ప్రధాన మంత్రి కార్యాలయం

ఇండియా ఎనర్జీ వీక్ 2024 ను ప్రారంభించిన ప్రధాన మంత్రి


‘‘ఒక బలమైన శక్తి రంగం దేశ పురోగతి కి మంచి సంకేతం గా ఉంటుంది’’

‘‘భారతదేశం యొక్కవృద్ధి గాథ విషయం లో ప్రపంచ నిపుణులు ఆశావాదం తో ఉన్నారు’’

‘‘భారతదేశం ఒక్క తనఅవసరాల ను తీర్చుకొంటూ ఉండడం అని కాకుండా, ప్రపంచం అనుసరించవలసిన దిశ ను కూడా నిర్ధారిస్తున్నది’’

‘‘మౌలిక సదుపాయాలనిర్మాణం అంశం లో ఇది వరకు ఎన్నడూ ఎరుగనంతటి శ్రద్ధ ను భారతదేశం కనబరుస్తున్నది’’

‘‘గ్లోబల్బయోఫ్యూయల్స్ అలయన్స్ ప్రపంచవ్యాప్తం గా ప్రభుత్వాల ను, సంస్థల ను మరియు పరిశ్రమల ను ఒక చోటు కు తీసుకు వచ్చింది’’

‘‘ ‘చెత్త నుండి సంపద నిర్వహణ’ విధానం ద్వారా మేం గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కు చేవ ను అందిస్తున్నాం’’

‘‘మన శక్తి మిశ్రణాన్ని వృద్ధి చెందింప చేసుకోవడం కోసంపర్యావరణ మిత్రపూర్వకమైనటువంటి శక్తి వనరుల ను అభివృద్ధి పరచుకోవాలని భారతదేశం స్పష్టంచేస్తోంది’’

‘‘సౌర శక్తి రంగంలో స్వయం సమృద్ధిని మేం ప్రోత్సహిస్తున్నాం’’

‘‘ఇండియా ఎనర్జీ వీక్ కార్యక్రమం ఒక్క భారతదేశం కార్యక్రమం కాదు, అది ‘ప్రపంచం తో భారతదేశం మరియు ప్రపంచం కోసం భారతదేశం’ అనే భావోద్వేగాన్ని చాటుతున్నది’’



Posted On: 06 FEB 2024 12:43PM by PIB Hyderabad

ఇండియా ఎనర్జీ వీక్ 2024 ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గోవా లో ఈ రోజు న ప్రారంభించారు. ఇండియా ఎనర్జీ వీక్ 2024 అనేది భారతదేశం యొక్క అతి పెద్దది అయినటువంటి మరియు సర్వతోముఖమైనటువంటి శక్తి సంబంధి ఏకైక ప్రదర్శన, ఇంకా సమావేశం అని చెప్పాలి. శక్తి పరం గా పరివర్తన కై భారతదేశం నిర్దేశించుకొన్న లక్ష్యాల కు ఉత్ప్రేరకం గా ఉండేటట్టు ఎనర్జీ వేల్యూ చైన్ లోని వేరు వేరు భాగాల ను ఒక చోటు కు చేర్చడం ఈ కార్యక్రమం యొక్క ప్రధానోద్దేశ్యం గా ఉంది. గ్లోబల్ ఆయిల్ & గ్యాస్ సిఇఒ లతో మరియు నిపుణుల తో ఒక రౌండ్ టేబుల్ ను కూడా ప్రధాన మంత్రి నిర్వహించారు.

సభికుల ను ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరి కి ఇండియా ఎనర్జీ వీక్ యొక్క రెండో సంచిక లో పాలుపంచుకోవడానికి ఇదే ఆహ్వానం అన్నారు. ఈ కార్యక్రమం శక్తి భరితం అయినటువంటి గోవా రాష్ట్రం లో జరుగుతూ ఉన్నందుకు ప్రధాన మంత్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు. గోవా ఆతిథేయ భావన కు, ప్రాకృతిక శోభ కు పేరు తెచ్చుకొన్న రాష్ట్రం; ఇక్కడి సంస్కృతి యావత్తు ప్రపంచం నుండి తరలి వచ్చేటటువంటి పర్యటకుల పైన ఎక్కడలేని ప్రభావాన్ని చూపెడుతుంది అని ఆయన అన్నారు. ‘‘గోవా అభివృద్ధి తాలూకు సరిక్రొత్త శిఖరాల ను అందుకొంటోంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. పర్యావరణం పట్ల చైతన్యం తో కూడి ఉండే మరియు దీర్ఘకాలికమైనటువంటి దృక్పథాన్ని గురించి చర్చించడాని కి గోవా ఒక సిసలైన స్థలం అని ఆయన అభివర్ణించారు. ఇండియా ఎనర్జీ వీక్ 2024 లో పాలుపంచుకోవడాని కి గోవా లో గుమికూడిన విదేశీ అతిథులు ఈ రాష్ట్రం తాలూకు జీవనకాల జ్ఞాపకాన్ని వారి వెంట తీసుకు వెళ్తారు అనే నమ్మకాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

