించిన సొమ్మంతా వడ్డీవ్యాపారుల పాలయ్యేది. కాని మేం వారిని గురించి, ఆ వీధి వ్యాపారుల గురించి పట్టించుకున్నాం. 

గౌరవ అధ్యక్షా, 
మన విశ్వకర్మ వర్గం సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటారు. వారంతా తమ హస్త నైపుణ్యంతో సమాజ అవసరాలు తీర్చేందుకు ఎంతో ప్రయత్నిస్తూ ఉంటారు. మేం వారిని గురించి కూడా పట్టించుకున్నాం. వారే మన బంజారా తెగ లేదా సంచార జాతి ప్రజలు. సమాజంలోని ఈ వర్గాల ప్రజలను శక్తివంతం చేయడానికి పిఎం స్వనిధి యోజన లేదా పిఎం విశ్వకర్మ యోజన ద్వారా మేం కృషి చేస్తున్నాం.

గౌరవ అధ్యక్షా,
మీరు కూడా స్వయంగా ఒక రైతు బిడ్డ. ఈ దేశంలో రైతులందరూ ఎదుర్కొన్నదేమిటి? కేవలం కొంత మంది ఉన్నత వర్గాల వారి గురించి మాత్రమే పట్టించుకుని వారు రాజకీయాలు చేశారు. మన దేశ వాస్తవ బలం చిన్న రైతుల్లోనే ఉంది. దేశంలోని 80-85 శాతం జనాభా కోసం వారు తమకున్న ఎకరా, రెండెకరాల భూమిలో పంటలు పండిస్తూ శ్రమిస్తున్నారు. అలాంటి చిన్న రైతుల గోడు ఎన్నడూ వినలేదు. వారిని నిరంతరం నిర్లక్ష్యం చేస్తూనే వచ్చారు. మేం చిన్న రైతులపై దృష్టి పెట్టాం. చిన్న రైతులను వ్యవస్థాత్మక బ్యాంకింగ్ తో అనుసంధానం చేశాం. నేడు పిఎం కిసాన్ సమ్మాన్  నిధికి చెందిన సొమ్ము ఏడాదికి మూడు విడతలుగా నేరుగా చిన్న రైతుల ఖాతాల్లోనే జమ అవుతోంది. అంతే కాదు, మేం పశువుల పెంపకందారులు, మత్స్యకారులను కూడా బ్యాంకులతో అనుసంధానం చేశాం. వారికి వడ్డీ రాయితీలు కల్పించడం ద్వారా వారి ఆర్థిక సామర్థ్యం పెంచేందుకు ప్రయత్నించాం. దీని వల్ల  వారు తమ వ్యాపారాలు అభివృద్ధి చేసుకోవడం లేదా పంట విధానాలు మార్చుకోవడం చేయగలిగారు. ప్రభుత్వం నుంచి గిట్టుబాటు ధరలు పొందిన తర్వాత మాత్రమే మార్కెట్ కు పంటలు తరలించగల విధంగా మేం ఏర్పాట్లు చేశాం.

గౌరవ అధ్యక్షా,  
మన దేశంలో చాలా మంది రైతులు వాన నీటి పైనే ఆధారపడతారని మాకు తెలుసు. గత ప్రభుత్వాలు నీటి పారుదల కోసం ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. నీటి వసతి లేని కారణంగా ఇలాంటి చిన్న రైతులు వాన నీటిని ఉపయోగించి చిరుధాన్యాలు పండించే వారు. అలాంటి చిరు ధాన్యాలు పండించే రైతులకు ప్రత్యేక స్థానం కల్పించేందుకు మేం ప్రయత్నించాం. చిరుధాన్యాల సంవత్సరం పాటించాలని ఐక్యరాజ్య సమితికి లేఖ రాశాం. ప్రపంచంలో వీటికి భారతదేశ చిరుధాన్యాలు అనే బ్రాండింగ్ ఏర్పడాల్సిన అవసరం ఉంది. అందుకు అవసరమైన మార్కెటింగ్ చేయాలి. అందుకే చిరుధాన్యాలకు ‘‘శ్రీ అన్న’’ పేరిట ప్రత్యేక గుర్తింపు కల్పించాం. ‘‘శ్రీ ఫాల్’’ వలెనే శ్రీ అన్నకు కూడా ప్రత్యేక గుర్తింపు ఏర్పడాల్సి ఉంది.  వాటిని ఉత్పత్తి చేసే రైతులు హేతుబద్ధమైన ధర పొందడంతో పాటు ప్రపంచ మార్కెట్ కూడా సాధించాలి. దేశంలో పంట విధానం మారాలి. పైగా చిరుధాన్యాలు పోషక విలువలు పుష్కలంగా ఉండే అద్భుత ఆహారం. మన దేశంలో కొత్త తరంలో  పోషకాహార లోపాన్ని తొలగించేందుకు కూడా ఇవి ఉపయోగపడతాయి. తద్వారా చిన్న రైతులు శక్తివంతులవుతారు. అదే విధంగా ఎరువుల విషయంలోకూడా కొత్త విధానాలను మేం అభివృద్ధి చేశాం. దాని వల్ల ప్రయోజనం కూడా లభించింది.

