ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav g20-india-2023

ఈ నెల 30-31 తేదీల్లో ప్రధానమంత్రి గుజరాత్ పర్యటన


అంబాజీ ఆలయంలో దైవ దర్శనం.. పూజలు చేయనున్న ప్రధానమంత్రి;

మెహసానాలో ₹5,800 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులు జాతికి అంకితం.. శంకుస్థాపన;

కేవాడియాలో జాతీయ ఐక్యత దినోత్సవంలో పాల్గొననున్న ప్రధానమంత్రి;

ఈ కార్యక్రమంలో భాగంగా అనేక అభివృద్ధి పనులకు శంకుస్థాపన... ప్రారంభం;

‘ఆరంభ్ 5.0’ ముగింపు సందర్భంగా 98వ కామన్ ఫౌండేషన్
కోర్సు శిక్షణార్థి అధికారులను ఉద్దేశించి ప్రసంగించనున్న ప్రధానమంత్రి

Posted On: 29 OCT 2023 2:20PM by PIB Hyderabad

   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అక్టోబరు 30-31 తేదీల్లో గుజరాత్‌లో పర్యటిస్తారు. తొలిరోజున ఉదయం 10:30 గంటలకు అంబాజీ ఆలయంలో దైవ దర్శనం చేసుకుని, పూజలు నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు మెహసానాలో ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. రెండో రోజున ఉదయం 8:00 గంటలకు ఆయన కేవాడియా వెళ్తారు. అక్కడ జాతీయ ఐక్యత దినోత్సవాల్లో భాగంగా ఐక్యతా విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటిస్టారు. అనంతరం పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేస్తారు. అటుపైన సుమారు 11:15 గంటలకు ‘ఆరంభ్ 5.0’ ముగింపు సందర్భంగా 98వ కామన్ ఫౌండేషన్ కోర్సు శిక్షణార్థి అధికారులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు.

మెహసానాలో ప్రధానమంత్రి

   మెహసానాలో 5,800 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపన కూడా చేస్తారు. వీటిలో రైల్వే, రహదారులు, తాగునీరు, నీటిపారుదల తదితర రంగాల పథకాలున్నాయి. ఈ మేరకు పశ్చిమ భారత ప్రత్యేక కారిడార్‌ (డబ్లుడి ఎఫ్‌సి)లో   భాగమైన న్యూభాండూ-న్యూ సనంద్(ఎన్) విభాగం; విరాంగం-సమాఖియలి రైలు మార్గం డబ్లింగ్; కటోసన్ రోడ్-బెచ్రాజీ- మారుతి సుజుకి ఇండియా లిమిటెడ్ (ఎంఎస్ఐఎల్ సైడింగ్) రైలు ప్రాజెక్టు; మెహసానా, గాంధీనగర్ జిల్లాల్లోగల విజాపూర్, మాన్సా తాలూకాలోని వివిధ గ్రామ చెరువుల పనర్పూరక ప్రాజెక్ట్; మెహసానా జిల్లాలో సబర్మతి నదిపై వలసనా బ్యారేజీ; పాలన్‌పూర్, బనస్కాంతలో తాగునీరందించే రెండు పథకాలు; ధరోయ్ ఆనకట్ట ఆధారిత పాలన్‌పూర్ జీవనాడి ప్రాజెక్ట్-హెడ్ వర్క్ సహా 80 ఎంఎల్‌డి సామర్థ్యంగల నీటి శుద్ధి ప్లాంటు తదితరాలున్నాయి.

   అలాగే ప్రధానమంత్రి శంకుస్థాపన చేయనున్న పథకాల్లో మహిసాగర్ జిల్లా సంత్రంపూర్ తాలూకాలో నీటిపారుదల సౌకర్యాల కల్పన ప్రాజెక్ట్; నరోడా– దేహగాం–హర్సోల్–ధన్సురా రోడ్, సబర్‌కాంత విస్తరణ, బలోపేతం; గాంధీనగర్ జిల్లాలో కలోల్ నగరపాలిక మురుగునీటి పారుదల, మురుగుశుద్ధి నిర్వహణ ప్రాజెక్ట్; సిద్ధపూర్ (పటాన్), పాలన్‌పూర్ (బనస్కాంత), బయాద్ (ఆరావళి), వాద్‌నగర్ (మెహసానా)లలో మురుగునీటి శుద్ధి ప్లాంట్ల ఏర్పాటు ప్రాజెక్టులు ఉన్నాయి.

