వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఇథియోపియా లోని అడిస్ అబాబా లో విజయవంతంగా జరిగిన - భారత్-ఇథియోపియా సంయుక్త వాణిజ్య కమిటీ 6వ సదస్సు


యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ ఆఫ్ ఇండియాతో భాగస్వామ్యం కావాలని ఇథియోపియాకు చెందిన ఎత్‌ స్విచ్‌ ని ఆహ్వానించిన - భారత్


ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించుకోడానికి, విదేశీ మారకద్రవ్యాన్ని కాపాడుకోవడానికి, స్థానిక కరెన్సీలో వాణిజ్య లావాదేవీ ల పరిష్కారాన్ని అన్వేషించాలని ఇథియోపియా ను కోరిన - భారత్

ప్రామాణీకరణ, నాణ్యత హామీ, కస్టమ్స్ ప్రక్రియలపై అవగాహన ఒప్పందాలు వేగవంతం చేయాలి

Posted On: 08 NOV 2023 4:06PM by PIB Hyderabad

భారత్-ఇథియోపియా సంయుక్త వాణిజ్య కమిటీ (జె.టి.సి) 6వ సదస్సు ఇథియోపియాలోని అడిస్ అబాబాలో 2023 నవంబర్, 6, 7 తేదీలలో జరిగింది.   ఈ సమావేశానికి భారత ప్రభుత్వ వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు చెందిన, వాణిజ్య శాఖ ఆర్థిక సలహాదారు శ్రీమతి ప్రియా పి. నాయర్; ఇథియోపియా కు చెందిన వాణిజ్యం, ప్రాంతీయ సమన్వయ మంత్రిత్వ శాఖ లోని అంతర్జాతీయ, ప్రాంతీయ వాణిజ్య సమన్యం లీడ్ ఎగ్జిక్యూటివ్ శ్రీ తాగెస్ ములుగెటా కలిసి, సహా అధ్యక్షత వహించారు. ఇథియోపియా లోని భారత రాయబారి శ్రీ రాబర్ట్ షెట్‌కిన్‌టాంగ్ తో పాటు ఇరుదేశాలకు చెందిన ఇతర సీనియర్ అధికారులు కూడా ఈ జె.టి.సి. లో పాల్గొన్నారు.

 

 

ద్వైపాక్షిక వాణిజ్యానికి ఆటంకం కలిగించే అన్ని సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోడానికి, రెండు దేశాల మధ్య వాణిజ్య అభివృద్ధి ని సులభతరం చేయడానికి ఇరుపక్షాలు అంగీకరించాయి.  యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ ఆఫ్ ఇండియా (యు.పి.ఐ) తో భాగస్వామ్యం కావాలని ఇథియోపియాకు చెందిన ఎత్‌ స్విచ్‌ ని భారతదేశం ఆహ్వానించింది.   దీనితో పాటు, ద్వైపాక్షిక వాణిజ్యాన్ని పెంపొందించడానికి, విదేశీ మారకద్రవ్యాన్ని పరిరక్షించడానికి సహాయపడే స్థానిక కరెన్సీలో వాణిజ్య లావాదేవీలను పరిష్కరించే అవకాశాన్ని అన్వేషించాలని కూడా భారతదేశం ఇథియోపియా దేశాన్ని కోరింది.  భారత్, ఇథియోపియా దేశాల జె.టి.సి. 6వ సదస్సులో రెండు దేశాల మధ్య సాంప్రదాయకంగా స్నేహపూర్వక, ప్రత్యేక సంబంధాలను ప్రతిబింబిస్తూ స్నేహపూర్వక వాతావరణంలో చర్చలు ముందుకు సాగాయి. 

 

 

ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడి సంబంధాలలో ఇటీవలి పరిణామాలపై ఇరుపక్షాలు ఒక వివరణాత్మక సమీక్షను చేపట్టాయి. ఈ సంబంధాన్ని మరింత పెంచడానికి భారీ అవకాశాలు ఉన్నాయని ఇరుపక్షాలు పేర్కొన్నాయి.   ఈ ప్రభావానికి, ద్వైపాక్షిక వాణిజ్యం, పరస్పర ప్రయోజనకరమైన పెట్టుబడులు రెండింటినీ పెంపొందించడానికి రెండు వైపులా దృష్టి సారించే పలు రంగాలను ఇరుపక్షాలు గుర్తించాయి.  వీటిలో ఆరోగ్యం, మందులు, ఆటోమొబైల్స్, వస్త్రాలు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, ఆహారం, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్ మొదలైనవి ఉన్నాయి.  ప్రామాణీకరణ, నాణ్యత హామీ, కస్టమ్స్ ప్రక్రియల రంగంలో అవగాహన ఒప్పందాల (ఎం.ఓ.యు.లు) కోసం జరుగుతున్న చర్చల పురోగతిని కూడా ఇరుపక్షాలు ఈ సందర్భంగా సమీక్షించాయి.  వాటిని త్వరితగతిన పూర్తి చేసేందుకు అంగీకరించాయి.  ద్వైపాక్షిక పెట్టుబడి ఒప్పందాన్ని త్వరగా ఖరారు చేయాలని ఇథియోపియన్ పక్షాన్ని భారతదేశం అభ్యర్థించింది.

 

 

ఆఫ్రికన్ ప్రాంతంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా, ఫెడరల్ డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ఇథియోపియా 2021-22 సంవత్సరంలో 6.4 శాతం వృద్ధి అంచనా వేయబడింది.   2022-23 ఆర్ధిక సంవత్సరంలో భారత, ఇథియోపియా దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 642.59 మిలియన్ల అమెరికా డాలర్లు గా ఉంది.   ఇథియోపియాకు భారతదేశం రెండవ అతిపెద్ద ఎగుమతిదారుగా ఉంది.   ఇథియోపియా లోని మొదటి మూడు విదేశీ పెట్టుబడిదారుల్లో  భారతీయ కంపెనీలు ఉన్నాయి.  ప్రస్తుతం 5 బిలియన్ డాలర్ల భారతీయ పెట్టుబడులు ఉన్నాయి.  వీటిలో సుమారు 3 నుంచి నాలుగు బిలియన్ల అమెరికా డాలర్ల మేర పెట్టుబడులు క్షేత్ర స్థాయిలో అమలు లో ఉన్నట్లు అంచనా.  వ్యవసాయం, పూల పెంపకం, ఇంజనీరింగ్, ప్లాస్టిక్స్, తయారీ, పత్తి, వస్త్రాలు, నీటి నిర్వహణ, ఫార్మాస్యూటికల్స్, ఆరోగ్య సంరక్షణ వంటి వివిధ రంగాలలో భారతీయ కంపెనీలు పెట్టుబడులు పెట్టాయి.

 

 

*****


(Release ID: 1975806) Visitor Counter : 100