ఆర్థిక సంవత్సరం లో తొలి ఆరు నెలల్లో భారతదేశం యొక్క స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) రేటు 7.5 శాతాన్ని మించిన ఒక ముఖ్యమైనటువంటి కాల ఖండం లో ఇండియా ఎనర్జీ వీక్ 2024 కార్యక్రమం జరుగుతోంది అని ప్రధాన మంత్రి గుర్తు కు తీసుకు వస్తూ, ఈ యొక్క వృద్ధి రేటు ప్రపంచ వృద్ధి అంచనా కంటే అధికం గా ఉండి భారతదేశాన్ని ప్రపంచం లో అత్యంత వేగవంతం గా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ గా మలచింది అని అన్నారు. రాబోయే కాలం లో ఇదే విధమైన వృద్ధి ధోరణులు ఉండవచ్చన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎమ్ఎఫ్) యొక్క సూచన ను సైతం ఆయన ప్రస్తావించారు. ‘‘భారతదేశం త్వరలో ప్రపంచం లో మూడో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థ గా నిలుస్తుంది అని ప్రపంచం అంతటా ఉన్నటువంటి ఆర్థిక నిపుణులు నమ్ముతున్నారు’’ , అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. మరి ఇదే సందర్భం లో భారతదేశం యొక్క వృద్ధి గాథ లో శక్తి రంగం యొక్క పరిధి విస్తరిస్తుండడాన్ని గురించి శ్రీ నరేంద్ర మోదీ నొక్కి పలికారు.

భారతదేశం ప్రపంచం లో కెల్లా మూడో అతి పెద్దది అయినటువంటి శక్తి, చమురు, ఇంకా ఎల్‌పిజి వినియోగదారు దేశం గా ఉన్నదన్న విషయాన్ని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. దీనికి తోడు, భారతదేశం నాలుగో అతి పెద్దది అయినటువంటి ఎల్ఎన్‌జి దిగుమతిదారు దేశం, రిఫైనరు అనే కాకుండా నాలుగో అతి పెద్ద ఆటోమొబైల్ మార్కెట్ కూడా ను అని ఆయన అన్నారు. దేశం లో విద్యుత్తు వాహనాల (ఇవి స్) కు డిమాండు అధికం అవుతున్న సంగతి ని కూడా ఆయన స్పష్టం చేశారు. దేశ ప్రజల శక్తి సంబంధి అవసరాలు 2045 వ సంవత్సరాని కల్లా రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్న అంశాన్ని గురించి కూడా ఆయన మాట్లాడారు. ఈ పెరుగుతున్న అవసరాల ను తీర్చడాని కి గాను భారతదేశం సిద్ధం చేసుకొంటున్న ప్రణాళిక ను గురించి వివరించారు. తక్కువ ఖరీదు లో ఇంధనం లభ్యత కు పూచీ పడేందుకు జరుగుతున్న ప్రయాసల ను గురించి ప్రధాన మంత్రి ప్రముఖం గా ప్రకటిస్తూ, ప్రపంచ స్థాయి లో మూల కారకాలు వ్యతిరేకం గా ఉంటూ వస్తున్నప్పటికీ పెట్రోలు ధర లు దిగి వచ్చిన అతి కొద్ది దేశాల సరసన భారతదేశం నిలచింది; అంతేకాదు, కోట్ల కొద్దీ గృహాల కు విద్యుత్తు సౌకర్యాన్ని అందుబాటు లోకి తీసుకు రావడం ద్వారా ఎలక్ట్రిసిటీ కవరేజీ పరం గా 100 శాతం లక్ష్యాన్ని సాధించింది అని ఆయన వివరించారు. ‘‘భారతదేశం తన అవసరాల ను తీర్చుకోవడం ఒక్కటే కాకుండా, ప్రపంచాని కి దిశ ను కూడా చూపెడుతోంది’’ , అని ప్రధాన మంత్రి అన్నారు.

