వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ

కోచింగ్ రంగంలో తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనల నిరోధానికి జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై అభిప్రాయాలు ఆహ్వానించిన కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ (సిసిపిఏ)


విజయ శాతం, ఎంపికల సంఖ్యపై తప్పుడు సమాచారం వ్యాప్తి నిరోధానికి మార్గదర్శకాలు సిద్ధం చేసిన సిసిపిఏ
మార్గదర్శకాలపై 30 రోజుల్లోగా 2024 మార్చి 16 వరకు సూచనలు, అభిప్రాయాలు స్వీకరించనున్న సిసిపిఏ

Posted On: 16 FEB 2024 1:57PM by PIB Hyderabad

కోచింగ్ రంగంలో తప్పుదోవ పట్టించే విధంగా ప్రకటనల నిరోధానికి  జారీ చేసిన ముసాయిదా మార్గదర్శకాలపై ప్రజల నుంచి అభిప్రాయాలు, సూచనలను  కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ (సిసిపిఏ) ఆహ్వానించింది. ముసాయిదా మార్గదర్శకాలు వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ వెబ్ సైట్ లింక్  (https://consumeraffairs.nic.in/sites/default/files/file-uploads/latestnews/Public%20Comments%20Letter%202.pdf).లో అందుబాటులో ఉన్నాయి. మార్గదర్శకాలపై 30 రోజుల్లోగా 2024 మార్చి 16 వరకు సూచనలు, అభిప్రాయాలు అందించాలని  కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ (సిసిపిఏ) కోరింది. 

 కోచింగ్ రంగంలో  తప్పుదోవ పట్టించే విధంగా జారీ అవుతున్న  ప్రకటనలను అరికట్టడానికి సంబంధిత వర్గాలతో 2024 జనవరి 8న   కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ (సిసిపిఏ)    సంప్రదింపులు జరిపింది. సమావేశానికి  డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్ (డిఓపిటి), విద్యా మంత్రిత్వ శాఖ, లాల్ బహదూర్ శాస్త్రి నేషనల్ అకాడమీ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ (ఎల్బిఎస్ఎన్ఎఎ), నేషనల్ లా యూనివర్శిటీ (ఎన్ఎల్యు) ఢిల్లీ, ఎఫ్ఐఐటిజెఇ, ఖాన్ గ్లోబల్ స్టడీస్ , ఇకిగై లా సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.  . కోచింగ్ రంగంలో తప్పుదోవ పట్టించే ప్రకటనలను అరికట్టడానికి కేంద్ర వినియోగదారుల రక్షణ అథారిటీ తగిన  మార్గదర్శకాలను తీసుకురావాలని సమావేశంలో ఏకాభిప్రాయం వ్యక్తమైంది.

కోచింగ్ ఇన్స్టిట్యూట్ లు, న్యాయ సంస్థలు, ప్రభుత్వ, స్వచ్ఛంద వినియోగదారుల సంస్థలు (వీసీఓలు) సహా అన్ని భాగస్వాములతో సమగ్రంగా చర్చించిన తర్వాత కోచింగ్ రంగంలో తప్పుదోవ పట్టించే ప్రకటనల నిరోధానికి ముసాయిదా మార్గదర్శకాలు రూపొందించారు. ప్రతిపాదిత మార్గదర్శకాలు వినియోగదారుల రక్షణ చట్టం 2019 లోని సెక్షన్ 18 (2) (ఎల్) కింద జారీ అవుతాయి. 

ముసాయిదా మార్గదర్శకాలు "కోచింగ్" ను ట్యూషన్, సూచనలు లేదా అకడమిక్ మద్దతు లేదా అభ్యాస కార్యక్రమం లేదా ఏదైనా వ్యక్తి అందించే మార్గదర్శకంగా నిర్వచిస్తాయి. మార్గదర్శకాల ప్రకారం తప్పుదోవ పట్టించే విధంగా  ప్రకటనలు ఉన్నాయని గుర్తించడానికి  షరతులు విధించారు. కోచింగ్ లో పాల్గొనే ఏ వ్యక్తి అయినా ఈ క్రింది పద్ధతుల్లో దేనినైనా ఉపయోగించి విడుదల చేసే  ప్రకటనలను  తప్పుదారి పట్టించే ప్రకటనగా గుర్తిస్తారు. 

ఎ. కోర్సు పేరు (ఉచితం లేదా చెల్లించినప్పటికీ), విజయం సాధించిన అభ్యర్థి ఎంచుకున్న కోర్సు వ్యవధి కి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని లేదా సేవలు ఎంచుకునే అంశంలో వినియోగదారు నిర్ణయాన్ని ప్రభావితం చేసే ఏదైనా ఇతర ముఖ్యమైన సమాచారాన్ని దాచిపెట్టడం 

బి. సరైన  ఆధారాలు చూపకుండా  ఏదైనా పోటీ పరీక్ష లో విద్యార్థుల విజయ రేటు, ఎంపికల సంఖ్య లేదా ర్యాంకుల గురించి తప్పుడు సమాచారం అందించడం 

సి. విద్యార్థుల వ్యక్తిగత కృషిని గుర్తించకుండా కేవలం తమ  కోచింగ్ మాత్రమే  విద్యార్థుల విజయానికి కారణమని తప్పుడు ప్రచారం చేయడం. ఈ అంశంలో  విజయంలో కోచింగ్ ప్రమేయం ఏ మేరకు ఉందో స్పష్టంగా తెలియజేయాలి. 

డి.ఏదో కోల్పోతారు అంటూ ప్రకటనలు విడుదల చేసి  విద్యార్థులు లేదా తల్లిదండ్రులకు  ఆందోళన కలిగించడం 

ఈ. వినియోగదారులను తప్పుదోవ పట్టించే లేదా వినియోగదారుల స్వయంప్రతిపత్తి, ఎంపికను ప్రభావితం చేసే ఇతర విధానాలు . 

కోచింగ్ రంగంలో ఉన్న ప్రతి వ్యక్తికీ మార్గదర్శకాలు వర్తిస్తాయి. కోచింగ్ రంగంలో తప్పుదోవ పట్టించే విధంగా విడుదల అయ్యే ప్రకటనల నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించడం లక్ష్యంగా మార్గదర్శకాలు అమలు జరుగుతాయి. ఒక వర్గానికి చెందిన వినియోగదారులకు తప్పుదోవ పట్టించే విధంగా జారీ అయ్యే ప్రకటనల నుంచి రక్షణ కల్పించడానికి మార్గదర్శకాలు రూపొందాయి. వినియోగదారుల రక్షణ చట్టం 2019 పరిధిలోకి ప్రకటనలు వస్తాయి. తప్పుడు ప్రకటనలపై సంబంధిత వర్గాలకు మార్గదర్శకాలు పూర్తి అవగాహనా కల్పించి వినియోగదారుల ప్రయోజనాలను రక్షించడానికి దోహదపడతాయి. 

నూతన మార్గదర్శకాలకు సంబంధించిన మరింత సమాచారాన్ని 

(https://consumeraffairs.nic.in/sites/default/files/file-uploads/latestnews/Public%20Comments%20Letter%202.pdf) ద్వారా పొందవచ్చు. 

***



(Release ID: 2006712) Visitor Counter : 69