గౌరవ అధ్యక్షా,   
విధాన నిర్ణయాల్లో మన తల్లులు, సోదరీమణుల పాత్ర పెరిగితో ఫలితాలు మెరుగ్గా, వేగవంతంగా ఉంటాయని నేను నమ్ముతాను. లక్ష్యసాధన కూడా తేలికవుతుంది. అందుకే మన తల్లులు, సోదరీమణుల భాగస్వామ్యం పెంచేందుకు, తద్వారా వారు విధాన నిర్ణయాల్లో భాగస్వాములయ్యేలా చేసేందుకు మా ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. మహిళల సాధికారతకు, మహిళా నాయకత్వ అభివృద్ధికి మా ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది. మహిళలకు మరుగుదొడ్లు ఏర్పాటు చేసినంత మాత్రాన మహిళల అభివృద్ధి సాధ్యమా అని గౌరవ సభ్యుడొకరు ప్రశ్నించారు. బహుశ ఆయన దృష్టి అంతా మరుగుదొడ్డి పైనే ఉండి ఉండవచ్చు, అదే ఆయన సమస్య కావచ్చు. కాని నేను ఒక గ్రామం నుంచి వచ్చానని తెలియచేయడానికి గర్వపడుతున్నాను. నా సోదర సోదరీమణులు, తల్లులకు 11 కోట్ల ‘‘ఇజ్జత్-ఘర్’’ లేదా  మరుగుదొడ్లు అందించడం ద్వారా వారి గౌరవాన్ని కాపాడానని గర్వపడుతున్నాను. మన తల్లులు, సోదరీమణులు, పుత్రికల జీవన చక్రం చూడండి. తల్లులు, సోదరీమణుల సాధికారత మాకు ఎంత ముఖ్యమో తెలియచేయాలనుకుంటున్నాను. కేవలం మరుగుదొడ్లకు మాత్రమే పరిమితం అయిన వారు చెవులు పెట్టుకుని వినండి. ఇది వారికి మరింత సౌకర్యవంతం కావచ్చు. గర్భస్థ శిశువుకు పోషకాహారం అందించడం లక్ష్యంగా మేం మాతృ వందన యోజన ప్రారంభించాం. గర్భంలోని శిశువుకు పోషకాహార ప్రయోజనాలు కల్పించేందుకు దీని కింద గర్భిణీల బ్యాంకు ఖాతాల్లో నేరుగా సొమ్ము జమ అవుతోంది. మన దేశంలో బాలింత, శిశు మరణాల సంఖ్య తగ్గించడానికి ఉత్తమ మార్గం వ్యవస్థాత్మక జననాలు.  అందుకే మేం నిరుపేదలైన మహిళలు ఆస్పత్రుల్లోనే పురుడు పోసుకునేలా ప్రోత్సహించడం కోసం సొమ్ము ఖర్చు చేయాలని నిర్ణయించాం. దీని వల్ల శిశువు ఆస్పత్రిలోనే జన్మిస్తుంది. దాని ఫలితాలు కూడా కళ్ల ముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని రకాలైన అపప్రథల కారణంగా ఆడపిల్లలను కన్నతల్లి గర్భంలో ఉండగానే నిర్మూలించే ధోరణులు పెరిగాయని మేం గుర్తించాం. అందుకే బేటీ బచావో ప్రచారం ప్రారంభించాం. దీని వల్ల మగ శిశువులతో పోల్చితే ఆడ శిశువుల జననాలు పెరిగాయని  తెలియచేయడానికి సంతోషిస్తున్నాను. ఇది మాకు అత్యంత సంతృప్తిని కలిగించే అంశం. మేం కుమార్తెల రక్షణకు పాటు పడ్డాం. గతంలో అమ్మాయి పెద్దదై పాఠశాలకు వెళ్లినా సరైన మరుగుదొడ్డి వసతి లేని కారణంగా ఐదో తరగతలోనో లేదా ఆరో తరగతిలోనో డ్రాపౌట్ గా మిగిలిపోయేదు. అందుకే బాలికలకు ప్రత్యేక మరుగుదొడ్లు నిర్మించి మేం ఆ సమస్యను పరిష్కరించాం. ఆ రకంగా బాలికలు పాఠశాల డ్రాపౌట్లు కాకూడదని నిర్ణయించాం. కుమార్తెల నిరంతరాయ విద్యాభ్యాసం కోసం సుకన్య సమృద్ధి యోజన ప్రారంభించాం. దీని వల్ల కుటుంబం కూడా బాలికల విద్యను ప్రోత్సహిస్తుంది. కుమార్తె ఎదిగి ఉద్యోగానికి సిద్ధం అయినప్పుడు ముద్ర యోజన ద్వారా ఎలాంటి హామీ అవసరం లేకుండానే రుణం పొంది సొంత వ్యాపారాలు ప్రారంభించుకునే అవకాశం అందుబాటులో ఉంది. ముద్ర యోజన లబ్ధిదారుల్లో 70 శాతం మంది మన తల్లులు, కుమార్తెలే అని తెలియచేయడానికి నేను ఆనందిస్తున్నాను. 
తల్లి అయిన తర్వాత కూడా పని చేసుకునేందుకు వీలుగా మాతృత్వ సెలవు దినాల సంఖ్య పెంచాం. ఈ సెలవులు అభివృద్ధి చెందిన దేశాల కన్నా మన దేశంలో ఎక్కువగా ఉన్నాయి. కుమార్తెల కోసం సైనిక పాఠశాలలు కూడా తెరిపించాం.

