సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
టిఫ్ 2023లో భారత ప్రతినిధి బృందానికి నాయకత్వం వహిస్తున్న డాక్టర్ ఎల్ మురుగన్
Posted On:
30 SEP 2023 11:56AM by PIB Hyderabad
ఈ నెల 29న, 15వ 'తాష్కెంట్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్' ప్రారంభోత్సవంలో భారతదేశం తరపున కేంద్ర సమాచార & ప్రసార శాఖ సహాయ మంత్రి డా. ఎల్ మురుగన్ పాల్గొన్నారు. భారతీయ ప్రతినిధి బృందంలో, సీనియర్ చలనచిత్ర నిర్మాత & దర్శకుడు శ్రీ ఉమేష్ మెహ్రా, 'నేషనల్ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్' (NFDC) అధికారులు ఉన్నారు. చలనచిత్ర నిర్మాణంలో భారతదేశం, ఉజ్బెకిస్థాన్ మధ్య సోవియట్ కాలం నుంచి బలమైన సహకారం కొనసాగుతోంది. ఎన్‌ఎఫ్‌డీసీ-ఉజ్బెక్ కినో (ఉజ్బెక్ ఫిల్మ్స్) ఉమ్మడి చర్యల ద్వారా రెండు సంస్థల మధ్య సహకారం మరింత బలోపేతం కావడానికి ఈ చిత్రోత్సవం దోహదం చేసింది.
ఉజ్బెకిస్తాన్ సంస్కృతి & పర్యాటక శాఖ మంత్రి మిస్టర్ ఓజోద్‌బెక్ నజర్బెకోవ్‌తో డా. మురుగన్ సమావేశం అయ్యారు. రెండు దేశాల మధ్య స్నేహం, సహకారాన్ని గుర్తు చేసుకున్నారు. చలనచిత్ర నిర్మాణం, సంస్కృతి సహా వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలను విస్తరించాల్సిన అవసరాన్ని ఇరుపక్షాలు అంగీకరించాయి.
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో, భారతదేశ సృజనాత్మక ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసేందుకు భారత ప్రభుత్వం అనుసరిస్తున్న దృఢమైన విధానాలను, భారతదేశ దృశ్య-శ్రవణ రంగంలో అద్భుతమైన వృద్ధిని డా. మురుగన్ ఉజ్బెక్ ప్రతినిధులకు వివరించారు. చలన చిత్రాల సహ-నిర్మాణం, చిత్రీకరణ, చిత్రీకర అనంతర రంగాల్లో సహకారం అందిస్తామని చెప్పారు. ఫిలింస్ అండ్ టెలివిజన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వంటి సంస్థల ద్వారా ఉజ్బెక్ చిత్ర నిర్మాతలు, విద్యార్థులకు శిక్షణ అందించడానికి కూడా భారత్ సిద్ధంగా ఉంది.
చలనచిత్రోత్సవం సందర్భంగా, టర్కీ సాంస్కృతిక & పర్యాటక శాఖ సహాయ మంత్రి డా. బి ముంకు నేతృత్వంలోని ఆ దేశ ప్రతినిధి బృందంతోనూ డాక్టర్ మురుగన్ సమావేశం అయ్యారు. భారతదేశంలో చలనచిత్రాల నిర్మాణాలకు ఉన్న అద్భుతమైన అవకాశాల గురించి, అందుబాటులో ఉన్న అత్యాధునిక సాంకేతిక మౌలిక సదుపాయాల గురించి టర్కీ బృందానికి వివరించారు.
***
(Release ID: 1962610)
Visitor Counter : 117