విద్యుత్తు మంత్రిత్వ శాఖ

ఎన్టీపీసీకి చెందిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ మొదటి 800 ఎండబ్ల్యూ యూనిట్‌ను జాతికి అంకితం చేసిన ప్రధాన మంత్రి


భారతదేశంలోని ఎన్టీపీసీ పవర్ ప్లాంట్లలో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ అత్యంత ఆధునికమైనది: ప్రధాన మంత్రి

Posted On: 03 OCT 2023 6:37PM by PIB Hyderabad

 

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈరోజు తెలంగాణాలోని నిజామాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఎన్టీపీసీకి చెందిన  తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్  మొదటి దశ 800 ఎండబ్ల్యూ యూనిట్‌ను జాతికి అంకితం చేశారు.పెద్దపల్లి జిల్లాలో ఉన్న ఈ ప్రాజెక్టు తెలంగాణకు తక్కువ ధరకే విద్యుత్‌ను అందించడంతోపాటు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి ఊతమిస్తుంది. దేశంలోని అత్యంత పర్యావరణ అనుకూల పవర్ స్టేషన్లలో ఇది కూడా ఒకటి.

ఈ స‌మావేశాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు అభినంద‌న‌లు తెలుపుతూ ఏ దేశమైనా లేదా రాష్ట్రమైనా అభివృద్ధి చెందుతుంద‌ంటే అది విద్యుత్ ఉత్ప‌త్తికి స్వ‌యం ఆధార‌ణ సామర్థ్యంపైనే ఆధారపడి ఉంటుంద‌ని, ఈజ్ ఆఫ్ లివింగ్ మరియు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏకకాలంలో మెరుగుపడుతుందని అన్నారు. “ ఒక రాష్ట్రంలో పరిశ్రమల వృద్ధికి  సాఫీ అయిన విద్యుత్ సరఫరా  ఊపునిస్తుంది” అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. ప్రాజెక్టులోని రెండో యూనిట్ కూడా అతి త్వరలో పని చేయనుందని, ఇది పూర్తయితే పవర్ ప్లాంట్ స్థాపిత సామర్థ్యం 4,000 మెగావాట్లకు పెరుగుతుందని ఆయన ఉద్ఘాటించారు.

దేశంలోని అన్ని ఎన్‌టిపిసి పవర్ ప్లాంట్‌లలో తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ అత్యంత ఆధునిక పవర్ ప్లాంట్ కావడం పట్ల ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. “ఈ పవర్ ప్లాంట్‌లో ఉత్పత్తి అయ్యే విద్యుత్‌లో ఎక్కువ భాగం తెలంగాణ ప్రజలకు అందజేస్తుంది” అని తెలిపారు. శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులను పూర్తి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించిన సందర్భంగా ప్రధాన మంత్రి అన్నారు. 2016లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారని ఈరోజు ప్రారంభించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. "ఇది తమ ప్రభుత్వం యొక్క కొత్త పని సంస్కృతి" అని ఆయన అన్నారు. తెలంగాణ ఇంధన అవసరాలను తీర్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రధాని తెలిపారు.

ఎన్టీపీసీ తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్  మొదటి దశ ఆమోదించబడిన ₹10,998 కోట్లతో పెద్దపల్లి జిల్లాలోని ఎన్టీపీసీ రామగుండం స్టేషన్ ఆవరణలో అందుబాటులో ఉన్న స్థలంలో స్థాపించబడింది. ఇది తెలంగాణ రాష్ట్రానికి 85% విద్యుత్ సరఫరా చేస్తుంది.

అల్ట్రా సూపర్‌క్రిటికల్ టెక్నాలజీతో పిట్-హెడ్ పవర్ స్టేషన్‌గా ఉన్న ఈ ప్రాజెక్ట్ తక్కువ ఖర్చుతో కూడిన విద్యుత్‌తో తెలంగాణ రాష్ట్రానికి కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా, ఇది భారతదేశంలోని ఎన్టీపీసీ యొక్క అత్యంత సమర్థవంతమైన పవర్ స్టేషన్ కావడం వల్ల ఇది నిర్దిష్ట బొగ్గు వినియోగం (ఉత్పత్తి చేయబడిన విద్యుత్ యూనిట్‌కు బొగ్గు యొక్క మొత్తం వినియోగం) మరియు సీఓ2 ఉద్గారాలను తగ్గిస్తుంది. తద్వారా ఇది భారతదేశంలో అత్యంత పర్యావరణ అనుకూల పవర్ స్టేషన్‌లలో ఒకటిగా మారుతుంది.

ప్రాజెక్టు 1వ యూనిట్‌ను ప్రారంభించడంతో తెలంగాణ రాష్ట్రంతో పాటు దేశంలోనే విద్యుత్ సరఫరా పరిస్థితి మెరుగుపడింది. ఈ ప్రాంతంలో మొత్తం ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయడానికి ఈ ప్రాజెక్ట్ సహాయపడుతుంది.

ఎన్టీపీసీ లిమిటెడ్ భారతదేశంలో అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ పవర్ యుటిలిటీ. ఇది దేశ విద్యుత్ అవసరాలలో 1/4 వంతును అందిస్తుంది. 73 జీడబ్ల్యూ కంటే ఎక్కువ స్థాపిత సామర్థ్యం మరియు థర్మల్, హైడ్రో, సోలార్ మరియు పవన విద్యుత్ ప్లాంట్ల యొక్క విభిన్న పోర్ట్‌ఫోలియోతో ఎన్టీపీసీ నమ్మకమైన, సరసమైన మరియు స్థిరమైన విద్యుత్తును దేశానికి అందించడానికి అంకితం చేయబడింది. కంపెనీ ఉత్తమ పద్ధతులను అవలంబించడానికి, ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి మరియు హరిత భవిష్యత్తు కోసం స్వచ్ఛమైన ఇంధన సాంకేతికతలను స్వీకరించడానికి కట్టుబడి ఉంది.

కార్యక్రమంలో ప్రధాని ప్రసంగాన్ని ఇక్కడ చూడవచ్చు.

ఇది కూడా చదవండి:

తెలంగాణలోని నిజామాబాద్‌లో సుమారు రూ. 8000 కోట్ల విలువైన జాతీయ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసి,అంకితం చేసిన ప్రధాన మంత్రి

 

****



(Release ID: 1963874) Visitor Counter : 116