గౌరవ అధ్యక్షా, 
మీరు స్వయంగా ఒక సైనిక్  పాఠశాల విద్యార్థి. ఈ పాఠశాలల్లో బాలికలకు ప్రవేశం లేదు. కాని నేడు బాలికలకు సైనిక పాఠశాలల ప్రవేశానికి మేంద అవకాశం కల్పించాం.  మన కుమార్తెలు బలహీనులు కాదు. వారు సైన్యంలో చేరాలనుకోవచ్చు లేదా సైనికాధికారులు కావాలనుకోవచ్చు. అందుకే సైన్యం తలుపులు కూడా కుమార్తెల కోసం తెరిచాం. నేడు మన పుత్రికలు మాతృ భూమిని కాపాడే ప్రయత్నంలో సియాచిన్ లో నియమితులయ్యారని తెలియచేసేందుకు నేను గర్విస్తున్నాను. 
గ్రామాల్లోని మన కుమార్తెలకు సంపాదన అవకాశాలు పెంచడానికి వీలుగా మహిళా స్వయం సహాయక గ్రూప్ లకు విలువ జోడించి వారికి కొత్త శక్తి అందించేందుకు మేం ప్రయత్నించాం. ఈ గ్రూప్ లలో సభ్యురాలైన మహిళ ఎవరైనా బ్యాంకుల నుంచి అధికంగా ధనం పొందేందుకు, తద్వారా పురోగతి సాధించేందుకు మేం  అవకాశం కల్పించాం. కట్టెల నుంచి వచ్చే పొగ ద్వారా తల్లులు, సోదరీమణులు సమస్యల బారిన పడకుండా కాపాడేందుకు ఉజ్వల యోజన ద్వారా మేం గ్యాస్ కనెక్షన్లు అందించాం. ఇంటింటికీ కుళాయిల ద్వారా నీటి సరఫరా చేయడం ద్వారా సోదరీమణులు, తల్లులు, కుమార్తెలు మంచి నీటి కోసం 2-4 కిలోమీటర్లు నడవాల్సిన అవస్థ తప్పించాం. వారు అంధకారంలోనే ఉండిపోకూడదని భావించి సౌభాగ్య యోజన ద్వారా పేద కుటుంబాలకు విద్యుత్ వసతి అందుబాటులోకి తెచ్చాం. కుమార్తెలు, తల్లులు లేదా సోదరీమణులు ఎంత తీవ్ర అనారోగ్యం బారిన పడ్డారన్న దాని కన్నా పిల్లలు రుణగ్రస్తులవుతారని, కుటుంబంపై భారం పడుతుందనే వారు బాధ పడతారు. అందుకే ఆమె బాధ పడుతుంది తప్పితే తన అనారోగ్యం గురించి కుటుంబ సభ్యులకు చెప్పదు. ఆయుష్మాన్ కార్డుల ద్వారా ఆ తల్లులు, సోదరీమణులు తీవ్ర వ్యాధులకు ఆస్పత్రుల్లో చికిత్స పొందే ఏర్పాటు చేశాం. 

గౌరవ అధ్యక్షా, 
బాలికలకు ఆస్తిపై హక్కులుండాలని మేం నమ్మాం. అందుకే ప్రభుత్వం నిర్మించి ఇచ్చే ఇళ్లకు వారికే యాజమాన్య హక్కులు కల్పించి ఆస్తి వారి పేరు మీదనే ఉండేలా చేశాం.  ఎన్ని కష్టాలు ఎదురైనా పొదుపు చేయడం మన తల్లులు, సోదరీమణులకు అలవాటు. అలా పొదుపు చేసిన సొమ్ముతో తమ జీవనం సాగించాలనే ఉద్దేశంతో డబ్బుని ఆహార ధాన్యాలు ఉండా డబ్బాల్లో దాస్తూ ఉంటారు. అలాంటి సమస్యను పరిష్కరించేందుకు మేం వారికి జన్ ధన్ ఖాతాలు అందించాం. తద్వారా వారు బ్యాంకుల్లోనే తమ సొమ్ము డిపాజిట్ చేసుకోగలుగుతారు.

గౌరవ అధ్యక్షా, 
పార్లమెంట్ బడ్జెట్ కార్యక్రమాలు మహిళా రాష్ర్టపతి చేతుల మీదుగా ప్రారంభం కావడం, పార్లమెంట్ కార్యకలాపాలు మహిళా ఆర్థిక మంత్రి  ప్రసంగంతో లాంఛనంగా ప్రారంభం కావడం గర్వకారణం. గతంలో ఎన్నడూ ఇలాంటి సంఘటన ఏర్పడలేదు. మేం భవిష్యత్తులో కూడా ఇలాంటి పవిత్ర అవకాశాలు కల్పించేందుకు మేం భరోసా ఇస్తున్నాం. 

గౌరవ అధ్యక్షా,   
దేశం ఆధునికం కావడానికి, నూతన సంకల్పాలు సాకారం చేసుకోవడానికి శాస్ర్త, సాంకేతిక శక్తిని ఉపయోగించుకోవడాన్ని మేం నిరాకరించలేం. సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ ప్రాధాన్యాన్ని మేం బాగా గుర్తించాం. శాస్ర్త, సాంకేతిక పరంగా మేం దేశాన్ని అన్ని దిశల్లోనూ ముందుకు నడిపేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నాం. అందుకే అటల్ టింకరింగ్ లాబ్ ల ద్వారా బాల్య దశ నుంచే శాస్ర్తీయ దృక్పథాన్ని పెంచడానికి అవకాశాలు కల్పించాం. పిల్లలు మరో అడుగు ముందుకేసి ఇంకా ఏదైనా ప్రారంభించాలనుకుంటే మద్దతు ఇచ్చేందుకు అటల్ ఇంకుబేషన్ సెంటర్లు ఏర్పాటు చేశాం. ఇంకా మంచి పురోగతి ఉంటే దాన్ని టెక్నాలజీగా మార్చేందుకు అనుకూలమైన వాతావరణం కూడా అందుబాటులో ఉంటుంది. ఇందుకు అనుగుణంగా పాలసీల్లో కూడా మేం మార్పులు చేశాం. అంతరిక్ష రంగంలో ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం కల్పించాం. ఈ దేశంలోని యువతకు ప్రైవేటు ఉపగ్రహాలు పంపే శక్తి కూడా ఉందని తెలియచేయడానికి నేను సంతోషిస్తున్నాను. అదే సైన్స్, టెక్నాలజీ శక్తి. ఇక స్టార్టప్ ల విషయానికి వస్తే యునికార్న్ ల సంఖ్యపరంగా మనం ప్రపంచంలోనే మూడో స్థానంలో ఉన్నాం.

గౌరవ అధ్యక్షా,
నేడు దేశంలో యువత పేటెంట్లను అధిక సంఖ్యలో దాఖలు చేసేందుకు ముందుకు వస్తూ ఉండడం గర్వకారణం. 

