ప్రధాన మంత్రి కార్యాలయం

ఒమన్ సుల్తాన్ తో జరిగిన ప్రతినిధివర్గం స్థాయి చర్చల సమయంలో ప్రధానమంత్రి ప్రారంభోపన్యాసం (16 డిసెంబరు 2023)

Posted On: 16 DEC 2023 6:27PM by PIB Hyderabad

యువర్ మెజెస్టీ,

ఉభయ దేశాల ప్రతినిధి వర్గాల సభ్యులారా

మీ అందరినీ భారతదేశానికి ఆహ్వానించడం నాకు చాలా ఆనందంగా ఉంది.

నేడు భారత, ఒమన్ సంబంధాల్లో ఒక చారిత్రక దినం.

26 సంవత్సరాల తర్వాత ఒమన్ సుల్తాను భారతదేశంలో అధికారికంగా పర్యటిస్తున్నారు.

140 కోట్ల మంది భారతీయులతో కలిసి మీ అందరికీ  ఆహ్వానం పలికే అవకాశం నాకు ఏర్పడింది.

దేశవాసులందరి తరఫున మీ అందరినీ హృద‌యపూర్వకంగా అభినందిస్తున్నాను.

మిత్రులారా,

భారత, ఒమన్  ల మధ్య శతాబ్దాలుగా విడదీయరాని స్నేహబంధం ఉంది.

అరేబియన్  సముద్రానికి ఒక దిశలో భారత్  ఉంటే మరో వైపు ఒమన్ ఉంది.

మన సన్నిహిత బంధం భౌగోళికంగానే సన్నిహితం కాదు, వేలాది సంవత్సరాల వాణిజ్య, సాంస్కృతిక బంధంతో పాటు మన ఉమ్మడి ప్రాధాన్యతల బంధం ఉంది.

సముజ్వలమైన చరిత్ర మన బలం, మనం సమున్నతమైన భవిష్యత్తును నిర్మిస్తున్నాం.

నేడు మనం సరికొత్త ‘‘ఇండియా-ఒమన్  ఉమ్మడి విజన్-భవిష్యత్  కోసం భాగస్వామ్యం’’ పత్రాన్ని  ఆమోదించుకుంటున్నాం.

ఈ ఉమ్మడి విజన్ మన భాగస్వామ్యానికి కొత్త, ఆధునిక రూపం అందిస్తుంది.

ఉభయ దేశాల మధ్య సెపా ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయని తెలియచేసేందుకు నేను ఆనందిస్తున్నాను.

ఇప్పటికే రెండు విడతల చర్చలు ఇప్పటికే పూర్తయ్యాయి. అనేక కీలక అంశాలపై ఏకాభిప్రాయం ఏర్పడింది.  

తొందరలోనే ఈ ఒప్పందంపై  సంతకాలు చేయగలమని నేను ఆశిస్తున్నాను. మన ఆర్థిక బంధంలో ఇది ఒక కొత్త అధ్యాయాన్ని ఆవిష్కరిస్తుంది.

ప్రపంచ వ్యవహారాల్లో కూడా భారత, ఒమన్  లు సన్నిహిత సహకారంతో ముందుకు సాగుతున్నాయి.

జి-20కి భారత అధ్యక్షత విజయవంతం కావడంలో గెస్ట్  దేశంగా వ్యవహరించిన ఒమన్ అమూల్యమైన వాటా అందించింది.

భారీ సంఖ్యలో భారతీయ  సంతతి ప్రజలు ఒమన్  ను  తమ రెండో మాతృదేశంగా భావిస్తున్నారు.

మన సన్నిహిత బంధానికి,  స్నేహ బంధానికి ఈ ప్రజలు సజీవ ఉదాహరణలు.

వారందరూ సుఖసంతోషాలతో జీవిస్తున్నందుకు హిజ్  మెజెస్టీ సుల్తాన్  హైతమ్  కు నేను వ్యక్తిగతంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను.

ప్రతీ రంగంలోను బహుముఖీన సహకారాన్ని మరింత పటిష్ఠం చేయడానికి నేటి సమావేశం దోహదపడుతుందని నేను నమ్ముతున్నాను.

యువర్  మెజెస్టీ,

మరోసారి మీ అందరినీ భారతదేశానికి ఆహ్వానిస్తున్నాను.

గత నెలలో ఒమన్  2024 టి-20 క్రికెట్  వరల్డ్  కప్  కు అర్హత సాధించింది. నేను మీ అందరికీ అభినందనలు, శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.

నేను ఇప్పుడు మీ ప్రారంభోపన్యాసానికి ఆహ్వానిస్తున్నాను.

గమనిక :  ప్రధానమంత్రి హిందీ ప్రసంగానికి ఇది అనువాదం మాత్రమే. 



(Release ID: 1988151) Visitor Counter : 83