ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

2023 వ సంవత్సరంసెప్టెంబర్ 24 వ తేదీ న జరిగిన ‘మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం 105 వ భాగం లో ప్రధాన మంత్రి ప్రసంగం పాఠం

Posted On: 24 SEP 2023 11:39AM by PIB Hyderabad
  • నా కుటుంబ సభ్యులారా, నమస్కారం. దేశం సాధించిన విజయాల ను, దేశ ప్రజల విజయాల ను, వారి స్ఫూర్తిదాయకమైన జీవిత ప్రయాణాన్ని మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో మరో భాగం లో మీతో పంచుకొనే అవకాశం నాకు లభించింది. ఈ రోజుల్లో నాకు వచ్చిన ఉత్తరాలలోను, సందేశాలలోను చాలా వరకు రెండు విషయాలు ఉన్నాయి. ఒకటో విషయం చంద్రయాన్-3 విజయవంతం గా ల్యాండింగ్ కావడమూ, రెండో విషయం దిల్లీ లో జి-20 శిఖర సమ్మేళనాన్ని విజయవంతం గా నిర్వహించడమూను. దేశం లో ప్రతి ప్రాంతం నుండి, సమాజం లో ప్రతి వర్గం నుండి, అన్ని వయసుల వారి నుండి నాకు లెక్కపెట్టలేనన్ని లేఖ లు వచ్చాయి. చంద్రయాన్-3 ల్యాండర్ చంద్రుని పై దిగే సంఘటన లో ప్రతి క్షణాన్ని కోట్ల కొద్దీ ప్రజలు వివిధ మాధ్యాల ద్వారా ఏకకాలం లో చూశారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్ రో) యూట్యూబ్ లైవ్ చానల్‌ లో ఎనభై లక్ష ల మంది కి పైగా ప్రజలు ఈ సంఘటన ను వీక్షించారు. అందులోనే ఇదొక రికార్డు. చంద్రయాన్-3 తో కోట్ల కొద్దీ భారతీయుల అనుబంధం ఎంత గాఢంగా ఉందో దీనిని పట్టి చూస్తే అర్థం అవుతోంది. చంద్రయాన్ సాధించిన ఈ విజయం పై దేశం లో చాలా అద్భుతమైన క్విజ్ పోటీ జరుగుతోంది. ఈ ప్రశ్న ల పోటీ కి ‘చంద్రయాన్-3 మహాక్విజ్’ అని పేరు పెట్టారు. MyGov portal ద్వారా జరుగుతున్న ఈ పోటీ లో ఇప్పటివరకు 15 లక్షల మంది కి పైగా పాల్గొన్నారు. MyGov ను ప్రారంభించిన తరువాత రూపొందించిన క్విజ్‌ల లో పాల్గొన్న వారి సంఖ్యాపరం గా ఇదే అతి పెద్దది. మీరు ఇంకా ఇందులో పాల్గొనకపోతే ఇంకా ఆలస్యం చేయవద్దు. ఇంకా కేవలం ఆరు రోజుల గడువే మిగిలి ఉంది. ఈ క్విజ్‌ లో తప్పకుండా పాల్గొనండి.

 

నా కుటుంబ సభ్యులారా, చంద్రయాన్-3 విజయం తరువాత గొప్ప శిఖర సమ్మేళనం జి-20 భారతదేశం లో ప్రతి ఒక్కరి యొక్క ఆనందాన్ని రెట్టింపు చేసింది. భారత మండపం అయితే స్వయం గా ఓ సెలబ్రిటి వలె మారిపోయింది. ప్రజలు సెల్ఫీల ను దిగుతూ సగర్వం గా పోస్ట్ చేస్తున్నారు. ఈ శిఖర సమ్మేళనం లో ఆఫ్రికన్ యూనియన్‌ ను జి-20 లో పూర్తి సభ్యత్వ దేశం గా చేయడం ద్వారా భారతదేశం తన నాయకత్వాన్ని నిరూపించుకొన్నది. భారతదేశం సుసంపన్నం గా ఉన్న కాలం లో మన దేశంలోనూ ప్రపంచం లోని ఇతర ప్రాంతాల లోనూ సిల్క్ రూట్ ను గురించి చాలా చర్చ లు జరిగేవి. ఈ సిల్క్ రూట్ వాణిజ్యాని కి ప్రధాన మాధ్యం గా ఉండేది. ఇప్పుడు ఆధునిక కాలం లో భారతదేశం జి-20 లో మరొక ఆర్థిక కారిడార్‌ ను సూచించింది. ఇది ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరోప్ ఇకానామిక్ కారిడార్. ఈ కారిడార్ రాబోయే వందల సంవత్సరాల కు ప్రపంచ వాణిజ్యాని కి ఆధారం అవుతుంది. ఈ కారిడార్ భారతదేశం గడ్డ మీద ప్రారంభం అయింది అని చరిత్ర ఎప్పటికీ గుర్తు పెట్టుకొంటుంది.