గౌరవ అధ్యక్షా,  
ఆధార్ శక్తి ఏమిటో కూడా మా ప్రభుత్వం చూపించింది. 2014 తర్వాత ఆధార్, టెక్నాలజీ  ప్రాధాన్యత  ఏమిటో తెలిసిందని ఆ రంగానికి చెందిన నిపుణులంటున్నారు. కోవిడ్  సమయంలో కోవిన్ యాప్ ద్వారా 200 కోట్ల వ్యాక్సిన్లు ఇవ్వడమే కాదు, కేవలం సెకండ్ల వ్యవధిలో కోవిన్ సర్టిఫికెట్  మొబైల్ లో వచ్చేది. కోవిడ్-19 నివారణకు భారతదేశం సొంత వ్యాక్సిన్ తయారుచేసుకోవడం చూసి ప్రపంచం యావత్తు ఆశ్చర్యపోయింది. ప్రపంచంలోని వారందరూ తమ వ్యాక్సిన్లు ఇక్కడ విక్రయించడానికి ఒత్తిడి చేసే వారు. పలు వ్యాసాలు రాయించారు. సెమినార్లు నిర్వహించారు. టివి ఇంటర్వ్యూలు ఇచ్చారు. నా దేశానికి చెందిన శాస్ర్తవేత్తలను అప్రతిష్ఠ పాలు చేసేందుకు, అవమానపరిచేందుకు బలమైన ప్రయత్నాలు చేశారు. కాని నా దేశానికి చెందిన శాస్ర్తవేత్తలు నా దేశ ప్రజల అవసరాలు తీర్చడమే కాదు, ప్రపంచంలో మన వ్యాక్సిన్ కు గుర్తింపు ఇచ్చిన ఇతర దేశాల ప్రజల అవసరాలు తీర్చేందుకు కూడా ప్రయత్నించారు.  కాని ఈ ప్రజలు సైన్స్ అండ్ టెక్నాలజీని వ్యతిరేకించారు.

గౌరవ అధ్యక్షా, 
వారు సైన్స్ అండ్ టెక్నాలజీకి వ్యతిరేకం. శాస్ర్తవేత్తల ప్రతిష్ఠను దిగజార్చే ఎలాంటి అవకాశాన్ని వదులుకోరు. మన దేశం ప్రపంచంలో ప్రధాన ఫార్మాశక్తిగా అవతరిస్తోంది. ప్రపంచ ఫార్మసీ కేంద్రంగా మారుతోంది. మన యువత కొత్త అన్వేషణలు చేస్తున్నారు. దాన్ని కూడా అప్రతిష్ఠ పాలు చేసేందుకు వారు ప్రయత్నిస్తున్నారు. వారికి దేశం గురించిన ఆలోచన ఏ మాత్రం లేదు. రాజకీయ ఎగుడుదిగుడులే వారికి ముఖ్యం. ఇది నిజంగా దురదృష్టకరం.

గౌరవ అధ్యక్షా,  
నేడు నేను బాలిలో ఉన్నాను. డిజిటల్  ఇండియాను అర్ధం చేసుకోవడానికి జి-20 దేశాలు శ్రమిస్తున్నాయి. యావత్ ప్రపంచాన్ని ఆ విజయం ప్రభావితం చేసింది. డిజిటల్ లావాదేవీల విషయంలో  భారతదేశం ప్రపంచ నాయకత్వ దేశంగా మారింది.

గౌరవ అధ్యక్షా, 
నేడు 100 కోట్లకు పైబడిన మొబైల్ ఫోన్లు నా దేశ పౌరుల చేతుల్లో ఉండడం మనందరికీ ఆనందదాయకం. 

గౌరవ అధ్యక్షా, 
మనం ఒకప్పుడు మొబైల్ ఫోన్లు దిగుమతి చేసుకున్న రోజులున్నాయి. కాని నేడు మన దేశం మొబైల్ ఫోన్లు ఎగుమతి చేయడం మనందరికీ గర్వకారణం. 5జి కావచ్చు, ఎఐ కావచ్చు, ఐఓటి కావచ్చు మనం దేశం వేగంగా టెక్నాలజీని విస్తరిస్తోంది. 
సామాన్య ప్రజల సంక్షేమం కోసం రోజువారీ జీవితంలో డ్రోన్లను వినియోగించేందుకు వీలుగా విధానాలను సంస్కరించాం. నేడు దేశంలోని మారుమూల ప్రాంతాలకు డ్రోన్ల ద్వారా ఔషధాల డెలివరీ జరుగుతోంది. నా రైతులు వ్యవసాయ క్షేత్రాల్లో డ్రోన్ల వినియోగంపై శిక్షణ పొందుతున్నారు. నేడు వ్యవసాయంలో డ్రోన్ల వినియోగం దేశంలో కనిపిస్తూనే ఉంది. జియో-స్పేషియల్ రంగం ద్వారాలు కూడా మేం తెరిచాం. డ్రోన్ల రంగంలో అవకాశాలు మరింతగా విస్తరించేందుకు అవకాశాలు కల్పించాం. నేడు ఐక్యరాజ్య సమితి వంటి సంస్థలు ప్రపంచంలోని పలు దేశాల ప్రజలకు భూమి, ఇంటిపై యాజమాన్య హక్కులు లేకపోవడం గురించి చర్చిస్తున్నాయి. కాని భారతదేశం స్వమిత్వ యోజన ద్వారా గ్రామాల మ్యాప్ లు తయారుచేయడంతో పాటు యాజమాన్య హక్కులు కూడా కల్పించింది. తద్వారా ప్రజల్లో ఒక రకమైన భద్రతా భావం ఏర్పడింది. వారు హక్కు కోసం ఒక కోర్టు నుంచి మరో కోర్టుకు పరుగులు తీయాల్సిన అవసరం లేదు. ఇంటిని కోల్పోతామనే భయం కూడా అవసరం లేదు. సగటు మనిషి కోసం టెక్నాలజీ వినియోగంలో మనం విజయం సాధించాం.
టెక్నాలజీ రంగంలో ఆధునిక,  అభివృద్ధి చెందిన భారతదేశం కలను, ప్రాధాన్యతను మేం అర్ధం చేసుకున్నాం. అందుకే మానవ వనరుల  అభివృద్ధి, ఇన్నోవేషన్లకు అధిక ప్రాధాన్యం ఉంది. ఈ కారణంగానే ప్రపంచంలోనే ఏకైక ‘‘ఫోరెన్సిక్ సైన్స్ విశ్వవిద్యాలయం’’ మన దేశంలోనే ఉంది. ‘‘గతిశక్తి విశ్వవిద్యాలయం’’ ఏర్పాటు ద్వారా మౌలిక వసతుల ప్రపంచంలో కూడా కొత్త చొరవ తీసుకున్నాం. అలాగే ‘‘ఎనర్జీ విశ్వవిద్యాలయం’’ ఏర్పాటు ద్వారా పునరుత్పాదక ఇంధన విభాగంలో కూడా పెద్ద అడుగు వేశాం. ఇప్పటి నుంచే దేశ యువతను సంసిద్ధం చేసే దిశగా పని చేస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ తన పాలనా కాలంలో టెక్నోక్రాట్లు, ఇంజనీర్లు, సైన్స్ పట్ల అసహనం వ్యక్తం చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ వెనుకాడలేదు. కాని సైన్స్, టెక్నాలజీలను గౌరవించడం మా విధానం. అందుకే వాటికి చెందాల్సిన గౌరవం అందించే విషయంలో మేం వెనుకడుగేయడంలేదు.

