ప్రధాన మంత్రి కార్యాలయం

డిసెంబరు 17-18 తేదీల్లో సూరత్.. వారణాసి నగరాల్లో ప్రధాని పర్యటన


వారణాసిలో రూ.19,150 కోట్లకుపైగా విలువైన పలు
అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన.. ప్రారంభోత్సవం;

వారణాసిలో వరుసగా 2 రోజులు వికసిత భారతం
సంకల్ప యాత్రలో పాల్గొననున్న ప్రధానమంత్రి;

స్వరవేద మహామందిర్‌ను ప్రారంభించనున్న ప్రధాని;

కాశీ తమిళ సంగమం-2023కు ప్రధాని శ్రీకారం;

వారణాసి-న్యూఢిల్లీ వందే భారత్ ఎక్స్‌ ప్రెస్‌ను జెండా ఊపి సాగనంపనున్న ప్రధాని;
నిరంతరాయ పర్యాటక అనుభవం దిశగా ఏకీకృత పర్యాటక పాసుల వ్యవస్థ ప్రారంభం;

సూరత్ విమానాశ్రయంలో కొత్త సమీకృత టెర్మినల్ భవనం ప్రారంభం;
సూరత్ నగరంలో అంతర్జాతీయ వజ్రాల విపణికి ప్రధాని ప్రారంభోత్సవం

Posted On: 16 DEC 2023 10:39AM by PIB Hyderabad

   ప్రధానమంత్రి నరేంద్ర మోదీ డిసెంబరు 17-18 తేదీలలో గుజరాత్‌లోని సూరత్, ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నగరాల్లో పర్యటిస్తారు. ఈ మేరకు 17వ తేదీ ఉదయం 10:45 గంటలకు సూరత్ విమానాశ్రయంలో కొత్త సమీకృత టెర్మినల్ భవనాన్ని ఆయన ప్రారంభిస్తారు. అటుపైన 11:15 గంటలకు సూరత్ వజ్రాల విపణికి ప్రారంభోత్సవం చేస్తారు. అక్కడి నుంచి వారణాసికి వెళ్లి మధ్యాహ్నం 3:30 గంటలకు వికసిత భారతం సంకల్ప యాత్రలో పాల్గొంటారు. అనంతరం సాయంత్రం 5:15 గంటలకు నమో ఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం-2023కు శ్రీకారం చుడతారు.

   అలాగే డిసెంబరు 18వ తేదీ ఉదయం 10:45 గంటలకు స్వరవేద మహామందిర్‌ను ప్రధాని సందర్శిస్తారు. ఆ తర్వాత ఉదయం 11:30 గంటలకు ప్రజల సమక్షంలో ప్రారంభోత్సవం చేస్తారు. మధ్యాహ్నం 1:00 గంటకు వికసిత భారతం సంకల్ప యాత్రలో పాల్గొంటారు. అటుపైన మధ్యాహ్నం 2:15 గంటలకు బహిరంగ సభలో రూ.19,150 కోట్లకుపైగా వ్యయంతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు.

సూరత్‌లో ప్రధానమంత్రి

   సూరత్ విమానాశ్రయంలో కొత్త సమీకృత టెర్మినల్ భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తారు. అధిక రద్దీ సమయంలో ఈ భవనం 1200 మంది దేశీయ, 600 మంది అంతర్జాతీయ ప్రయాణీకుల లావాదేవీలను నిర్వహించగలదు. ఈ సామర్థ్యాన్ని 3000 మంది స్థాయికి పెంచే సదుపాయాలు కూడా ఇక్కడ ఉన్నాయి. మొత్తంమీద దీని వార్షిక ప్రయాణిక నిర్వహణ సామర్థ్యం 55 లక్షలకు పెరుగుతుంది. ఈ టెర్మినల్ భవనం సూరత్ నగరానికి ప్రవేశ ద్వారం వంటిది కావడంతో స్థానిక సంస్కృతి-వారసత్వం ఉట్టిపడేలా దీన్ని రూపొందించారు. అలాగే వెలుపలే కాకుండా లోపల కూడా ఆ సంప్రదాయాన్ని ప్రతిబింబించేలా అలంకరించారు. సందర్శకులకు ఆత్మీయ భావన కలిగించేలా ఈ ప్రదేశాన్ని రూపుదిద్దారు. ఉన్నతీకరించబడిన టెర్మినల్ భవనం ముందుభాగాన్ని సూరత్ నగరంలోని ‘రాండర్’ ప్రాంతంలోగల ప్రాచీన గృహాల సుసంపన్న-సంప్రదాయ కొయ్యపనితో ప్రయాణికులకు కనువిందు చేసేలా తీర్చిదిద్దారు. ఈ భవనం ‘గృహ-4’ నిబంధనలకు అనుగుణంగా నిర్మితమైంది. ఈ మేరకు రెండు పొరల పైకప్పు వ్యవస్థ, విద్యుత్ పొదుపు కోసం వెలుగు ప్రసరించే పందిళ్లు, తక్కువ ఉష్ణాన్ని గ్రహించి, రెట్టింపు వెలుగునిచ్చే యూనిట్, వాననీటి సంరక్షణ ఏర్పాటు, జలశుద్ధి ప్లాంటు, మురుగుశుద్ధి యంత్రాగారం వగైరాలు కూడా ఏర్పాటు చేశారు. ఈ ప్లాంట్లలో శుద్ధి చేసిన నీటిని పచ్చిక బయళ్లు, సౌరశక్తి ప్లాంట్ల కోసం వినియోగిస్తారు.

