హోం మంత్రిత్వ శాఖ
అస్సాంలోని తేజ్ పూర్ లో సశస్త్ర సీమా బల్ (ఎస్ ఎస్ బి ) 60వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా
దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన ఎస్ ఎస్ బి వీర జవాన్లకు నివాళులు అర్పించిన హోంమంత్రి
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వం అన్ని సి ఎ పి ఎఫ్ లకు సౌకర్యాలను మెరుగుపరిచేందుకు అనేక చర్యలు తీసుకుంది.
ఇప్పుడు న్యాయం అందించడంలో జాప్యం జరగదు, మూడు కొత్త చట్టాల ద్వారా మూడేళ్లలోనే న్యాయం లభిస్తుంది
కొత్త చట్టాలు భారత న్యాయ వ్యవస్థను ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా మారుస్తాయి.
మోదీ నాయకత్వంలో మూడేళ్లలో దేశం మొత్తం నక్సల్స్ సమస్య నుంచి 100 శాతం విముక్తి పొందుతుంది
సరిహద్దుల భద్రతతో పాటు, సరిహద్దు ప్రాంతాల సాంస్కృతిక, భాషా, భౌగోళిక, చారిత్రక సమాచారాన్ని పరిరక్షించడానికి ఎస్ ఎస్ బికృషి చేస్తోంది
సేవ, భద్రత, సౌభ్రాతృత్వం అనే మంత్రంతో ఎస్ ఎస్ బి చరిత్ర ముడిపడివుంది
మహిళా సాధికారతలో పెద్ద ముందడుగు: 2026 నాటికి ఎస్ ఎస్ బి లో 6% మహిళలు
సరిహద్దు భద్రతా సిబ్బంది పనిభారాన్ని తగ్గించడానికి మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉంది, 2014 నుండి లక్షా 75 వేల ఖాళీలను భర్తీ చేసింది
Posted On:
20 JAN 2024 4:41PM by PIB Hyderabad
అస్సాంలోని తేజ్ పూర్ లో ఉన్న ఎస్ ఎస్ బి రిక్రూట్ మెంట్ ట్రైనింగ్ సెంటర్ లో జరిగిన సశస్త్ర సీమా బల్ (ఎస్ ఎస్ బి) 60వ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో కేంద్ర హోం మంత్రి, సహకార మంత్రి శ్రీ అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అసోం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ, కేంద్ర హోం శాఖ కార్యదర్శి, ఎస్ ఎస్ బి డైరెక్టర్ జనరల్ తదితరులు పాల్గొన్నారు.
దేశ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన 51 మంది జవాన్లకు హోంమంత్రి నివాళులర్పించారు. గత ఏడాది ఐదుగురు ఎస్ ఎస్ బి సిబ్బంది విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయారని గుర్తు చేశారు. దేశ రక్షణ కోసం ప్రాణత్యాగం చేయడానికి వెనుకాడని సైనికుల వల్లే దేశం ప్రశాంతంగా నిద్రపోగలుగు తోందని అన్నారు. పరమ్ వీర్ చక్ర అవార్డు గ్రహీత కరమ్ సింగ్ గవర్ధంతి సందర్భంగా ఆయనను స్మరించుకుంటూ శ్రీ అమిత్ షా, కరమ్ సింగ్ తన జీవితాన్ని త్యాగం చేసి గొప్ప ధైర్యసాహసాలకు ఉదాహరణగా నిలిచారని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గ ఆయన జ్ఞాపకార్థం అండమాన్ , నికోబార్ దీవుల్లోని ఒక ద్వీపానికి కరమ్ సింగ్ ద్వీపం అని నామకరణం చేశారని అన్నారు.
220 కోట్ల రూపాయలతో ఎస్ ఎస్ బికి సంబంధించిన అనేక ప్రాజెక్టులను ఈ రోజు ప్రారంభించామని, 45వ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ వీర్ పూర్, 20వ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ సీతామర్హి, రిజర్వ్ బెటాలియన్ హెడ్ క్వార్టర్స్ బరాసత్ లోహౌసింగ్, బ్యారక్ లు, మెస్ లు, ఆసుపత్రులు, ఇంకా క్వార్టర్ గార్డులు, స్టోర్స్, గ్యారేజీలు వంటి వివిధ సౌకర్యాల ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయని శ్రీ అమిత్ షా తెలిపారు. ప్ర ధాన మంత్రి శ్రీ న రేంద్ర మోదీ గడచిన తొమ్మిదేళ్లలో ఎస్ ఎస్ బితో సహా అన్ని కేంద్ర సాయుధ పారామిలిటరీ దళాల (సిఎపిఎఫ్) సౌకర్యాలను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకున్నారని ఆయన తెలిపారు. ఎస్ ఎస్ బి 60వ వజ్రోత్సవాన్ని పురస్కరించుకుని భారత ప్రభుత్వం పోస్టల్ స్టాంపును విడుదల చేసిందని తెలిపారు. ఈ పోస్టల్ స్టాంప్ ఎప్పటికీ దేశం ముందు ఎస్ ఎస్ బి కర్తవ్యాన్ని సజీవంగా ఉంచుతుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.
