రక్షణ మంత్రిత్వ శాఖ
ఆత్మనిర్భర్ భారత్: సాయుధ బలగాలు & భారతీయ తీర రక్షణ దళం శక్తిసామర్థ్యాలు పెంచేందుకు రూ.84,560 కోట్ల విలువైన ఆయుధ సంపత్తి కొనుగోలు ప్రతిపాదనలను ఆమోదించిన డాక్
కొత్త తరం ట్యాంక్ నిర్వీర్య మందుపాతరలు, గగనతల రక్షణ నిఘా రాడార్, భారీ స్థాయి టార్పెడోలు, మధ్య స్థాయి సముద్ర నిఘా & బహుళ విధుల సముద్ర విమానం, గాలిలో ఇంధనం నింపే విమానాలు & సాఫ్ట్‌వేర్ ఆధారిత రేడియోల కొనుగోళ్లకు ఆమోదం
అంకుర సంస్థలు & ఎంఎస్‌ఎంఈల నుంచి ఆధునిక సాంకేతికతల సేకరణను ప్రోత్సహించేలా 'డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ 2020'లో సవరణలు ఆమోదం
Posted On:
16 FEB 2024 3:32PM by PIB Hyderabad
రక్షణ శాఖ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ నేతృత్వంలోని 'డిఫెన్స్ అక్విజిషన్ కౌన్సిల్' (డాక్), రూ.84,560 కోట్ల విలువైన వివిధ ఆయుధాలు, రక్షణ సంబంధ పరికరాల కొనుగోళ్ల కోసం 'యాక్సెప్టాన్స్ ఆఫ్ నెసెసిటీ'కు (ఏవోఎన్) ఆమోదం
తెలిపింది. 'ఆత్మనిర్భర్ భారత్' స్ఫూర్తితో 16 ఫిబ్రవరి 2024న ఇచ్చిన ఆమోదాల ద్వారా భారతీయ విక్రేతల నుంచి వివిధ పరికరాల సేకరణకు ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు.
'బయ్' విభాగం కింద (దేశీయంగా రూపొందించి, తయారు చేసిన), రీమోట్ ద్వారా పని చేయించగల & భూ ప్రకంపనలు గుర్తించగల కొత్త తరం ట్యాంక్ నిర్వీర్య మందుపాతరల సేకరణ కోసం డాక్ ఆమోదం తెలిపింది. వ్యూహాత్మక యుద్ధ ప్రాంతంలో నిర్దేశిత లక్ష్యాలను ఛేదించేలా భద్రత బలగాల సామర్థ్యాన్ని & ఆధిపత్యాన్ని మెరుగుపరచడానికి 'కాన్సిస్టర్ లాంచ్‌డ్ యాంటీ-ఆర్మర్ లొయిటర్ మ్యూనిషన్ సిస్టమ్' సేకరణ కోసం కూడా 'బయ్' విభాగం కింద ఏవోఎన్‌కు ఆమోదం తెలిపారు.
గగనతల రక్షణ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ముఖ్యంగా చిన్న పరిమాణంలో ఉండి నెమ్మదిగా, తక్కువ ఎత్తులో ఎగిరే లక్ష్యాలను గుర్తించే సామర్థ్యాన్ని పెంచుకోవడానికి, వివిధ లక్ష్యాలపై నిఘా పెట్టడానికి 'బయ్' విభాగం కింద 'ఎయిర్ డిఫెన్స్ టాక్టికల్ కంట్రోల్ రాడార్' సేకరణ కోసం ఏవోఎన్‌కు ఆమోదం దొరికింది.
భారతీయ నౌకాదళం & తీర రక్షణ దళం (ఐసీజీ) నిఘా సామర్థ్యాలన్ని పెంచడానికి, 'బయ్' & 'మేక్' విభాగం కింద మధ్య స్థాయి సముద్ర నిఘా & బహుళ విధుల సముద్ర విమానం కొనుగోలు కోసం ఏవోఎన్‌కు అనుమతి మంజూరైంది.
ప్రత్యర్థుల వ్యూహాల కంటే భారతీయ నౌకాదళాన్ని ఒక అడుగు ముందే ఉంచడానికి, ప్రత్యర్థి జలాంతర్గాములను తక్కువ పౌనఃపున్యాల వద్ద & సుదూరంలో ఉండగానే గుర్తించే సామర్థ్యం గల 'యాక్టివ్ టోవ్డ్ అర్రే సోనార్' కొనుగోలు చేయడానికి 'బయ్' విభాగం కింద డాక్ ఏవోఎన్ ఇచ్చింది. కల్వరి తరగతి జలాంతర్గాముల దాడి సామర్థ్యాలను పెంచేందుకు భారీ స్థాయి టార్పెడోల సేకరణకు కూడా ఏవోఎన్‌కు అనుమతి లభించింది. అమెరికా ప్రభుత్వంతో 'ఫారిన్ మిలిటరీ సేల్ రూట్' కింద, 24 ఎంహెచ్60ఆర్ విమానాలకు 'ఫాలో ఆన్ సపోర్ట్' (ఎఫ్‌వోఎస్), 'ఫాలో ఆన్ సప్లై సపోర్ట్' (ఎఫ్‌వోఎస్‌ఎస్) ద్వారా మరమ్మతుల కోసం కూడా ఏవోఎన్ ఇచ్చారు.
భారత వైమానిక దళం సామర్థ్యం & దూకుడును పెంచడానికి గాలిలోనే ఇంధనం నింపే విమానాల సేకరణ కోసం డాక్ ఏవోఎన్ ఇచ్చింది. ఐసీజీ కోసం సాఫ్ట్‌వేర్ ఆధారిత రేడియోల కొనుగోళ్ల కోసం 'బయ్' విభాగం కింద ఏవోఎన్ మంజూరైంది. దీనివల్ల ఐసీజీ - భారతీయ నౌకాదళం మధ్య అవాంతరాలు లేని, వేగవంతమైన & సురక్షితమైన సమాచార మార్పిడి జరుగుతుంది.
'ఇన్నోవేషన్స్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్' (ఐడెక్స్) & సాంకేతికత అభివృద్ధి నిధి పథకాల ద్వారా స్నేహపూర్వక రక్షణ రంగ అంకుర సంస్థల వ్యవస్థను రూపొందించడానికి, అంకుర సంస్థలు & ఎంఎస్‌ఎంఈల నుంచి ఆధునిక సాంకేతికతల సేకరణను ప్రోత్సహించడానికి 'డిఫెన్స్ అక్విజిషన్ ప్రొసీజర్ (డాప్) 2020' నిబంధనలు, ఖర్చుల లెక్కింపు, చెల్లింపుల షెడ్యూల్, సేకరణ పరిమాణం మొదలైన వాటిలో సవరణలను డాక్ ఆమోదించింది. 'సులభతర వ్యాపారం' స్ఫూర్తితో, ఐడెక్స్ & టీడీఎఫ్ పథకాల కింద అంకుర సంస్థలు & ఎంఎస్‌ఎంఈలకు ఇది చాలా ప్రోత్సాహాన్ని అందిస్తుంది.
***
(Release ID: 2006714)
Visitor Counter : 125