రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
'వివాద్ సే విశ్వాస్ Il' (ఒప్పంద వివాదాలు) ప్రచారం చేపట్టిన కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ
Posted On:
14 OCT 2023 4:08PM by PIB Hyderabad
కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ, జాతీయ రహదారి నిర్మాణాల్లో సమస్యలను పరిష్కరించేందుకు నేషనల్ హైవే బిల్డర్స్ ఫెడరేషన్‌తో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అర్హత గల అన్ని క్లెయిములను పరిష్కరించే లక్ష్యంతో 'వివాద్ సే విశ్వాస్ II' పథకాన్ని ప్రచార పద్ధతిలో అమలు చేయాలని సమావేశంలో అంగీకరించారు. గుత్తేదార్లంతా తమ అభ్యర్థనలను 25 అక్టోబర్ 2023 లోగా దాఖలు చేయాలని ఎన్‌హెచ్‌బీఎఫ్‌కు సూచించారు.
'వివాద్ సే విశ్వాస్ Il' (ఒప్పంద వివాదాలు) పథకాన్ని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని వ్యయాల విభాగం తీసుకొచ్చింది. గుత్తేదారుకు చెల్లించాల్సిన ఒప్పంద మొత్తం రూ.500 కోట్లు లేదా అంతకంటే తక్కువగా, మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటే ఆ అభ్యర్థనను సేకరణ సంస్థలు అంగీకరించాలి. ఇందుకోసం 'వివాద్ సే విశ్వాస్ Il' (ఒప్పంద వివాదాలు) పథకంలో వివరణాత్మక విధివిధానాలు ఉన్నాయి. చెల్లించాల్సిన మొత్తం రూ. 500 కోట్ల కంటే ఎక్కువ ఉంటే, గుత్తేదారు చేసిన అభ్యర్థనను అంగీకరించకూడదనే నిర్ణయం తీసుకోవాలి. దీనికి తగిన కారణాలను నమోదు చేయాలి, సంబంధిత ప్రాధికార సంస్థ అనుమతి తీసుకోవాలి. ఆ అభ్యర్థనలను 31.10.2023లోపు జెమ్ పోర్టల్ ద్వారా సమర్పించాలి.
న్యాయస్థానం/ట్రైబ్యునల్, ద్రవ్య ప్రాతిపదికన తీర్పునిచ్చిన అన్ని వివాదాలకు ప్రస్తుత మార్గదర్శకం వర్తిస్తుంది. మధ్యవర్తిత్వ సంస్థ తీర్పు 31.01.2023 లోపు జారీ అయిన, లేదా న్యాయస్థానం తీర్పు 30.04.2023 లోపు వచ్చిన అన్ని దావాలకు ఈ మార్గదర్శకం వర్తిస్తుంది.
పాత వ్యాజ్యాలను పరిష్కరించడానికి 'వివాద్ సే విశ్వాస్ Il' (ఒప్పంద వివాదాలు) రూపొందించినట్లు కేంద్ర రహదారి రవాణా & జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ అనురాగ్ జైన్ చెప్పారు. స్తంభించిన మూలధనాన్ని విడుదల చేయడానికి, తాజా పెట్టుబడులను ప్రోత్సహించడానికి ఈ పథకం సాయపడుతుందని అన్నారు.
****
(Release ID: 1967825)