శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
‘సిఎస్ఐఆర్’ 82వ వ్యవస్థాపక దినోత్సవం నిర్వహించిన ‘సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్సీపిఆర్’
Posted On:
11 OCT 2023 12:29PM by PIB Hyderabad
భారత శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన మండలి (సిఎస్ఐఆర్) 82వ వ్యవస్థాపక దినోత్సవాన్ని మండలి పరిధిలోని జాతీయ శాస్త్ర-సమాచార-విధాన పరిశోధన సంస్థ (ఎన్ఐఎస్సీపిఆర్) 2023 అక్టోబరు 10వ తేదీన న్యూఢిల్లీలోని తమ ప్రాంగణంలో నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ‘ఎనర్జీ స్వరాజ్ మూవ్‌మెంట్’ వ్యవస్థాపకుడు, ఐఐటీ-బాంబే ప్రొఫెసర్ చేతన్ సింగ్ సోలంకి (సోలార్ మ్యాన్ ఆఫ్ ఇండియా) ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి హాజైన వారందరికీ ‘ఎన్ఐఎస్సీపిఆర్’ డైరెక్టర్ ప్రొఫెసర్ రంజనా అగర్వాల్ సాదర స్వాగతం పలికారు. అనంతరం ‘సిఎస్ఐఆర్’ వ్యవస్థాపక దినోత్సవం గురించి, ఈ ఏడాది వేడుకల ప్రత్యేకత గురించి ఆమె సంక్షిప్తంగా వివరించారు. ఈసారి ‘సిఎస్ఐఆర్’ పరిధిలోని ప్రయోగశాలలన్నీ తాము సాధించిన విజయాలను ఒకే వేదికపై సమష్టిగా ప్రదర్శించాయని తెలిపారు. దేశ సాంకేతిక పురోగమనంలో ‘సిఎస్ఐఆర్’ ప్రయోగశాలలు పోషించిన పాత్రను, స్వయం సమృద్ధ భారతం కల నెరవేరడంలో వాటి సహకారాన్ని ఆమె ప్రముఖంగా ప్రస్తావించారు.
ఆ తర్వాత ముఖ్య అతిథి ప్రొఫెసర్ చేతన్ సింగ్ సోలంకి ‘వాతావరణ మార్పు-దిద్దుబాటు చర్యలపై ఆరు సూత్రాల అవగాహన’ శీర్షికతో ప్రధానోపన్యాసం చేశారు. ఇంధన పొదుపుపై తన అమూల్య అనుభవాలను ఆయన ‘సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్సీపిఆర్’ కుటుంబంతో పంచుకున్నారు. విద్యుత్తు వాడకంలో దుబారా, లోపభూయిష్ట వినియోగం వంటి తప్పులే వాతావరణ మార్పువంటి అనేక సమస్యలకు దారితీస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. సమర్థ వినియోగ సూత్రాన్ని వివరిస్తూ ‘నివారణ.. కనిష్టీకరణ.. ఉత్పాదన’ (ఎఎంజి) అనే తనదైన మంత్రాన్ని ఆయన పునరుద్ఘాటించారు. ఇళ్లలో అనవసర వినియోగ (దుబారా) నివారణ ఇందులో మొదటిదని ప్రొఫెసర్ సింగ్ పేర్కొన్నారు. తద్వారా మూడింట ఒక వంతు ఆదా అవుతుందని తెలిపారు. తక్కువ విద్యుత్తుతో సమర్థంగా పనిచేసే ఉపకరణాల ద్వారా వృథాను అరికడితే ఒకవంతు ఆదా కాగలదని చెప్పారు. మూడో పద్ధతి కింద ఏదో ఒక స్థాయిలో ఉత్పాదన చేపట్టాలని సూచించారు. ఈ విధంగా మనం విద్యుత్తు ఆదాచేస్తూ వాతావరణ మార్పు వంటి పెను సమస్యల పరిష్కారానికి కృషి చేయవచ్చునని తెలిపారు. విద్యుత్తు పొదుపులో మొత్తంమీద వ్యక్తులుగా మనం కీలక పాత్ర పోషించాల్సి ఉంటుందని ముఖ్య అతిథి నొక్కిచెప్పారు.
