విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇంధన సామర్థ్యం.. ఇంధన పొదుపు చర్యల రంగంలో సహకారంపై భారత్-భూటాన్ అవగాహన ఒప్పందానికి మంత్రిమండలి ఆమోదం

Posted On: 13 MAR 2024 3:32PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రిమండలి ఇవాళ సమావేశమైంది. ఈ సందర్భంగా ఇంధన సామర్థ్యం.. ఇంధన పొదుపు చర్యల రంగంలో సహకారంపై భారత్-భూటాన్ మధ్య అవగాహన ఒప్పందానికి ఆమోదం తెలిపింది.

   భారత విద్యుత్ మంత్రిత్వశాఖ పరిధిలోని ‘బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ’ (బిఇఇ), భూటాన్ రాయల్ ప్రభుత్వ ఇంధన-సహజ వనరుల మంత్రిత్వశాఖ పరిధిలోని ఇంధన విభాగం మధ్య ఈ ఒప్పందంపై కుదిరింది. ఈ ఒప్పందంలో భాగంగా బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ రూపొందించిన ‘స్టార్ లేబులింగ్ ప్రోగ్రామ్‌’ను భారత్ ప్రోత్సహిస్తుంది. ఈ మేరకు గృహ రంగంలో ఇంధన సామర్థ్యం పెంపు దిశగా భూటాన్‌కు తోడ్పాటు అందిస్తుంది. భారతదేశానికిగల అపార అనుభవం ఆధారంగా భూటాన్ వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా భవన నిర్మాణ నియమావళి రూపకల్పన సులువవుతుంది. అలాగే ఇంధన వినియోగ తనిఖీ దారులకు శిక్షణను సంస్థాగతీకరించడం ద్వారా భూటాన్‌లో నిపుణుల సంఖ్య పెంచడం కూడా ఒప్పందం లక్ష్యాల్లో ఒకటిగా ఉంది.

   అలాగే స్టార్ రేటెడ్ ఉపకరణాలతో ఇంధన పొదుపుపై వినియోగదారులలో సదరు ఉత్పత్తుల వినియోగం విస్తరణకు రిటైలర్ల శిక్షణ సహాయపడుతుంది. అంతేకాకుండా ప్రమాణాలు-లేబులింగ్ విధానం రూపొందించడం సహా దాని అమలులోనూ భూటాన్‌కు భారత మద్దతివ్వాలన్నది ఒప్పంద నిర్దేశాల్లో ఒకటి.

   సాధారణంగా గృహ-వాణిజ్య సంస్థలలో విద్యుత్తును ఎక్కువగా వాడుకునే ఉపకరణాలే అధిక వినియోగానికి దారితీసే ప్రధాన ఉత్పత్తులుగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఇలాంటి వినియోగ వస్తువుల వాడకంలో వృద్ధి ఇనుమడిస్తున్న దృష్ట్యా ఉంచుకుని, విద్యుత్ అవసరాలు ఏటికేడు పెరుగుతున్నాయి. ఈ పరిస్థితుల నడుమ వినియోగదారులు ఇంధన పొదుపులో అధిక సామర్థ్యంగల ఉపకరణాల వైపు మొగ్గుచూపితే పెరుగుతున్న డిమాండ్‌ను హేతుబద్ధీకరించవచ్చు. కాగా, భారతదేశంలో ‘స్టార్-లేబులింగ్ ప్రోగ్రామ్‌’ను అమలు చేస్తున్న ‘బిఇఇ’ ప్రస్తుతం దైనందిన జీవితంలో వాడే 37 ఉపకరణాలకు దీన్ని వర్తింపజేస్తోంది.

   భారత్-భూటాన్ మధ్య కుదిరిన ఈ ఒప్పందాన్ని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (ఎంఇఎ), పరిశ్రమలు-అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (డిపిఐఐటి)తో సంప్రదింపుల ద్వారా కేంద్ర విద్యుత్ మంత్రిత్వ శాఖ రూపొందించింది. రెండు దేశాల నడుమ ఇంధన సామర్థ్యం.. ఇంధన పొదుపు సంబంధిత సమాచారం, గణాంకాలు, సాంకేతిక నిపుణుల ఆదానప్రదానానికి ఇది వీలు కల్పిస్తుంది. మార్కెట్‌లో ఇంధన పొదుపు ఉత్పత్తుల లభ్యతపై ఇది భూటాన్‌కు భరోసానిస్తుంది. అలాగే ఇంధన సామర్థ్యం, ఇంధన పొదుపు రంగంలో పరిశోధన-సాంకేతిక విస్తరణలో సహకారాన్ని విశ్లేషిస్తుంది.

***


(Release ID: 2014349) Visitor Counter : 123