గౌరవ అధ్యక్షా, 
ఉపాధి గురించి కూడా ఇక్కడ చర్చ జరిగింది. సుదీర్ఘకాలం పాటు ప్రజాజీవనంలో ఉన్న వారికి ఉపాధి, ఉద్యోగం అంటే తేడా తెలియకపోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఉద్యోగం, ఉపాధి గురించి తేడా తెలియని వారు మాకు బోధలు చేస్తున్నారు.

గౌరవ అధ్యక్షా,  
అరకొర జ్ఞానంతో కొత్త భాష్యాలు చెప్పే ప్రయత్నం కూడా జరుగుతోంది. గత 9 సంవత్సరాల కాలంలో ఆర్థిక వ్యవస్థల విస్తరణతో కొత్త రంగాల్లో కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటులోకి వచ్చాయి. నేడు దేశం హరిత ఆర్థిక వ్యవస్థ దిశగా కదులుతున్న వాతావరణంలో హరిత ఉద్యోగావకాశాలు పెరిగాయి. డిజిటల్ ఇండియా విస్తరణతో డిజిటల్ ఎకానమీ కూడా విస్తరించింది. నేడు సేవల రంగంలో డిజిటల్ ఇండియా కొత్త శిఖరాలు చేరుతోంది. ఐదు లక్షలకు పైగా కామన్ సర్వీస్ కేంద్రాలున్నాయి. ప్రతీ ఒక్క గ్రామంలోను, చివరికి మారుమూల అడవుల్లోని చిన్న గ్రామాల్లో కూడా ఉన్న కామన్ సర్వీస్ కేంద్రంలో 2 నుంచి 5 మంది జీవనోపాధి పొందుతున్నారు. నేడు మన దేశానికి కామన్ సర్వీస్ సెంటర్ అనేది అత్యంత అవసరం. ఆ కేంద్రాల్లో ఒకే ఒక బటన్ నొక్కడం ద్వారా గ్రామస్థులకు సేవలు అందుబాటులో ఉంచే ఏర్పాట్లు జరిగాయి. డిజిటల్ ఎకానమీ పలు కొత్త ఉద్యోగావకాశాలు కల్పించింది.

గౌరవ అధ్యక్షా, 
90 వేల రిజిస్టర్డ్ స్టార్టప్ లు కూడా ఉపాధికి కొత్త ద్వారాలు తెరిచాయి. 2022 ఏప్రిల్-నవంబరు నెలల మధ్య కాలంలో కోటి మందికి పైగా ఇపిఎఫ్ఓ పేరోల్స్ లో జోడయ్యారు. 

గౌరవ అధ్యక్షా, 
ఆత్మనిర్భర్ భారత్ రోజ్ గార్ యోజన ద్వారా 60 లక్షల మందికి పైగా కొత్త ఉద్యోగులు లబ్ధి పొందారు. ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ కింద అంతరిక్షం, రక్షణ, డ్రోన్లు, మైనింగ్, బొగ్గు రంగాల్లోకి కొత్త ఎంటర్ ప్రెన్యూర్ల ప్రవేశానికి అవకాశం కల్పించాం. ఇది కూడా ఉపాధిలో కొత్త ఉత్తేజం కల్పించింది. మన యువత ముందుకు వచ్చి ఈ విభాగాలన్నింటిలోనూ అవకాశాలు అంది పుచ్చుకుంటున్నారు, లాభం పొందుతున్నారు.

గౌరవ అధ్యక్షా,
రక్షణ రంగంలో దేశం స్వయం-సమృద్ధం కావడం చాలా అవసరం. ఈ దిశగా మేం అడుగేశాం అని చెప్పడానికి నేను ఆనందిస్తున్నాను. నేడు 350కి పైగా ప్రైవేటు కంపెనీలు రక్షణ రంగంలో ప్రవేశానికి ముందుకు వచ్చాయి. నేడు నా దేశం రూ.లక్ష కోట్ల విలువ గల రక్షణ పరికరాలు ఎగుమతి చేస్తోంది. ఈ రంగంలో కూడా అసాధారణ ఉద్యోగావకాశాలు అందుబాటులోకి వచ్చాయి.