 

మిత్రులారా, జి-20 శిఖర సమ్మేళనం సందర్భం లో భారతదేశం యొక్క యువ శక్తి ఈ కార్యక్రమం లో పాల్గొన్న తీరు ను గురించి, అనుసంధానమైన పద్ధతి ని గురించి ప్రస్తుతం ప్రత్యేక చర్చ జరగవలసిన అవసరం ఉంది. ఏడాది పొడవు న దేశం లో అనేక విశ్వవిద్యాలయాల లో జి-20 కి సంబంధించిన కార్యక్రమాలు జరిగాయి. ఈ వరుస లో ఇప్పుడు దిల్లీ లో జి-20 యూనివర్సిటీ కనెక్ట్ ప్రోగ్రామ్అనే మరో ఉత్కంఠభరితమైన కార్యక్రమం జరగబోతోంది. ఈ కార్యక్రమం ద్వారా దేశవ్యాప్తం గా లక్షల కొద్దీ విశ్వవిద్యాలయ విద్యార్థులు పరస్పరం అనుసంధానం అవుతారు. ఐఐటి లు, ఐఐఎమ్ లు, ఎన్‌ఐటి లు, వైద్య కళాశాల ల వంటి పలు ప్రతిష్టాత్మక సంస్థ లు కూడా ఇందులో పాల్గొంటాయి. మీరు కాలేజీ విద్యార్థి అయితే సెప్టెంబర్ 26 వ తేదీన జరిగే ఈ కార్యక్రమాన్ని తప్పక చూడండని, అందులో భాగస్వామి కండి అని కోరుతున్నాను. భావి భారతదేశం లో యువత భవిష్యత్తు పై అనేక ఆసక్తికరమైన విషయాల ను ఇందులో చర్చించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో నేను కూడా పాలుపంచుకొంటాను. మన కళాశాలల విద్యార్థుల తో మాట్లాడాలి అని నేను ఎదురుచూస్తున్నాను.

 

 

నా కుటుంబ సభ్యులారా, నేటి నుండి రెండు రోజుల తరువాత అంటే సెప్టెంబర్ 27 వ తేదీ న 'ప్రపంచ పర్యటక దినం' జరుగనుంది. కొంత మంది వ్యక్తులు పర్యాటన ను విహారయాత్ర సాధనం గా మాత్రమే చూస్తారు. అయితే పర్యాటకం లో చాలా పెద్ద అంశం ‘ఉపాధి’ కి సంబంధించింది. కనీస పెట్టుబడి తో అత్యధిక ఉపాధి ని కల్పించే రంగం ఏదన్నా ఉంది అంటే అది పర్యటన రంగం. పర్యటన రంగాన్ని అభివృద్ధి చేయడం లో దేశం పట్ల సద్భావన, ఆకర్షణ అనేవి చాలా ముఖ్యం. గత కొన్ని సంవత్సరాలు గా భారతదేశం పై ఆకర్షణ చాలా పెరిగిపోయింది. జి-20 శిఖర సమ్మేళనం యొక్క నిర్వహణ సఫలం అయిన తరువాత భారతదేశం పై ప్రపంచ ప్రజల ఆసక్తి మరింత గా పెరిగింది.

 

 

మిత్రులారా, జి-20 శిఖర సమ్మేళనం జరుగుతున్న సమయం లో ఒక లక్ష మంది కి పైగా ప్రతినిధులు భారతదేశాని కి విచ్చేశారు. ఇక్కడి వైవిధ్యం, విభిన్న సంప్రదాయాలు, వివిధ రకాల ఆహార పానీయాలు, మన వారసత్వ సంపద లను గురించి వారు తెలుసుకొన్నారు. ఇక్కడ కు వచ్చిన ప్రతినిధులు వారి వెంట తీసుకుపోయిన అద్భుతమైన అనుభూతులు పర్యటన ను మరింత విస్తరింపజేయగలవు.

