బొగ్గు మంత్రిత్వ శాఖ

దేశంలో బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించడానికి రేపు హైదరాబాద్‌లో పరిశ్రమల ముఖాముఖి నిర్వహించనున్న కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ

Posted On: 15 FEB 2024 12:49PM by PIB Hyderabad

దేశంలో స్థిరమైన ఇంధన భద్రత కల్పించేలా బొగ్గు/లిగ్నైట్ వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకునే దిశగా కీలక అడుగు పడుతోంది. దేశవ్యాప్తంగా బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ (బొగ్గు/లిగ్నైట్ నుంచి ఇంధన వాయువుల ఉత్పత్తి) ప్రాజెక్టుల ఏర్పాటు, విస్తరణను ప్రోత్సహించే లక్ష్యంతో కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ, 16 ఫిబ్రవరి 2024న, హైదరాబాద్‌లో పరిశ్రమల ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తోంది.

దేశ భవిష్యత్‌ ఇంధన అవసరాలను తీర్చేలా బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులను ప్రోత్సహించేందుకు భారత ప్రభుత్వం ఒక పథకాన్ని ఆమోదించింది. ఆ పథకం ప్రకారం, బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టులకు 3 విభాగాల కింద బొగ్గు మంత్రిత్వ శాఖ రూ.8,500 కోట్ల పెట్టుబడి సాయాన్ని అందిస్తుంది. ఆ విభాగాలు ప్రభుత్వ పీఎస్‌యూలు, ప్రైవేట్ సంస్థలు, చిన్న తరహా ప్రాజెక్టులు.

బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టుల వల్ల ఇంధన వనరుల వైవిధ్యీకరణ, దిగుమతులపై తక్కువగా ఆధారపడటం, శుద్ధ ఇంధన సాంకేతికతల ద్వారా పర్యావరణంపై ప్రభావాన్ని తగ్గించడం వంటి ప్రయోజనాలు ఉంటాయి. ఇంధన రంగంలో ఆవిష్కరణలు, సహకారాన్ని పెంచడంలో బొగ్గు మంత్రిత్వ శాఖ నిబద్ధతను ఈ చొరవ స్పష్టం చేస్తుంది. అంతేకాదు, పరిశ్రమ వర్గాలతో వ్యూహాత్మక భాగస్వామ్యాల ద్వారా గ్యాసిఫికేషన్ సాంకేతికతల అమల్లో వేగం పెంచడానికి, బొగ్గు/లిగ్నైట్ ఆధారిత ఇంధన పరిష్కారాల కోసం ఒక బలమైన వ్యవస్థను అభివృద్ధి చేయడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ ముఖాముఖి ద్వారా ఒకే వేదికపైకి రానున్న విధాన రూపకర్తలు, పరిశ్రమ పెద్దలు, పెట్టుబడిదార్లు కలిసి బొగ్గు/లిగ్నైట్ గ్యాసిఫికేషన్‌ రంగంలో అవకాశాలు, సవాళ్లపై చర్చిస్తారు. ఆహుతులంతా తమ అభిప్రాయాలు, ఉత్తమ విధానాలను పంచుకుంటారు. భారతదేశంలో గ్యాసిఫికేషన్ కార్యక్రమాలను పెంచే కొత్త మార్గాల గురించి ఆలోచిస్తారు.

కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అమృత్ లాల్ మీనా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరవుతారు. కోల్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ శ్రీ పి.ఎం. ప్రసాద్ కూడా పాల్గొంటారు.

భారతదేశం స్థిరంగా వృద్ధి చెందేలా, ఇంధన భద్రత లక్ష్యాలను సాధించేలా బొగ్గు/లిగ్నైట్ వనరుల అపారమైన సామర్థ్యాన్ని బొగ్గు గ్యాసిఫికేషన్ అందుబాటులోకి తెస్తుంది. ఆసక్తి గల వాటాదార్లంతా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆహ్వానిస్తోంది. 

 

***



(Release ID: 2006372) Visitor Counter : 104