సేవ, భద్రత, సోదర భావం నినాదంతో దేశ సేవ, భద్రతలో నిమగ్నమైన ఎస్ ఎస్ బీకి ఎంతో ఘనమైన చరిత్ర ఉందన్నారు. భారత్-చైనా యుద్ధం తర్వాత 1963లో ఎస్ ఎస్ బి ఏర్పాటైంది. ఆ తర్వాత అటల్ జీ ఒకే సరిహద్దు- ఒకే దళం (వన్ బోర్డర్, వన్ ఫోర్స్) విధానాన్ని అమలు చేసినప్పుడు ఎస్ఎస్ బి 2001 నుంచి భారత్-నేపాల్ సరిహద్దును, 2004 నుంచి భారత్-భూటాన్ సరిహద్దులను ఎంతో బాధ్యతాయుతంగా నిర్వహిస్తోంది. 2,450 కిలోమీటర్ల పొడవైన ఓపెన్ బోర్డర్లను ఎస్ ఎస్ బి పూర్తి అప్రమత్తతతో కాపాడుతోందని, అది అడవి, పర్వతం, నది లేదా పీఠభూమి ఏదైనా సరే, ఎస్ఎస్ బి సిబ్బంది ఎటువంటి వాతావరణంలో అయినా రాజీ పడకుండా విధులు నిర్వహిస్తున్నారని ఆయన అన్నారు.
సరిహద్దులను పరిరక్షించే అన్ని సిఎపిఎఫ్ లలో ఎస్ ఎస్ బి ఒక ప్రత్యేకమైన సంస్థ అని, ఇది సరిహద్దులను సురక్షితంగా ఉంచడమే కాకుండా, క్లిష్టమైన ప్రాంతాల్లో ఉగ్రవాదులు, నక్సలైట్లను కూడా ఎదుర్కొందని శ్రీ అమిత్ షా అన్నారు. భారత్-చైనా, భారత్-నేపాల్, భారత్-భూటాన్ సరిహద్దులకు సమీపంలో ఉన్న అన్ని గ్రామాల సాంస్కృతిక, భాషా, భౌగోళిక, చారిత్రక సమాచారాన్ని క్షుణ్ణంగా భద్రపరిచే పనిని కూడా ఈ దళం చేసింది. ఇటువంటి గ్రామాలన్నింటినీ వారి సాంస్కృతిక, భాషా చరిత్ర ద్వారా దేశంతో అనుసంధానించడానికి ఈ ప్రత్యేకమైన పని సహాయపడుతుందని, సరిహద్దు వివాదాలు ఎక్కడ ఉన్నా భారతదేశ వాదనను ధృవీకరించడానికి, బలోపేతం చేయడానికి కూడా ఇది సహాయపడుతుందని ఆయన అన్నారు. ఈ కార్యకలాపాలు ఎస్ ఎస్ బి బహుముఖ ప్రజ్ఞను ప్రదర్శిస్తాయని, భారతదేశ సరిహద్దుల సాంస్కృతిక సమగ్రతను కాపాడటంలో, వివాదాస్పద ప్రాంతాల్లో భారతదేశ వాదనలను బలోపేతం చేయడంలో దేశానికి ఎంతో ప్రయోజనం చేకూర్చాయని ఆయన అన్నారు.