   సూరత్ నగర సందర్శనలో భాగంగా ప్రధానమంత్రి ప్రపంచ స్థాయి వజ్రాల విపణిని ప్రారంభిస్తారు. అంతర్జాతీయ వజ్రాలు-ఆభరణాల వ్యాపారానికి ఇది ప్రపంచంలోనే అతిపెద్ద, ఆధునిక కూడలి కాగలదు. ఇది ముడి, సానపట్టిన వజ్రాలు-ఆభరణాల వ్యాపారానికి అంతర్జాతీయ కేంద్రంగా ఉంటుంది. ఎగుమతి-దిగుమతుల కోసం ఇందులో అత్యాధునిక ‘కస్టమ్స్ అనుమతి కేంద్రం’ ఏర్పాటు చేయబడింది. ఇక వజ్రాల చిల్లర వ్యాపార నిర్వహణకు జువెలరీ మాల్, అంతర్జాతీయ బ్యాంకింగ్ సదుపాయంతోపాటు సేఫ్ వాల్టుల సౌకర్యం కూడా ఉంటుంది.

వారణాసిలో ప్రధానమంత్రి

   ప్రధానమంత్రి డిసెంబరు 17న నగరంలోని కట్టింగ్ స్మారక పాఠశాల మైదానంలో వికసిత భారతం సంకల్ప యాత్రలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పిఎం ఆవాస్, పీఎం స్వానిధి, పీఎం ఉజ్వల తదితర ప్రభుత్వ ప్రధాన పథకాల లబ్ధిదారులతో ఆయన సంభాషిస్తారు.

   అలాగే ‘ఒకే భారతం-శ్రేష్ట భారతం’పై తన దృక్కోణం మేరకు నమోఘాట్ వద్ద కాశీ తమిళ సంగమం-2023కు ప్రధాని శ్రీకారం చుడతారు. అలాగే కన్యాకుమారి-వారణాసి తమిళ సంగమం కొత్త రైలును ఆయన జెండా ఊపి సాగనంపుతారు.

   ఇక డిసెంబరు 18న వారణాసిలోని ఉమరహాలో నిర్మించిన సరికొత్త స్వరవేద మహామందిర్‌ను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అనంతరం అక్కడ భక్తులనుద్దేశించి ప్రసంగిస్తారు. అటుపైన తన నియోజకవర్గమైన వారణాసిలోని గ్రామీణ ప్రాంతం సేవాపురిలో వికసిత భారతం సంకల్ప యాత్రలో పాల్గొంటారు. ఈ సందర్భంగా కాశీ పార్లమెంటు స్థానం క్రీడా పోటీలు-2023లో కొన్ని క్రీడా పోటీలను ఆయన ప్రత్యక్షంగా తిలకించి, విజేతలతో కాసేపు ముచ్చటిస్తారు. అలాగే వివిధ ప్రభుత్వ పథకాల లబ్ధిదారులతోనూ ప్రధాని సంభాషిస్తారు.

   వారణాసి ముఖచిత్రాన్ని పరివర్తనాత్మకంగా తీర్చిదిద్దడంపై గడచిన తొమ్మిదేళ్లలో ప్రధానమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఇందులో భాగంగా నగరంతోపాటు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ జీవన సౌలభ్యం కల్పన లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ఈ మేరకు రూ.19,150 కోట్లకుపైగా వ్యయంతో చేపట్టే, పూర్తయిన ప్రాజెక్టులకు ప్రధాని శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు.

   ఈ కార్యక్రమాల్లో భాగంగా పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ్ నగర్-న్యూ భౌపూర్ మధ్య దాదాపు రూ.10,900 కోట్ల వ్యయంతో నిర్మించిన సరకు రవాణా ప్రత్యేక కారిడార్ ప్రాజెక్టును ప్రధాని ప్రారంభిస్తారు. అలాగే బల్లియా-ఘాజీపూర్ సిటీ రైలు మార్గం డబ్లింగ్; ఇందార-దోహ్రిఘాట్ రైలు మార్గం గేజ్ మార్పిడి తదితరాలను కూడా ఆయన ప్రారంభిస్తారు.

