శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

6G ప్రమాణాలు అమలు చేయగల సామర్థ్యం ఉన్న భారతదేశం 6G సాంకేతిక పరిజ్ఞానం ఎగుమతి రంగంలో ప్రపంచ అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందుతుంది.. డీఎస్టీ కార్యదర్శి

Posted On: 29 OCT 2023 5:11PM by PIB Hyderabad

మొబైల్ సాంకేతిక రంగంలో ప్రపంచంలో అగ్రగామి దేశంగా అభివృద్ధి చెందడానికి భారతదేశం శక్తి సామర్ధ్యాలు కలిగి ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ అన్నారు. స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో 5G సేవలు అందిస్తున్న భారతదేశానికి  6G సేవలు అందించే సామర్థ్యం ఉందని ఆయన పేర్కొన్నారు. అంకితభావంతో కూడిన పరిశోధకుల బృందం, విద్యావేత్తలు, పరిశ్రమలు, అంకుర సంస్థల కృషితో మొబైల్ సాంకేతిక రంగంలో దేశం పురోగతి సాధిస్తోందని ఆయన చెప్పారు. ఢిల్లీలో జరుగుతున్న ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సమావేశంలో  ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ ఈరోజు పాల్గొని ప్రసంగించారు. మొబైల్ సాంకేతిక రంగంలో మరింత అభివృద్ధి సాధించడానికి అవసరమైన సౌకర్యాలు దేశంలో ఉన్నాయని ఆయన చెప్పారు. 

"  6G ప్రమాణాలను సాధించడానికి అవసరమైన అన్ని సౌకర్యాలు దేశంలో ఉన్నాయి. 6G ప్రమాణాలను భారతదేశం సాదిస్తుందని ఎవరూ ఊహించలేదు.భవిష్యత్తులో  6G సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రపంచ దేశాలకు అందించే సామర్థ్యం భారతదేశానికి ఉంది" అని  ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ సమావేశంలో భాగంగా 6G ప్రమాణాలపై  నిర్వహించిన  అంతర్జాతీయ వర్క్‌షాప్ లో ప్రొఫెసర్ కరాండికర్ పేర్కొన్నారు. 2023 అక్టోబర్ 27న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ  ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ ను ప్రారంభించారు. 

" 2G, 3G మొబైల్ నెట్‌వర్క్‌లతో పోల్చి చూస్తే 5G ఒక విప్లవాత్మక మార్పు. మొబైల్ రంగంలో  6G సమూల మార్పులు తీసుకు వస్తుంది. 6G ప్రమాణాలు సాధించడానికి అవసరమైన పరిశోధనలు చేపట్టేందుకు  భారతదేశంలో అవసరమైన అన్ని సౌకర్యాలు ఉన్నాయి " అని  ప్రొఫెసర్ అభయ్ కరాండికర్ అన్నారు.

మొబైల్ కమ్యూనికేషన్ రంగానికి అవసరమైన సమాచారాన్ని అందించడంలో భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో ఉందని  ప్రొఫెసర్ అభయ్ కరాండికర్  తెలిపారు.మొబైల్ కమ్యూనికేషన్ రంగానికి అవసరమైన మొత్తం డేటాలో  2030 నాటికి మూడవ వంతు లేదా అంతకంటే ఎక్కువ పరిమాణం భారతదేశం నుంచి అందే అవకాశం ఉందని  ఆయన తెలిపారు.   

“వివిధ అవసరాల కోసం భారతదేశం చాలా ఎక్కువ నుంచి చాలా తక్కువ డేటా రేట్ ఉపయోగిస్తోంది.అత్యంత క్లిష్టమైన అవసరాల నుంచి రేడియో ప్రసారాలు లాంటి భిన్నమైన రంగాల్లో భారతదేశం  సెల్యులార్ మొబైల్ కమ్యూనికేషన్‌ సేవలు విని యోగిస్తోంది.  వై-ఫై, డ్రోన్‌లు, శాటిలైట్, ప్రాంతీయ  నెట్‌వర్క్‌లు, సెన్సార్‌లతో పాటు IoT ద్వారా అనుసంధానం చేసిన పరికరాలకు ఉపయోగపడే వ్యవస్థను అభివృద్ధి చేయడానికి భారతదేశం ఒక పరిశోధనా కేంద్రంగా ఉంటుంది. ”అని ప్రొఫెసర్ కరాండికర్ అన్నారు. 

 ప్రామాణీకరణసాధించి పేటెంట్లు సాధించడానికి దేశంలో  పరిశోధనలు మరింత ఎక్కువ జరగాల్సి ఉందన్న అభిప్రాయాన్ని ప్రొఫెసర్ కరాండికర్ వ్యక్తం చేశారు. కోర్ నెట్‌వర్క్‌ అభివృద్ధిపై దృష్టి సారించాలని అన్నారు. కోర్ నెట్‌వర్క్ అభివృద్ధి చేయడానికి   సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపిన ప్రొఫెసర్ కరాండికర్  సవాళ్లను అధిగమించడానికి సమర్థవంతమైన భిన్నమైన రేడియో యాక్సెస్ టెక్నాలజీ అభివృద్ధిపై దృష్టి సారించాల్సి ఉంటుందని  ఆయన వివరించారు.

శాస్త్ర సాంకేతిక విభాగం అమలు చేస్తున్న నేషనల్ మిషన్ ఫర్ సైబర్ ఫిజికల్ సిస్టమ్స్ వంటి కార్యక్రమాల ద్వారా పరిశోధనలు సాగించి సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉందని ప్రొఫెసర్ కరాండికర్ అన్నారు. దీనివల్ల  ప్రాథమిక టెలిఫోన్ వ్యవస్థతో  పాటు వ్యవసాయం, ఆరోగ్యం, రవాణా మొదలైన రంగాలలో కమ్యూనికేషన్‌ సౌకర్యాలు విస్తరిస్తాయని ఆయన చెప్పారు. .

ఎన్‌ఎంఐసిపిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్‌ల ద్వారా ఐఎంసిలో ఏర్పాటు చేసిన స్టాల్స్‌ను  ప్రొఫెసర్ కరాండికర్ సందర్శించారు.  

సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అపూర్వ చంద్ర, ట్రాయ్ కార్యదర్శి   శ్రీ వి  రఘునందన్, సి-డాట్ నుంచి శ్రీ ఆర్.కే. ఉపాధ్యాయ, టీఈసీ సలహాదారు శ్రీ ఆర్.ఆర్. మిట్టార్  విద్యాసంస్థలు, పరిశ్రమల ప్రతినిధులు వర్క్‌షాప్లో పాల్గొన్నారు.  న్యూఢిల్లీలో నిర్వహించిన 3 రోజుల ఇండియన్ మొబైల్ కాంగ్రెస్ లో మొబైల్ నెట్‌వర్క్ టెక్నాలజీలు, వాటి ప్రమాణీకరణ, వాటి భవిష్యత్తు, సంబంధిత సమస్యలపై చర్చలు నిర్వహించారు. 

 

***


(Release ID: 1973013) Visitor Counter : 90