ప్రధాన మంత్రి కార్యాలయం
మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో రూ.12,600 కోట్ల విలువ గల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి, అంకితం చేసిన ప్రధానమంత్రి
జబల్ పూర్ లో “వీరాంగన రాణి దుర్గావతి స్మారక్ ఔర్ ఉద్యాన్”కు భూమి పూజ
వీరగంగా రాణి దుర్గావతి 500 వ జయంతి సందర్బంగా స్మారక నాణెం విడుదల
పిఎంఏవై - అర్బన్ కింద ఇండోర్ లో లైట్ హౌస్ ప్రాజెక్ట్ కింద నిర్మించిన 1000 పైగా ఇళ్ళ ప్రారంభం
మాండ్ల, జబల్ పూర్, దిండోరి జిల్లాల్లో అనేక జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులు శంకుస్థాపన, సియోని జిల్లాలో జల్ జీవన్ ప్రాజెక్టు అంకితం
మధ్యప్రదేశ్ లో రోడ్డు మౌలిక వసతులను మెరుగు పరిచేందుకు రూ.4800 కోట్ల పైగా వ్యయంతో చేపడుతున్న పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన, అంకితం
రూ. 1850 కోట్ల పైగా విలువ గల రైలు ప్రాజెక్టులు అంకితం
విజయ్ పూర్-అరియన్-ఫూల్పూర్ పైప్ లైన్ అంకితం
ముంబై-నాగపూర్-ఝార్సుగూడ పైప్ లైన్ లో నాగపూర్-జబల్ పూర్ సెక్షన్ కు (317 కిలోమీటర్లు) శంకుస్థాపన, జబల్ పూర్ లో కొత్త బాట్లింగ్ ప్లాంటు అంకితం
“మాతృభూమి కోసం ఏదైనా చేయాలనీ మనలో స్ఫూర్తిని నింపిన, ఇతరుల ప్రయోజనం కోసం జీవించాలని రాణి దుర్గావతి మనకు బోధించారు”.
“గత కొద్ది వారాలుగా ఉజ్వల లభ్డిదారులకు గ్యాస్ ధర రూ.500 మేరకు తగ్గింపు”
“దేశంలో అవినీతి వ్యవస్థను తుడిచి పెట్టిన జన్ ధన్, ఆధార్, మొబైల్ త్రయం”
“రాబోయే 25 సంవత్సరాల కాలంలో అభివృద్ధి చెందిన మధ్యప్రదేశ్ ని మీ పిల్లలు చూసేలా చేయాల్సిన బాధ్యత ప్రస్తుతం 25 లోపు వయస్కులదే”
“నేడు భారత దేశం విశ్వాసం కొత్త శిఖరాలపై ఉంది. క్రీడా మైదానాల నుంచి వ్యవసాయ క్షేత్రాల వరకు భారత పతాకం ఎగురుతోంది”
“నేడు స్వదేశీ భావన, దేశాన్ని ముందుకు నడపాలన్న ఆలోచన ప్రతి చోటా పెరుగుతోంది”
“డబల్ ఇంజన్ ప్రభుత్వం నిరాదరణకు గురవుతున్న వర్గాలకు ప్రాధాన్యం ఇస్తోంది”
Posted On:
05 OCT 2023 6:10PM by PIB Hyderabad
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ లో రూ.12,600 కోట్ల వ్యయంతో నిర్మించిన రోడ్డు, రైలు, గ్యాస్ పైప్ లైన్, గృహనిర్మాణ, స్వచ్ఛ మంచినీటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి కొన్నింటిని ప్రారంభించారు. రాణి దుర్గావతి 500వ జయంతి సందర్భంగా జబల్ పూర్ లో నిర్మిస్తున్న ‘‘వీరాంగన రాణి దుర్గావతి స్మారక్ ఔర్ ఉద్యాన్’’ ప్రాజెక్టుకు శ్రీ మోదీ భూమిపూజ చేశారు. శ్రీ మోదీ ప్రారంభించిన ప్రాజెక్టుల్లో లైట్ హౌస్ ప్రాజెక్టు కింద ఇండోర్ లో నిర్మించిన 1000 ఇళ్లు కూడా ఉన్నాయి. మాండ్లా, జబల్ పూర్, దిండోరి జిల్లాల్లో అనేక జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. సియోని జిల్లాలో జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టును ప్రారంభించారు. మధ్యప్రదేశ్ లో రూ.4800 కోట్ల పైబడిన వ్యయంతో చేపడుతున్న పలు రోడ్ల అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంతో పాటు రూ.1850 కోట్ల పైబడిన వ్యయంతో నిర్మించిన రైలు ప్రాజెక్టులను, విజయ్ పూర్-ఔరియాన్-ఫూల్పూర్ పైప్ లైన్ ప్రాజెక్టును, జబల్ పూర్ లో కొత్త బాట్లింగ్ ప్లాంట్ ను జాతికి అంకితం చేశారు. ముంబై-నాగపూర్-ఝార్సుగుడా పైప్ లైన్ ప్రాజెక్టులో నాగపూర-జబల్ పూర్ సెక్షన్ కు (317 కిలోమీటర్లు) శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనను కూడా తిలకించి వీరాంగన రాణి దుర్గావతికి పుష్పాంజలి ఘటించారు.
