ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2023 వ సంవత్సరం నవంబర్ 26 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం  యొక్క 107వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 26 NOV 2023 11:41AM by PIB Hyderabad

ప్రియమైన నా దేశవాసులారా, నమస్కారం. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నవంబర్ 26 ను మనం ఎప్పటికీ మర్చిపోలేం. దేశంలో అత్యంత దారుణమైన ఉగ్రవాద దాడి జరిగింది ఈ రోజే. ఉగ్రవాదులు ముంబయి తో పాటు యావద్దేశాన్ని వణికించారు. అయితే ఆ దాడి నుండి కోలుకొని, ఇప్పుడు పూర్తి ధైర్యం తో ఉగ్రవాదాన్ని అణచివేయడం భారతదేశం యొక్క సమర్థతయే అని చెప్పాలి. ముంబయి దాడుల లో ప్రాణాల ను కోల్పోయిన వారందరికి శ్రద్ధాంజలి ని సమర్పిస్తున్నాను. ఈ దాడి లో ప్రాణ త్యాగం చేసిన మన వీర జవానుల ను నేడు దేశం స్మరించుకొంటున్నది.

 

 

నా కుటుంబ సభ్యులారా, మరొక కారణం గా కూడా ఈ నవంబరు 26 వ తేదీ చాలా ముఖ్యమైంది. రాజ్యాంగ పరిషత్తు 1949వ సంవత్సరం లో ఇదే రోజు న భారత రాజ్యాంగాన్ని ఆమోదించింది. బాబాసాహెబ్ శ్రీ ఆంబేడ్ కర్ 125 వ జయంతి ని 2015వ సంవత్సరం లో జరుపుకొంటున్నప్పుడు- అదే కాలం లో నవంబరు 26 వ తేదీ ని ‘రాజ్యాంగ దినం’ గా జరుపుకోవాలి అనే ఆలోచన వచ్చింది అని నాకు జ్ఞాపకం ఉంది. అప్పటి నుండి ప్రతి ఏటా ఈ రోజు ను రాజ్యాంగ దినం గా జరుపుకొంటున్నాం. దేశ ప్రజలందరి కి రాజ్యాంగ దినం తాలూకు శుభాకాంక్ష లు. మనం అందరం కలసి, పౌరుల విధుల కు ప్రాధాన్యాన్ని ఇస్తూ, వికసిత భారతదేశం సంకల్పాన్ని నెరవేర్చి తీరుతాం.

 

 

మిత్రులారా, రాజ్యాంగాన్ని రూపొందించడానికి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల కాలం పట్టింది అన్న సంగతి మనకు అందరికి తెలుసును. సచ్చిదానంద్ సిన్హా గారు రాజ్యాంగ పరిషత్తు లో అతి పెద్ద వయస్సు గల సభ్యులు. 60 కి పైగా దేశాల రాజ్యాంగాల పై సుదీర్ఘంగా చర్చించి, అధ్యయనం చేసిన తరువాతనే మన రాజ్యాంగం ముసాయిదా కు రూపకల్పన జరిగింది. ముసాయిదా సిద్ధం అయిన తరువాత దానిని ఖరారు చేయక ముందే అందులో 2 వేల కు పైగా సవరణ లు చేశారు. 1950 లో రాజ్యాంగం అమలు లోకి వచ్చిన తరువాత కూడా మొత్తం 106 సారు లు రాజ్యాంగాన్ని సవరించారు. సమయం, పరిస్థితి, ఆవశ్యకతల ను దృష్టి లో పెట్టుకొని, వివిధ ప్రభుత్వాలు వివిధ కాలాల్లో సవరణ లు చేశాయి. కానీ రాజ్యాంగం లోని మొదటి సవరణ వాక్ స్వాతంత్ర్యం, భావప్రకటన స్వేచ్ఛ హక్కుల ను తగ్గించడానికి ఉద్దేశించింది కావడం దురదృష్టకరం. అత్యవసర స్థితి కాలం లో జరిగిన తప్పుల ను 44 వ రాజ్యాంగ సవరణ ద్వారా సరిదిద్దడమైంది.

 

 

మిత్రులారా, రాజ్యాంగ పరిషత్తు లో కొందరు సభ్యులు నామినేట్ కావడం కూడా చాలా స్ఫూర్తిదాయకం. అందులో 15 మంది మహిళలు. అలా నామినేట్ అయిన సభ్యురాలు హంసా మెహతా గారు మహిళల కు హక్కు ల కోసం, మహిళల కు న్యాయం కోసం గళం విప్పారు. ఆ కాలం లో, రాజ్యాంగం ద్వారా మహిళల కు వోటు హక్కు ను కల్పించిన అతి కొద్ది దేశాల లో భారతదేశం ఒకటి. దేశ నిర్మాణం లో ప్రతి ఒక్కరు భాగస్వాములు అయినప్పుడే అభివృద్ధి సాధ్యం అవుతుంది. రాజ్యాంగ నిర్మాతల దృష్టికోణాన్ని అనుసరించి, భారతదేశం యొక్క పార్లమెంటు ఇప్పుడు నారీ శక్తి వందన్ చట్టాన్ని ఆమోదించినందుకు నాకు సంతోషం గా ఉంది. నారీ శక్తి వందన్ చట్టం మన ప్రజాస్వామ్యం యొక్క సంకల్ప శక్తి కి ఉదాహరణ గా ఉంది. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం మన సంకల్పాని కి ఊతాన్ని ఇవ్వడానికి కూడా ఇది దోహద పడుతుంది.

