మంత్రిమండలి
azadi ka amrit mahotsav

గోవా శాసనసభలో షెడ్యూల్డ్ తెగలకు ప్రాతినిధ్యం కల్పించే బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం


గోవాలోని షెడ్యూల్డ్ తెగల రాజ్యాంగ హక్కులకు రక్షణ కల్పించనున్న బిల్లు

Posted On: 07 MAR 2024 8:32PM by PIB Hyderabad

గోవా శాసనసభలోకి షెడ్యూల్‌ తెగల ప్రజాప్రతినిధులు కాలు మోపేందుకు మార్గం సుగమం అవుతోంది. 'గోవా రాష్ట్ర శాసనసభ నియోజకవర్గాల్లో షెడ్యూల్డ్ తెగల ప్రాతినిధ్య పునర్వ్యవస్థీకరణ బిల్లు 2024'ను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం చట్టం & న్యాయ మంత్రిత్వ శాఖ చేసిన ప్రతిపాదనకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.

గోవాలోని షెడ్యూల్డ్ తెగల రాజ్యాంగ హక్కులను పరిరక్షించేందుకు ఈ బిల్లును తీసుకొచ్చారు. పార్లమెంటరీ & అసెంబ్లీ నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణ ఆదేశం 2008లో సవరణలు చేయడానికి, గోవాలని షెడ్యూల్డ్ తెగల ప్రయోజనాల కోసం ఆ రాష్ట్ర శాసనసభలో ప్రాతినిధ్య స్థానాలను పునర్వ్యవస్థీకరించడానికి ఎన్నికల కమిషన్‌కు అధికారం కల్పించే చట్టాన్ని రూపొందించడానికి ఈ బిల్లుకు రూపమిచ్చారు.

ప్రతిపాదిత బిల్లు ముఖ్య లక్షణాలు:

(i) 2001 జనాభా లెక్కల తర్వాత షెడ్యూల్డ్ తెగలుగా గుర్తించినవాళ్ల జనాభా గణాంకాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత, గోవాలో షెడ్యూల్డ్ తెగల జనాభాను నిర్ణయించడానికి ఈ చట్టం జనాభా కమిషనర్‌కు అధికారం కల్పిస్తుంది. జనాభా కమిషనర్, గెజిట్‌లో నిర్ధారించిన వివిధ జనాభా గణాంకాలను నోటిఫై చేస్తారు. ఆ తర్వాత, ఆ గణాంకాలను తుది జనాభా లెక్కగా పరిగణనలోకి తీసుకుంటారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 332 ప్రకారం షెడ్యూల్డ్ తెగలకు జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యాన్ని అందించడానికి గతంలో ప్రచురించిన అన్ని గణాంకాలను రద్దు చేస్తారు.

(ii) గోవా శాసనసభలో షెడ్యూల్డ్ తెగలకు సరైన ప్రాతినిధ్యం కల్పించేందుకు పార్లమెంటరీ & శాసనసభ నియోజకవర్గాల పునర్విభజన ఉత్తర్వు 2008లో అవసరమైన సవరణలు చేయడానికి ఎన్నికల కమిషన్‌కు ఈ చట్టం అధికారం ఇస్తుంది.

(iii) షెడ్యూల్డ్ తెగల సవరణ జనాభా లెక్కలను ఎన్నికల సంఘం పరిగణనలోకి తీసుకుంటుంది. ఆ తర్వాత, రాజ్యాంగంలోని 170, 332 ఆర్టికళ్లు, పునర్విభజన చట్టం 2002లోని సెక్షన్ 8 నిబంధనలకు అనుగుణంగా శాసనసభ నియోజకవర్గాలను తిరిగి సర్దుబాటు చేస్తుంది.

(iv) శాసనసభ నియోజకవర్గాల పునరుద్ధరణ కోసం, భారత ఎన్నికల సంఘం తన సొంత విధానాన్ని నిర్ణయిస్తుంది. దీనికి సివిల్ కోర్టుకు సమానమైన అధికారాలు ఉంటాయి.

(v) పునర్విభజన ఆదేశంలో చేసిన సవరణలు, తేదీలను గెజిట్‌లో ప్రచురించడానికి భారత ఎన్నికల కమిషన్‌కు అధికారం సంక్రమిస్తుంది. మళ్లీ రద్దు చేసే వరకు, ప్రస్తుత శాసనసభ రాజ్యాంగంపై సవరణ పునర్విభజన ఆదేశం ఎలాంటి ప్రభావం చూపదు.

(vi) ప్రతిపాదిత బిల్లు డీలిమిటేషన్ ఆర్డర్‌లోని లోపాలను సరిదిద్దడానికి ఎన్నికల కమిషన్‌కు అధికారం కల్పిస్తుంది. 

***


(Release ID: 2012588) Visitor Counter : 176