కమ్యూనికేషన్లు- సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ట్రాయ్‌ పేరుతో మోసాలు జరుగుతున్నాయి, జాగ్రత్త

Posted On: 15 NOV 2023 4:23PM by PIB Hyderabad

కొన్ని సంస్థలు/వ్యక్తులు మోసపూరితంగా ప్రజలను/వినియోగదార్లకు కాల్‌ చేసి, ట్రాయ్‌ నుంచి కాల్ చేస్తున్నామని చెబుతున్నారని 'టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా' (ట్రాయ్) దృష్టికి వచ్చింది. దురుద్దేశపూర్వక సందేశాలు పంపడానికి ఆ నంబర్లు ఉపయోగిస్తున్నారు కాబట్టి, ప్రజలు/వినియోగదార్ల చరవాణి నంబర్లు రద్దవుతాయని ఆ మోసపూరిత సంస్థలు/వ్యక్తులు వినియోగదార్లను భయపెడుతున్నారు. ప్రజలు/వినియోగదార్ల ఆధార్ నంబర్లు ఉపయోగించి తీసుకున్న సిమ్ కార్డులతో చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కూడా ఆ సంస్థలు/వ్యక్తులు బెదిరిస్తున్నారు. మొబైల్ నంబర్ల రద్దును నివారించడానికి, స్కైప్ వీడియో కాల్‌లో మాట్లాడేలా ప్రజలు/వినియోగదార్లను ఆ సంస్థలు/వ్యక్తులు మోసగిస్తున్నారు.

ఏ వ్యక్తిగత ఫోన్‌ నంబర్‌ను ట్రాయ్‌ రద్దు చేయదని ప్రజలకు తెలియజేస్తున్నాం. ట్రాయ్‌ ఎప్పుడూ ఎలాంటి సందేశం పంపదు లేదా మొబైల్ నంబర్ల రద్దు చేస్తామంటూ కాల్ చేయదు. అలాంటి కార్యకలాపాల కోసం ప్రజలను/వినియోగదార్లను సంప్రదించడానికి ఏ సంస్థకు ట్రాయ్‌ అధికారం ఇవ్వలేదు. కాబట్టి, అలాంటి కాల్‌ చేయడం చట్టవిరుద్ధం. అందువల్ల, ట్రాయ్‌ పేరిట వచ్చే ఫోన్‌ కాల్ లేదా సందేశాన్ని మోసపూరితంగా ప్రజలు గుర్తించాలి.

ట్రాయ్‌ 'టెలికాం కమర్షియల్ కమ్యూనికేషన్ కస్టమర్ ప్రిఫరెన్స్ రెగ్యులేషన్' (టీసీసీసీపీఆర్‌) 2018 ప్రకారం, అవాంఛిత కాల్‌ లేదా సందేశాలు పంపడానికి ఉపయోగించిన మొబైల్ నంబర్లపై తగిన చర్యలు తీసుకునే బాధ్యత టెలికాం సేవల ప్రదాతలది. బాధిత వ్యక్తులు, సంబంధిత టెలికాం సేవల ప్రదాతను వారి వినియోగదార్ల సహాయక కేంద్రం నంబర్‌ ద్వారా, లేదా జాతీయ సైబర్ నేరాల నివేదన పోర్టల్ https://cybercrime.gov.inలో సంప్రదించవచ్చు. లేదా, సైబర్ నేరాల సహాయక కేంద్రం నంబర్ 1930కి కాల్ చేయవచ్చు.

 

***



(Release ID: 1977283) Visitor Counter : 101