రక్షణ మంత్రిత్వ శాఖ
నేషనల్ డిఫెన్స్ అకాడమీ 75 సంవత్సరాల వేడుకల్లో భాగంగా 'ఓషన్ సెయిలింగ్' యాత్ర; మొదటి దశలో గోవా నుంచి కోచికి యాత్ర
Posted On:
10 DEC 2023 8:54PM by PIB Hyderabad
నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) 75 సంవత్సరాల వేడుకల్లో భాగంగా, గోవా నుంచి కోచికి & కోచి నుంచి గోవా వరకు సాగిన 'ఓషన్ సెయిలింగ్' యాత్రలో మొదటి దశ 10 డిసెంబర్ 2023న కోచిలో ముగిసింది. తొమ్మిది మంది క్యాడెట్లు, ముగ్గురు అధికారుల బృందం ఈ సాహస యాత్రలో పాల్గొన్నారు. యాత్రలో భాగంగా 334 నాటికల్ మైళ్లకు పైగా సముద్రంలో ప్రయాణించారు. నౌకాదళ నౌకలు మహదేయ్, బుల్‌బుల్, నీల్‌కంఠ్ సిబ్బంది ఈ సాహస యాత్రలో పాల్గొన్నారు.
యాత్రలో పాల్గొన్న సిబ్బంది తొలుత కోచిలో ప్రాథమిక శిక్షణ తీసుకున్నారు. ఆ తర్వాత తెరచాపలు మార్చడం, సముద్రయానం, ప్రథమ చికిత్స, ఇతర అవసరమైన నైపుణ్యాలపై గోవాలో లోతైన శిక్షణ పొందారు. డిసెంబర్ 06న, గోవా నుంచి కోచి వరకు మొదటి విడత యాత్ర ప్రారంభమైంది. రెండో దశ ప్రయాణం డిసెంబర్ 12న కోచి నుంచి ప్రారంభమై డిసెంబర్ 16న గోవాలో ముగుస్తుంది.
మానసికంగా, శారీరకంగా సవాలుగా భావించే అత్యంత డిమాండ్ ఉన్న క్రీడల్లో ఓషన్ సెయిలింగ్ ఒకటి. క్యాడెట్లలో సాహసోపేత ఆలోచనలు, ప్రమాదాలకు ఎదురెళ్లే సామర్థ్యాలు, స్థితప్రజ్ఞతను పెంచడం, జట్టుగా పని చేయడం, నిరంతర అభ్యాసాన్ని అలవాటు చేయడం అకాడమీ లక్ష్యం.
నేషనల్ డిఫెన్స్ అకాడమీ, 16 జనవరి 2024తో దేశ సేవలో 75 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుంది.
***
(Release ID: 1986115)
Visitor Counter : 80