ప్రధాన మంత్రి కార్యాలయం

ఉపాధి సమ్మేళనం కింద ప్రభుత్వ శాఖలు.. సంస్థల్లో కొత్తగా చేరేవారికి లక్షకుపైగా నియామక లేఖలు అందజేసిన ప్రధానమంత్రి


న్యూఢిల్లీలో ‘‘కర్మయోగి భవన్’’ సమీకృత ప్రాంగణం తొలిదశకు శంకుస్థాపన;

‘‘దేశ ప్రగతిలో మన యువశక్తి పాత్రను పెంచడంలో ఉపాధి సమ్మేళనాలది కీలక పాత్ర’;

‘‘కేంద్ర ప్రభుత్వంలో నియామక ప్రక్రియ ఇప్పుడు పూర్తిగా పారదర్శకంగా మారింది’’;

‘‘కేంద్ర ప్రభుత్వంతో యువత అనుసంధానంసహా దేశ ప్రగతిలో
వారికి భాగస్వామ్యం కల్పించడానికి మేం కృషి చేస్తున్నాం’’;

‘‘ఈ దశాబ్దం చివరికల్లా భారతీయ రైల్వేలు పూర్తిగా రూపాంతరం చెందుతాయి’’;

‘‘చక్కని అనుసంధానం దేశాభివృద్ధిపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది’’;

‘‘పారామిలటరీ బలగాల ఎంపిక ప్రక్రియలో సంస్కరణలు
ప్రతి ప్రాంతంలోని యువతకూ సమానావకాశం కల్పిస్తాయి’’

Posted On: 12 FEB 2024 11:32AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ సదుపాయం ద్వారా వివిధ విభాగాలు.. సంస్థలలో కొత్తగా చేరేవారికి లక్షకుపైగా నియామక లేఖలు అందజేశారు. అలాగే న్యూఢిల్లీలోని ‘‘కర్మయోగి భవన్’’ సమీకృత ప్రాంగణం తొలిదశ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మిషన్ కర్మయోగి సంబంధిత వివిధ మూలస్తంభాల మధ్య సహకారం, సమన్వయానికి ఈ ప్రాంగణం తోడ్పడుతుంది. ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- నియామక లేఖలు అందుకున్న యువతరానికి, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వంలో యువతరానికి ఉద్యోగావకాశాల కల్పన కార్యక్రమం పూర్తిస్థాయిలో కొనసాగుతున్నదని ఆయన ఉద్ఘాటించారు.

   ఉద్యోగ ప్రకటనలు, నియామక లేఖల జారీ నడుమ వ్యవధి అధికంగా ఉండటంతో లోగడ అక్రమార్జనకు అదొక మార్గంగా మారిందని ప్రధాని గుర్తుచేశారు. అయితే, నేడు ఈ మొత్తం ప్రక్రియను ప్రభుత్వం పూర్తి పారదర్శకం చేసిందన్నారు. అంతేకాకుండా నిర్దిష్ట వ్యవధిలో నియామక ప్రక్రియను కూడా పూర్తి చేస్తున్నదని పేర్కొన్నారు. తద్వారా ప్రతి యువకుడూ సామర్థ్యం ప్రదర్శించేందుకు సమాన అవకాశాలు లభిస్తున్నాయని చెప్పారు. ‘‘ఈ రోజున ప్రతి యువకుడు శ్రమించి, నైపుణ్యంతో తమ ఉద్యోగాన్ని సుస్థిరం చేసుకోగలమని విశ్వసిస్తున్నాడు’’ అని పేర్కొంటూ, దేశాభివృద్ధిలో యువత భాగస్వామ్యం దిశగా ప్రభుత్వం కృషి చేస్తున్నదని ప్రధాని మోదీ తెలిపారు. గత ప్రభుత్వాల హయాంతో పోలిస్తే ప్రస్తుత ప్రభత్వం గత పదేళ్లలో 1.5 రెట్లు అధికంగా ఉద్యోగాలిచ్చిందని చెప్పారు. న్యూఢిల్లీలో ‘‘కర్మయోగి భవన్’’ సమీకృత ప్రాంగణం తొలిదశ నిర్మాణానికి శంకుస్థాపన అంశాన్ని కూడా ప్రధానమంత్రి ప్రస్తావించారు. సామర్థ్యం వికాసం దిశగా ప్రభుత్వ చొరవను ఇది మరింత బలోపేతం చేస్తుందన్నారు.