ఈ సందర్భంగా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ నర్మదామాత ప్రవహించే ఈ భూమికి శిరసు వంచి అభివాదం చేస్తున్నానని ప్రధానమంత్రి అన్నారు. జబల్ పూర్ ను ఉత్సాహం, ఉత్సుకత, ఆనందం పొంగి పొరలుతున్న నగరంగా పూర్తిగా కొత్తగా తాను చూస్తున్నాని చెప్పారు. జాతి యావత్తు వీరాంగన రాణి దుర్గావతి 500వ జయంతిని అత్యంత ఉత్సాహంగా, వేడుకగా నిర్వహించుకుంటున్నదని ప్రధానమంత్రి అన్నారు. దుర్గావతి గౌరవ యాత్ర ముగింపు సందర్భంగా తాను జాతియావత్తు ఆమె జయంతిని నిర్వహించుకుంటుందని తాను చెప్పానని, నేడు ఇక్కడకు వచ్చిన భారీ జనసందోహంలో ఆ స్ఫూర్తి కనిపిస్తున్నదని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు. ‘‘భారతదేశ ప్రాచీన ప్రముఖుల రుణం తీర్చుకునేందుకు మనందరం ఇక్కడ సమావేశమయ్యాం’’ అని చెప్పారు. వీరాంగన రాణి దుర్గావతి స్మారక్ ఔర్ ఉద్యాన్ ప్రాజెక్టు వివరాలు తెలియచేస్తూ దేశంలోని తల్లులు, యువతీ యువకుల్లో ప్రతీ ఒక్కరూ ఈ స్మారకాన్ని సందర్శించాలని కోరుకుంటారని, ఆ రకంగా రాబోయే కాలంలో ఇది ఒక పెద్ద యాత్రా స్థలంగా మారుతుందన్న విశ్వాసం ప్రకటించారు. ఇతరుల ప్రయోజనం కోసం జీవించాలని రాణి దుర్గావతి మనకి బోధించారని, ఆమె జీవితం మాతృభూమి కోసం ఏదైనా చేయాలనే స్ఫూర్తిని నింపుతుందని ప్రధానమంత్రి అన్నారు. రాణి దుర్గావతి 500వ జయంతి సందర్భంగా యావత్ గిరిజన సమాజానికి, మధ్యప్రదేశ్ ప్రజలకు, 140 కోట్ల మంది భారతీయులకు శుభాకాంక్షలు అందించారు. దేశ స్వాతంత్ర్యం అనంతరం మన పూర్వీకులకు తగినంత ప్రాధాన్యత ఇవ్వలేదని, జాతి యోధులను మరిచిపోయిందని ప్రధానమంత్రి విమర్శించారు. రూ.12,000 కోట్లతో చేపట్టిన ఈ ప్రాజెక్టు రైతులు, యువత సహా ప్రజలందరి జీవితాల్లో పరివర్తన తెస్తుందని ప్రధానమంత్రి అన్నారు. ‘‘ఈ ప్రాంతంలో కొత్త పరిశ్రమలు ఏర్పాటు కావడంతో యువతకు ఉద్యోగాలు కూడా లభిస్తాయి’’ అన్నారు.