ఈ విశిష్ట వక్తల ఉపన్యాసాలతోపాటు ఈ కార్యక్రమంలో పలు కీలక కార్యకలాపాలు కూడా చేపట్టారు:
- పుస్తకావిష్కరణలు: ‘సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్సీపిఆర్’ తొలి ద్వైవార్షిక నివేదిక (2021-2023). సంస్థ విజయాలతోపాటు సైన్స్-కమ్యూనికేషన్; సైన్స్ పాలసీ రంగాల్లో తోడ్పాటును వివరించింది. ముఖ్య అతిథితోపాటు ‘ఎన్ఐఎస్సీపిఆర్’ డైరెక్టర్ ఈ నివేదికను సంయుక్తంగా ఆవిష్కరించారు. అలాగే డాక్టర్ సుకన్య దత్తా ‘యాన్యువల్ జర్నీ: ది మ్యాజిక్ ఆఫ్ మైగ్రేషన్’ శీర్షికతో రచించిన మరో పుస్తకాన్ని కూడా ఈ సందర్భంగా విడుదల చేశారు.
- రిటైరైన ఉద్యోగులకు సత్కారం: ఈ కార్యక్రమం కింద ‘ఎన్ఐఎస్సీపిఆర్’లో పనిచేసి, రిటైరైన ఉద్యోగులను సత్కరించారు. వారి సేవలను కొనియాడుతూ సంస్థ విజయాలకు ఏళ్ల తరబడి వారు మూలస్తంభాలుగా నిలిచారని ఉన్నతాధికారులు ప్రశంసించారు. అలాగే 25 ఏళ్ల సేవాకాలం పూర్తిచేసుకున్న వారిని కూడా సత్కరించారు.
- సాంస్కృతిక కార్యక్రమం: ‘సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్సీపిఆర్’లోని ప్రతిభావంతులైన విద్యార్థులు, సిబ్బంది సంయుక్తంగా ఇచ్చిన సాంస్కృతిక ప్రదర్శన అందర్నీ ఎంతగానో అలరించింది. కళాకారులు వీనుల విందైన సంగీతం, కనువిందు చేసే నృత్యం, ఇతరత్రా కళారూపాలతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేశారు.
- బహుమతి ప్రదానం: ‘సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్సీపిఆర్’ కుటుంబంలోని అందరిలోనూ అసాధారణ ప్రతిభను గుర్తించి అభినందించేందుకు ఈ వేడుక ఒక మహత్తర అవకాశం కల్పించింది. ఈ మేరకు నిర్వహించిన వివిధ రకాల పోటీల్లో విజేతలకు బహుమతి ప్రదానం చేశారు.
ఈ వ్యవస్థాపక దినోత్సవం కేవలం సంస్థ గత విజయాల వేడుకకు మాత్రమే పరిమితమైనది కాదు. ఆవిష్కరణ, నైపుణ్యం, పట్టుదలతో ఇక్కడ ఆశావహ భవిష్యత్తుకు బాటలు పడటాన్ని కూడా ఈ కార్యక్రమం సంగ్రహంగా ప్రతిబింబించింది. తన విలువలు, లక్ష్యాలపై సంస్థ నిబద్ధతను ఈ కార్యక్రమం ప్రస్ఫుటం చేసింది.
న్యూఢిల్లీలో ‘సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్సీపిఆర్’ 2021లో ఉనికిలోకి వచ్చింది. న్యూఢిల్లీలోనే అంతకుముందున్న ‘సిఎస్ఐఆర్-నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కమ్యూనికేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ రిసోర్సెస్’, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్-టెక్నాలజీ అండ్ డెవలప్‌మెంట్ స్టడీస్’ సంస్థల విలీనంతో ‘సిఎస్ఐఆర్-ఎన్ఐఎస్సీపిఆర్’ ఏర్పడింది. శాస్త్ర-సమాచార-విధాన అధ్యయన రంగంలో దేశంలోనే ప్రత్యేకతగల ప్రధాన పరిశోధన సంస్థ ఇది. శాస్త్ర-సాంకేతికతలలో విస్తృత శ్రేణి అంశాలతో అనేక పరిశోధన పత్రికలను ఇది ప్రచురిస్తుంది. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేట్, డాక్టోరల్ స్థాయిలో ‘సైన్స్-కమ్యూనికేషన్-పాలసీ రీసెర్చ్’లో విద్యా కార్యక్రమాలను కూడా అందిస్తుంది.
***
(Release ID: 1966870)
Visitor Counter : 72