గౌరవ అధ్యక్షా, 
రిటైల్ నుంచి టూరిజం వరకు ప్రతీ రంగం విస్తరించింది. మహాత్మాగాంధీకి ఎంతో సన్నిహితం అయిన ఖాదీ, గ్రామీణ పరిశ్రమల రంగం కూడా ఒకప్పుడు మునిగిపోయింది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత మా పాలనా కాలంలో మాత్రమే ఖాదీ, గ్రామీణ పరిశ్రమల రంగంలో రికార్డు స్థాయిలో పనులు జరిగాయి. రైలు, రోడ్లు, పోర్టులు, విమానాశ్రయాలు...ఇలా విభిన్న రంగాలు; ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన వంటి వివిధ మౌలిక వసతులపై రికార్డు స్థాయిలో పెట్టుబడులు పెట్టాం. ఈ మౌలిక వసతుల పనులన్నింటిలోనూ రికార్డు స్థాయిలో ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. నిర్మాణ పనులు జరిగే ప్రతీ చోటా కూలీల నుంచి మెకానిక్ ల వరకు, ఇంజనీర్ల నుంచి కార్మికుల వరకు పలు ఉపాధి అవకాశాలు ఏర్పడతాయి. అందుకే నేడు యువత యువజన వ్యతిరేక విధానాలు అనుసరించే వారిని తిరస్కరించారు. నేడు యువజన సంక్షేమం కోసం రూపొందించే విధానాలన్నింటినీ దేశం ఆమోదిస్తోంది. 

గౌరవ అధ్యక్షా,
ప్రభుత్వ పథకాల పేర్ల విషయంలో కూడా అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని పేర్లలో  సంస్కృతం ఉపయోగించడం పట్ల కూడా కొందరికి సమస్య ఉంది. 

గౌరవ అధ్యక్షా, 
నేను ఒక వార్తాపత్రిక చదివాను. దానిలో నిజానిజాలు నేను పరీక్షించలేదు గాని, సుమారు 600 వరకు ప్రభుత్వ పథకాలు గాంధీ-నెహ్రూ కుటుంబం పేరు మీద ఉన్నాయి. 

గౌరవ అధ్యక్షా, 
ఏ కార్యక్రమంలో అయినా నెహ్రూ పేరు ఉపయోగించకపోతే కొందరికి కోసం వస్తుంది, వారి రక్తం ఆగ్రహంతో మరుగుతుంది.

గౌరవ అధ్యక్షా, 
కొన్ని సందర్భాల్లో పొరపాటున నెహ్రూజీ పేరును మేం వదిలివేస్తూ ఉంటాం. అలా వదిలివేసినా ఆ తర్వాత మేం సవరించుకుంటాం, ఎందుకంటే ఆయన మన దేశానికి తొలి ప్రధానమంత్రి కాబట్టి. కాని ఆయన తరానికి చెందిన వ్యక్తి ఎందుకు నెహ్రూ ఇంటిపేరు ఉపయోగించడానికి భయపడతారో నాకు అర్ధం కాదు. నెహ్రూ ఇంటిపేరు ఉపయోగించడం ఏమైనా సిగ్గుచేటా? అలాంటి గొప్ప వ్యక్తిత్వం మీకు, మీ కుటుంబానికి ఆమోదయోగ్యం కానప్పుడు మరి మమ్మల్నెందుకు అడుగుతారు? 

గౌరవ అధ్యక్షా,
శతాబ్దాల చరిత్ర కలిగిన ఈ దేశం శ్రమజీవి స్వేదం చిందించి నిర్మించినది. కొన్ని తరాల సాంప్రదాయాలతో నిర్మాణం అయిన దేశం. ఇది ఏ ఒక్క కుటుంబ సంపద కాదు. మేం ఖేల్ రత్న అవార్డుకు మేజర్ ధ్యాన్ చంద్ పేరు పెట్టాం. అండమాన్ లోని దీవులకు నేతాజీ సుభాష్ పేరు మీద స్వరాజ్ గా పేరు పెట్టాం. దానికి మేం గర్వపడుతున్నాం. నేతాజీ సుభాష్ చంద్ర బోస్ సేవలకు మేం గర్వపడుతున్నాం. 
మేం ఈ దీవులన్నింటికీ పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టాం. మన దేశ సైన్యాన్ని అవమానపరిచేందుకు వచ్చే అవకాశం ఏదీ వదులుకోని వారున్నారు. కొన్ని శతాబ్దాలుగా హిమాలయాల్లోని ఒక శిఖరాన్ని ఎవరెస్ట్ అనే వ్యక్తి పేరు మీద ఎవరెస్ట్ గా వ్యవహరిస్తున్నారు. కాని మన దీవుల సముదాయాలన్నింటికీ నా దేశాన్ని కాపాడడంలో తమ ప్రాణాలు పణంగా పెట్టిన పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీతల పేర్లు పెట్టాం. ఇదే మా అంకిత భావం, మేం అదే బాటలో ముందుకు నడుస్తాం. కాని ఇది మీకు అభ్యంతరకరంగా ఉంది. ఆ బాధ కూడా వ్యక్తమవుతోంది. ప్రతీ ఒక్కరూ తమ బాధను భిన్నమైన మార్గంలో వ్యక్తం చేస్తూ ఉంటారు. కాని మా భావం సానుకూలంగా ఉంది.
ఇప్పుడు ఒక రకంగా ఈ సభ రాష్ర్టాల గొప్పతనాన్ని ప్రతిబింబిస్తుంది. కొన్ని సందర్భాల్లో మేం రాష్ర్టాలను ఇబ్బందులు పెడుతున్నామని ఆరోపణలు వస్తూ ఉంటాయి.