మౌలిక సదుపాయాల కల్పన కు ఇదివరకు ఎన్నడూ ఎరుగనంత జోరు ను జతపరుస్తున్నట్లు ప్రధాన మంత్రి వివరిస్తూ, మౌలిక సదుపాయాల కల్పన కోసం 11 లక్షల కోట్ల రూపాయల ను ఇచ్చే ప్రస్తావన ఇటీవలి బడ్జెటు లో ఉంది, ఈ నిధుల లో చాలా పెద్ద భాగం శక్తి రంగాని కి దక్కుతుందన్నారు. ఈ సొమ్ము శక్తి అవసరం అయ్యేటటువంటి రైలు మార్గాలు, రహదారి మార్గాలు, జల మార్గాలు, వాయు మార్గాలు లేదా గృహ నిర్మాణం రంగాల లో ఆస్తుల కల్పన కు తోడ్పడుతుంది; అదే జరిగితే భారతదేశం శక్తి సంబంధి సామర్థ్యాన్ని విస్తరించుకోవడం కోసం నడుం బిగిస్తుంది అని ఆయన అన్నారు. ప్రభుత్వం తీసుకు వచ్చిన సంస్కరణల ఫలితం గా దేశీయం గా గ్యాస్ ఉత్పాదన పెరుగుతూ ఉన్నది; శక్తి సంబంధి ప్రాథమిక మిశ్రణం లో గ్యాస్ యొక్క వాటా ను 6 శాతం నుండి 15 శాతాని కి చేర్చేందుకు దేశం యత్నిస్తోంది అని ఆయన అన్నారు. దీని కోసం తదుపరి అయిదారు సంవత్సరాల కాలం లో సుమారు గా 67 బిలియన్ డాలర్ మేరకు పెట్టుబడి పెట్టడం జరుగుతుంది అని ఆయన తెలియ జేశారు.

వృత్తాకార ఆర్థిక వ్యవస్థ, ఇంకా పునర్ వినియోగ భావన లు భారతదేశం యొక్క ప్రాచీన సంప్రదాయాల లో ఒక భాగం గా ఉన్నవే అనే సంగతి ని ప్రధాన మంత్రి చెప్తూ, శక్తి రంగాని కి అయినా సరే ఇదే విషయం వర్తిస్తుంది అన్నారు. ఈ విశ్వాసాని కి గ్లోబల్ బయో ఫ్యూయల్ అలయన్స్ ప్రతీక గా ఉంటూ, ప్రపంచ వ్యాప్తం గా ప్రభుత్వాల ను, సంస్థల ను మరియు పరిశ్రమల ను ఒకే వేదిక మీదకు తీసుకు వస్తున్నది అని ఆయన అన్నారు. భారతదేశం లో జి-20 సమిట్ జరిగిన కాలం లో ఈ విషయం మొట్టమొదట ప్రస్తావన కు వచ్చింది అని ప్రధాన మంత్రి చెప్తూ, ఈ కూటమి కి సంపూర్ణమైన సమర్థన ప్రాప్తించింది. దాదాపు గా, 22 దేశాలు మరియు 12 అంతర్జాతీయ సంస్థ లు ప్రపంచం లో బయో ఫ్యూయల్స్ యొక్క వినియోగాన్ని ప్రోత్సహించడాని కి ముందుకు వచ్చాయి. అదే కాలం లో, 500 బిలియన్ యుఎస్ డాలర్ విలువైన ఆర్థిక అవకాశాల ను కూడా అవి సృష్టించాయి అని ఆయన వివరించారు.

బయో ఫ్యూయల్ సెక్టరు లో భారతదేశం సాధించిన ప్రగతి ని శ్రీ నరేంద్ర మోదీ ప్రముఖం గా ప్రస్తావిస్తూ, భారతదేశం లో అంగీకారం రేటు వృద్ధి చెందుతోంది అని వెల్లడించారు. ఇథెనాల్ మిశ్రణం ప్రక్రియ 2014 వ సంవత్సరం లో 1.5 శాతం గా ఉన్నది కాస్తా, 2023 వ సంవత్సరం లో చెప్పుకోదగినంత గా 12 శాతాని కి హెచ్చడం తో కర్బన ఉద్గారాల లో తగ్గుదల అనేది రమారమి 42 మిలియన్ మెట్రిక్ టన్నుల కు చేరుకొందన్నారు. ‘‘పెట్రోలు లో ఇథెనాల్ ను కలపడాన్ని 2025 సంవత్సరానికంతా 20 శాతాని కి చేర్చాలని ప్రభుత్వం ఒక లక్ష్యాన్ని విధించింది’’ అని ఆయన అన్నారు. కిందటి సంవత్సరం లో ఇండియా ఎనర్జీ వీక్ సందర్భం లో 80 కి పైగా రిటైల్ అవుట్ లెట్ లలో 20 శాతం ఇథెనాల్ మిశ్రణం ప్రక్రియ మొదలైందని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గుర్తు చేస్తూ, ఆ తరహా అవుట్ లెట్ ల సంఖ్య ప్రస్తుతం 9,000 కు పెరిగిందని తెలిపారు.