 

భారతదేశం లో ఒక దానికి మించి మరొకటి గా ఉండే ప్రపంచ వారసత్వ ప్రదేశాలు ఉన్నాయని, వాటి సంఖ్య నిరంతరం పెరుగుతోందని మీ అందరికీ తెలుసు. కొద్ది రోజుల క్రితం శాంతినికేతన్ ను, కర్నాటక లోని పవిత్ర హొయసాల దేవాలయాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశాలు గా ప్రకటించారు. ఈ అద్భుతమైన విజయాని కి దేశప్రజలందరినీ నేను అభినందిస్తున్నాను. శాంతినికేతన్‌ ను సందర్శించే అవకాశం 2018 లో నాకు దక్కింది. శాంతినికేతన్‌ తో గురుదేవులు శ్రీ రవీంద్రనాథ్ టాగోర్ కు అనుబంధం ఉంది. గురుదేవులు శ్రీ రవీంద్రనాథ్ టాగూర్ పురాతన సంస్కృత శ్లోకం నుండి శాంతినికేతన్ పేరు ను తీసుకున్నారు. ఆ శ్లోకం ఇది..

యత్ర విశ్వం భవత్యేక నీడమ్

ఈ మాటల కు ఒక చిన్న గూటి లో యావత్తు ప్రపంచం ఇమడిపోగలుగుతుంది అని అర్థం.

కర్నాటక లోని హోయ్సళ దేవాలయాల ను యూనెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితా లో చేర్చింది; అవి 13 వ శతాబ్దాని కి చెందిన అద్భుతమైన వాస్తుశిల్పాని కి ప్రసిద్ధి చెందాయి. ఈ దేవాలయాలు యూనెస్కో నుండి గుర్తింపు ను పొందడం భారతీయ ఆలయ నిర్మాణ సంప్రదాయాని కి కూడా గౌరవం. భారతదేశం లో ప్రపంచ వారసత్వ సంపద మొత్తం సంఖ్య ఇప్పుడు 42 కు చేరుకొన్నది. మన చారిత్రక ప్రదేశాల కు, మన సాంస్కృతిక ప్రదేశాల కు వీలైనంత అధిక సంఖ్య లో ప్రపంచ వారసత్వ ప్రదేశాలు గా గుర్తింపు ను తెచ్చుకొనేందుకు భారతదేశం ప్రయత్నిస్తున్నది. మీరు ఎక్కడకైనా వెళ్లాలని అనుకున్నప్పుడల్లా భారతదేశం లో వైవిధ్యాన్ని చూడండి అని మీ అందరిని నేను కోరుతున్నాను. మీరు వివిధ రాష్ట్రాల సంస్కృతి ని అర్థం చేసుకోవాలి. అందుకోసం ప్రపంచ వారసత్వ ప్రదేశాల ను సందర్శించండి. దీనితో మీరు మన దేశ అద్భుతమైన చరిత్ర ను గురించి తెలుసుకోవడం ఒక్కటే కాకుండా స్థానిక ప్రజల ఆదాయాన్ని పెంచడానికి ఒక ముఖ్యమైన మాధ్యం గా కూడాను మారతారు.

 

నా కుటుంబ సభ్యులారా, భారతీయ సంస్కృతి, భారతీయ సంగీతం ఇప్పుడు విశ్వ వ్యాప్తం అయ్యాయి. వాటితో ప్రపంచవ్యాప్తం గా ప్రజల అనుబంధం రోజురోజు కు వృద్ధి చెందుతున్నది. ఒక ముద్దులు మూటగట్టే కుమార్తె సమర్పించిన చిన్న ఆడియో రికార్డు ను మీకు వినిపిస్తాను..

