సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

విదేశీ ఆన్‌లైన్ పందేలు, జూదపు వేదికలను ప్రచారం చేయవద్దని సామాజిక మాధ్యమ ప్రభావశీలురను హెచ్చరించిన ఐ&బీ మంత్రిత్వ శాఖ


ఆన్‌లైన్ జూదం వల్ల డబ్బు నష్టంతో పాటు సామాజిక-ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి; సామాజిక మాధ్యమ మధ్యవర్తులు తమ ఫాలోయర్లను తప్పుదోవ పట్టించవద్దని మంత్రిత్వ శాఖ సూచన

మార్గదర్శకాలు పాటించడంలో విఫలమైతే సామాజిక మాధ్యమ సందేశాలు, ఖాతాలను రద్దు చేయవచ్చు

Posted On: 21 MAR 2024 5:30PM by PIB Hyderabad

నిషేధిత ప్రకటనలు, విదేశీ ఆన్‌లైన్ పందేలు, జూదం వేదికల కోసం ప్రచారం చేయడం మానుకోవాలని దేశంలోని అందరు ప్రముఖులు, సామాజిక మాధ్యమ ప్రభావశీలురకు కేంద్ర సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ ఈ రోజు సూచించింది. నిషేధిత, ఆకర్షించే ప్రకటనలు సామాజిక మాధ్యమ వినియోగదార్లను, ముఖ్యంగా యువతను ఆన్‌లైన్ పందేలు, జూదం వైపు పురిగొల్పుతాయని, తద్వారా గణనీయమైన డబ్బు నష్టం & సామాజిక-ఆర్థిక దుష్ప్రభావాలను కలిగి ఉంటుందని మంత్రిత్వ శాఖ తెలిపింది.

అలాంటి ప్రచారాల కోసం భారతీయ ప్రజలను లక్ష్యంగా చేసుకోవద్దని మంత్రిత్వ శాఖ సలహా ఇచ్చింది. అందరు ప్రముఖులు, సామాజిక మాధ్యమ ప్రభావశీలురు అటువంటి సమాచారాన్ని ప్రచారం చేయకుండా ఉండాలని, తమ ఫాలోయర్ల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సున్నితంగా వ్యవహరించాలని కూడా సూచించింది.

ఈ మార్గదర్శకాలను పాటించకపోతే సామాజిక మాధ్యమ సందేశాలు, ఖాతాలను తీసివేయడం లేదా నిలిపివేయడం చేస్తామని మంత్రిత్వ శాఖ చెప్పింది. అలాగే, వినియోగదార్ల రక్షణ చట్టం 2019 ప్రకారం విచారణ చేపట్టడంతో పాటు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది.

ఐటీ చట్టం 2000లోని సెక్షన్ 79 ప్రకారం, థర్డ్ పార్టీ సమాచారం లేదా ప్రసారానికి సంబంధించిన బాధ్యతల నుంచి మధ్యవర్తులకు మినహాయింపు ఉంటుంది. అయితే, వాస్తవం తెలిసిన తర్వాత లేదా ప్రభుత్వం & ప్రభుత్వ సంస్థల ద్వారా సూచనలు అందిన తర్వాత, సెక్షన్ 79లోని సబ్ సెక్షన్ (3)(బి) ప్రకారం ఆ మినహాయింపు వర్తించదని తన మార్గదర్శకాల ద్వారా మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.

జూదాన్ని ప్రోత్సహించేలా ప్రముఖులు & ప్రభావశీలురు పందేలు/జూదపు వేదికలను ప్రచారం చేయడం గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ 06.03.2024న విడుదల చేసిన 'కేంద్ర వినియోగదారు రక్షణ ప్రాధికార సంస్థ' (సీసీపీఏ) సలహాను మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఎలాంటి ప్రత్యక్ష లేదా పరోక్ష ప్రకటన అయినా కఠినమైన చర్యల పరిధిలోకి వస్తుందని హెచ్చరించింది.

ఐ&బీ మంత్రిత్వ శాఖ సలహాను ఈ దిగువ లింక్‌ ద్వారా చూడవచ్చు:

https://mib.gov.in/sites/default/files/Advisory%20dated%2021.03.2021%20%281%29.pdf

***



(Release ID: 2016307) Visitor Counter : 49