మన తల్లులు, సోదరీమణులకు పొగరహిత వంటగదులను అందించాల్సిన అవసరం ఉందని నొక్కి చెబుతూ ప్రస్తుత ప్రభుత్వం దానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తున్నదని చెప్పారు. ఒక అధ్యయనం ప్రకారం పొయ్యి నుంచి వచ్చే పొగ 24 గంటల్లో 400 సిగరెట్ల పొగతో సమానమని ఆయన తెలిపారు. మహిళలకు భద్రతతో కూడిన వాతావరణం కల్పించడానికి గత ప్రభుత్వ హయాంలో ఎలాంటి ప్రయత్నం జరగకపోవడాన్ని దుయ్యబట్టారు. ఉజ్వల స్కీమ్ గురించి ప్రస్తావిస్తూ గతంలో గ్యాస్ కనెక్షన్ పొందడం ఎంత కష్టంగా ఉండేదో ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రస్తుత ప్రభుత్వం రక్షాబంధన్ పండుగ సమయంలో గ్యాస్ ధరలు తగ్గించడాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఉజ్వల లబ్ధిదారులకు ఒక్కో సిలిండర్ రూ.400 చౌక అయిందన్నారు. రాబోయే పండుగ సీజన్ లో గ్యాస్ సిలిండర్ ధర మరో రూ.100 తగ్గించాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయం తీసుకున్నదని చెప్పారు. ‘‘గత కొద్ది వారాల కాలంలో ఉజ్వల లబ్ధిదారులకు గ్యాస్ సిలిండర్ ధర రూ.500 తగ్గింది’’ అన్నారు. రాష్ర్టంలో గ్యాస్ పైప్ లైన్ వేస్తున్న విషయం ప్రస్తావిస్తూ పైప్ లైన్ల ద్వారా చౌక ధరలో గ్యాస్ అందించే దిశగా కేంద్రప్రభుత్వం పెద్ద అడుగులేస్తున్నదని ప్రధానమంత్రి చెప్పారు. గత ప్రభుత్వాల హయాంలో అవినీతి విలయతాండవం చేసిన విషయం గుర్తు చేస్తూ పేదల కోసం కేటాయించిన నిధులు అవినీతిపరుల బొక్కసాలు నింపాయన్నారు. పది సంవత్సరాల క్రితం పరిస్థితి తెలుసుకోవాలంటే ఒక సారి ఆన్ లైన్ లో నాటి పతాక శీర్షికలు పరిశీలిస్తే చాలునంటూ అప్పట్లో అవన్నీ అవినీతికి సంబంధించిన వార్తలతో నిండి ఉంటాయని వ్యాఖ్యానించారు.
2014 తర్వాత ప్రస్తుత ప్రభుత్వం అవినీతిని సమూలంగా తొలగించేందుకు ‘‘స్వచ్ఛ’’ ఉద్యమం చేపట్టిందని ప్రధానమంత్రి చెప్పారు. ‘‘టెక్నాలజీ వినియోగంతో 11 కోట్ల మంది ఊరూపేరూ తెలియని బోగస్ లబ్ధిదారులను ప్రభుత్వ జాబితాల నుంచి తొలగించింది’’ అన్నారు. ‘‘పేదల కోసం కేటాయించిన నిధులో ఏ ఒక్కరూ దోచుకోలేరు అని 2014 తర్వాత మోదీ హామీ ఇచ్చాడు’’ అన్నారు.జన్ ధన్, ఆధార్, మొబైల్ త్రయాన్ని మోదీ సృష్టించాడని చెప్పారు. ‘‘ఈ త్రిశక్తి కారణంగా రూ.2.5 కోట్లు తప్పుడు లబ్ధిదారుల చేతుల్లోకి పోకుండా ఆదా చేయగలిగాం’’ అని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. ఉజ్వల సిలిండర్లు కేవలం రూ.500కి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఎంతో ఖర్చు చేస్తోందని, కోట్లాది కుటుంబాలకు ఉచితంగా రేషన్ అందించడానికి రూ.3 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నామని, అలాగే ఆయుష్మాన్ స్కీమ్ కింద 5 కోట్ల కుటుంబాలకు ఉచిత చికిత్స కోసం రూ.70,000 కోట్లు, రైతులకు చౌకగా యూరియా అందించేందుకు రూ.8 లక్షల కోట్లు, పిఎం సమ్మాన్ నిధి కింద చిన్న రైతుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేయడానికి రూ.2.5 లక్షల కోట్లు, పేదలకు శాశ్వత గృహాల నిర్మాణం కోసం రూ.4 లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నట్టు ప్రధానమంత్రి వివరించారు. ఇండోర్ లోని పేదల కుటుంబాలు ఆధునిక టెక్నాలజీతో నిర్మించిన 1000 శాశ్వత గృహాలు అందుకున్నారని ఆయన తెలిపారు.
