రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

భారతదేశంలో శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తిని వినియోగిస్తుండడంపై అవగాహన పెంచేందుకు ఎన్‌సీసీ, ఎన్‌పీసీఐఎల్‌ ఒప్పందం

Posted On: 21 MAR 2024 4:49PM by PIB Hyderabad

భారతదేశంలో శాంతియుత ప్రయోజనాల కోసం అణుశక్తిని వినియోగిస్తుండడంపై ప్రజల్లో అవగాహన పెంచడానికి, శాస్త్రీయమైన & ప్రామాణికమైన సమాచారాన్ని వ్యాప్తి చేయడానికి దేశవ్యాప్తంగా వివిధ అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం కోసం 'నేషనల్ క్యాడెట్ కార్ప్స్' (ఎన్‌సీసీ), 'న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (ఎన్‌పీసీఐఎల్‌) ఈ రోజు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఎన్‌సీసీ డీజీ లెఫ్టినెంట్ జనరల్ గుర్బీర్‌పాల్ సింగ్, ఎన్‌పీసీఐఎల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీ బీవీఎస్ శేఖర్ ఒప్పందంపై సంతకాలు చేశారు.

ఎన్‌సీసీ క్యాడెట్‌లకు అవగాహన కల్పించడం కోసం దేశవ్యాప్తంగా నిర్వహించే శిబిరాలు & వివిధ కార్యకలాపాల సమయంలో ఎన్‌పీసీఐఎల్‌ రిసోర్స్ పర్సన్‌లను అందిస్తుంది. ఒప్పందంలో భాగంగా, దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌పీసీఐఎల్‌ కేంద్రాలను సందర్శించడానికి క్యాడెట్‌లకు ప్రత్యేక అవకాశం కల్పిస్తుంది. తద్వారా, అణుశక్తి శాంతియుత వినియోగం, దాని సాంకేతిక అంశాలపై క్యాడెట్‌లకు ప్రత్యక్ష అనుభవం వస్తుంది.

క్యాడెట్‌ల అవగాహన పరిధిని విస్తృతం చేయడానికి చేపట్టిన చొరవల్లో ఈ కార్యక్రమం ఒకటిగా ఎన్‌సీసీ డీజీ ఎన్‌సీసీ అభివర్ణించారు. యువతలో మరింత అవగాహన కల్పించడానికి, వారిని బాధ్యతాయుతంగా తీర్చిదిద్దడానికి ఇది ఉపయోగపడుతుందన్నారు. 1.5 మిలియన్ల ఎన్‌సీసీ క్యాడెట్లు ప్రపంచవ్యాప్తంగా యువత ఆలోచనలను ప్రభావితం చేయగలరని స్పష్టం చేశారు. అణుశక్తిని శాంతియుతంగా వినియోగించుకోవడంపై అవగాహన కల్పించే కార్యక్రమాలను విజయవంతం చేయడంలో క్యాడెట్లు కీలకపాత్ర పోషిస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు. ఈ చొరవకు మద్దతు అందించినందుకు ఎన్‌పీసీఐఎల్‌కు లెఫ్టినెంట్ జనరల్‌ గుర్బీర్‌పాల్ సింగ్ కృతజ్ఞతలు తెలిపారు.

***



(Release ID: 2016059) Visitor Counter : 109