   ప్ర‌భుత్వ కృషి ఫలితంగా కొత్త రంగాలు రూపుదిద్దుకోవడం, యువతకు ఉపాధి-స్వ‌యం ఉపాధి అవ‌కాశాలు పెరగడం గురించి ప్ర‌ధానమంత్రి ప్ర‌స్తావించారు. అలాగే కుటుంబాల విద్యుత్ బిల్లు భారాన్ని త‌గ్గించే దిశగా దేశవ్యాప్తంగా కోటి ఇళ్ల పైకప్పుమీద సౌరశక్తి ఉత్పాదక వ్యవస్థ ఏర్పాటుపై బ‌డ్జెట్ ప్ర‌క‌ట‌న‌ను గుర్తుచేశారు. దీనివల్ల వారికి ఉచిత విద్యుత్తు లభించడమే కాకుండా గ్రిడ్‌కు విద్యుత్ సరఫరా ద్వారా ఆదాయం కూడా లభిస్తుందని చెప్పారు. మరోవైపు ఈ పథకం అమలు వల్ల లక్షలాది కొత్త ఉద్యోగాల సృష్టి జరుగుతుందన్నారు. ఇక దాదాపు 1.25 లక్షల అంకుర సంస్థలతో ప్రపంచంలోనే భారతదేశం మూడో అతిపెద్ద అంకుర పర్యావరణ వ్యవస్థగా రూపొందిందని ఆయన పునరుద్ఘాటించారు. ఈ సంస్థలలో అనేకం రెండు, మూడు అంచెల నగరాల్లో ఏర్పాటైనవి కావడంపై ప్రధాని మోదీ హర్షం వెలిబుచ్చారు. ఈ సంస్థలన్నీ కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తున్న నేపథ్యంలో తాజా బడ్జెట్‌లో వాటికి పన్ను రాయితీ కొనసాగింపును ప్రకటించినట్లు గుర్తుచేశారు. అలాగే పరిశోధన-ఆవిష్కరణలను ప్రోత్సహించడం కోసం ఈ బడ్జెట్‌లో రూ.లక్ష కోట్ల నిధిని ప్రకటించడాన్ని కూడా ఆయన ప్రస్తావించారు.

   నేటి ఉపాధి సమ్మేళనంలో భాగంగా రైల్వేలోనూ నియామక ప్రక్రియ చేపట్టినట్లు ప్రధానమంత్రి తెలిపారు. సామాన్య ప్రజలు తమ ప్రయాణం కోసం ముందుగా ఎంచుకునేది రైళ్లనేనని పేర్కొన్నారు. దేశంలో రైల్వేల రంగం భారీస్థాయిలో రూపాంతరం చెందుతున్నదని, రాబోయే దశాబ్దంలో ఇది సంపూర్ణం కానుందని శ్రీ మోదీ వివరించారు. కాగా, 2014కు ముందు ప్రభుత్వాలు రైల్వే రంగంపై పెద్దగా శ్రద్ధ చూపిన దాఖలాలు లేవన్నారు. ఆ మేరకు రైలు మార్గాల విద్యుదీకరణ, డబ్లింగ్‌తోపాటు కొత్త రైళ్లను ప్రారంభించడం, ప్రయాణిక సౌకర్యాలు మెరుగుపరచడం వంటివి చేపట్టలేదని ఆయన ఉదాహరించారు. అయితే 2014 తర్వాత, రైల్వేల ఆధునికీకరణతోపాటు, ఉన్నతీకరణపై దృష్టి సారించి రైలు ప్రయాణానుభవాన్ని పునరావిష్కరించే కార్యక్రమాలు చేపట్టామని ప్రధానమంత్రి గుర్తుచేశారు. ఈ ఏడాది బడ్జెట్‌లో వందే భారత్‌ ఎక్స్‌ ప్రెస్‌ ప్రమాణాలతో 40,000 ఆధునిక బోగీలను తయారుచేసి, సాధారణ రైళ్లకు అమర్చనున్నామని చెప్పారు. తద్వారా ప్రయాణికులకు సౌకర్యాలు, సదుపాయాలు పెరుగుతాయని ఆయన తెలిపారు.

   అనుసంధానంతో ఒనగూడే విస్తృత ప్రభావాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- కొత్త మార్కెట్లు, పర్యాటక రంగ విస్తరణ, కొత్త వ్యాపారాలు సహా మెరుగైన అనుసంధానంతో లక్షలాది ఉద్యోగ అవకాశాలు కూడా అందివస్తాయని ప్రధానమంత్రి పేర్కొన్నారు. అందుకే ‘అభివృద్ధిని వేగిరపరచే మౌలిక సదుపాయాలపై పెట్టుబడులు పెంచబడుతున్నాయి’’ అన్నారు. తదనుగుణంగా ఇటీవలి బడ్జెట్‌లో మౌలిక సదుపాయాలపై పెట్టుబడుల కోసం రూ.11 లక్షల కోట్లు కేటాయించినట్లు ప్రధానమంత్రి చెప్పారు. ఈ నిధులతో కొత్త రైలుమార్గాలు, రహదారులు, విమానాశ్రయాలు, జలమార్గాల ప్రాజెక్టులు రూపుదిద్దుకోవడమేగాక కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయని చెప్పారు.

   ఈసారి ఉపాధి సమ్మేళనంలో పారామిలటరీ దళాల్లో నియామకాలు అత్యధిక సంఖ్యలో ఉన్నాయని ప్రధాని పేర్కొన్నారు. ఈ బలగాల ఎంపిక ప్రక్రియలో సంస్కరణల గురించి వివరిస్తూ- ఈ ఏడాది జనవరి నుంచి హిందీ, ఆంగ్లం సహా 13 భారతీయ భాషలలో పరీక్ష నిర్వహించబడుతున్నదని తెలిపారు. దీనివల్ల లక్షలాది అభ్యర్థులకు సమానావకాశం లభిస్తుందని చెప్పారు. సరిహద్దు భద్రత, తీవ్రవాద ప్రభావిత జిల్లాలకు ఈ బలగాల కోటాను పెంచినట్లు ఈ సందర్భంగా ఆయన వెల్లడించారు. వికసిత భారత్ ప్రయాణంలో ప్రభుత్వ సిబ్బంది పాత్రను ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావించారు. ‘‘ఇవాళ ఇక్కడ హాజరైన లక్ష మందికిపైగా కర్మయోగులు (ఉద్యోగులు) ఈ ప్రయాణానికి కొత్త శక్తిని, వేగాన్ని జోడిస్తారు’’ అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. అనునిత్యం దేశాభివృద్ధే కర్తవ్యంగా విధులు నిర్వర్తించాల్సిందిగా వారికి పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా 800కుపైగా కోర్సులు, 30 లక్షల మంది వరకూ వాడకందారులుగల ‘కర్మయోగి భారత్ పోర్టల్’ గురించి తెలుపుతూ, దీనిద్వారా పూర్తి ప్రయోజనం పొందాల్సిందిగా సూచించారు.

నేపథ్యం

   దేశవ్యాప్తంగా 47 ప్రాంతాల్లో ఉపాధి సమ్మేళనం నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో భాగంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలతోపాటు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోనూ నియామకాలు చేపట్టారు. ఈ ప్రక్రియలో ఎంపికైన వారంతా వివిధ మంత్రిత్వ శాఖలు/ప్రభుత్వ విభాగాలలో ఉద్యోగులుగా చేరుతారు. ఈ మేరకు రెవెన్యూ, హోమ్, ఉన్నత విద్య, అణు ఇంధన, రక్షణ, ఆర్థిక సేవల, ఆరోగ్యం-కుటుంబ సంక్షేమ, గిరిజన వ్యవహారాలు, రైల్వే తదితర పలు మంత్రిత్వ శాఖల పరిధిలో వివిధ హోదాలలో వీరు బాధ్యతలు నిర్వర్తిస్తారు. దేశంలో ఉపాధి కల్పనకు అగ్ర ప్రాధాన్యంపై  ప్రధానమంత్రి నిబద్ధతను నెరవేర్చే దిశగా ఉపాధి సమ్మేళనాల నిర్వహణ ఒక ముందడుగు. ఈ కార్యక్రమం ఉపాధి కల్పనను మరింతగా ప్రభావితం చేస్తుంది. యువతకు సాధికారత సహా దేశాభివృద్ధిలో ప్రత్యక్ష భాగస్వామ్యం దిశగా ప్రయోజనాత్మక అవకాశాలను కల్పిస్తుంది. కొత్త ఉద్యోగులు ‘కర్మయోగి ప్రారంభ్’ కోర్సు ద్వారా శిక్షణ పొందే వీలుంటుంది. ఇది ‘ఐగాట్ కర్మయోగి’ పోర్టల్‌లోని ఆన్‌లైన్ మాడ్యూల్ కాగా, ఇందులో 880కిపైగా ఇ-లెర్నింగ్ కోర్సులను ‘ఎక్కడైనా, ఏ పరికరంతోనైనా’ అభ్యసించే వీలుంటుంది.

 

 

***

DS/TS



(Release ID: 2005611) Visitor Counter : 62