   వారణాసి-న్యూఢిల్లీ వందేభారత్ ఎక్స్‌ ప్రెస్ రైలు, దోహ్రీఘాట్-మౌ మధ్య మెము రైలుసహా ఒక జత సుదూర గూడ్స్ రైళ్లను కొత్త రవాణా కారిడార్‌లో ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. బనారస్ లోకోమోటివ్ వర్క్స్ తయారు చేసిన 10,000వ ఇంజన్‌ను కూడా ఆయన జెండా ఊపి సాగనంపుతారు.

   మొత్తం రూ.370 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించిన రెండు రోడ్డు ఓవర్ బ్రిడ్జిలతోపాటు శివ్‌పూర్-ఫుల్వారియా-లహర్తారా కొత్త రహదారిని కూడా ప్రధాని ప్రారంభిస్తారు. దీంతో వారణాసి నగర ఉత్తర- దక్షిణ ప్రాంతాల మధ్య వాహన రాకపోకల సౌలభ్యానికి తోడ్పడుతుంది. అలాగే పర్యాటకులు, సందర్శకులకు సౌకర్యం మరింత పెరుగుతుంది. ప్రధాని ప్రారంభించే మరిన్ని కీలక ప్రాజెక్టులలో 20 రోడ్ల బలోపేతం-విస్తరణ; కైతి గ్రామంలో సంగం ఘాట్ రోడ్డుతోపాటు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ ఆస్పత్రిలో నివాస భవనాల నిర్మాణానికి శ్రీకారం చుడతారు.

   అంతేకాకుండా పోలీసు సిబ్బంది గృహావసరాలు తీర్చడంలో భాగంగా పోలీస్ లైన్, పిఎసి భుల్లన్‌పూర్‌లలో 200, 150 పడకలతో నిర్మించిన బహుళ అంతస్తుల బ్యారక్ భవనాలను ప్రధాని ప్రారంభిస్తారు. అలాగే 9 ప్రదేశాల్లో నిర్మించిన అత్యాధునిక బస్ షెల్టర్లు, అలైపూర్‌లో నిర్మించిన 132 కిలోవాట్ సబ్‌స్టేషన్‌ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు.

   అత్యాధునిక నగరాల కార్యక్రమం కింద పర్యాటకులకు సమగ్ర సమాచారం కోసం ఒక వెబ్‌సైట్ సహా ఏకీకృత పర్యాటక పాసుల వ్యవస్థను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ పాస్ సదుపాయంతో శ్రీ కాశీ విశ్వనాథ క్షేత్రం, గంగానదిలో పడవ విహారం, సారనాథ్ లైట్ అండ్ సౌండ్ ప్రదర్శనకు సింగిల్ ప్లాట్‌ఫామ్ టికెట బుకింగ్‌ అందుబాటులోకి వస్తాయి. ఇది సమీకృత ‘క్యూఆర్‘ కోడ్ సేవలను అందిస్తుంది.

   ఇవే కాకుండా మరో రూ.6,500 కోట్లకుపైగా విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. వీటిలో పునరుత్పాదక ఇంధనేతర వనరుల ఉత్పత్తి పెంపు నిమిత్తం దాదాపు రూ.4000 కోట్లతో చిత్రకూట్ జిల్లాలో 800 మెగావాట్ల సౌరశక్తి పార్కుకు ఆయన పునాదిరాయి వేస్తారు. పెట్రోలియం సరఫరా శ్రేణి విస్తరణ దిశగా మీర్జాపూర్‌లో రూ.1,050 కోట్లకుపైగా వ్యయంతో నిర్మించే కొత్త పెట్రోలియం-ఆయిల్ టెర్మినల్ నిర్మాణానికి ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

   ప్రధానమంత్రి శంకుస్థాపన చేసే మరికొన్ని ప్రాజెక్టులలో... రూ.900 కోట్లతో వారణాసి-భదోహి జాతీయ రహదారి నం.731 బి (ప్యాకేజీ-2) కింద రోడ్డు మార్గం విస్తరణ; జల్ జీవన్ మిషన్ కింద రూ.280 కోట్లతో 69 గ్రామీణ తాగునీటి పథకాలు; బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ట్రామా సెంటర్‌లో 150 పడకల సామర్థ్యం గల ప్రాణరక్షక చికిత్స యూనిట్ నిర్మాణం; అలాగే 8 గంగా ఘాట్‌ల పునరాభివృద్ధి పనులు, దివ్యాంగ మాధ్యమిక ఆశ్రమ పాఠశాల నిర్మాణం తదితరాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు.

****



(Release ID: 1987382) Visitor Counter : 75