గౌరవ అధ్యక్షా, 
నేను సుదీర్ఘ కాలం పాటు ఒక రాష్ర్టానికి ముఖ్యమంత్రిగా పని చేసిన తర్వాత ఈ స్థానానికి వచ్చాను. ఫెడరలిజం ప్రాధాన్యం ఏమిటో నాకు బాగా అర్ధం అయింది. అక్కడ జీవించిన తర్వాతే నేను ఇక్కడకు వచ్చాను. అందుకే మేం సహకార పోటీ ఫెడరలిజం గురించి నొక్కి చెబుతున్నాం. ‘‘మనం పోటీ పడదాం, మనం పురోగమిద్దాం, మనం సహకరించుకుందాం, మనం ముందుకు సాగుదాం’’ అనే దిశలోనే ముందుకు సాగుతున్నాం. మా విధానాల్లో జాతీయ పురోగతిని, ప్రాంతీయ ఆకాంక్షలను మా విధానాల్లో ఒక భాగంగా చేసుకున్నాం. 2047 నాటికి అభివృద్ది చెందిన భారత్ అనే కల సాకారం చేసుకునే దిశగా జాతీయ పురోగతి, ప్రాంతీయ ఆకాంక్షల సమ్మేళనంగా మా విధానాలు రూపొందించాం. 
కాని నేడు ప్రతిపక్షంలో కూచున్న వారు రాష్ర్టాల హక్కులను కాలరాశారు. ఆ రహస్యాలన్నీ కూడా నేను వెల్లడిస్తాను. ఒక్కసారి చరిత్ర చూడండి. రాజ్యాంగంలోని 356వ అధికరణాన్ని అధికంగా దుర్వినియోగం చేసింది ఎవరు, ఏ పార్టీ అన్నది వెంటనే తెలుస్తుంది. 90 సార్లు ఎన్నికైన ప్రభుత్వాలను కూలదోసిందెవరు? ఈ పని చేసిందెవరు, చేసిందెవరు, చేసిందెవరు? 

గౌరవ అధ్యక్షా, 
ఒక ప్రధానమంత్రి 356వ అధికరణాన్ని 50 సార్లు ఉపయోగించి అర్ధసెంచరీ చేశారు. అది శ్రీమతి ఇందిరా గాంధీ.  50 సార్లు ప్రభుత్వాలను కూలదోశారు. నేడు కేరళ నుంచి ఇక్కడ ఉన్న వారు దాన్ని ఒక సారి గుర్తు చేసుకోంది. కేరళలో ఎన్నికైన వామపక్ష ప్రభుత్వాలను పండిట్ నెహ్రూ ఇష్టపడలేదు. ఎన్నికైన తొలి ప్రజాప్రభుత్వాన్ని అతి తక్కువ కాలంలోనే కూలదోశారు. మీకేం జరిగిందో ఒక్కసారి గుర్తు చేసుకోండి.

గౌరవ అధ్యక్షా, 
డిఎంకె మిత్రపక్షాలకు కూడా నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. తమిళనాడులో ఎంజిఆర్, కరుణానిధి వంటి దిగ్గజాల ప్రభుత్వాలను బర్తరఫ్ చేసింది కూడా అదే కాంగ్రెస్ ప్రభుత్వం. ఎంజిఆర్ ఆత్మ మిమ్మల్ని చూస్తూనే ఉంటుంది. నేను గౌరవనీయుడైన నాయకుడుగా పరిగణించే శ్రీ శరద్ పవార్ కూడా ఇక్కడే ఉన్నారు. 1980 నాటికి శ్రీ శరద్ పవార్ జీ వయసు 35-40 సంవత్సరాలుంటుంది. ఒక యువ ముఖ్యమంత్రి తన తల్లికి సేవ చేయడానికి వెళ్లారు. కాని ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేశారు. ఆయన కూడా నేడు ఇక్కడ ఉన్నారు. 
ఆయన ప్రతీ ప్రాంతీయ నాయకుని వేధించారు. ఆయన శ్రీ ఎన్టీఆర్  కు ఏం చేశాడు? ఇక్కడ ఉన్న వారిలో కొందరు జాతకాల ప్రకారం తమ పేర్లు, దుస్తులు మార్చుకుని ఉండవచ్చు.  కాని వారంతా ఆయనతో ఉన్నారు. శ్రీ ఎన్టీఆర్ ఆరోగ్య  సంబంధిత సమస్యలతో అమెరికా వెళ్లారు. అదే అదనుగా చూసుకుని శ్రీ ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కూలదోసేందుకు మీరు ప్రయత్నించారు. ఇదీ కాంగ్రెస్ ప్రభుత్వాల స్థాయి.

గౌరవ అధ్యక్షా,  
ఒక్కసారి నాటి వార్తాపత్రికలు తెరిచి చదవండి. రాజ్ భవన్లు కాంగ్రెస్  కార్యాలయాలు, ప్రధాన కార్యాలయాలుగా మారాయని ప్రతీ పత్రిక రాసింది. 2005 సంవత్సరంలో జార్ఖండ్ లో ఎన్ డిఏకి అధిక సంఖ్యలో స్థానాలున్నాయి. అయినా ప్రమాణ స్వీకారం చేయాలని గవర్నర్ యుపిఏని ఆహ్వానించారు. 1982లో హర్యానాలో బిజెపి, దేవీలాల్ మధ్య ప్రీ పోల్ ఒప్పందం ఉంది. అయినా ప్రభుత్వం ఏర్పాటుకు కాంగ్రెస్  ను గవర్నర్ ఆహ్వానించారు. ఇదీ కాంగ్రెస్ గతం. వారు దేశాన్ని తప్పుదారి పట్టించిన చరిత్ర.