 

 

నా కుటుంబ సభ్యులారా, దేశం యొక్క నిర్మాణ బాధ్యత ను ప్రజలు తీసుకున్నప్పుడు ఆ దేశాన్ని ముందుకు సాగకుండా ప్రపంచం లో ఏ శక్తీ ఆపలేకపోతుంది. దేశం లో 140 కోట్ల మంది ప్రజలు అనేక మార్పుల కు నాయకత్వం వహిస్తున్నారనేది నేడు భారతదేశం లో స్పష్టంగా కనిపిస్తోంది. దీనికి ప్రత్యక్ష ఉదాహరణ ను ఈ పండుగల కాలం లో మనం చూశాం. గత నెల ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో నేను వోకల్ ఫార్ లోకల్.. అదే, స్థానిక ఉత్పత్తుల ను కొనుగోలు చేయడాన్ని.. గురించి నొక్కి పలికాను. గత కొద్ది రోజుల లోనే దీపావళి, యమ ద్వితీయ గా పేర్కొనే భయ్యా దూజ్, ఛఠ్ రోజుల లో దేశం లో 4 లక్షల కోట్ల రూపాయల కు పైగా వ్యాపారం జరిగింది. భారతదేశం లో తయారైన ఉత్పాదనల ను కొనుగోలు చేయడానికి ఈ కాలం లో ప్రజల లో విపరీతమైన ఉత్సాహం కనిపించింది. ఇప్పుడు పిల్లలు కూడా దుకాణం లో ఏదైనా కొంటున్నప్పుడు మేడ్ ఇన్ ఇండియా అని వ్రాసి ఉందా లేదా అని పరిశీలించడం మొదలుపెట్టారు. ఇది ఒక్కటే కాదు- ఇప్పుడు ప్రజలు ఆన్‌ లైన్‌ లో వస్తువుల ను కొనుగోలు చేసేటప్పుడు ఉత్పాదన కు మూల దేశాన్ని తనిఖీ చేయడం మర్చిపోవడం లేదు.

 

 

మిత్రులారా, ‘స్వచ్ఛ్ భారత్ అభియాన్’ మాదిరే ‘వోకల్ ఫార్ లోకల్’ విజయం కూడా స్ఫూర్తి గా మారుతోంది. వోకల్ ఫార్ లోకల్ విజయం అభివృద్ధి చెందిన భారతదేశాని కి, సుసంపన్న భారతదేశాని కి తలుపుల ను తెరుస్తోంది. ఈ ఉద్యమం యావత్తు దేశ ఆర్థిక వ్యవస్థ ను బలోపేతం చేస్తున్నది. వోకల్ ఫార్ లోకల్ ప్రచారం ఉపాధి కి హామీ ని ఇస్తోంది. ఇది అభివృద్ధి కి హామీ. దేశం యొక్క సమతుల్య అభివృద్ధి కి హామీ. ఇది పట్టణ ప్రాంతాల ప్రజల కు, గ్రామీణ ప్రాంతాల ప్రజల కు సమాన అవకాశాల ను అందిస్తుంది. స్థానిక ఉత్పత్తుల విలువ పెంపుదల కు కూడా మార్గాన్ని సుగమం చేస్తుంది. ఎప్పుడైనా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో ఒడిదొడుకులు ఏర్పడ్డాయంటే వోకల్ ఫార్ లోకల్ అనే మంత్రం మన ఆర్థిక వ్యవస్థ ను సురక్షితం గా కూడాను ఉంచుతుంది.

 

 

మిత్రులారా, భారతీయ ఉత్పత్తుల పట్ల ఈ భావన కేవలం పండుగల కే పరిమితం కాకూడదు. పెళ్ళిళ్ల కాలం మొదలైంది. ఈ పెళ్ళిళ్ల కాలం లో దాదాపు 5 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగే అవకాశం ఉందని కొన్ని వాణిజ్య సంస్థ లు అంచనా వేస్తున్నాయి. వివాహాల కోసం కొనుగోళ్లు చేసేటప్పుడు, మీరు అందరు భారతదేశం లో తయారైన ఉత్పత్తుల కు మాత్రమే ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. పెళ్ళిళ్ల అంశం చర్చ కు వచ్చినప్పుడు చాలా కాలం గా ఒక విషయం నన్ను అప్పుడప్పుడు కలవరపెడుతున్నది. నా గుండె బాధ ను నేను నా కుటుంబ సభ్యుల కు కాకుంటే ఎవరికి చెప్పుకోను? ఒక్క సారి ఆలోచించండి.. ఈ రోజుల్లో కొన్ని కుటుంబాల వారు విదేశాల కు వెళ్ళి పెళ్ళి చేసుకొనే ఒక క్రొత్త వాతావరణం ఏర్పడుతోంది. ఇది అవసరమా ? భారతదేశం గడ్డ మీద, భారతదేశం ప్రజల మధ్య కల్యాణాలు జరుపుకొంటే, అప్పుడు దేశం లోని డబ్బు దేశం లోనే ఉంటుంది. దేశం లోని ప్రజల కు మీ వివాహం లో కొంత సేవ చేయడానికి అవకాశం దొరుకుతుంది. పేదవాళ్లు కూడా మీ పెళ్ళి విశేషాల ను గురించి వారి పిల్లల కు చెబుతారు. మీరు వోకల్ ఫార్ లోకల్ ఉద్యమాన్ని విస్తరించగలరా! ఇటువంటి పెళ్లి వేడుక లు మన దేశం లోనే ఎందుకు జరుపుకో కూడదు? మీరు కోరుకొనే వ్యవస్థ ఈ రోజు న ఉండకపోవచ్చు. అయితే మనం అటువంటి కార్యక్రమాల ను నిర్వహిస్తే వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుంది. ఇది చాలా పెద్ద కుటుంబాల కు సంబంధించిన అంశం. నా ఈ బాధ ఆ పెద్ద కుటుంబాల చెంత కు చేరుకోవాలి అనే నేను ఆశిస్తున్నాను.

 

 

నా కుటుంబ సభ్యులారా, ఈ పండుగ ల కాలం లో మరో పెద్ద ట్రెండ్ కనిపించింది. దీపావళి సందర్భం లో నగదు ను చెల్లించి కొన్ని వస్తువుల ను కొనుగోలు చేసే ధోరణి క్రమం గా తగ్గుముఖం పట్టడం ఇది వరుస గా రెండో ఏడాది. అంటే, ఇప్పుడు ప్రజలు డిజిటల్ చెల్లింపుల ను ఎక్కువ గా జరుపుతున్నారు. ఇది కూడా చాలా ప్రోత్సాహకరం గా ఉంది. మీరు మరొక పని ని చేయవచ్చును. ఒక నెల పాటు మీరు యూపీఐ లేదా ఏదైనా డిజిటల్ మాధ్యం ద్వారా మాత్రమే చెల్లింపు చేయాలని, నగదు చెల్లింపు లు చేయకూడదని నిర్ణయించుకోండి. భారతదేశం లో డిజిటల్ విప్లవం విజయం దీనిని సాధ్యం చేసింది. ఒక నెల పూర్తి అయిన తరువాత దయచేసి మీ అనుభవాల ను, ఫోటోల ను నాతో పంచుకోండి. నేను ఇప్పటి నుండే ముందస్తు గా మీకు శుభాకాంక్షల ను తెలియ జేస్తున్నాను.

 

 

నా కుటుంబ సభ్యులారా, మన యువ స్నేహితులు దేశానికి మరో పెద్ద శుభవార్త ను అందించారు. ఈ వార్త మనందరిలో గర్వాన్ని నింపుతుంది. ఇంటెలిజెన్స్, ఐడియా, ఇనొవేశన్ - నేటి భారతీయ యువత గుర్తింపులు ఇవి. వీటికి సాంకేతికత ను జోడించడం ద్వారా వారి మేధాపరమైన లక్షణాల లో నిరంతర పెరుగుదల దేశ సామర్థ్యాన్ని పెంపొందించడం లో ఒక ముఖ్యమైన పురోగతి ని ఏర్పరుస్తుంది. భారతీయుల పేటెంట్ దరఖాస్తుల లో 2022వ సంవత్సరం లో 31 శాతం కంటే ఎక్కువ పెరుగుదల ఉంది అని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. ప్రపంచ మేధా సంపత్తి సంస్థ చాలా ఆసక్తికరమైనటువంటి నివేదిక ను విడుదల చేసింది. పేటెంట్ ల దాఖలు లో ముందంజ లో ఉన్న పది దేశాల లో కూడా ఇంతకుముందు ఎన్నడు ఇలా జరగలేదు అని ఈ నివేదిక తెలియజేస్తోంది. ఈ అద్భుతమైనటువంటి విజయాని కి గాను నా యువ సహచరుల ను నేను అభినందిస్తున్నాను. అడుగడుగు న దేశం మీ వెంటే ఉంది అని నా యువ స్నేహితుల కు బరోసా ను ఇవ్వాలి అని అనుకొంటున్నాను. ప్రభుత్వం చేసిన పరిపాలన సంబంధమైన, చట్ట పరమైన సంస్కరణ ల తరువాత నేడు మన యువత కొత్త శక్తి తో పెద్ద ఎత్తున ఆవిష్కరణ ల పని లో తలమునుకలు గా ఉంది. పది సంవత్సరాల క్రిందటి గణాంకాల తో పోలిస్తే, ప్రస్తుతం మన పేటెంట్ లకు ఆమోదాలు పది రెట్లు లభిస్తున్నాయి. పేటెంట్ దేశ మేధా సంపత్తి ని పెంచడమే కాకుండా కొత్త అవకాశాలకు తలుపులు కూడా తెరుస్తుంది అని మనకు అందరికి తెలిసిన విషయమే. అంతే కాదు- ఇది మన స్టార్ట్- అప్‌ స్ యొక్క బలాన్ని, సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది. నేడు మన పాఠశాల విద్యార్థుల లో కూడా ఆవిష్కరణ ల సంబంధి స్ఫూర్తి ని ప్రోత్సహించడం జరుగుతోంది. అటల్ టింకరింగ్ లేబ్ స్, అటల్ ఇనొవేశన్ మిశన్, కళాశాల ల్లో ఇన్ క్యుబేశన్ సెంటర్ స్, స్టార్ట్- అప్ ఇండియా ప్రచారం.. ఇలా నిరంతర ప్రయాస ల ఫలితాలు దేశ ప్రజల ముందున్నాయి. భారతదేశం యువ శక్తి కి, భారతదేశం యొక్క నూతన ఆవిష్కరణల సంబంధి శక్తి కి ఇది ప్రత్యక్ష ఉదాహరణ కూడా. ఈ ఉత్సాహం తో ముందుకు సాగడం ద్వారా అభివృద్ధి చెందిన భారతదేశం సంకల్పాన్ని మనం సాధిస్తాం. అందుకే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ‘జయ్ జవాన్, జయ్ కిసాన్, జయ్ విజ్ఞాన్ మరియు జయ్ అనుసంధాన్’ అని.

 

 

ప్రియమైన నా దేశప్రజలారా, భారతదేశం లో పెద్ద ఎత్తున నిర్వహించే జాతరల ను గురించి కొంతకాలం క్రితం ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మా’) కార్యక్రమం లో నేను చర్చించిన విషయం మీకు గుర్తుండే ఉంటుంది. అప్పుడు జాతరల కు సంబంధించిన ఫోటోల ను ప్రజలు పంచుకొనే పోటీ ఆలోచన కూడా వచ్చింది. దీనికి సంబంధించి సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ‘మేలా మూమెంట్స్ పోటీ’ ని నిర్వహించింది. వేల కొద్దీ ప్రజలు ఇందులో పాల్గొన్నారని తెలిస్తే మీరు సంతోషిస్తారు. చాలా మంది బహుమతుల ను కూడా గెలుచుకొన్నారు. కోల్‌కాతా నివాసి రాజేశ్ ధర్ గారు ‘చరక్ మేళా’ లో గాలిబుడగలు, బొమ్మల అమ్మకందారు అద్భుతమైన ఫోటో కు గాను పురస్కారాన్ని గెలుచుకొన్నారు. గ్రామీణ బంగాల్‌ లో ఈ జాతర బాగా ప్రాచుర్యం పొందింది. వారాణసీ లో హోలీ ఉత్సవాల ను దృశ్యం లో చూపించిన అనుపమ్ సింహ్ గారు మేలా పోర్ట్రెయిట్స్ అవార్డు ను అందుకున్నారు. ‘కులసాయి దశ్ హరా’ కు సంబంధించిన ఆకర్షణీయమైన అంశాన్ని చూపించినందుకు అరుణ్ కుమార్ నలిమెల గారి కి అవార్డు లభించింది. అదే విధం గా మహారాష్ట్ర కు చెందిన రాహుల్ గారు పంపిన ఫోటో అత్యధిక మంది మెచ్చిన ఫోటో గా ఎంపిక అయింది. ఈ ఫోటో పంఢర్‌పుర్ యొక్క భక్తి ని కళ్ల కు కడుతుంది. జాతర ల సమయం లో కనిపించే స్థానిక వంటకాల కు సంబంధించిన అనేక చిత్రాలు ఈ పోటీ లో ఉన్నాయి. ఇందులో పుర్ లియా నివాసి ఆలోక్ అవినాశ్ గారి చిత్రం పురస్కారాన్ని గెలుచుకొంది. ఒక జాతర లో బంగాల్ గ్రామీణ ప్రాంతాల ఆహార పానీయాల అలబాటుల ను ఆయన చూపించారు. భగోరియా పండుగ సందర్భం లో మహిళ లు కుల్ఫీ ని ఆస్వాదిస్తున్న చిత్రాని కి ప్రణబ్ బసాక్ గారు పురస్కారాన్ని పొందారు. రుమేలా గారు ఛత్తీస్‌ గఢ్‌ లోని జగదల్‌ పుర్‌ లో ఒక గ్రామ ఉత్సవం లో భజియా ను రుచి చూస్తున్న మహిళ ల ఛాయాచిత్రాన్ని పంపారు. అది కూడా పురస్కారాన్ని గెలుచుకొంది.

 

 

మిత్రులారా, నిరంతరం ఇటువంటి పోటీల ను నిర్వహించాలని ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ద్వారా ఈ రోజు న ప్రతి గ్రామం, ప్రతి పాఠశాల, ప్రతి పంచాయతీ ని కోరుతున్నాను. ఈ రోజుల్లో సామాజిక మాధ్యమం యొక్క శక్తి ఎంత గా ఉంది అంటే సాంకేతికత, మొబైల్ ప్రతి ఇంటికి చేరాయి. వీటిని ఉపయోగించి మీరు మీ స్థానిక పండుగల ను, ఉత్పత్తుల ను ప్రపంచవ్యాప్తం చేయవచ్చు.

 

 

మిత్రులారా, ప్రతి గ్రామం లో జరిగే జాతర లాగానే ఇక్కడ వివిధ నృత్యాల కు కూడా తమ స్వంత వారసత్వ సంపద ఉంటుంది. ఝార్ ఖండ్, ఒడిశా, బంగాల్‌ లోని గిరిజన ప్రాంతాల లో ‘ఛవూ’ అని పిలచే చాలా ప్రసిద్ధం అయినటువంటి నృత్యం ఉంది. ‘ఏక్ భారత్ శ్రేష్ఠ్ భారత్’ స్ఫూర్తి తో నవంబరు 15 వ తేదీ నుండి 17 వ తేదీ వరకు శ్రీనగర్‌ లో ‘ఛవూ’ పండుగ ను నిర్వహించారు. ఈ కార్యక్రమం లో అందరూ ‘ఛవూ’ నృత్యాన్ని ఆస్వాదించారు. శ్రీనగర్ యువత కు ‘ఛవూ’ నృత్యంలో శిక్షణ ఇచ్చేందుకు కార్యశాల ను కూడా నిర్వహించారు. అదేవిధం గా కఠువా జిల్లా లో కొన్ని వారాల క్రితం ‘బసోహలీ ఉత్సవా’న్ని నిర్వహించారు. ఈ ప్రదేశం జమ్ము నుండి 150 కిలోమీటర్ల దూరం లో ఉంది. ఈ ఉత్సవం లో స్థానిక కళ లు, జానపద నృత్యం తో పాటు సాంప్రదాయిక రాంలీల ను కూడా నిర్వహించారు.

 

 

మిత్రులారా, భారతీయ సంస్కృతి సౌందర్యం సౌదీ అరేబియా లో కూడా ప్రతిబింబించింది. ఈ నెల సౌదీ అరేబియా లో ‘సంస్కృత్ ఉత్సవ్’ పేరు తో ఒక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమం మొత్తం సంస్కృతం లో ఉన్నందువల్ల ఇది చాలా ప్రత్యేకమైంది. సంభాషణలు, సంగీతం, నృత్యం అన్నీ సంస్కృతం లోనే ఉండడం తో పాటు గా అక్కడి ప్రజల భాగస్వామ్యం కూడ ఇందులో కనిపించింది.

 

నా కుటుంబ సభ్యులారా, ‘స్వచ్చ్ భారత్’ ఇప్పుడు దేశం మొత్తాని కి ఇష్టమైన అంశం గా మారింది. ఇది నాకు ఇష్టమైన అంశం. దానికి సంబంధించిన ఏదైనా వార్త వచ్చిన వెంటనే నా మనస్సు దాని వైపు వెళ్తుంది. అది సహజం. ఆ విషయం ఖచ్చితం గా ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో చోటు దక్కించుకొంటుంది కూడా. పరిశుభ్రత, ప్రజా పారిశుద్ధ్యం విషయాల లో స్వచ్ఛ్ భారత్ అభియాన్ ప్రజల ఆలోచన ధోరణుల ను మార్చింది. నేడు ఈ చొరవ జాతీయ స్ఫూర్తి కి చిహ్నం గా మారింది. కోట్లః కొద్దీ దేశవాసుల జీవితాల ను మెరుగుపరచింది. ఈ ప్రచారం వివిధ వర్గాల ప్రజల ను, ముఖ్యం గా యువత ను సామూహిక భాగస్వామ్యం దిశ గా ప్రేరేపించింది. అటువంటి ఒక మెచ్చుకోదగ్గ ప్రయత్నం ప్రాజెక్ట్ సూరత్ లో కనిపించింది. యువకుల బృందం ప్రాజెక్ట్ సూరత్ ను ప్రారంభించింది. పరిశుభ్రత కు, స్థిరమైన అభివృద్ధి కి ఒక అద్భుతమైన ఉదాహరణ గా మారేలా సూరత్‌ ను ఒక నమూనా నగరం గా మార్చడం దీని లక్ష్యం. ‘సఫాయి సండే’ పేరు తో ప్రారంభమైన ఈ కార్యక్రమం లో సూరత్‌ యువత ముందుగా బహిరంగ ప్రదేశాల ను, డుమాస్ బీచ్‌ ను శుభ్రం చేసేది. తరువాత వారు తాపీ నది ఒడ్డు ను శుభ్రం చేయడం లో హృదయపూర్వకం గా నిమగ్నం అయ్యారు. అనతికాలం లో దీనితో సంబంధం ఉన్న వారి సంఖ్య ఏభై వేల కు పైగా పెరిగిందని తెలుసుకుంటే మీరు సంతోషిస్తారు. ప్రజల నుండి అందుతున్న ఆదరణ తో బృందం లో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఆ తరువాత చెత్త ను సేకరించే పని ని కూడా మొదలుపెట్టారు. లక్షల కిలో ల చెత్త ను ఈ బృందం తొలగించిందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అట్టడుగు స్థాయి లో జరిగే ఇటువంటి ప్రయత్నాలు భారీ మార్పుల ను తీసుకు రాగలుగుతాయి.

 

 

మిత్రులారా, గుజరాత్ నుండే మరో సమాచారం వచ్చింది. కొన్ని వారాల క్రితం అంబాజీ లో 'భాద్ రవీ పూనమ్ మేళా’ జరిగింది. ఈ జాతర లో 50 లక్షల మంది కి పైగా పాల్గొన్నారు. ఈ జాతర ను ప్రతి సంవత్సరం లో జరుపుతుంటారు. అందులో అత్యంత విశేషం ఏమిటంటే జాతర కు వచ్చిన ప్రజలు గబ్బర్‌ హిల్‌ లోని అధికభాగం లో పరిశుభ్రత ఉద్యమాన్ని నిర్వహించారు. దేవాలయాల చుట్టుపక్కల ప్రాంతాలన్నిటిని పరిశుభ్రం గా ఉంచాలనే ఈ ప్రచారం ఎంతో స్ఫూర్తిదాయకమైంది.

 

 

మిత్రులారా, పరిశుభ్రత ఏదో ఒక రోజు లేదా ఏదో ఒక వారం నిర్వహించే ప్రచారం కాదు. అది జీవితం లో అమలు చేయవలసిన పని అని నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను. పరిశుభ్రత కు సంబంధించిన విషయాలకు తమ జీవనాన్నంతటిని సమర్పణం చేసిన వ్యక్తులను కూడా మనం మన చుట్టూ చూస్తాం. తమిళ నాడు లోని కోయంబత్తూరు లో నివసించే లోగనాథన్ గారు కూడా అసామాన్యుడు. తన బాల్యం లో పేద పిల్లల చిరిగిన బట్టల ను చూసి ఆయన తరచు గా కలత చెందే వారు. తరువాత అలాంటి బాలల కు సహాయం చేస్తానని ప్రతిజ్ఞ చేశారు. తన సంపాదన లో కొంత భాగాన్ని వారికి విరాళం గా ఇవ్వడం మొదలుపెట్టారు. డబ్బు కొరత ఉన్నప్పుడు లోగనాథన్ గారు పేద పిల్లల కు సహాయపడేందుకు మరుగుదొడ్ల ను కూడా శుభ్రం చేశారు. గత 25 సంవత్సరాలు గా ఆయన పూర్తి అంకితభావం తో ఈ పని లో నిమగ్నమై ఉన్నారు. ఇప్పటి వరకు 1500 మందికి పైగా పిల్లలకు సహాయం చేశారు. అలాంటి ప్రయత్నాల ను మరోసారి అభినందిస్తున్నాను. దేశవ్యాప్తం గా జరుగుతున్న ఇటువంటి ఎన్నో ప్రయత్నాలు మనలో స్ఫూర్తి ని నింపడమే కాకుండా కొత్తగా ఏదైనా చేయాలనే సంకల్పాన్ని మేల్కొల్పుతాయి.

 

 

నా కుటుంబ సభ్యులారా, 21 వ శతాబ్దపు అతి పెద్ద సవాళ్ల లో ఒకటి ‘జల సంరక్షణ’. నీటి ని సంరక్షించడం ప్రాణాన్ని కాపాడడం కంటే తక్కువేమీ కాదు. ఈ సామూహిక స్ఫూర్తి తో ఏ పని ని చేసినా విజయం సాధిస్తాం. దేశం లోని ప్రతి జిల్లా లో నిర్మిస్తున్న అమృత సరోవరాలు దీనికి ఉదాహరణ. అమృత మహోత్సవాల సందర్భం లో భారతదేశం రూపొందించినటువంటి 65 వేలకు పైగా ‘అమృత్ సరోవర్’ లు రాబోయే తరాలకు మేలు చేస్తాయి. ఇప్పుడు ‘అమృత్ సరోవర్’ ను ఎక్కడ నిర్మించినా, అది నీటి సంరక్షణ కు ప్రధాన వనరు గా ఉండేలా వాటిని నిరంతరం చూసుకోవలసిన బాధ్యత కూడా ఉంది.

 

 

మిత్రులారా, నీటి సంరక్షణ పై ఇటువంటి చర్చల మధ్య గుజరాత్‌ లోని అమ్ రేలీ లో జరిగిన ‘జల ఉత్సవా’న్ని గురించి కూడా తెలుసుకున్నాను. గుజరాత్‌ లో నిరంతరం ప్రవహించే నదుల కు కొరత ఉంది. అందువల్ల ప్రజలు ఎక్కువగా వర్షపు నీటి పైనే ఆధారపడవలసి వస్తున్నది. గత 20-25 సంవత్సరాల లో ప్రభుత్వం, సామాజిక సంస్థ ల కార్యాల తో అక్కడ పరిస్థితి మారిపోయింది. అందుకే జల ఉత్సవానికి అక్కడ పెద్ద పాత్ర ఉంది. అమ్ రేలీ లో జరిగిన జల ఉత్సవం లో నీటి సంరక్షణ పై, సరస్సుల ను కాపాడుకోవడం పై ప్రజల లో అవగాహన ను పెంచడం జరిగింది. ఇందులో భాగం గా జల క్రీడల ను కూడా ప్రోత్సహించారు. నీటి ని కాపాడుకోవడం పై నిపుణుల తో మేధమథనాన్ని కూడా నిర్వహించడమైంది. కార్యక్రమం లో పాల్గొన్న ప్రజలు మూడు రంగుల వాటర్ ఫౌంటెన్‌ ను ఎంతగానో ఆదరించారు. వజ్రాల వ్యాపారం లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ను తెచ్చుకొన్న సూరత్‌ లోని సావ్ జీ భాయి ఢోలకియా పేర ఏర్పడ్డ సావ్ జీ భాయి ఢోలకియా ఫౌండేశన్ ఈ జల ఉత్సవాన్ని నిర్వహించింది. ఇందులో పాలుపంచుకొన్న ప్రతి ఒక్కరి ని అభినందిస్తున్నాను. జల సంరక్షణ కోసం ఇటువంటి పని చేస్తున్నందుకు వారికి శుభాకాంక్షలు.

 

 

నా కుటుంబ సభ్యులారా, నేడు ప్రపంచవ్యాప్తం గా నైపుణ్యాభివృద్ధి ప్రాముఖ్యాన్ని అంగీకరిస్తున్నారు. మనం ఎవరికైనా నైపుణ్యాన్ని నేర్పినప్పుడు నైపుణ్యం ఇవ్వడమే కాకుండా ఆదాయ వనరు ను కూడా ఇస్తాం. ఒక సంస్థ గత నాలుగు దశాబ్దాలు గా నైపుణ్యాభివృద్ధి పని లో నిమగ్నమై ఉందని తెలుసుకొన్నప్పుడు నేను మరింత సంతోషపడ్డాను. ఈ సంస్థ ఆంధ్ర ప్రదేశ్‌ లోని శ్రీకాకుళం లో ఉంది. దాని పేరు ‘బెజ్జిపురం యూథ్ క్లబ్’. నైపుణ్యాభివృద్ధి పై దృష్టి సారించడం ద్వారా ‘బెజ్జిపురం యూథ్ క్లబ్’ సుమారు 7000 మంది మహిళల కు సాధికారిత ను కల్పించింది. ఈ రోజుల్లో వీరిలోని చాలా మంది మహిళ లు వారి యొక్క స్వశక్తి పైన ఆధారపడి జీవిస్తున్నారు. ఈ సంస్థ బాల కార్మికులు గా పని చేస్తున్న పిల్లల కు ఏదో ఒక నైపుణ్యాన్ని నేర్పించడం ద్వారా ఆ విష వలయం నుండి బయటపడడానికి వారికి సహాయం చేసింది. ‘బెజ్జిపురం యూథ్ క్లబ్’ బృందం రైతు ఉత్పత్తి సంఘాల తో జతపడ్డ రైతుల కు కూడా కొత్త నైపుణ్యాల ను నేర్పింది. తద్ద్వారా పెద్ద సంఖ్య లో రైతుల కు సాధికారత ను అందించింది. ఈ యూత్ క్లబ్ గ్రామ గ్రామాన పరిశుభ్రత పై ప్రజలను చైతన్యవంతుల ను చేస్తున్నది. అనేక మరుగుదొడ్ల నిర్మాణానికి కూడా ఇది దోహద పడింది. నైపుణ్యాభివృద్ధి విషయంలో ఈ సంస్థ తో జతపడ్డ వ్యక్తులు అందరిని నేను అభినందిస్తున్నాను. వారిని ప్రశంసిస్తున్నాను. ప్రస్తుతం దేశం లో ప్రతి గ్రామం లో నైపుణ్యాభివృద్ధి కి ఇటువంటి సామూహిక కృషి అవసరం.

 

 

మిత్రులారా, ఒక లక్ష్యం కోసం సామూహిక కృషి ఉన్నప్పుడు విజయగర్వం కూడా పెరుగుతుంది. నేను స్ఫూర్తిదాయకమైన లద్దాఖ్ ఉదాహరణ ను మీ అందరి కి తెలియజెప్పాలని అనుకొంటున్నాను. మీరు పశ్మీనా శాలువా ను గురించి వినే ఉంటారు. లద్దాఖీ పశ్మీనా ను గురించి కూడా గత కొంతకాలంగా చర్చ జరుగుతున్నది. లూమ్స్ ఆఫ్ లద్దాఖ్ పేరు తో లద్దాఖీ పశ్మీనా ప్రపంచవ్యాప్తం గా బజారుల కు చేరుతున్నది. 15 గ్రామాల కు చెందిన 450 మంది కి పైగా మహిళ లు దీని ని తయారు చేయడం లో నిమగ్నం అయి ఉన్నారు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఇంతకు ముందు అక్కడకు వచ్చే పర్యటకుల కు మాత్రమే తమ ఉత్పత్తుల ను విక్రయించే వారు. కానీ ఇప్పుడు ఈ డిజిటల్ ఇండియా యుగం లో వారు తయారు చేసిన వస్తువులు దేశ విదేశాల లో వివిధ బజారుల కు చేరుకోవడం మొదలైంది. అంటే మన ‘లోకల్’ ఇప్పుడు ‘గ్లోబల్‌’గా మారుతోంది. దీని వల్ల ఈ మహిళల సంపాదన కూడా పెరిగింది.

 

 

మిత్రులారా, మహిళల శక్తి సాధించిన ఇటువంటి విజయాలు దేశం లో ప్రతి మూల న ఉన్నాయి. ఇటువంటి వాటి ని వీలైనంత వరకు తెర మీద కు తీసుకు రావలసిన అవసరం ఎంతయినా ఉంది. మరి ఈ విషయాన్ని చెప్పడానికి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం కంటే గొప్ప మాధ్యం ఏముంటుంది ? కాబట్టి మీరు కూడా అటువంటి ఉదాహరణల ను వీలు అయినంత వరకు నాకు తెలియజేయండి. వారిని మీ మధ్యకు తీసుకు రావడానికి నేను కూడా నా వంతు ప్రయత్నం చేస్తాను.

 

 

నా కుటుంబ సభ్యులారా, సమాజం లో పెనుమార్పుల ను తీసుకు వచ్చిన ఇటువంటి సామూహిక ప్రయాసల ను గురించి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో మనం చర్చిస్తున్నాం. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం సాధించిన మరో ఘనత ఏమిటి అంటే ప్రతి ఇంట్లో రేడియో ను మరింత ప్రాచుర్యం లోకి తెచ్చింది. ‘మై గవ్’ లో ఉత్తర్ ప్రదేశ్‌ లోని అమ్ రోహా కు చెందిన శ్రీ రామ్ సింహ్ బౌద్ధ్ నుండి నాకు ఉత్తరం వచ్చింది. రామ్ సింహ్ గారు గత కొన్ని దశాబ్దాలు గా రేడియోల ను సేకరించే పని లో నిమగ్నమై ఉన్నారు. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం తరువాత తన రేడియో మ్యూజియమ్ పై ప్రజల లో ఆసక్తి మరింత గా పెరిగింది అని ఆయన అంటున్నారు. అదే విధం గా 'మన్ కీ బాత్' స్ఫూర్తితో, అహమదాబాద్ సమీపం లోని పుణ్యక్షేత్రం అయిన ప్రేరణ తీర్థ్ ఒక ఆసక్తికరమైన ప్రదర్శన ను ఏర్పాటు చేసింది. దేశ విదేశాల నుండి వంద కు పైగా పురాతన రేడియోల ను ఇక్కడ ప్రదర్శించారు. ఇప్పటి వరకు ప్రసారమైన ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం భాగాలన్నీ ఇక్కడ వినవచ్చు. ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ద్వారా ప్రజలు ప్రేరణ పొంది, వారి స్వంత పనులని ప్రారంభించిన తీరును చూపించే అనేక ఉదాహరణలు ఉన్నాయి. కర్ణాటక లోని చామరాజనగర్‌ కు చెందిన వర్ష గారు తన కాళ్ల మీద తాను నిలబడేందుకు (‘మనసు లో మాట’) కార్యక్రమం నుండి ప్రేరణ ను పొందారు. ఈ కార్యక్రమం లోని ఒక భాగం తో స్ఫూర్తి పొంది అరటి తో సేంద్రియ ఎరువుల ను తయారు చేసే పని ని మొదలుపెట్టారు. ప్రకృతి ని అమితం గా ఇష్టపడే వర్ష గారి ఈ చొరవ ఇతర వ్యక్తుల కు కూడా ఉపాధి అవకాశాల ను తీసుకు వచ్చింది.

 

 

నా కుటుంబ సభ్యులారా, రేపటి రోజు న నవంబరు 27 వ తేదీ కార్తీక పౌర్ణమి పర్వదినం. ఈ రోజునే ‘దేవ్ దీపావళి’ కూడా జరుపుకుంటారు. కాశీ లో ‘దేవ్ దీపావళి’ని చూడాలని నాకు ఎప్పుడూ అనిపిస్తుంది. ఈసారి నేను కాశీ కి వెళ్ళలేను. కానీ, ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం మాధ్యం ద్వారా బనారస్ ప్రజల కు శుభాకాంక్షల ను తెలియ జేస్తున్నాను. ఈసారి కూడా కాశీ ఘాట్ ల లో లక్షల కొద్దీ దీపాల ను వెలిగిస్తారు. మహా హారతి ఉంటుంది. లేజర్ శో ను నిర్వహిస్తారు. దేశ విదేశాల నుండి లక్షల కొద్దీ ప్రజ ‘దేవ్ దీపావళి’ ని ఆస్వాదిస్తారు.

 

 

మిత్రులారా, రేపు పౌర్ణమి నాడే గురు నానక్ దేవ్ జీ ప్రకాశ్ పర్వ్ కూడా ఉంది. గురు నానక్ గారి అమూల్యమైన సందేశాలు ఒక్క భారతదేశాని కే కాకుండా యావత్ ప్రపంచానికి కూడాను నేటికీ స్ఫూర్తిదాయకం గా ఉన్నాయి. ఇప్పటికీ ప్రాసంగికత ను కలిగి ఉన్నాయి. ఇతరుల పట్ల నిష్కాపట్యం గా, సామరస్యపూర్వకం గా, అంకితభావం తో ఉండడానికి ఆయన సందేశాలు మనల్ని ప్రేరేపిస్తాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మన సిక్కు సోదర సోదరీమణులు సేవా స్ఫూర్తి, సేవా కార్యక్రమాల విషయం లో గురు నానక్ దేవ్ గారి బోధనల ను అనుసరిస్తున్నారు. గురు నానక్ దేవ్ జీ యొక్క ప్రకాశ్ పర్వ్ సందర్భం లో ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం శ్రోత లు అందరికి చాలా చాలా శుభాకాంక్షలు.

 

 

నా కుటుంబ సభ్యులారా, ఈ సారి కి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం విశేషాలు ఇంతే. చూస్తూ ఉండగానే 2023వ సంవత్సరం త్వరలో ముగిసే దిశ గా పయనిస్తోంది. మరి ప్రతి సారీ లాగానే మీరు మరియు నేను కూడ “అరె..ఈ సంవత్సరం ఇంత త్వరగా గడిచిపోయిందే!” అని ఆలోచిస్తున్నాం. అయితే ఈ సంవత్సరం భారతదేశాని కి అపారమైన విజయాల సంవత్సరం అనే విషయం వాస్తవం. భారతదేశం సాధించిన విజయాలు భారతదేశం లో ప్రతి ఒక్కరి యొక్క విజయాలు. భారతీయుల విజయాల ను ముందుకు తెచ్చేందుకు ’మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం ఒక శక్తియుక్తమైన మాధ్యం గా మారినందుకు నేను సంతోషిస్తున్నాను. వచ్చే సారి మన దేశం ప్రజల అనేక విజయాల ను గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. అప్పటి వరకు నాకు సెలవివ్వండి. చాలా చాలా ధన్యవాదాలు. నమస్కారం.

 

***

 


(Release ID: 1982620) Visitor Counter : 173