రైల్వే మంత్రిత్వ శాఖ
2023 అక్టోబర్‌లో ఆపరేషన్ ‘నన్హే ఫరిస్తే’ కింద 601 మంది పిల్లలను రక్షించిన ఆర్‌పీఎఫ్
ప్రయాణీకుల రక్షణ, భద్రత, సౌకర్యం కోసం నిర్విరామంగా కృషి చేస్తున్న ఆర్‌పీఎఫ్
Posted On:
09 NOV 2023 12:41PM by PIB Hyderabad
రైల్వే ఆస్తులు, ప్రయాణీకుల ప్రాంగణాలు, ప్రయాణికుల భద్రతను పరిరక్షించడంలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్‌పీఎఫ్) నిబద్ధత అసామాన్యం. ప్రయాణీకులకు సురక్షితమైన, భద్రతతో కూడిన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించడానికి ఈ దళం 24 గంటలూ పని చేస్తోంది.
2023 అక్టోబర్‌లో, ప్రయాణీకుల రక్షణ, భద్రత, సౌకర్యం కోసం ఆర్‌పీఎఫ్ తన ప్రయత్నాలు కొనసాగించింది. భారతీయ రైల్వేలు తమ వినియోగదార్లకు నమ్మకమైన సరకు రవాణా సేవలను అందించడంలోనూ సాయపడింది.
నేర నివారణ చర్యలు తీసుకోవడంతో పాటు, రైల్వే ఆస్తులకు సంబంధించిన నేరాలు జరిగినప్పుడు ఆర్‌పీఎఫ్ వాటిని విజయవంతంగా గుర్తిస్తోంది. తద్వారా, దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే ఆస్తులను రక్షించే బాధ్యతను సమర్థంగా నిర్వర్తిస్తోంది.
2023 అక్టోబర్‌లో ఆర్‌పీఎఫ్ సాధించిన విజయాల సంక్షిప్త సమాచారం ఇది -
తప్పిపోయిన పిల్లలను రక్షించడం - ఆపరేషన్ "నన్హే ఫరిస్తే": మిషన్ "నన్హే ఫారిస్తే" కింద, 601 మంది పిల్లలను వారి కుటుంబాలతో తిరిగి కలపడంలో ఆర్‌పీఎఫ్ కీలక పాత్ర పోషించింది. ఈ పిల్లలు వివిధ కారణాల వల్ల వారి కుటుంబాల నుంచి వేరయ్యారు. వారు సురక్షితంగా తిరిగి ఇంటికి చేరడానికి ఆర్‌పీఎఫ్ అవిశ్రాంతంగా కృషి చేసింది.
మానవ అక్రమ రవాణా నిరోధక ప్రయత్నాలు - ఆపరేషన్ "ఆత్": మానవ అక్రమ రవాణాదార్ల ప్రణాళికలను తిప్పికొట్టేందుకు, ఆర్‌పీఎఫ్ మానవ అక్రమ రవాణా నిరోధక యూనిట్లు నిర్విరామంగా పని చేశాయి. 2023 అక్టోబర్‌లో, 39 మంది వ్యక్తులను అక్రమ రవాణాదార్ల బారి నుంచి ఆర్‌పీఎఫ్ రక్షించింది.
ప్రాణాలను కాపాడటం - ఆపరేషన్ "జీవన్ రక్ష": అక్టోబర్‌లో, ప్లాట్‌ఫారాలు, రైల్వే ట్రాక్‌ల వద్ద రైలు కింద పడబోయిన 262 మంది ప్రయాణికుల ప్రాణాలను ఆర్‌పీఎఫ్ కాపాడింది. రైల్వే రక్షణ దళ సభ్యుల అప్రమత్తత, వేగం వల్ల ఇది సాధ్యమైంది.
మహిళా ప్రయాణీకులకు సాధికారత - "మేరీ సహేలీ" చొరవ: మహిళా ప్రయాణీకుల భద్రతకు ఆర్‌పీఎఫ్ ప్రథమ ప్రాధాన్యం ఇస్తుంది. దీనికోసం "మేరీ సహేలీ" చొరవను ప్రారంభించింది. 2023 అక్టోబర్‌లో, 232 "మేరీ సహేలీ" బృందాలు 13,664 రైళ్లలో విధులు నిర్వర్తించాయి, 4,23,803 మంది మహిళా ప్రయాణీకులకు భద్రత హామీని ఇచ్చాయి. మహిళలకు కేటాయించిన బోగీల్లోకి ఎక్కిన 5,722 మంది పురుషులపై ఆర్‌పీఎఫ్ చర్యలు తీసుకుంది.