మధ్యప్రదేశ్ నేడు అత్యంత కీలకమైన దశలో ఉన్నదని, అభివృద్ధికి ఏ మాత్రం విఘాతం కలిగినా గత రెండు సంత్సరాలుగా సాధించిన పురోగతి కుంటుపడిపోతుందని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. ప్రత్యేకంగా 25 సంవత్సరాల లోపు వారినుద్దేశించి మాట్లాడుతూ రాబోయే 25 సంవత్సరాల కాలంలో మీ పిల్లలు అభివృద్ధి చెందిన మధ్యప్రదేశ్ చూడగలిగేలా మీరే భరోసా ఇవ్వాలి అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వ్యవసాయ ఎగుమతుల్లో ఎంపిని అగ్రస్థానంలో నిలిపిందని, పారిశ్రామికాభివృద్ధిలో కూడా రాష్ర్టం ముందువరుసలో ఉన్నదని ఆయన తెలిపారు. గత కొద్ది సంవత్సరాల్లోనూ భారతదేశ రక్షణ ఎగుమతులు ఎన్నో రెట్లు పెరిగాయని చెబుతూ రక్షణ ఉత్పత్తులు తయారుచేసే 4 ఫ్యాక్టరీలతో జబల్ పూర్ రక్షణ ఎగుమతులకు పెద్ద వాటా అందించిందన్నారు. కేంద్రప్రభుత్వం సైన్యానికి ‘‘మేడ్ ఇన్ ఇండియా’’ ఆయుధాలు అందిస్తోందని, ప్రపంచ దేశాల్లో కూడా భారత రక్షణ వస్తువులకు డిమాండు పెరుగుతోందని చెప్పారు. ‘‘దీని ద్వారా మధ్యప్రదేశ్ ఎంతో ప్రయోజనం పొందుతోంది. వేలాది మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది’’ అని ప్రధానమంత్రి అన్నారు.
‘‘నేడు భారతదేశ విశ్వాసం కొత్త శిఖరాల్లో నిలిచి ఉంది. క్రీడా మైదానాల నుంచి పంట పొలాల వరకు భారతదేశ జెండా ఎగురుతోంది’’ అని ప్రధానమంత్రి చెప్పారు. ప్రస్తుతం జరుగుతున్న ఆసియా క్రీడోత్సవాల్లో భారతదేశం అత్యద్భుత ప్రదర్శన చూపుతోందని నొక్కి చెబుతూ నేడు భారత యువత అందరూ తాము ఈ దేశానికి చెందిన వారు కావడం పట్ల గర్వపడుతున్నారన్నారు. యువతకు అవకాశాలు లభించినప్పుడు అభివృద్ధి చెందిన భారత్ కోసం వారి ఆకాంక్ష కూడా ఉత్తేజితం అవుతుందని ఆయన చెప్పారు. ఉదాహరణకి జి-20 వంటి ప్రపంచ స్థాయి భారీ సదస్సులు మనం నిర్వహిస్తున్నామన్నారు. చంద్రయాన్ విజయం గురించి ప్రస్తావిస్తూ స్థానికం కోసం నినాదం మంత్రం ఇలాంటి విజయాలతో ప్రతిధ్వనిస్తుందని పేర్కొన్నారు. గాంధీ జయంతి నాడు ఢిల్లీలోని ఒక స్టోర్ లో రూ.1.5 కోట్ల విలువ గల ఖాదీ ఉత్పత్తులు అమ్ముడుపోయాయని చెప్పారు. ‘‘స్వదేశీ భావన నేడు దేశాన్ని అన్ని రంగాల్లోను ముందుకు నడిపిస్తోంది’’ అని శ్రీ మోదీ నొక్కి చెప్పారు. స్టార్టప్ ప్రపంచంలో కూడా విజయం సాధించడంలో భారత యువత పాత్ర గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. అక్టోబరు 1న చేపట్టిన స్వచ్ఛత కార్యక్రమంలో 9 లక్షలకు పైగా ప్రాంతాల్లో చేపట్టిన వివిధ కార్యకలాపాల్లో 9 కోట్ల మంది పౌరులు పాల్గొన్నారని తెలిపారు. స్వచ్ఛతలో మధ్యప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలపడంలో ప్రజల పాత్ర ఎంతో కీలకమని ప్రశంసించారు.
