సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ

చలనచిత్రాలకు ధృవీకరణ పత్రాలు జారీ చేసేందుకు చండీగఢ్‌లో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్


సీబీఎఫ్‌సీ కార్యాలయం ఏర్పాటు వల్ల సరళంగా మారనున్న ప్రాంతీయ చిత్రాల ధృవీకరణ ప్రక్రియ, పంజాబీ చలనచిత్ర పరిశ్రమకు ప్రయోజనం

Posted On: 25 FEB 2024 9:05PM by PIB Hyderabad

'సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్' (సీబీఎఫ్‌సీ) ప్రాంతీయ కార్యాలయాన్ని చండీగఢ్‌లో ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్ర సమాచార & ప్రసార శాఖ మంత్రి శ్రీ అనురాగ్ సింగ్ ఠాకూర్ ప్రకటించారు. దీనివల్ల, ఆ ప్రాంతంలోని సినీ నిర్మాతల పని సులభంగా మారుతుందన్నారు.

చండీగఢ్‌లో, 'చిత్ర భారతి ఫిల్మ్ ఫెస్టివల్' ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి, ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటు విషయాన్ని ప్రకటించారు. ఇకపై, ఆ ప్రాంతంలోని చిత్ర నిర్మాతలు తమ సినిమాలకు సీబీఎఫ్‌సీ ధృవపత్రం కోసం దిల్లీ లేదా ముంబైకి వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు. దీనివల్ల పంజాబీ చిత్ర పరిశ్రమను మరింత బలోపేతం అవుతుందని చెప్పారు.

"ఈ రోజు, భారతదేశం కథల కేంద్రంగా మారుతోంది. అంతర్జాతీయ సినిమాల చిత్రీకరణ & పోస్ట్-ప్రొడక్షన్ రెండింటి కోసం భారత్‌ను ఎంచుకుంటున్నారు. భారతదేశ చిత్రాలకు ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభిస్తున్నాయి" అని శ్రీ ఠాకూర్‌ చెప్పారు.

ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా నిర్మిస్తున్న 2,500 సినిమాల్లో సగానికి పైగా భారతదేశ గడ్డపైనే రూపొందుతున్నాయన్న కేంద్ర మంత్రి, “వాణిజ్య చిత్రాల నుంచి డాక్యుమెంటరీల వరకు, లఘు చిత్రాల నుంచి సీరియళ్ల వరకు, స్థానిక కథలను భారతీయ సినిమా విశ్వవ్యాప్తం చేస్తోంది. అందువల్ల ఏ భాషలో సినిమా తీస్తున్నారన్నది ముఖ్యం కాదు. కథ ఆసక్తికరంగా ఉంటే చాలు, దానిని తెరకెక్కించే ఔత్సాహికులు ఉంటారు" అన్నారు.

"పంజాబ్ ప్రాంతంలో రూపొందిన చిత్రాలు గొప్పగా ఉంటాయని నా నమ్మకం. అందువల్ల, సినిమా ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా చండీగఢ్‌లో సీబీఎఫ్‌సీ ప్రాంతీయ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది" అని శ్రీ ఠాకూర్ వివరించారు.

దివ్యాంగ సినిమా అభిమానుల కోసం సినిమా హాళ్లను మరింత అనుకూలంగా మార్చేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల గురించి కూడా మంత్రి వివరించారు. "వినికిడి, దృష్టి లోపం ఉన్నవాళ్లు అందరిలాగే సినిమాను ఆస్వాదించే అవకాశం కల్పించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త మార్గదర్శకాన్ని రూపొందించే పనిలో ఉంది. సంబంధిత వాటాదార్ల నుంచి సలహాలు, అభిప్రాయాలను కూడా ఆహ్వానించింది. ఈ దేశంలోని పౌరులందరికీ సమాన అవకాశాలు కల్పించాలనేది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దృక్పథం. ప్రత్యేక అవసరాలు గల వ్యక్తులను వికలాంగులు అని కాకుండా దివ్యాంగులు అని పిలిచిన మొదటి వ్యక్తి ఆయనే" అని చెప్పారు.

పైరసీ ముప్పుపైనా శ్రీ ఠాకూర్ మాట్లాడారు. “సినిమా పైరసీని నిరోధించడానికి ఇటీవల సినిమాటోగ్రాఫ్ చట్టంలో చాలా మార్పులు చేశాం. ఇప్పుడు, పైరసీని అరికట్టడానికి అన్ని సీబీఎఫ్‌సీ కేంద్రాల్లో ప్రత్యేక నోడల్ అధికారులను నియమిస్తున్నాం. దేశవ్యాప్తంగా 12 మంది నోడల్ అధికారులు పైరసీకి వ్యతిరేకంగా ఫిర్యాదులు స్వీకరిస్తారు, డిజిటల్ వేదికల్లోని పైరసీ చిత్రాలను తొలగించడానికి ఆదేశాలు జారీ చేస్తారు. ఫిర్యాదు అందిన 48 గంటల్లో చర్యలు తీసుకుంటున్నారు. పైరసీ అనేది సినిమా పరిశ్రమకే కాదు యావత్ ప్రపంచానికే పెద్ద ముప్పు’’ అని చెప్పారు.

పైరసీ కారణంగా చిత్ర పరిశ్రమకు ఏటా రూ.20,000 కోట్ల నష్టం వాటిల్లుతున్నట్లు సమాచారం.

'చిత్ర భారతి ఫిల్మ్ ఫెస్టివల్' నిర్వాహకులను కేంద్ర మంత్రి అభినందించారు. "యువ ప్రతిభావంతులను మద్దతు ఇవ్వడానికి, మన దేశ గొప్ప సంస్కృతి & వారసత్వాన్ని ప్రతిబింబించే చక్కటి చిత్రాలను రూపొందించేలా వారిని ప్రోత్సహించడానికి చేస్తున్న కృషి నిజంగా ప్రశంసనీయం. సమీప భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రముఖ చలనచిత్ర వేడుకల్లో ఈ చిత్రాలను చూడాలని నేను ఎదురుచూస్తున్నా" అని శ్రీ ఠాకూర్‌ ఆకాంక్షించారు.

****



(Release ID: 2009015) Visitor Counter : 69


Read this release in: English , Urdu , Marathi , Hindi