గత ఏడాది కాలంలో ఎస్ ఎస్ బి ఐదు వేలకు పైగా స్మగ్లర్లను అరెస్టు చేసిందని, 24 వేల కిలోల మాదకద్రవ్యాలు, 144 ఆయుధాలు, భారీ మొత్తంలో మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకుందని కేంద్ర హోం , సహకార మంత్రి తెలిపారు. మానవ అక్రమ రవాణా నుంచి సుమారు 500 మంది అమాయకులను కాపాడింది. నేపాల్, భూటాన్ వంటి మిత్ర దేశాలతో సరిహద్దులను రక్షించడంతో పాటు ఛత్తీస్ గఢ్, జార్ఖండ్, బీహార్ నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో కూడా ఎస్ ఎస్ బి సైనికులు విధులు నిర్వహిస్తున్నారని తెలిపారు. సిఆర్ పి ఎఫ్, బిఎస్ఎఫ్ తో కలిసి ఎస్ ఎస్ బి నక్సల్స్ ఉద్యమాన్ని అణచివేసిందన్నారు. ప్రధాన మంత్రి శ్రీ న రేంద్ర మోదీ నాయకత్వంలో వచ్చే మూడేండ్లలో దేశం మొత్తం నక్సల్స్ సమస్య నుంచి 100 శాతం విముక్తం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. జమ్ముకశ్మీర్ లో ఉగ్రవాదంపై పోరులో సిఆర్ పిఎఫ్ , బిఎస్ ఎఫ్ , జమ్మూకశ్మీర్ పోలీసులు, ఆర్మీతో కలిసి ఎస్ ఎస్ బి జవాన్లు భుజం భుజం కలిపి పోరాడి, త్యాగాలు చేసి, తమ ధైర్యసాహసాలకు సంబంధించిన ఇతిహాస గాథలను లిఖించారని అన్నారు.
ఎస్ ఎస్ బి క్రీడారంగంలో కూడా మంచి పనితీరు కనబరిచిందని శ్రీ అమిత్ షా అన్నారు. జాతీయ, అంతర్జాతీయ పోటీలలో ఎస్ ఎస్ బి ఈ ఏడాది 234 పతకాలు సాధించిందన్నారు. మన సి ఎ పి ఎఫ్ లలో క్రీడలను ప్రోత్సహించేందుకు కేంద్ర స్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాలని కేంద్ర హోంశాఖ నిర్ణయించిందని, త్వరలోనే ఈ విధానం ముందుకు రానుందని తెలిపారు. శాస్త్రీయ ఏర్పాట్లతో బ్యారక్ స్థాయిలో ఈ విధానం ప్రయోజనాలు ఎలా లభిస్తాయో తాను స్వయంగా పరిశీలిస్తున్నానని, హోం కార్యదర్శి కూడా దీనిని పర్యవేక్షిస్తున్నారని శ్రీ షా చెప్పారు. ఆసియా క్రీడల్లో అథ్లెటిక్స్ లో కాంస్య పతకం సాధించిన ఎస్ ఎస్ బి జవాన్లను శ్రీ షా అభినందించారు.
మహిళా సాధికారత రంగంలో ఎస్ ఎస్ బి చేస్తున్న కృషిని కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి కొనియాడారు. 2026 నాటికి ఫోర్స్ లో మహిళా సిబ్బంది సంఖ్యను ఆరు శాతానికి పెంచాలని ఎస్ ఎస్ బి లక్ష్యంగా పెట్టుకుందని, ఇప్పటికే 4 శాతం లక్ష్యాన్ని సాధించిందని ఆయన చెప్పారు. వీటితో పాటు ఎస్ ఎస్ బి మహిళా సైనికులు ఐక్యరాజ్యసమితి మిషన్, అమర్నాథ్ యాత్ర వంటి సవాళ్లు ఎదురయ్యే విధుల్లో కూడా పాల్గొన్నారు.
వైబ్రంట్ విలేజ్ స్కీమ్ అనేది సరిహద్దు గ్రామాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇచ్చిన కానుక అని శ్రీ అమిత్ షా అన్నారు. సరిహద్దు గ్రామం దేశానికి చివరి గ్రామం కాదని, దేశంలోనే మొదటి గ్రామం అనే కొత్త భావనతో ఈ పథకాన్ని తీసుకొచ్చామని, దేశం అక్కడి నుంచే ప్రారంభమవుతుందని చెప్పారు. మోదీ ప్రభుత్వం ఈ కొత్త కాన్సెప్ట్, వర్క్ కల్చర్ తో ముందుకు వెళ్తోందన్నారు. ఎస్ ఎస్ బి కూడా 100 శాతం సంతృప్తతతో గ్రామాల సమగ్రాభివృద్ధికి మంచి పనిచేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాలను క్షేత్రస్థాయికి తీసుకెళ్లడంలో ఎస్ ఎస్ బి కీలక పాత్ర పోషించింది. సరిహద్దు భద్రతలో గ్రామస్థులను భాగస్వాములను చేసేందుకు ఎస్ ఎస్ బి మంచి నమూనాను కూడా సిద్ధం చేసింది.
శ్రీ నరేంద్ర మోదీ దేశ ప్రధాని అయినప్పటి నుండి, ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయడానికి ,సరిహద్దు భద్రతా సిబ్బంది పనిభారాన్ని పంచడానికి ఒక పెద్ద ప్రచారాన్ని ప్రారంభించినట్లు హోం మంత్రి తెలిపారు. 2014 నుంచి ఇప్పటి వరకు లక్షా 75 వేల ఉద్యోగాల భర్తీ పూర్తయిందన్నారు. ఇది ఇతర తొమ్మిదేళ్ల కాలంలో జరిగే నియామకాల కంటే రెట్టింపు. సి ఎ పి ఎఫ్ సిబ్బంది పనిభారాన్ని తగ్గించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందని దీన్ని బట్టి అర్థమవుతోంది. అర్హత కలిగిన అభ్యర్థుల నియామకం, ఎంపికను వేగవంతం చేయడానికి గత సంవత్సరాల్లో, ఎన్ సి సి క్యాడెట్లకు బోనస్ మార్కులు ఇచ్చారు. సరిహద్దు జిల్లాలు, తీవ్రవాద ప్రభావిత జిల్లాలకు చెందిన యువతకు ప్రాధాన్యం ఇచ్చారు. కొవిడ్ కారణంగా కోల్పోయిన సమయాన్ని భర్తీ చేసేందుకు వయోపరిమితిలో మూడేళ్ల సడలింపు ఇచ్చారు. దీనికి అదనంగా మోదీ ప్రభుత్వం అగ్నిపథ్ పథకం కింద అగ్ని వీరులకు పది శాతం రిజర్వేషన్లు కల్పించింది.
దేశంలోని క్రిమినల్ న్యాయ వ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పు తీసుకురావడానికి మూడు చట్టాలను కొత్త రూపంలో తీసుకువచ్చి దేశ ప్రజల ముందు ఉంచామని శ్రీ అమిత్ షా చెప్పారు. ఈ చట్టాల ఉద్దేశం దేశ ప్రజలకు న్యాయం చేయడమే కాగా, మునుపటి చట్టాల ఉద్దేశం శిక్షించడం. ఇప్పుడు ఎఫ్ఐఆర్ తర్వాత మొత్తం ప్రక్రియ మూడేళ్లలో పూర్తవుతుంది. న్యాయంలో జాప్యం ఇక ఉండదు. ఈ చట్టాల అమలుతో మన క్రిమినల్ జస్టిస్ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత ఆధునికంగా మారుతుందని, ఇందులో ఫోరెన్సిక్స్ కు చాలా ప్రాముఖ్యత ఇచ్చినందున శిక్షల రేటు కూడా బాగా పెరుగుతుందని ఆయన అన్నారు. ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ శిక్ష పడే అన్ని నేరాలకు ఫోరెన్సిక్ అధికారి సందర్శనను చట్టప్రకారం తప్పనిసరి చేసినట్లు తెలిపారు.
అన్ని ఎస్ ఎస్ బి యూనిట్లు స్థానిక గ్రామాల నుండి పాలు, పనీర్, పండ్లు, కూరగాయలు ధాన్యాలను కొనుగోలు చేస్తున్నాయని, ఇది గ్రామాల్లో ఉపాధి , ఆర్థిక అభివృద్ధికి పెద్ద ప్రయత్నమని హోం మంత్రి అన్నారు. వీటితో పాటు బేటీ బచావో బేటీ పడావో, స్వచ్ఛ భారత్ మిషన్, నీటి సంరక్షణ, సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధం, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్, ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వంటి రంగాల్లో కూడా ఎస్ ఎస్ బి మంచి పనులు చేసింది. చెట్ల పెంపకం కార్యక్రమాన్ని వేగవంతం చేయడానికి, ఐదు సంవత్సరాలలో సిఎపిఎఫ్ ద్వారా 5 కోట్లకు పైగా చెట్లను నాటారు.
ఆయుష్మాన్ సి ఎ పి ఎఫ్ కింద 40 లక్షల మందికి పైగా సి ఎ పి ఎఫ్ సిబ్బందికి కార్డులు ఇచ్చామని, గృహనిర్మాణ పథకం కింద గత ఐదేళ్లలో 11,000 కొత్త ఇళ్లు నిర్మించామని, ఇ-ఆవాస్ పోర్టల్ ద్వారా సుమారు 52,000 ఖాళీ ఇళ్లను కేటాయించామని, ప్రధానమంత్రి స్కాలర్ షిప్ పథకాన్ని ప్రతి చిన్నారికి చేరేలా శాస్త్రీయంగా తీర్చిదిద్దామని అమిత్ షా తెలిపారు. వీటితో పాటు కేంద్రీయ పోలీస్ కళ్యాణ్ భండార్ నిబంధనలను కూడా సరళతరం చేశారు.
***
(Release ID: 1998250)
Visitor Counter : 140