భారతదేశ విజయాలను ప్రపంచం యావత్తు చర్చించుకుంటున్న తరుణంలో కొందరు రాజకీయ నాయకులు భారత వ్యతిరేక మాటలు మాట్లాడుతున్న వైఖరి పట్ల ప్రధానమంత్రి హెచ్చరించారు. ఉదాహరణకి భారతదేశ డిజిటల్ కార్యక్రమం, కోవిడ్ వ్యాక్సిన్ల కార్యక్రమం వంటివి వారు ప్రస్తావిస్తున్న ప్రశ్నలని తెలియచేశారు. భారతదేశ శత్రువుల మాటలు అలాంటి రాజకీయ పార్టీలు నమ్ముతున్నాయని, వారు చివరికి భారతదేశ సైన్యాన్నే ప్రశ్నించే స్థాయికి చేరాయని అన్నారు. వారు అమృత్ మహోత్సవ్ వేడుకలను, అమృత సరోవరాల ఏర్పాటును కూడా విమర్శిస్తున్నారని చెప్పారు.
భారత సాంస్కృతిక, వారసత్వ విలువలకు స్వాతంత్ర్య కాలం నుంచి భారత గిరిజన సమాజం అందించిన సేవలకు ప్రముఖంగా ప్రస్తావిస్తూ దశాబ్దాలుగా దేశాన్ని పాలించిన వారు ఇలాంటి వారికి ఎలా నిర్లక్ష్యం చేశారని ప్రశ్నించారు. గిరిజన సమాజం సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి బడ్జెట్ కేటాయింపులు చేసిన తొలి ప్రభుత్వం అటల్ జీ ప్రభుత్వమేనని నొక్కి చెప్పారు. గత 9 సంవత్సరాల కాలంగా ఈ బడ్జెట్ ను కూడా ఎన్నో రెట్లు పెంచినట్టు శ్రీ మోదీ చెప్పారు. భారతదేశం తొలి గిరిజన మహిళా రాష్ర్టపతి కలిగి ఉన్నదని. బిర్సా ముందా జయంతిని జనజాతీయ గౌరవ దివస్ గా పాటిస్తున్నామని ఆయన గుర్తు చేశారు. దేశంలోని అత్యంత ఆధునిక రైల్వే స్టేషన్ పేరును రాణి కమలాపతి స్టేషన్ గా మార్చామని, పటల్పని స్టేషన్ పేరును జననాయక్ తాంత్యా బాయి స్టేషన్ గా మార్చామని శ్రీ మోదీ ప్రత్యేకంగా నొక్కి చెప్పారు. అలాగే గోండ్ తెగ వారికి అతి పెద్ద స్ఫూర్తి అయిన రాణి దుర్గావతిజీ పేరిట అతి పెద్ద స్మారకం నిర్మాణ ప్రాజెక్టును చేపట్టామన్నారు. గోండుల సంస్కృతి, చరిత్ర, కళలను ఈ మ్యూజియం ప్రపంచానికి చూపుతుందన్నారు. గోండుల సాంప్రదాయం పట్ల చైతన్యం కలిగించడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని చెప్పారు. ప్రపంచ నాయకులకు క డా గోండుల పెయింటింగ్ లను బహుమతిగా అందించామని ప్రధానమంత్రి శ్రీ మోదీ ప్రత్యేకంగా తెలిపారు.
మహో సహా డాక్టర్ బాబా సాహెబ్ కు అనుబంధం ఉన్న ప్రాంతాలన్నింటినీ పంచతీర్థ్ గా అభివృద్ధి చేస్తున్నది ప్రస్తుత ప్రభుత్వమేనని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు. సాగర్ లో కొద్ది వారాల క్రితం సంత్ రవిదాస్ జీ స్మారక స్థలికి భూమి పూజ చేశామని గుర్తు చేశారు. ‘‘సామాజిక సామరస్యం, వారసత్వం పట్ల ప్రస్తుత ప్రభుత్వానికి గల చిత్తశుద్ధిని ఇది ప్రదర్శిస్తోంది’’ అన్నారు.
ఆశ్రిత పక్షపాతం, అవినీతిని పెంచి పోషించిన పార్టీలు గిరిజన సమాజాన్ని దోచుకున్నాయని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. 2014 సంవత్సరానికి ముందు కేవలం 8-10 అటవీ ఉత్పత్తులకే మద్దతు ధరలు అందించారని, మిగతా ఉత్పత్తులన్నీ వచ్చిన కాడికి అమ్ముకోవలసి వచ్చేదని చెబుతూ నేడు 90 అటవీ ఉత్పత్తులకు ఎంఎస్ పి అందిస్తున్నామని ప్రధానమంత్రి తెలియచేశారు.
గత కాలంలో గిరిజనులు, చిన్న రైతులు పండించే చిరుధాన్యాలకు ప్రత్యేకించి కోడో-కుట్కీకి అంత ప్రాధాన్యత ఇవ్వలేదని ప్రధానమంత్రి గుర్తు చేశారు. మీ కోడో-కుట్కితోనే జి-20కి వచ్చిన విదేశీ అతిథులకు ఆహార పదార్థాలు తయారుచేసి అందించాం అని చెప్పారు. ‘‘ప్రస్తుత ప్రభుత్వం శ్రీ అన్నలో భాగంగా కోడో-కుట్కీని దేశ, విదేశీ మార్కెట్లకు అందించాలనుకుంటోంది’’ అని చెప్పారు.
‘‘డబుల్ ఇంజన్ ప్రభుత్వం సమాజంలో నిరాదరణకు గురవుతున్న వారికి అధిక ప్రాధాన్యం ఇస్తోంది’’ అని ప్రధానమంత్రి నొక్కి చెప్పారు. పేదల ఆరోగ్య పరిరక్షణ కోసం స్వచ్ఛమైన మంచినీరు అందించాల్సిన అవసరం ఉన్నదన్నారు. నేడు చేపట్టిన ఈ ప్రాజెక్టులు 1600 గ్రామాలకు స్వచ్ఛమైన నీటి వసతిని అందిస్తాయని తెలిపారు. నారీశక్తి వందన్ అధినియమ్ ద్వారా లోక్ సభ, అసెంబ్లీల్లో మహిళలకు వారు పొందాల్సిన వాటా అందించడం గురించి కూడా ప్రస్తావించారు. అలాగే రూ.13 వేల కోట్లతో చేపట్టిన పిఎం విశ్వకర్మ పథకం గురించి వివరించారు.
మధ్యప్రదేశ్ ను అభివృద్ధిలో అగ్రస్థానానికి చేరుస్తామని మోదీ ప్రభుత్వం ప్రజలు హామీ ఇస్తోందని ప్రసంగాన్ని ముగిస్తూ ప్రధానమంత్రి చెప్పారు. ‘‘మధ్యప్రదేశ్ కు చెందిన మహాకౌశల్ మోదీ, ప్రభుత్వ సంకల్పాన్ని పటిష్ఠం చేస్తుందని నేను నమ్ముతున్నాను’’ అన్నారు.
మధ్యప్రదేవ్ గవర్నర్ శ్రీ మంగుభాయ్ సి పటేల్, ముఖ్యమంత్రి శ్రీ శివరాజ్ సింగ్ చౌహాన్, ఇతరులు ఈ కార్యక్రమాలకు హాజరైన వారిలో ఉన్నారు.
పూర్వాపరాలు
రాణి దుర్గావతి 500 వ జయంతిని భారతదేశం అత్యంత ఉత్సాహంతో నిర్వహిస్తోంది. 2023 జులైలో ప్రధానమంత్రి మధ్యప్రదేశ్ లోని షాదోల్ పర్యటన సందర్భంగా ఈ విషయం ప్రకటించారు. ఎర్రకోట బురుజుల నుంచి ప్రధానమంత్రి చేసిన చారిత్రక స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో ఆయన ఈ ప్రకటన పునరుద్ఘాటించారు . ఈ వేడుకల సందర్భంగానే “వీరాంగన రాణి దుర్గావతి స్మారక్ ఔర్ ఉద్యాన్”కు భూమిపూజ చేశారు.
రూ.100 కోట్ల వ్యయంతో జబల్ పూర్ లో నిర్మించనున్న “వీరాంగన రాణి దుర్గావతి స్మారక్ ఔర్ ఉద్యాన్” 21 ఎకరాల విస్తీర్ణంలో ఆవరించి ఉంటుంది. అక్కడ 52 అడుగుల ఎత్తు గల రాణి దుర్గావతి విగ్రహం ఆకర్షణీయం. అలాగే గోండ్వానా ప్రాంత చరిత్రను, రాణి దుర్గావతి ధైర్యం, సాహసాన్ని తెలియజేసే అద్భుతమైన మ్యూజియం కూడా ఏర్పాటు చేస్తారు. గోండు ప్రజలు, ఇతర గిరిజన తెగల వంటకాలు, చిత్రలేఖనం, సంస్కృతి, జీవనశైలిని కూడా ఇది వెలుగులోకి తెస్తుంది. “వీరాంగన రాణి దుర్గావతి స్మారక్ ఔర్ ఉద్యాన్”లో పలు ఉద్యానవనాలు, పార్కులు, వైద్యంలో ఉపయోగించే మొక్కలు, కాక్టస్ గార్డెన్, రాక్ గార్డెన్ కూడా ఉంటాయి. 16వ శతాబ్ది మధ్యలో పరిపాలించిన గోండ్వానా పాలకురాలు రాణి దుర్గావతి. స్వాతంత్ర్య సంగ్రామంలో మొఘలాయిలకు వ్యతిరేకంగా పోరాడిన ధైర్యవంతురాలు, సాహసి, నిర్భీతి గల యోధురాలుగా ఆమె ఎల్లప్పుడూ గుర్తుండిపోతారు.
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో లైట్ హౌస్ ప్రాజెక్టును ప్రారంభించడం ద్వారా ‘‘అందరికీ ఇల్లు’’ అందించాలనే ప్రధానమంత్రి విజన్ మరింత బలోపేతం అవుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-అర్బన్ కింద రూ.128 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ ఇళ్లు 1000 మంది పైగా లబ్ధిదారుల కుటుంబాలకు ప్రయోజనం కలిగిస్తాయి. అన్ని రకాల మౌలిక సౌకర్యాలతో కూడి నాణ్యమైన ఇళ్ల నిర్మాణం కోసం ‘‘ప్రీ ఇంజనీర్డ్ స్టీల్ స్ర్టక్చర్ వ్యవస్థతో కూడిన ప్రీఫ్యాబ్రికేటెడ్ శాండ్ విచ్ ప్యానెల్ సిస్టమ్ ’’ అనే కొత్త టెక్నాలజీని ఈ ఇళ్ల నిర్మాణంలో ఉపయోగించడం వల్ల నిర్మాణ సమయం కూడా గణనీయంగా తగ్గింది.
ప్రతీ ఇంటికీ టాప్ కనెక్షన్ల ద్వారా స్వచ్ఛమైన మంచినీరు తగినంతగ అందించాలనే ప్రధానమంత్రి దార్శనికతను సాకారం చేసే దిశగా మాండ్లా, జబల్ పూర్, దిండోరి జిల్లాల్లో రూ.2350 కోట్లతో జల్ జీవన్ మిషన్ కింద చేపట్టే పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దీనికి తోడు సియోని జిల్లాలో రూ.100 కోట్ల పైబిన వ్యయంతో నిర్మించిన జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టును ప్రజలకు అంకితం చేశారు. నాలుగు జిల్లాల్లోని ఈ ప్రాజెక్టులు మధ్యప్రదేశ్ లోని 1575 గ్రామాలకు ప్రయోజనం చేకూర్చుతాయి.
మధ్యప్రదేశ్ లో రోడ్డు మౌలిక వసతులను మెరుగుపరిచే రూ.4800 కోట్లకు పైగా విలువగల ప్రాజెక్టులకు కూడా ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. వాటిలో ఎన్ హెచ్ 346లోని జహార్ ఖేదా-బెరిసియా-ధోఖేడి రోడ్డు కనెక్టివిటీ మెరుగుదల ప్రాజెక్టు; ఎన్ హెచ్ 543లోని బాలాఘాట్-గోండియా సెక్షన్ నాలుగు లేన్ల ప్రాజెక్టు; రుధి-దేశ్ గాంవ్ ను అనుసంధానం చేసే ఖాండ్వా నాలుగు లేన్ల బైపాస్ ప్రాజెక్టు; ఎన్ హెచ్ 47లోని తమగాం-చిచోలి సెక్షన్ 4 లైన్ల ప్రాజెక్టు; నాలుగు లేన్ల బోరేగాం-షాపూర్ రోడ్డు కనెక్టివిటీ ప్రాజెక్టు; ఫాపూర్-ముక్తినగర్ నాలుగు లేన్ల కనెక్టివిటీ ప్రాజెక్టు ఉన్నాయి. అలాగే ఎన్ హెచ్ 347సిలోని ఖాల్ఘాట్-శర్వర్ దేవ్లా రోడ్డు అప్ గ్రేడేషన్ ప్రాజెక్టును జాతికి అంకితం చేశారు.
రూ.11850 కోట్లకు పైగా విలువ గల రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేశారు. కట్ని-విజయ్ సోటా (102 కిలోమీటర్లు) రైల్ లైన్ డబ్లింగ్; మార్వస్ గ్రామ్-సింగ్రోలి రైల్వేలైన్ (78.50 కిలోమీటర్లు) డబ్లింగ్ ప్రాజెక్టులు వీటిలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టులను కట్ని-సింగ్రోలి సెక్షన్ డబ్లింగ్ పనుల్లో భాగంగా చేపట్టారు. ఈ ప్రాజెక్టులు మధ్యప్రదేశ్ లో రైల్వే మౌలిక వసతులను మెరుగుపరిచి వాణిజ్య, పర్యాటక రంగాలకు ప్రయోజనం చేకూర్చుతాయి.
విజైపూర్-ఔరియాన్-ఫూల్పూర్ పైప్ లైన్ ప్రాజెక్టును కూడా ప్రధానమంత్రి ప్రజలకు అంకితం చేశారు. 352 కిలోమీటర్ల నిడివి గల ఈ ప్రాజెక్టును రూ.1750 కోట్ల పైబడిన వ్యయంతో నిర్మించారు.ముంబై-నాగపూర్- ఝార్సుగుడా పైప్ లైన్ ప్రాజెక్టులోని నాగపూర్-జబల్ పూర్ (317 కిలోమీటర్లు) సెక్షన్ కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. రూ.1100 కోట్లకు పైబడన వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మిస్తారు. పర్యావరణంలో వ్యర్థాలను తొలగించే దిశలో ఒక ముందడుగుగా ఈ ప్రాజెక్టు పరిశ్రమలు, ఇళ్లకు పైప్ లైన్ల ద్వారా స్వచ్ఛమైన సహజ వాయువును అందుబాటు ధరల్లో సరఫరా చేస్తుంది. జబల్ పూర్ లో రూ.147 కోట్లతో నిర్మించిన కొత్త బాట్లింగ్ ప్లాంట్ ను కూడా ప్రధానమంత్రి అంకితం చేశారు.
*****
DS/TS
(Release ID: 1964957)
Visitor Counter : 164
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Assamese
,
Bengali
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam