రక్షణ మంత్రిత్వ శాఖ
టాంజానియా పర్యటనలో ద్వైపాక్షిక రక్షణ సహకారాన్ని బలోపేతం చేయనున్న భారత సైన్యాధిపతి
प्रविष्टि तिथि:
02 OCT 2023 1:21PM by PIB Hyderabad
భారత చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ (సీవోఏఎస్) జనరల్ మనోజ్ పాండే, ఈ నెల 2-5 తేదీల్లో పర్యటన కోసం టాంజానియా బయలుదేరారు. రెండు దేశాల మధ్య దీర్ఘకాలిక రక్షణ సంబంధాలను బలోపేతం చేయడం ఈ పర్యటన ఉద్దేశం.
టాంజానియా రాజధాని దార్ ఎస్ సలామ్, చారిత్రక నగరం జాంజిబార్, అరుషాను సీవోఏఎస్ సందర్శిస్తారు. టాంజానియా ప్రముఖులు, సీనియర్ అధికారులతో సమావేశాల్లో పాల్గొంటారు. యూనియన్ రిపబ్లిక్ ఆఫ్ టాంజానియా అధ్యక్షురాలు సామియా సులుహు హసన్‌తోనూ సీవోఏఎస్ మర్యాదపూర్వకంగా భేటీ అవుతారు.
పర్యటనలో భాగంగా, టాంజానియా రక్షణ మంత్రి డా. స్టెర్గోమెనా లారెన్స్ టాక్స్, సైన్యాధిపతి జనరల్ జాకబ్ జాన్ మ్కుండాతో సీవోఏఎస్ చర్చలు జరుపుతారు. జాంజిబార్‌ను కూడా సీవోఏఎస్ సందర్శించి, జాంజిబార్ అధ్యక్షుడు డా. హుస్సేన్ అలీ మ్వినీతో సమావేశం అవుతారు. 101వ పదాతిదళ బ్రిగేడ్ కమాండర్ జనరల్ సైదీ హమీసి సైదీతో ముఖాముఖి కూడా ఈ పర్యటనలో ఉంది.
జనరల్ మనోజ్ పాండే, 'నేషనల్ డిఫెన్స్ కాలేజ్'లో ప్రసంగిస్తారు, అధ్యాపకులతో సంభాషిస్తారు. డులూటీలోని 'కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్' కమాండెంట్ బ్రిగేడియర్ జనరల్ స్టీఫెన్ జస్టిస్ మంకండేతోనూ జనరల్ మనోజ్ పాండే సమావేశం అవుతారు.
దార్-ఎస్-సలామ్‌లో నిర్వహించే 2వ 'ఇండియా టాంజానియా మినీ డిఫెక్స్‌పో'ను సీవోఏఎస్ సందర్శిస్తారు. భారతదేశ స్వదేశీ రక్షణ పరిశ్రమ నైపుణ్యాన్ని ఈ ఎక్స్‌పో ప్రదర్శిస్తుంది.
భారత్-టాంజానియా మధ్య ద్వైపాక్షిక రక్షణ సంబంధాలు బలంగా ఉన్నాయి. 2003 అక్టోబరులో, రక్షణ సహకారంపై ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయడం ఈ బంధానికి బలమైన పునాదిని వేసింది. ఈ సంవత్సరం జూన్ 28, 29 తేదీల్లో అరుషాలో జరిగిన 'ఇండియా-టాంజానియా జాయింట్ డిఫెన్స్ కోఆపరేషన్ కమిటీ' రెండో సమావేశం ఈ సహకారాన్ని మరింత బలపరిచింది.
టాంజానియా సైన్యం, గత ఐదేళ్లుగా భారతదేశంలో యూఎన్ శాంతి పరిరక్షక శిక్షణ తీసుకుంటోంది. డులూటీలోని 'కమాండ్ అండ్ స్టాఫ్ కాలేజ్'లో 2017 సంవత్సరం నుంచి భారత సైన్యానికి చెందిన ఒక బృందం శిక్షణ ఇస్తోంది.
రెండు దేశాల మధ్య బలమైన సైనిక సహకారానికి గుర్తుగా టాంజానియా సైనిక ప్రతినిధులు తరచుగా భారత్‌ను సందర్శిస్తున్నారు. ఇటీవలి కాలంలో, టాంజానియా ప్రతినిధులు ఏరో ఇండియా 23, ఇండో ఆఫ్రికా ఆర్మీ చీఫ్స్ కాన్‌కేవ్-23, అఫిండెక్స్-23లో పాల్గొన్నారు. డెఫ్ ఎక్స్‌పో 22 సమయంలోనూ టాంజానియా సీనియర్ సైనిక అధికారులు భారతదేశాన్ని సందర్శించారు. ఇటీవల 13వ ఐపీఏసీసీ, 47వ ఐపీఏఎంఎస్, 9వ సెల్ఫ్ 23లోనూ పాల్గొన్నారు.
సీవోఏఎస్ పర్యటన, భారత్-టాంజానియా మధ్య ఉన్నత స్థాయి ద్వైపాక్షిక రక్షణ ఒప్పందాలు, సంబంధాలను మరింత పటిష్టం చేస్తుంది. ఇప్పటికే ఉన్న సహకారాన్ని నిలుపుకోవడంతో పాటు, బలమైన భవిష్యత్ భాగస్వామ్యానికి మార్గం సుగమం చేసేలా పర్యటన సాగుతుంది.
***
(रिलीज़ आईडी: 1963363)
आगंतुक पटल : 174