వ్యవసాయ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

వారణాసిలోని ఇండియన్ వెజిటబుల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ లో 2024 ఫిబ్రవరి 3 నుంచి 05 వరకు ప్రాంతీయ రైతు మేళా

Posted On: 02 FEB 2024 3:19PM by PIB Hyderabad

వారణాసిలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ ఆధ్వర్యంలో 2024 ఫిబ్రవరి 3 నుంచి 5వ తేదీ వరకు మూడు రోజుల పాటు షహన్ షాపూర్ క్యాంపస్ లో ప్రాంతీయ వ్యవసాయ ప్రదర్శన జరగనున్నది.  ప్రారంభ సమావేశంలో  ఉత్తరప్రదేశ్ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రి శ్రీ సూర్య ప్రతాప్ షాహి  ముఖ్య అతిథిగా పాల్గొంటారు. .ఈ కార్యక్రమంలో ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హిమాన్షు పాఠక్, ఐసీఏఆర్ సీనియర్ అధికారులు డీడీజీ (ఉద్యానవనాలు), డాక్టర్ సంజయ్ కుమార్ సింగ్(ఎక్సటెన్షన్ ), డాక్టర్ యూఎస్ గౌతమ్, ఐసీఏఆర్ ఏడీజీ డాక్టర్ సుధాకర్ పాండే తదితరులు పాల్గొంటారు.

అధునాతన వ్యవసాయ పద్ధతులు, వ్యవసాయం, పశుపోషణ, చేపల పెంపకం, కూరగాయల అధునాతన సాగు, పాలీహౌస్, హైటెక్ నర్సరీ, సేంద్రియ వ్యవసాయం, ప్రాసెసింగ్  ద్వారా ప్రజారోగ్యం , రైతు సంక్షేమం లక్ష్యంగా ప్రదర్శన  నిర్వహిస్తున్నట్లు ఐఐవీఆర్ డైరెక్టర్ డాక్టర్ తుషార్ కాంతి బెహెరా తెలిపారు. విలువ జోడింపు, వ్యవసాయ యాంత్రీకరణ, డ్రోన్లు, తెగుళ్లు, తెగుళ్ల నిర్వహణ వంటి అంశాలపై సాంకేతిక సదస్సులు  నిర్వహిస్తామని ఆయన వివరించారు. దేశం వివిధ ప్రాంతాలకు చెందిన   వ్యవసాయ నిపుణులు రైతులతో చర్చలు జరుపుతారని ఆయన  తెలిపారు.అసోసియేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఇన్నోవేషన్ ఇన్ వెజిటేబుల్స్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, రాష్ట్ర ప్రభుత్వం, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల సహకారంతో ఈ రైతు మేళా  నిర్వహిస్తున్నారు.  కూరగాయల ప్రదర్శన, వివిధ సంస్థల వ్యవసాయ ఉత్పత్తులు / పనిముట్లు , అమ్మకాలు ప్రాంతీయ రైతు మేళాలో ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. మూడు రోజుల పాటు జరిగే కార్యక్రమంలో  కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, విశ్వవిద్యాలయాలు, ఐసీఏఆర్ సంస్థలు, వాణిజ్య  వ్యవసాయ సంస్థలు, వివిధ కంపెనీలకు చెందిన పలువురు ప్రముఖులు, 6 రాష్ట్రాలకు చెందిన 5 వేల మందికి పైగా రైతులు పాల్గొంటున్నారు.

2022-23 లో దేశంలో రికార్డు స్థాయిలో 330 మిలియన్ టన్నుల ఆహార ధాన్యాలు, 350 మిలియన్ టన్నుల ఉద్యాన ఉత్పత్తులు ఉత్పత్తి అయ్యాయని డాక్టర్ బెహెరా తెలిపారు. దేశం ఆహార ఉత్పత్తిలో స్వయం సమృద్ధి సాధించడమే కాకుండా వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తోంది.  రైతులు, విధాన రూపకర్తలు, శాస్త్రవేత్తలు,వివిధ వర్గాల సహకారంతో వ్యవసాయ రంగం పురోభివృద్ధి సాధించింది.  భవిష్యత్తులో ఆహార, పోషకాహార భద్రత కల్పించడం కోసం  వాతావరణ మార్పులు, నిల్వ, మార్కెటింగ్, ప్రాసెసింగ్, వ్యవసాయం నుంచి స్వయం ఉపాధి వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. 

దేశంలో క్రమబద్ధమైన కూరగాయల పరిశోధనను ప్రోత్సహించడానికి 1999 లో వారణాసిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వెజిటబుల్ రీసెర్చ్ (ఐఐవిఆర్) ఏర్పాటు అయింది.దేశంలో కూరగాయల పరిశోధనకు పూర్తిగా అంకితమైన ఏకైక సంస్థ ఐఐవిఆర్. నూత్న  మెరుగైన కూరగాయల రకాలు,  సాగు,తెగుళ్లు,వ్యాధుల సమర్థవంతమైన నియంత్రణ కోసం  ఐఐవిఆర్లో  పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పటి వరకు 76 బహిరంగ  పరాగసంపర్కం, 12 హైబ్రిడ్ రకాల కూరగాయలను ఈ సంస్థ అభివృద్ధి చేసింది. వీటితో పాటు మెరుగైన రకాల కూరగాయల విత్తనాలను కూడా ఐఐవిఆర్ అభివృద్ధి చేస్తోంది. సంస్థ అభివృద్ధి చేసిన సాంకేతిక పరిజ్ఞానాన్నిక్షేత్ర స్థాయి  ప్రదర్శనలు, రైతు సదస్సులు, శిక్షణ, రైతు మేళాల  మొదలైన వాటి ద్వారా రైతులకు చేరేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. దీనిలో భాగంగా మూడు రోజుల పాటు ప్రాంతీయ మేళా నిర్వహించడానికి ఐఐవిఆర్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మేళాలో పెద్ద సంఖ్యలో పాల్గొని  నిర్వహించే వివిధ కార్యక్రమాల  ద్వారా  ప్రాంత రైతులు  పాల్గొని అధునాతన వ్యవసాయం గురించి సమాచారం పొందాలని డాక్టర్ బెహెరా విజ్ఞప్తి చేశారు.

 

***


(Release ID: 2001978)
Read this release in: English , Urdu , Hindi , Tamil