అక్రమార్కులపై ఉక్కుపాదం (ఆపరేషన్ "ఉపలబ్ద్"): 2023 అక్టోబర్‌లో 490 మంది అక్రమార్కులను ఆర్‌పీఎఫ్ అరెస్టు చేసింది, చట్టం ప్రకారం వారిపై చర్యలు తీసుకుంది. వారి నుంచి రూ.43.96 లక్షల విలువైన టిక్కెట్లను, 42 అక్రమ సాఫ్ట్‌వేర్‌లను స్వాధీనం చేసుకుంది.
మాదకద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట - ఆపరేషన్ "నార్కోస్": ఈ ప్రయత్నాల్లో భాగంగా, ఆర్‌పీఎఫ్ 99 మంది వ్యక్తులను అరెస్టు చేసింది, వాహరి నుంచి రూ. 5.99 కోట్లు విలువ చేసే మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. చట్టపరమైన చర్యల కోసం సంబంధిత విచారణ సంస్థలకు వారిని అప్పగించింది.
ప్రయాణీకుల ఆందోళనలపై సత్వర స్పందన: రైల్ మదద్ పోర్టల్, హెల్ప్‌లైన్ (అత్యవసర ప్రతిస్పందన మద్దతు వ్యవస్థ నంబర్ 112తో అనుసంధానమైన నంబర్ 139) ద్వారా, భద్రతకు సంబంధించి ప్రయాణీకులు ఫిర్యాదులు చేస్తే ఆర్‌పీఎఫ్ వెంటనే పరిష్కరించింది. 2023 అక్టోబర్‌లో 30,300 ఫిర్యాదులు అందాయి, వాటిని పరిష్కరించడానికి అవసరమైన అన్ని చర్యలను ఆర్‌పీఎఫ్ తీసుకుంది.
ప్రయాణీకులకు రక్షణ - ఆపరేషన్ "యాత్రి సురక్ష": రైల్వే ప్రయాణీకులపై జరిగే నేరాలను నిరోధించడంలో, గుర్తించడంలో పోలీసుల ప్రయత్నాలకు ఆర్‌పీఎఫ్ మద్దతు అందించింది. 2023 అక్టోబర్‌లో, ప్రయాణీకులపై నేరాలకు పాల్పడిన 256 మందిని ఆర్‌పీఎఫ్ అరెస్టు చేసి, సంబంధిత జీఆర్‌పీ/పోలీసులకు అప్పగించింది.
ప్రయాణీకులకు భద్రత - ఆపరేషన్ "సంరక్ష": ప్రయాణీకుల భద్రత కూడా ఆర్‌పీఎఫ్ ప్రాధాన్యత సేవల్లో భాగం. ఈ ప్రయత్నంలో, 2023 అక్టోబర్‌లో, రైళ్లపై రాళ్ల దాడికి పాల్పడిన 33 మంది వ్యక్తులను ఆర్‌పీఎఫ్ అరెస్టు చేసింది.
అవసరమైన వారికి సాయం అందించడం - ఆపరేషన్ "సేవ": 2023 అక్టోబర్‌లో, రైలు ప్రయాణాలు చేసిన 272 మంది వృద్ధులు, అనారోగ్యం బారిన పడినవారు, గాయపడిన ప్రయాణికులకు మానవత దృక్పథంతో ఆర్‌పీఎఫ్ సాయం అందించింది.
నిషేధిత వస్తువుల రవాణాను అడ్డుకోవడం - ఆపరేషన్ "సతర్క్": "ఆపరేషన్ సతర్క్" కింద, రూ.10,33,149 విలువైన పొగాకు ఉత్పత్తులను, రూ. 26,12,656 విలువైన మద్యాన్ని ఆర్‌పీఎఫ్ స్వాధీనం చేసుకుంది, 127 మంది వ్యక్తులను పట్టుకుంది. ఆ వ్యక్తులను సంబంధిత విచారణ సంస్థలకు అప్పగించింది.
***
(Release ID: 1976027)
Visitor Counter : 71