గౌరవ అధ్యక్షా, 
నేను ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నాను. ఒక సీరియస్ అంశం వైపు మీ  దృష్టి ఆకర్షించాలనుకుంటున్నాను. నేను చాలా కీలకమైన అంశాలు ప్రస్తావించాను. దేశ ఆర్థిక విధానాలు అర్ధం చేసుకోలేని వారు, 24 గంటలూ రాజకీయాలు తప్ప మరే మీ ఆలోచించని వారు, కేవలం అధికార క్రీడ కోసం ప్రజా జీవనాన్ని ఉపయోగించుకున్న వారు ఆర్థిక విధానాలను ‘‘విచ్ఛిన్నకర విధానాలు’’గా మార్చారు. 
అలాంటి వారందరినీ తిరిగి సొంత రాష్ర్టాలకు పోయి తప్పుడు దోవ విడనాడాలని హెచ్చరిస్తున్నాను. మన పొరుగు దేశాల పరిస్థితి ఏమిటో చూడండి. అక్కడ ఏం జరిగింది? విచక్షణారహితంగా అప్పులు చేసిన దేశాలు ఏ విధంగా మునిగిపోయాయి? నేడు మన దేశం కూడా కొన్ని తక్షణ ప్రయోజనాల కోసం చెల్లింపులు చేసినట్టయితే భవిష్యత్ తరాలు దానికి మూల్యం చెల్లించాల్సి ఉంటుంది. మనం రుణాలు తీసుకుంటే భవిష్యత్తు నాశనం అవుతుంది. ఇది జిపిఓ గేమ్ వంటిదే. ‘‘తదుపరి వచ్చే వాడు చూసుకుంటాడు’’ అనే విధానం కొన్ని రాష్ర్టాలు అనుసరిస్తున్నాయి. వారు తమను తాము నాశనం చేసుకోవడం కాదు, దేశాన్ని కూడా నాశనం చేస్తారు. 
నేడు అలాంటి దేశాలన్నీ రుణాల ఊబిలో కూరుకుపోయి అల్లాడుతున్నాయి. నేడు ప్రపంచంలో ఎవరూ వారికి రుణాలిచ్చేందుకు ముందుకు రావడంలేదు. వారు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 
రాజకీయ, సైద్ధాంతిక విభేదాలుండవచ్చు. పార్టీల మధ్య ఒకరిపై ఒకరికి ఫిర్యాదులుండవచ్చు. కాని దేశ ఆర్థిక వ్యవస్థ స్వస్థతతో ఆటలాడవద్దు. మీ ఆనందం కోసం మీ పిల్లల హక్కులను కాలరాసే పాపాలకు పాల్పడవద్దు.  మీ పిల్లల జీవితాలను శిథిలం చేసి పారిపోవద్దు. ఒక ముఖ్యమంత్రి చేసిన ప్రకటన చూడండి. ‘‘ఇప్పటికిది ఓకె. నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నాను. 2030-32 తర్వాత సమస్య ప్రారంభం అవుతుంది. తర్వాత ఎవరు వస్తే వారే ఇబ్బంది పడతారు’’ అన్నాడాయన. ఏ దేశం అయినా ఇలా ఆలోచిస్తుందా? 

గౌరవ అధ్యక్షా, 
దేశ ఆర్థిక స్వస్థత కోసం రాష్ర్టాలు కూడా క్రమశిక్షణ బాట ఎంచుకోవాలి. అప్పుడే రాష్ర్టాలు ఈ అభివృద్ధి యానం నుంచి లాభం పొందగలుగుతాయి. ఆ రాష్ర్టాల ప్రజలకు లబ్ధి చేకూర్చాలని మేం భావిస్తున్నందు వలల వారి సంక్షేమం కోసం మేం కూడా పని చేయగలుగుతాం.

గౌరవ అధ్యక్షా,  
2047 నాటికి దేశం అభివృద్ధి చెందిన భారత్ గా మారుతుంది. ఇది మా అందరి సంకల్పం. 140 కోట్ల మంది దేశవాసుల సంకల్పం. నేడు దేశం వెనక్కి తిరిగి చూడాలనుకోవడంలేదు. భవిష్యత్తు దిశగా ఒక భారీ అంగ వేయాలనుకుంటోంది. రోజు కనీసం రెండు పూటలా నోటికి భోజనం అందించేందుకు మీరు ప్రయత్నించలేదు, కాని మేం వారి బాధలు పట్టించుకున్నాం. సామాజిక న్యాయం కోరే వారి గురించి మీరు పట్టించుకోలేదు, కాని వారి సమస్యలు మేం తీర్చాం. అవకాశాల కోసం ఎదురు చూసే వారికి అవకాశాలు కల్పించేందుకు పలు చర్యలు తీసుకున్నాం. స్వతంత్ర భారత కలలు సాకారం చేసేందుకు మనం కట్టుబాటుతో నడవాలి. 

గౌరవ అధ్యక్షా,  
ఒకే ఒక వ్యక్తి ఎంత మందిపై ఆధిపత్యం చెలాయిస్తున్నది దేశం వీక్షిస్తోంది. నినాదాలు చేయడాన్ని కూడా వారు రెండింతలు తగ్గించుకోవాలి.

గౌరవ అధ్యక్షా, 
నేను దృఢ సంకల్పంతో ముందడుగు వేస్తూనే ఉంటాను. నేను దేశం కోసమే జీవిస్తాను. దేశం కోసం ఏదైనా చేయడానికే నేను వచ్చాను. అందుకే ఈ రాజకీయాలు చేసే వారెవరూ ధైర్యం చేయలేకపోతున్నారు. వారు తప్పించుకునే మార్గాల కోసం అన్వేషిస్తున్నారు. 

గౌరవ అధ్యక్షా,
ఈ సభలో స్ఫూర్తిదాయకంగా ప్రసంగించి అద్భుతమైన మార్గదర్శకం చేసినందుకు రాష్ర్టపతిని అభినందించి ధన్యవాదాలు తెలియచేస్తూ అదే సమయంలో మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ  ప్రసంగం ముగిస్తున్నాను. 
గమనిక :  ఇది ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి అనువాదం.

 

****
 


(रिलीज़ आईडी: 2016745) आगंतुक पटल : 11
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , हिन्दी , Marathi , Manipuri , Bengali , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam