ప్రధాన మంత్రి కార్యాలయం

లోక్ సభలో అవిశ్వాస తీర్మానానికి ప్రధానమంత్రి సమాధానం


“ప్రభుత్వంపై తమకున్న నమ్మకాన్ని పదేపదే చాటుకున్నందుకు భారత పౌరులందరికీ కృతజ్ఞతలు తెలిపేందుకు వచ్చాను”

“ప్రతిపక్షాలు రాజకీయాలకు పెద్దపీట వేయడంతో అనేక కీలక బిల్లులు చర్చకు రాలేదు.”
'21వ శతాబ్దపు ఈ కాలం రాబోయే వెయ్యి సంవత్సరాల పాటు దేశాన్ని ప్రభావితం చేస్తుంది. మనమందరం ఒకే దృష్టి పెట్టాలి”

“భారత యువతకు కుంభకోణాలు (స్కాం లు) లేని ప్రభుత్వాన్ని ఇచ్చాం”

“నేడు పేదల గుండెల్లో తమ కలల సాకారం పై ఒక నమ్మకం పుట్టింది”

“అవిశ్వాసంలో కూరుకుపోయిన ప్రతిపక్షాలు ప్రజల నమ్మకాన్ని చూడలేకపోతున్నాయి”

“2028లో మీరు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే భారత్ టాప్ 3లో ఉంటుంది”

“ప్రతిపక్షాలు పేర్లు మార్చడాన్ని నమ్ముతాయి, కానీ అవి తమ పని సంస్కృతిని మార్చుకోలేవు”

"స్వాతంత్ర్య సమరయోధులు , దేశ నిర్మాతలు ఎల్లప్పుడూ వారసత్వ రాజకీయాలను వ్యతిరేకించారు"

“మహిళలపై అఘాయిత్యాలు ఆమోదయోగ్యం కాదు, దోషులకు శిక్ష పడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయి”

“మణిపూర్ లో శాంతి నెలకొంటుంది, అభివృద్ధి పథంలో పయనిస్తుంది”

“మణిపూర్ ప్రజలకు, మణిపూర్ మాతృమూర్తులు, కుమార్తెలకు ఈ దేశం, ఈ సభ

Posted On: 10 AUG 2023 8:24PM by PIB Hyderabad

సభనుద్దేశించి ప్రసంగించిన ప్రధాన మంత్రి, ప్రభుత్వంపై తమకున్న నమ్మకాన్ని పదేపదే చూపిస్తున్నందుకు భారతదేశంలోని ప్రతి పౌరుడికి ఎనలేని కృతజ్ఞతలు తెలియజేయడానికి వచ్చానని అన్నారు. “ఇది ప్రభుత్వానికి బలపరీక్ష కాదని, సభలో ప్రవేశపెట్టిన వారికే అని 2018లో ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టినప్పుడు తాను వ్యాఖ్యానించడాన్ని” గుర్తు చేశారు. "2019 లో మేము ఎన్నికలకు వెళ్ళినప్పుడు, ప్రజలు వారిపై అవిశ్వాసాన్ని అత్యంత బలంతో ప్రకటించారు" అని ప్రధాన మంత్రి అన్నారు, అప్పుడు ఎన్ డి ఎ , బిజెపి రెండూ ఎక్కువ స్థానాలను గెలుచుకున్నాయని ఆయన ప్రస్తావించారు. అదేవిధంగా ఒకరకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానం ప్రభుత్వానికి అదృష్టమని ప్రధాని అన్నారు. ప్రజల ఆశీస్సులతో 2024లో ఎన్డీయే, బీజేపీ అన్ని రికార్డులను బద్దలు కొట్టి విజయం సాధిస్తాయని ధీమా వ్యక్తం చేశారు.

సమావేశాలు ప్రారంభమైనప్పటి నుంచి ప్రతిపక్షాలు తగిన శ్రద్ధతో పాల్గొని ఉంటే బాగుండేదని ప్రధాని అన్నారు. గత కొన్ని రోజులుగా ముఖ్యమైన బిల్లులు ఆమోదం పొందాయని, ఈ కీలక చట్టాల కంటే రాజకీయాలకు ప్రాధాన్యమిచ్చిన ప్రతిపక్షాలు వాటిపై చర్చించి ఉండాల్సిందని ఆయన పేర్కొన్నారు. మత్స్యకారులు, పేదలు, నిరుపేదలు, గిరిజనులతో ముడిపడిన అనేక బిల్లులు ఉన్నాయని, కానీ ప్రతిపక్షాలకు వాటిపై ఆసక్తి లేదన్నారు. ఇది ప్రజల ఆకాంక్షలకు ద్రోహం చేయడమేనన్నారు. “వారు తమకు దేశం కంటే పార్టీ గొప్పదని వారు నిరూపించారు" అని ఆయన అన్నారు. ప్రతిపక్షాలను దేశం గమనిస్తోందని, వారు ఎప్పుడూ ప్రజలను నిరాశపరుస్తూనే ఉన్నారని ప్రధాని అన్నారు.  

ఒక జాతి జీవితంలో పాత సంకెళ్ల నుంచి బయటపడి కొత్త శక్తి, దృఢ సంకల్పంతో ముందుకు సాగే సమయం ఆసన్నమైందని ప్రధాని పేర్కొన్నారు. '21వ శతాబ్దపు ఈ కాలం మన ఆకాంక్షలన్నీ నెరవేర్చే సమయం. ఈ కాలంలో ఏది రూపుదిద్దుకున్నా అది వచ్చే వేయి సంవత్సరాల పాటు దేశాన్ని ప్రభావితం చేస్తుంది. అందువల్ల, మనపై పెద్ద బాధ్యత ఉంది. దేశ అభివృద్ధిపై దృష్టి పెట్టాలి. దేశ ప్రజల కలలను సాకారం చేయడానికి పూర్తి అంకితభావం ఉండాలి" అని ఆయన స్పష్టం చేశారు. మన ప్రజలు, యువత బలాలు మనల్ని గమ్యస్థానానికి తీసుకెళ్లగలవని ఆయన అన్నారు.

2014 లోనూ, ఆ తర్వాత ట్రాక్ రికార్డ్ కారణంగా దేశం పూర్తి మెజారిటీ ప్రభుత్వాన్ని ఎన్నుకుందని, తమ కలలను సాకారం చేసుకునే సామర్థ్యం ఎక్కడుందో ప్రజలకు తెలుసని ఆయన అన్నారు. భారత యువతకు కుంభకోణాలు లేని ప్రభుత్వాన్ని ఇచ్చాం. వారికి ధైర్యాన్ని, ఆకాశంలో ఎగిరే అవకాశాన్ని కల్పించాం. మేము ప్రపంచంలో భారతదేశ స్థానాన్ని మెరుగుపరిచాము.   వాటిని కొత్త శిఖరాలకు తీసుకెళ్లాము", అని ఆయన చెప్పారు. అవిశ్వాస తీర్మానం ముసుగులో ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేందుకు ప్రతిపక్షాలు విఫలయత్నం చేశాయన్నారు. స్టార్టప్ ఎకోసిస్టమ్ వృద్ధి, రికార్డు స్థాయిలో విదేశీ పెట్టుబడులు, ఎగుమతుల్లో కొత్త శిఖరాలను ప్రస్తావిస్తూ, నేడు పేదల గుండెల్లో వారి కలలను సాకారం చేసుకునేందుకు ఒక విశ్వాసం ఏర్పడిందన్నారు. 13.5 కోట్ల మంది పేదరికం నుంచి బయట పడుతున్నారని అంటూ నీతి అయోగ్ నివేదిక గురించి ప్రస్తావించారు.

భారతదేశం కటిక పేదరికాన్ని దాదాపు నిర్మూలించిందని ఐఎంఎఫ్ వర్కింగ్ పేపర్ ను ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ఐఎంఎఫ్ ను ఉటంకిస్తూ, ఇండియన్ డిబిటి స్కీమ్, ఇతర సామాజిక సంక్షేమ పథకాలు ఒక 'లాజిస్టిక్ అద్భుతం' అని ప్రధాన మంత్రి అన్నారు. జల్ జీవన్ మిషన్ దేశంలో నాలుగు లక్షల మంది ప్రాణాలను కాపాడటానికి సహాయపడుతుందని, స్వచ్ఛ భారత్ అభియాన్ మూడు లక్షల మంది ప్రాణాలను కాపాడటానికి సహాయపడుతుందని డబ్ల్యూహెచ్ఒ పేర్కొన్న విషయాన్ని ఆయన ఉటంకించారు. స్వచ్ఛ భారత్ అభియాన్ పై యునిసెఫ్ ను ఉటంకిస్తూ, దేశంలోని పేద కుటుంబాలకు సంవత్సరానికి రూ.50,000 ఆదా చేయడానికి ఇది సహాయపడుతోందని  ప్రధాన మంత్రి అన్నారు.

ప్రతిపక్షాల వైఖరిని విమర్శించిన ప్రధాని.. వారు అపనమ్మకంలో కూరుకుపోవడంతో ప్రజల నమ్మకాన్ని చూడలేకపోతున్నారని అన్నారు. ప్రతిపక్షాల చెడు భాష, నిరంతరం తిట్టడం 'కాలా టికా' లా (చెడు శకునాన్ని తరిమికొట్టడానికి) పనిచేస్తుందని ప్రధాని అన్నారు.

ప్రతిపక్షాల విమర్శల లక్ష్య సంస్థలన్నీ నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటాయని, ఇది ప్రతిపక్షాల రహస్య వరం అని ప్రధాని అన్నారు. "వారు ఎవరికి చెడు చేయాలనుకుంటే, వారు మంచి చేస్తారు", అని ఆయన అన్నారు.

బ్యాంకింగ్ రంగంలో పరిణామాలపై ప్రతిపక్షాల వైఖరిని గుర్తు చేసిన ప్రధాని, తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి, ప్రజలను గందరగోళానికి గురిచేయడానికి వారు తమ వంతు ప్రయత్నం చేశారని అన్నారు. అయితే, ప్రభుత్వ రంగ బ్యాంకుల నికర లాభం రెండు రెట్లు పెరిగిందని ప్రధాని అన్నారు. దేశాన్ని ఎన్ పి ఎ సంక్షోభంలోకి నెట్టిన ఫోన్ బ్యాంకింగ్ కుంభకోణాన్ని ఆయన ప్రస్తావించారు.దేశం దీని నుంచి కోలుకుని ఇప్పుడు ముందుకు సాగుతోందని అన్నారు. ప్రతిపక్షాలు తీవ్రంగా విమర్శించిన హెచ్ ఏఎల్ ను కూడా మోదీ ఉదాహరణగా చెప్పారు. హెచ్ఏఎల్ కొత్త విజయాల శిఖరాలను అధిరోహిస్తోందని, గతంలో ఎన్నడూ లేనంత అత్యధిక ఆదాయాన్ని నమోదు చేసిందని ఆయన అన్నారు. ఎల్ఐసీ గురించి ప్రతిపక్షాల విమర్శలను ప్రస్తావిస్తూ, ఎల్ఐసీ రోజురోజుకూ బలపడుతోందన్నారు.

"దేశ సామర్థ్యాలు, అంకితభావంపై ప్రతిపక్షాలకు నమ్మకం లేదు" అని ప్రధాన మంత్రి కొన్ని రోజుల క్రితం తన మూడవ పదవీకాలంలో భారతదేశం ప్రపంచంలో మూడవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటూ పేర్కొన్నారు. ఒక బాధ్యతాయుతమైన ప్రతిపక్షంగా, ఈ లక్ష్యసాధనకు తమ రోడ్ మ్యాప్ పై ప్రభుత్వాన్ని ప్రశ్నించాలని లేదా కనీసం సలహాలు ఇవ్వాల్సిందని , కానీ అది జరగలేదని ప్రధాని అన్నారు,  ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి ఏమీ చేయాల్సిన అవసరం లేదని చెబుతున్న ప్రతిపక్షాల అలసత్వాన్ని ఆయన తప్పుపట్టారు. విధానాలు, ఉద్దేశాలు, దార్శనికత, ప్రపంచ ఆర్థిక శాస్త్ర పరిజ్ఞానం, భారతదేశ సామర్థ్యాలపై ప్రతిపక్షాలకు అవగాహన లేకపోవడాన్ని సూచిస్తున్నాయని ప్రధాన మంత్రి అన్నారు.

1991లో భారతదేశం పేదరికంలో కూరుకుపోయి దివాళా అంచున ఉందని ప్రధాన మంత్రి చెప్పారు. అయితే 2014 తర్వాత ప్రపంచంలోని టాప్ 5 ఆర్థిక వ్యవస్థల్లో భారత్ చోటు దక్కించుకుంది. కచ్చితమైన ప్రణాళిక, కృషితో 'సంస్కరణ, పనితీరు, పరివర్తన' అనే మంత్రం ద్వారా ఇది సాధ్యమైందని ఆయన అన్నారు. ఇది కొనసాగుతుందని, అవసరమైన సంస్కరణలు చేపడతామని తెలిపారు. “2028లో మీరు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే భారత్ టాప్ 3లో ఉంటుందని” ఆయన సభకు తెలిపారు.

స్వచ్ఛభారత్, జన్ ధన్ ఖాతా, యోగా, ఆయుర్వేదం, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలపై ప్రతిపక్షాలకు విశ్వాసం కొరవడిందని ప్రధాని అన్నారు.  

కాంగ్రెస్ హయాంలో కశ్మీర్ లో మిలిటెంట్ల చొరబాట్లను ప్రధాని ప్రస్తావించారు.  అప్పటి ప్రభుత్వం పాకిస్థాన్ తో ఏకీభవించి శాంతి చర్చలను కొనసాగించిందని అన్నారు. కశ్మీరీ ప్రజలతో కాకుండా హురియత్ తో వారికున్న అనుబంధాన్ని కూడా ప్రధాని  ప్రస్తావించారు. సర్జికల్ స్ట్రైక్ గురించి ప్రస్తావిస్తూ, ప్రతిపక్షాలు ఈ విషయంలో ప్రభుత్వాన్ని నమ్మకుండా శత్రువులు చెప్పే కథనాలను ఎలా విశ్వసించాయో ప్రధాని ప్రస్తావించారు.

దేశం గురించి చెడుగా మాట్లాడేవారిని ప్రతిపక్షాలు వెంటనే నమ్ముతాయని, ఆహార అభద్రతతో వ్యవహరించే దేశం కొన్ని అంశాల్లో భారత్ కంటే ముందుందని ఒక విదేశీ సంస్థ తప్పుడు సమాచారం ఇచ్చిన నివేదికను ప్రధాన మంత్రి ప్రస్తావించారు. ప్రతిపక్షాలు ఇలాంటి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తూ అవకాశం దొరికినప్పుడల్లా దేశాన్ని అప్రతిష్టపాలు చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని ఆయన అన్నారు. మేడిన్ ఇండియా కరోనా వ్యాక్సిన్ ను ఉదాహరణగా చూపుతూ, ప్రతిపక్షాలు దాన్ని నమ్మలేదని, బదులుగా విదేశీ తయారీ వ్యాక్సిన్ల వైపు చూసాయని అన్నారు. భారత్, దాని ప్రజల సామర్థ్యాలపై ప్రతిపక్షాలకు నమ్మకం లేదని, అదే విధంగా ప్రజల దృష్టిలో ప్రతిపక్షాలకు ఆత్మవిశ్వాస స్థాయి చాలా తక్కువగా ఉందన్నారు. 

కూటమి నిర్మాణంలో కాస్మోటిక్ మార్పులు దేశ ప్రజలను మభ్యపెట్టలేవని, నామమాత్రపు పేరు మార్పు ప్రతిపక్ష కూటమి అదృష్టాన్ని మార్చదని ప్రధాని అన్నారు.  మనుగడ కోసం ఎన్ డి ఎ  సాయం తీసుకున్నారని, కానీ అహంకారం తో కూడిన రెండు -ఐ-లు  ‘మొదటిది 26 పార్టీల అహంకారం, రెండోది ఒక కుటుంబం అహం కోసం' అని పేర్కొన్నారు. జోడించారు. వారు భారతదేశాన్ని ఐ.ఎన్.డి.ఐ.ఎ.గా కూడా విడగొట్టారని ఆయన అన్నారు. "ప్రతిపక్షాలు పేర్లను మార్చడాన్ని నమ్ముతాయి, కానీ వారు తమ పని సంస్కృతిని మార్చుకోరు " అని ఆయన అన్నారు. తమిళనాడు ప్రభుత్వానికి చెందిన ఒక మంత్రి చేసిన విభజన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ, దేశభక్తి ప్రవాహం నిరంతరం ప్రవహించే రాష్ట్రం తమిళనాడు అని ఆ రాష్ట్రంపై తనకున్న నమ్మకాన్ని ప్రధాని పునరుద్ఘాటించారు. 

ప్రతి పథకానికి, కీలక గుర్తుకు ఒకే కుటుంబానికి చెందిన వారి పేర్లను పెట్టడంపై ప్రధాని మాట్లాడుతూ,  ఐ.ఎన్.డి.ఐ.ఎ. ను 'ఘమ్ండియా' సంకీర్ణం (అహంకార సంకీర్ణం) అని పిలిచారు.  భాగస్వాముల మధ్య వైరుధ్యాలను ప్రస్తావించారు. 

స్వాతంత్ర సమరయోధులు, దేశ నిర్మాతలు  వంశపారంపర్య రాజకీయాలను ఎప్పుడూ వ్యతిరేకించారని శ్రీ మోదీ ఉద్ఘాటించారు.  వంశపారంపర్య వ్యవస్థ సామాన్య పౌరుడిని దెబ్బ తీసిందని, వారసత్వ రాజకీయాల వల్ల కీలక నేతలు నష్టపోయారని అన్నారు. కాంగ్రెసేతర ప్రభుత్వాల తర్వాతి కాలంలో ఈ తరహా రాజకీయాలకు బలైపోయిన ఎందరో మహానుభావుల చిత్రపటాలకు పార్లమెంటులో స్థానం లభించిందన్నారు. స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, ప్రధాన మంత్రి సంగ్రహాలయ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. ఈ మ్యూజియం పార్టీ రాజకీయాలకు అతీతంగా ప్రధానమంత్రులందరికీ అంకితం చేయబడిందని చెప్పారు. 

30 ఏళ్ల తర్వాత భారత ప్రజలు రెండుసార్లు పూర్తి మెజారిటీ ప్రభుత్వాన్ని ఎన్నుకున్నప్పటికీ ప్రధాని కుర్చీలో కూర్చున్న 'గరీబ్ కా బేటా' ప్రతిపక్షాలను కలవరపెడుతోందని ప్రధాని పునరుద్ఘాటించారు. వ్యాక్సిన్ల రవాణా, విదేశాల్లో చిక్కుకున్న వారిని స్వదేశానికి తీసుకురావడానికి గతంలో ప్రతిపక్షాలు దుర్వినియోగం చేసిన విమానాలు, నౌకాదళ నౌకలను ఇప్పుడు సరిదిద్దినట్టు తెలిపారు. ఉచితాల రాజకీయాలకు వ్యతిరేకంగా ప్రధాని హెచ్చరించారు. పొరుగు దేశాల పరిస్థితిని అటువంటి రాజకీయాలు తీసుకువచ్చే వినాశనానికి ఉదాహరణగా పేర్కొన్నారు. నిర్లక్ష్యపు హామీలతో ఎన్నికల్లో గెలిచే ధోరణి కనిపిస్తోందని, అభివృద్ధి పథకాలను పక్కన పెట్టడంతో ప్రజలు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

మణిపూర్ పరిస్థితిపై చర్చించడానికి ప్రతిపక్షాలు ఎప్పుడూ ఆసక్తి చూపలేదని ప్రధాన మంత్రి అన్నారు. రాజకీయాలకు తావులేకుండా ఓపికతో హోంమంత్రి సమస్యలను సవివరంగా వివరించారని చెప్పారు. “హోం మంత్రి వివరణ దేశం , దేశ ఆందోళనను తెలియజేసే ప్రయత్నం, ఇది మణిపూర్ కు సభ విశ్వాసాన్ని తెలియజేసే ప్రయత్నం. చర్చించి, మార్గాలను కనుగొనడానికి నిజాయితీగా చేసిన ప్రయత్నమిది” అన్నారు. 

మణిపూర్ సమస్య గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, మణిపూర్ లో జరిగిన హింస విచారం కలిగిస్తోందన్నారు. మహిళలపై అఘాయిత్యాలు ఆమోదయోగ్యం కాదని, దోషులకు శిక్ష పడేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తాయన్నారు. రాబోయే కాలంలో మణిపూర్ లో శాంతి నెలకొంటుందని మేము చేస్తున్న ప్రయత్నాల ఆధారంగా నేను భారత ప్రజలకు హామీ ఇస్తున్నాను" అని ప్రధాన మంత్రి పేర్కొన్నారు. మణిపూర్ ప్రజలకు, మణిపూర్ తల్లులు, కుమార్తెలకు  దేశం అండగా ఉంటుందని, సభ కూడా వారికి అండగా ఉంటుందని ఆయన భరోసా ఇచ్చారు. మణిపూర్ ను తిరిగి అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తుందని ఆయన హామీ ఇచ్చారు. 

సభలో తల్లి భారతి పట్ల అభ్యంతరకరమైన భాషను ఉపయోగించడంపై ప్రధాని తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.విభజనకు కారకులైన వారు వీరేనని, వందేమాతరాన్ని కూడా కించపరిచారని అన్నారు. ప్రతిపక్షాల వైఫల్యానికి ఉదాహరణగా కచ్చతీవు అంశాన్ని కూడా మోదీ ప్రస్తావించారు.

ఈశాన్య రాష్ట్రాలకు సంబంధించి జరిగిన మూడు సంఘటనలను ప్రధాని ప్రస్తావించారు. మొదటిది, 1966 మార్చి 5 న, మిజోరంలో ప్రజలపై దాడి చేయడానికి వైమానిక దళాన్ని ఉపయోగించారు. రెండవది, 1962లో చైనా దురాక్రమణ సమయంలో ఈశాన్య ప్రాంత ప్రజలు తమను తాము రక్షించుకోలేని స్థితిలో ఉన్నప్పుడు అప్పటి ప్రధాని నెహ్రూ రేడియో ప్రసారం. ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేశారంటూ రామ్ మనోహర్ లోహియా చేసిన ఆరోపణను ఆయన ఉదహరించారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఈశాన్యంలోని వివిధ జిల్లా కేంద్రాల్లో మంత్రులు 400 రాత్రి బస చేశారని, తాము స్వయంగా 50 సార్లు సందర్శించామని ప్రధాని తెలిపారు. 'ఈశాన్య రాష్ట్రాలతో నాకు భావోద్వేగ అనుబంధం ఉంది. ప్రధాని కాకముందు కూడా నేను ఈ ప్రాంతం అంతటా పర్యటించాను" అని శ్రీ మోదీ అన్నారు.

మణిపూర్ లో నెలకొన్న పరిస్థితులను ఈ మధ్యనే తలెత్తిన సంఘర్షణగా చిత్రీకరిస్తున్నామని, అయితే మణిపూర్ లో అన్ని సమస్యలకు మూలకారణం కాంగ్రెస్, దాని రాజకీయాలేనని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. మణిపూర్ గొప్ప భారతీయ సంస్కృతి, వారసత్వంతో నిండి ఉంది. మణిపూర్ అసంఖ్యాక త్యాగాల భూమి అని ఆయన అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి సంస్థ తీవ్రవాద సంస్థల పిలుపు మేరకు పనిచేసిందని, ప్రభుత్వ కార్యాలయాల్లో మహాత్మాగాంధీ చిత్రపటాన్ని ఉంచడం నిషిద్ధమని గుర్తు చేశారు. మొయిరాంగ్ లోని ఆజాద్ హింద్ ఫౌజ్ మ్యూజియంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి బాంబు దాడి జరిగిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. మణిపూర్ లోని పాఠశాలల్లో జాతీయ గీతం ఆలపించడాన్ని నిషేధించారని, లైబ్రరీల నుంచి పుస్తకాలను తగలబెట్టాలని ప్రచారం ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. కాంగ్రెస్ పాలనలో ఈ ప్రాంతంలో తీవ్రవాద కార్యకలాపాలకు అనేక ఉదాహరణలు ఇచ్చిన ప్రధాని, సాయంత్రం 4 గంటలకు ఆలయాల తలుపులు మూసివేయడం, ఇంఫాల్ లోని ఇస్కాన్ ఆలయంపై బాంబు దాడి, తీవ్రవాదులకు ప్రభుత్వ అధికారులు చెల్లించిన రక్షణ డబ్బులను ప్రస్తావించారు.

రానున్న రోజుల్లో ఈశాన్య రాష్ట్రాలు అభివృద్ధి కేంద్రంగా మారబోతున్నాయని ప్రధాని అన్నారు. ప్రపంచ వ్యవస్థలో కదలికలు ఆగ్నేయాసియా, ఆసియాన్ దేశాల్లో మార్పు తెస్తాయని, దాని ప్రభావం ఈశాన్య రాష్ట్రాలపై ఎలా ఉంటుందో తనకు తెలుసని ఆయన అన్నారు. అందుకే తమ ప్రభుత్వం ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇచ్చిందని ప్రధాని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనలో పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తూ, ఆధునిక రహదారులు, రైల్వేలు, విమానాశ్రయాలు ఈశాన్య రాష్ట్రాలకు ఎలా గుర్తింపుగా మారుతున్నాయో వివరించారు. “అగర్తలా తొలిసారిగా రైలు కనెక్టివిటీతో అనుసంధానమైంది, గూడ్స్ రైలు మొదటిసారి మణిపూర్ కు చేరుకుంది, ఈ ప్రాంతంలో తొలిసారి వందే భారత్ వంటి ఆధునిక రైలు నడిచింది, అరుణాచల్ ప్రదేశ్ లో మొదటి గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయాన్ని నిర్మించారు, సిక్కిం విమాన ప్రయాణానికి అనుసంధానించబడింది, ఈశాన్యంలో తొలిసారి ఎయిమ్స్ ను ప్రారంభించారు, మణిపూర్ లో నేషనల్ స్పోర్ట్స్ యూనివర్శిటీని, మిజోరంలో ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మాస్ కమ్యూనికేషన్ ను ప్రారంభించారు. మంత్రిమండలిలో భాగస్వామ్యం పెరిగింది, మొదటిసారిగా ఒక మహిళ రాజ్యసభలో నాగాలాండ్ కు ప్రాతినిధ్యం వహించింది. తొలిసారిగా ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఎంతోమందికి పద్మ అవార్డులు వచ్చాయి. రిపబ్లిక్ డే రోజున లచిత్ బుర్ఫుకాన్ లాంటి హీరోను సెలబ్రేట్ చేశాం. రాణి గైడిన్లియూ పేరుతో మ్యూజియంను ఏర్పాటు చేశాం” అని తెలిపారు.

"మాకు సబ్ కా సాత్ సబ్ కా విశ్వాస్ అనేది ఒక నినాదం కాదు, విశ్వాసం, నిబద్ధతకు సంబంధించిన అంశం" అని ప్రధాన మంత్రి అన్నారు, "నేను శరీరంలోని ప్రతి కణాన్ని , ప్రతి క్షణాన్ని దేశ ప్రజల సేవకు అంకితం చేస్తానని హామీ ఇస్తున్నాను" అన్నారు. 

పార్లమెంటు ఒక పార్టీకి వేదిక కాదని ప్రధాని ఉద్ఘాటించారు. “పార్లమెంట్ దేశ అత్యున్నత సంస్థ. కాబట్టి, పార్లమెంటు సభ్యులు దీనిపై కొంత నిబద్ధత కలిగి ఉండటం తప్పనిసరి. ఇక్కడ చాలా వనరులు కేటాయిస్తున్నారు. ఇక్కడి ప్రతి సెకనును దేశం కోసం వినియోగించాలి. నిబద్ధత లేకపోతే రాజకీయాలు చేయవచ్చు కానీ దేశాన్ని నడప లేరు “ అని ఆయన అన్నారు.

గత తొమ్మిది సంవత్సరాల్లో సామాన్య ప్రజల విశ్వాసం కొత్త పుంతలు తొక్కుతోందని, ప్రతి ఒక్క భారతీయుడి లోనూ ఆత్మవిశ్వాసం నింపుతుందని ప్రధాన మంత్రి అన్నారు. 'నేటి భారత దేశం ఒత్తిడికి తలొగ్గదు. నేటి భారతదేశం వంగదు, అలసిపోదు, ఆగదు" అని శ్రీ మోదీ అన్నారు. విశ్వాసం, సంకల్పంతో ముందుకు సాగాలని, సామాన్య ప్రజల నమ్మకమే భారత్ ను విశ్వసించేలా ప్రపంచాన్ని ప్రేరేపిస్తోందని అన్నారు. భారత్ పై ప్రపంచానికి పెరుగుతున్న నమ్మకమే సామాన్య పౌరుల్లో విశ్వాసం పెరగడానికి కారణమని ఆయన పేర్కొన్నారు.

గత కొన్నేళ్లుగా వికసిత్ భారత్ కు బలమైన పునాదులు వేయడంలో ప్రభుత్వం విజయం సాధించిందని ప్రధాన మంత్రి అన్నారు. ఈ ఫౌండేషన్ 2047 నాటికి భారత్ ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. దేశం అధ్వాన్న పరిస్థితుల నుంచి బయటపడిందని, చిల్లర రాజకీయాల కోసం మణిపూర్ భూమిని దుర్వినియోగం చేయవద్దని రాజకీయ పార్టీలను కోరారు. "మనం నొప్పి , బాధను సహానుభూతి చెందాలి. కోలుకోవడానికి మన వంతు కృషి చేయాలి. ఇదే ముందున్న మార్గం'' అని ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు. 

 

***



(Release ID: 2016334) Visitor Counter : 28