కేవాడియాలో ప్రధానమంత్రి

   దేశ ఐక్యత, సమగ్రత, భద్రతల పరిరక్షణ, బలోపేతం చేసే స్ఫూర్తిని మరింత ప్రోదిచేయడం లక్ష్యంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని జాతీయ ఐక్యతా దినోత్సవంగా నిర్వహించాలని ప్రధాని నాయకత్వంలో ప్రభుత్వం చారిత్రక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అక్టోబ‌ర్ 31న జాతీయ ఐక్యత దినోత్సవం కార్యక్రమాల్లో భాగంగా స‌ర్దార్ వ‌ల్లభాయ్ ప‌టేల్‌కు నివాళి అర్పిస్తారు. అలాగే రక్షణ సిబ్బంది కవాతును వీక్షించి గౌరవ వందనం స్వీకరిస్తారు. సరిహద్దు భద్రత దళం(బిఎస్ఎఫ్ )సహా వివిధ రాష్ట్ర పోలీసు విభాగాల సిబ్బంది ఈ కవాతులో పాల్గొంటారు. మహిళా సీఆర్పీఎఫ్ మోటార్ సైకిళ్ల బృందం సాహస ప్రదర్శన, ‘బిఎస్ఎఫ్’ మహిళా పైప్ వాద్య బృందం, గుజరాత్ మహిళా పోలీసు విభాగం నాట్యరీతులు సమకూర్చిన నృత్యం, ఎన్‌సిసి ప్రదర్శన, స్కూల్ బ్యాండ్‌ల ప్రదర్శన, భారత వాయుసేన ద్వారా వైమానిక విన్యాసాలు, సాధికార గ్రామాల ఆర్థిక సామర్థ్యం ప్రదర్శన వగైరా కార్యక్రమాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.

   కేవాడియాలో 160 కోట్ల విలువైన పలు ప్రాజెక్టులను ప్రధానమంత్రి జాతికి అంకితం చేయడంతోపాటు శంకుస్థాపన కూడా చేస్తారు. వీటిలో ఏక్తానగర్-అహ్మదాబాద్ వారసత్వ రైలు; నర్మదా ఆరతి ప్రత్యక్ష ప్రసార ప్రాజెక్ట్; కమలం పార్క్; ఐక్యత విగ్రహం ప్రాంగణంలో నడక మార్గం; 30 కొత్త ఇ-బస్సులు, 210 ఇ-సైకిళ్లు, అనేక గోల్ఫ్ కార్టులు; ఏక్తా నగర్‌లో నగర వంటగ్యాస్ పంపిణీ నెట్‌వర్క్, గుజరాత్ రాష్ట్ర సహకార బ్యాంకువారి ‘సహకార భవనం’ వగైరాలున్నాయి. అలాగే కేవాడియా ఉప-జిల్లా ఆస్పత్రిలో అత్యవసర చికిత్స కేంద్రం, సౌర ఫలకాల ఏర్పాటుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు.

   ‘ఆరంభ్ 5.0’ ముగింపు సందర్భంగా 98వ కామన్ ఫౌండేషన్ కోర్సు శిక్షణార్థి అధికారులను ఉద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగించన్నారు. ‘‘వినూత్న పరిజ్ఞానాల సద్వినియోగం’’ ఇతివృత్తంగా ‘ఆరంభ్ 5.0’ కోర్సు ప్రారంభించబడింది. ఇది వర్తమానం, భవిష్యత్తు పునర్నిర్మాణంలో వినూత్నత పాత్రను ఇది వివరిస్తుంది. అలాగే సమ్మిళిత అభివృద్ధి కోసం పాలన రంగంలో వినూత్నత శక్తిని వాడుకునే మార్గాలను నిర్వచిస్తుంది. దీనికింద ‘నేను కాదు మనం’ ఇతివృత్తంతో 98వ కామన్ ఫౌండేషన్ కోర్సు నిర్వహించబడింది. దేశంలోని 16, భూటాన్ నుంచి 3 సివిల్ సర్వీసు విభాగాల నుంచి 560 మంది శిక్షణార్థి అధికారులు దీనికింద శిక్షణ పొందారు.



(Release ID: 1973015) Visitor Counter : 144