నౌకారవాణా మంత్రిత్వ శాఖ

శ్రీ సర్బానంద సోనోవాల్ అధ్యక్షతన కోల్‌కతాలో రేపు జరగనున్న అంతర్గత జలమార్గాల అభివృద్ధి మండలి తొలి సమావేశం


'రివర్ క్రూయిజ్ టూరిజం రోడ్‌మ్యాప్ 2047'తో పాటు 'హరిత్ నౌక' మార్గదర్శకాలు విడుదల చేయనున్న శ్రీ సోనోవాల్

అంతర్గత జల మార్గాల అభివృద్ధి ప్రణాళిక సిద్ధం చేయనున్న అంతర్గత జలమార్గాల అభివృద్ధి మండలి తొలి సమావేశం

Posted On: 07 JAN 2024 4:16PM by PIB Hyderabad

 అంతర్గత జలమార్గాల అభివృద్ధి మండలి తొలి సమావేశం రేపు  కోల్‌కతాలో జరగనున్నది. కేంద్ర 

నౌకాశ్రయాలు, షిప్పింగ్ మరియు జలమార్గాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని జరగనున్న సమావేశంలో కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ & జలమార్గాలు మరియు ఆయుష్ శాఖ మంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్‌ అధ్యక్షత వహిస్తారు.  MV గంగా క్వీన్‌పై ఒక రోజంతా  సమావేశం జరుగుతుంది.  సమావేశంలో శ్రీ సర్బానంద సోనోవాల్ తో పాటు కేంద్ర    ఓడరేవులు, షిప్పింగ్, జలమార్గాల శాఖ  సహాయ మంత్రులు శ్రీ శ్రీపాద్ నాయక్ , శ్రీ శంతను ఠాకూర్‌ వివిధ రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన మంత్రులు,  ప్రధాన కార్యదర్శులు/కార్యదర్శులు, అనేక మంది కేంద్ర ప్రభుత్వ సీనియర్ అధికారులు, షిప్పింగ్ రంగానికి చెందిన  నిపుణులు పాల్గొంటారు. 

 సమావేశంలో "హరిత్ నౌక - లోతట్టు నౌకల గ్రీన్ ట్రాన్సిషన్ కోసం మార్గదర్శకాలు"  "రివర్ క్రూయిజ్ టూరిజం రోడ్‌మ్యాప్ 2047" లను శ్రీ సర్బానంద సోనోవాల్ ఆవిష్కరిస్తారు.కార్యక్రమంలో  అనేక అవగాహన ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది. లోతట్టు జలమార్గాలు  అనుబంధ రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను ఈ ఒప్పందాలు వేగవంతం చేస్తాయి. 

దేశంలో అంతర్గత జలమార్గాల అభివృద్ధిలో ఎదురవుతున్న  సమస్యలను చర్చించి, పరిష్కార మార్గాలను సూచించడానికి సమావేశంలో చర్చలు జరుగుతాయి.అభివృద్ధి, ప్రైవేటు రంగం భాగస్వామ్యం, ఉత్తమ విధానాలు,  ఇన్‌ల్యాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ (IWT) రవాణా సామర్థ్యాన్ని ఎక్కువ  చేయడం, ప్రయాణీకుల రవాణా కోసం పర్యావరణ అనుకూల నౌకలను ప్రోత్సహించడం, అభివృద్ధి చేయడం, రివర్ క్రూయిజ్ టూరిజం  ఆర్థిక ప్రయోజనాలను అన్వేషించడం వంటి అంశాలను సమావేశంలో చర్చిస్తారు. 

మారిటైమ్ ఇండియా విజన్ 2030లో పేర్కొన్న లక్ష్యాలకు అనుగుణంగా  అంతర్గత జలమార్గాల రవాణా వ్యవస్థ ల్ వాటాను ప్రస్తుత 2% నుండి 5%కి పెంచాలని  మంత్రిత్వ శాఖ నిర్ణయించింది.దీనిలో  భాగంగా ప్రతిష్టాత్మకమైన మారిటైమ్ అమృత్ కాల్ విజన్ 2047 కింద అంతర్గత జలమార్గాల ద్వారా ప్రస్తుతం ఏడాదికి  120 ఎంటీ వరకు ఉన్న రవాణాను ఏడాదికి 500 ఎంటీ వరకు పెంచాలని  మంత్రిత్వ శాఖ  లక్ష్యంగా పెట్టుకుంది,  దేశంలో అంతర్గత జలమార్గాల అభివృద్ధికి మంత్రిత్వ శాఖ నిర్ణయం సహకరిస్తుంది. 

పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో 16,300 కోట్ల రూపాయల వ్యయంతో సాగరమాల కార్యక్రమం కింద  62 ప్రాజెక్టులు అమలు జరుగుతున్నాయి. వీటిలో రూ. 1,100 కోట్ల విలువ చేసే  19 ప్రాజెక్టులు పూర్తి అయ్యాయి. 43 ప్రాజెక్టులు, మొత్తం రూ. 15 వేల కోట్లు అమలులో వివిధ దశల్లో ఉన్నాయి. ఈ 11 ప్రాజెక్టుల నిర్మాణం కోసం పోర్టులు, షిప్పింగ్ , జలమార్గాల మంత్రిత్వ శాఖ దాదాపు రూ.  650 కోట్లు సమకూర్చింది. ఈ ప్రాజెక్టులు  గణనీయమైన పురోగతిని సాధిస్తున్నాయి. 400 కోట్ల రూపాయల ఖర్చుతో  చేపట్టిన  ఆరు ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది.  రూ. 250 కోట్లతో చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం వివిధ దశల్లో ఉంది. 

రహదారి సౌకర్యాన్ని మెరుగుపరచడం, పోర్ట్  వాణిజ్య వినియోగదారులకు సౌకర్యాలు కల్పించడం,   కోల్‌కతా పోర్ట్‌లోని EJC యార్డ్‌లో ట్రాక్‌ల అప్‌గ్రేడేషన్ కోసం  రూ. 47 కోట్ల ప్రాజెక్టు ద్వారా  భద్రత  సామర్థ్యం మెరుగు పరచడానికి చేపట్టిన పనులు విజయవంతం అయ్యాయి.  సాగరమాల పథకం కింద 100% ఆర్థిక సహాయంతో ఐఐటీ  ఖరగ్‌పూర్‌లో ఇన్‌ల్యాండ్ , కోస్టల్ మారిటైమ్ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయడం ,రూ. 17.7 కోట్ల ఖర్చుతో  హుగ్లీ/భాగీరథి బ్లాక్ , PS కళ్యాణి నదియా జిల్లా నది ఎడమ ఒడ్డున కోత అరికట్టి  స్థానిక ప్రజల  జీవనోపాధి కాపాడడం లక్ష్యంగా త్వరలో ప్రాజెక్టులు అమలు జరగనున్నాయి. 

 జలమార్గాల సమగ్ర అభివృద్ధి, సరుకు రవాణా అభివృద్ధి, ప్రయాణీకుల కదలిక , రివర్ క్రూయిజ్ టూరిజం కోసం కేంద్ర ప్రభుత్వం 2023 అక్టోబర్ లో  అంతర్గత జలమార్గాల అభివృద్ధి మండలి ని ఏర్పాటు చేసింది. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారంతో అభివృద్ధి కార్యక్రమాలు అమలు జరుగుతున్నాయి. 

 

***



(Release ID: 1994038) Visitor Counter : 137