 

   ‘వ్యర్థం నుంచి అర్థం’ నిర్వహణ నమూనా ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థల పరివర్తనలో ప్రభుత్వ నిబద్ధతను వివరిస్తూ, సుస్థిర ప్రగతి దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషికి ఇదొక నిదర్శనమని ప్రధానమంత్రి నొక్కిచెప్పారు, ‘‘భారతదేశంలో 5000 కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ల ఏర్పాటుకు మేం కృషి చేస్తున్నాం’’ అని వెల్లడించారు. ప్రపంచ పర్యావరణ సమస్యలను ప్రస్తావిస్తూ- ‘‘ప్రపంచ జనాభాలో 17 శాతం భార‌త్‌లోనే నివసిస్తున్నా ప్రపంచ కర్బన ఉద్గారాల్లో మన దేశం 4 శాతం మాత్రమే’’ అని ప్రధాని మోదీ వివరించారు. ‘‘పర్యావరణపరంగా సానుకూల ఇంధన వనరుల అభివృద్ధిపై దృష్టి సారించడం ద్వారా మన ఇంధన సమ్మేళనాన్ని మరింత మెరుగుపరచేందుకు కట్టుబడి ఉన్నాం’’ అని ఆయన స్పష్టం చేశారు. దేశంలో 2070 నాటికి నికర శూన్య ఉద్గార లక్ష్యాన్ని సాధించాలని భారత్ సంకల్పించిందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.

   అలాగే ‘‘పునరుత్పాదక ఇంధన స్థాపిత సామర్థ్యం రీత్యా భారత్ నేడు ప్రపంచంలో నాలుగో స్థానంలో ఉంది’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. దేశంలోని మొత్తం వ్యవస్థాపిత ఇంధన సామర్థ్యంలో 40 శాతం శిలాజ ఇంధన వనరుల నుంచి ఉత్పత్తి అవుతోందని తెలిపారు. మరోవైపు సౌరశక్తి ఉత్పాదనలో దేశ పురోగమనాన్ని ప్రముఖంగా ప్రస్తావిస్తూ- ‘‘గత దశాబ్ద కాలంలో భారత సౌరశక్తి వ్యవస్థాపిత సామర్థ్యం 20 రెట్లు పెరిగింది’’ అని ప్రధాని మోదీ వెల్లడించారు. దీంతో ‘‘సౌరశక్తితో అనుసంధానాన్ని ప్రోత్సహించే కార్యక్రమం భారతదేశంలో ఊపందుకుంది’’ అని ఆయన తెలిపారు.

   ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా కోటి ఇళ్లకు పైకప్పుమీద సౌరశక్తి ఉత్పాదన ఫలకాల ఏర్పాటు లక్ష్యంతో కీలక కార్యక్రమం ప్రారంభించినట్లు తెలిపారు. తద్వారా కోటి కుటుంబాలు ఇంధన స్వావలంబన సాధించడమేగాక వారు అదనంగా ఉత్పత్తి చేసే విద్యుత్తును నేరుగా గ్రిడ్ ద్వారా  ప్రభుత్వానికి  సరఫరా చేయవచ్చునని పేర్కొన్నారు. ఇందుకు తగిన యంత్రాంగాలను కూడా ఏర్పాటు చేయనున్నట్లు శ్రీ మోదీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల పరివర్తనాత్మక ప్రభావాన్ని కూడా ప్రధాని మోదీ విశదీకరించారు. ఈ మేరకు ‘‘మొత్తం సౌరశక్తి విలువ శ్రేణిలో పెట్టుబడులకు అపార అవకాశాలు ఉన్నాయి’’ అని తెలిపారు.

   హరిత ఉదజని రంగంలో భారత్ ప్రగతిని వెల్లడిస్తూ... హైడ్రోజన్ ఉత్పత్తి-ఎగుమతి కూడలిగా మన దేశం మారడానికి మార్గం సుగమం చేస్తూ ‘నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్‌’ను ప్రారంభించామని ప్రధాన మంత్రి తెలిపారు. భారత హరిత ఇంధన రంగం పెట్టుబడిదారులతోపాటు పరిశ్రమలను కూడా తప్పకుండా విజేతలుగా నిలుపుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

   ఇంధన రంగంలో అంతర్జాతీయ సహకారంపై భారత్ నిబద్ధతను ‘ఇండియా ఎనర్జీ వీక్’ కార్యక్రమం ప్రతిబింబిస్తుంది. ఆ మేరకు ‘‘ఇది కేవలం భారతదేశ కార్యక్రమం మాత్రమే కాదు... ‘ప్రపంచంతో భారత్-ప్రపంచం కోసం భారత్‘ భావనకు ప్రతీక’’ అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు.

   ‘‘మన అనుభవాలను పరస్పరం పంచుకుంటూ ముందుకెళ్దాం.. అత్యాధునిక సాంకేతికతలపై సహకరించుకుందాం.. సుస్థిర ఇంధన అభివృద్ధికి మార్గాన్వేషణ చేద్దాం’’ అంటూ సుస్థిర ఇంధన అభివృద్ధిలో సహకారం-విజ్ఞానాల ఆదానప్రదానాన్ని ఆయన ప్రతిపాదించారు.

   చివరగా- పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యంతో సుసంపన్న భవితను రూపుదిద్దుకోవడంపై ప్రధాని మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. ‘‘సమష్టి కృషితో మనం సంపన్న, పర్యావరణ సుస్థిర భవిష్యత్తును నిర్మించగలం’’ అని పేర్కొంటూ ప్రధాని తన ప్రసంగం ముగించారు.

   ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ శ్రీ పి.ఎస్.శ్రీధరన్ పిళ్లై; రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ప్రమోద్ సావంత్; కేంద్ర పెట్రోలియం-సహజ వాయువు శాఖ మంత్రి శ్రీ హర్దీప్ సింగ్ పూరి;  పెట్రోలియం-చమురు- సహజవాయువు శాఖ సహాయ మంత్రి శ్రీ రామేశ్వర్ తెలీ తదితరులు పాల్గొన్నారు.

నేపథ్యం

   ఇంధన అవసరాలరీత్యా స్వావలంబన సాధించడం ప్రధానమంత్రి దార్శనికతలో కీలకాంశం. ఈ దిశగా ఫిబ్రవరి 6 నుంచి 9 వరకు గోవాలో నిర్వహించే ‘ఇండియా ఎనర్జీ వీక్-2024’ రూపంలో మరొక ముందడుగు పడింది. ఇది భారతదేశంలో అతిపెద్ద, ఏకైక ఇంధన శక్తి ప్రదర్శన, సదస్సు కావడం గమనార్హం. భారత ఇంధన పరివర్తన లక్ష్యాల సాధన దిశగా ఇంధన శ్రేణి మొత్తాన్నీ ఒకే వేదికపైకి తెచ్చే ఉత్ప్రేరకంగా ఈ సదస్సు ఉపయోగపడుతుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ అగ్రశ్రేణి ఆయిల్-గ్యాస్ సంస్థల ముఖ్య  కార్యనిర్వహణాధికారులు, నిపుణులతో ప్రధానమంత్రి రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించారు.

   అంకుర సంస్థలకు ప్రోత్సాహం, చేయూతనిస్తూ  ఇంధన విలువ శ్రేణిలో వాటిని ఏకీకృతం చేయడం ‘భారత ఎనర్జీ వీక్-2024’లో ఓ కీలకాంశం. వివిధ దేశాల నుంచి దాదాపు 17 మంది ఇంధనశాఖ  మంత్రులతోపాటు 35,000 మందికిపైగా ప్రతినిధులు, 900కుపైగా ప్రదర్శన సంస్థలు ఇందులో పాల్గొంటారని అంచనా. కెనడా, జర్మనీ, నెదర్లాండ్స్, రష్యా, యు.కె., అమెరికా... ఆరు దేశాల ప్రత్యేక కేంద్రాలు కూడా ఈ ప్రదర్శనలో అంతర్భాగంగా ఉంటాయి. అలాగే ఇంధన రంగంలో భారతీయ ‘ఎంఎస్ఎంఇ’లు అగ్రగాములుగా ఉన్న వినూత్న పరిష్కారాల ప్రదర్శన కోసం ప్రత్యేకంగా ‘మేక్ ఇన్ ఇండియా’ పెవిలియన్ కూడా నిర్వహించబడుతోంది.



(Release ID: 2003130) Visitor Counter : 496