### (MKB EP 105 AUDIO Byte 1)###

దీనిని విని, మీరు కూడా ఆశ్చర్యపోయారు కదూ! ఎంత మధురమైన స్వరమో, మరి ప్రతి పదం లో ప్రతిబింబించే భావోద్వేగాల ద్వారా భగవంతుని పై ఆమె ప్రేమ ను మనం అనుభూతి చెందగలం. ఈ మధురమైన స్వరం జర్మనీ కి చెందిన ఒక అమ్మాయి ది అని నేను మీకు చెబితే, బహుశా మీరు మరింత చకితులు అవుతారు. ఈ అమ్మాయి పేరు కైసమీ. 21 ఏళ్ల వయస్సు ఉన్న కైసమీ ఈ రోజుల్లో ఇన్‌స్టాగ్రామ్‌ లో బాగా ప్రసిద్ధి చెందారు. జర్మనీ నివాసి అయిన కైసమీ భారతదేశాని కి ఎప్పుడూ రాలేదు. కానీ ఆమె భారతీయ సంగీతాని కి అభిమాని. భారతదేశాన్ని కూడా చూడని ఆమె కు భారతీయ సంగీతం పైన ఉన్నటువంటి ఆసక్తి చాలా స్ఫూర్తిదాయకం. కైసమీ పుట్టుక తోనే దృష్టి జ్ఞ‌ానాని కి నోచుకోలేదు. కానీ ఈ కష్టమైన సవాలు ఆమె ను అసాధారణ విజయాల ను చేజిక్కించుకోకుండా ఆపలేదు. సంగీతం పైన, సృజనాత్మకత పైన ఉన్న మక్కువ తో కైసమీ చిన్నతనం నుండే పాడడాన్ని మొదలుపెట్టారు. మూడేళ్ల ప్రాయం లోనే ఆఫ్రికన్ డ్రమ్మింగ్ ను ఆరంభించారు. భారతీయ సంగీతం తో 5-6 సంవత్సరాల క్రితమే ఆమె కు పరిచయం ఏర్పడింది. భారతదేశం యొక్క సంగీతం ఆమె ను ఎంతగానో ఆకట్టుకొన్నది. దానిలో పూర్తిగా ఆమె లీనం అయ్యారు. తబలా ను వాయించడం కూడా నేర్చుకొన్నారు. చాలా స్ఫూర్తిదాయకం అయినటువంటి విషయం ఏమిటి అంటే ఆమె అనేక భారతీయ భాషల లో పాడడం లో ప్రావీణ్యాన్ని సంపాదించారన్నదే. సంస్కృతం, హిందీ, మలయాళం, తమిళం, కన్నడం, అసమీ, బెంగాలీ, మరాఠీ, ఉర్దూ.. ఈ భాషలన్నిటి లో ఆమె పాడగలరు. తెలియని భాష లో రెండు మూడు వాక్యాలు మాట్లాడడమే ఎంత కష్టమో; అయితే కైసమీ కి మాత్రం ఇది ఒక సులువైన ఆట. కన్నడం లో ఆమె పాడిన ఒక పాట ను ఇక్కడ మీ అందరి కోసం వెల్లడిస్తున్నాను..

###(MKB EP 105 AUDIO Byte 2)###

భారతీయ సంస్కృతి పై, సంగీతం పై జర్మనీ కి చెందిన కైసమీ కి ఉన్న మక్కువ ను నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఆమె ప్రయత్నాలు భారతదేశం లో ప్రతి ఒక్కరి ని ఉప్పొంగిపోయేటట్టు చేస్తాయి.

 

ప్రియమైన నా కుటుంబ సభ్యులారా, మన దేశం లో విద్య ను ఎల్లప్పుడూ సేవ గా చూస్తారు. అదే స్ఫూర్తి తో పిల్లల చదువు కోసం కృషి చేస్తున్న ఉత్తరాఖండ్‌ లోని యువత ను గురించి నాకు తెలియవచ్చింది. నైనీతాల్ జిల్లా లో బాలల కోసం ఒక ప్రత్యేక సంచార గ్రంథాలయాన్ని కొంతమంది యువకులు ప్రారంభించారు. ఈ గ్రంథాలయం ప్రత్యేకత ఏమిటి అంటే దీని ద్వారా అత్యంత మారుమూల ప్రాంతాల లో కూడాను పిల్లల కు పుస్తకాలు చేరుతున్నాయి. అంతేకాదు- ఈ సేవ పూర్తి గా ఉచితం. ఇప్పటి వరకు నైనీతాల్ లోని 12 గ్రామాల కు ఈ గ్రంథాలయం ద్వారా సేవలను అందించడమైంది. పిల్లల చదువు కు సంబంధించిన ఈ ఉదాత్తమైన కార్యం లో స్థానిక ప్రజలు కూడా సహాయం చేయడానికి ముందుకు వస్తున్నారు. మారుమూల పల్లెల లో నివసించే పిల్లల కు పాఠశాల పుస్తకాలే కాకుండా పద్యాలు, కథలు, నైతిక విద్య కు సంబంధించిన పుస్తకాలు చదివేందుకు పూర్తి అవకాశం కల్పించే ప్రయాస ఈ సంచార గ్రంథాలయం ద్వారా జరుగుతున్నది. ఈ ప్రత్యేకమైన లైబ్రరి ని బాలలు చాలా ఇష్టపడతారు కూడాను.

 

మిత్రులారా, గ్రంథాలయాని కి సంబంధించి హైదరాబాదు లో ఒక ప్రత్యేకమైన ప్రయత్నం గురించి నాకు తెలిసింది. అక్కడ ఏడో తరగతి చదువుతున్న, ఆకర్షణ సతీష్ అనే పేరు కల అమ్మాయి అద్భుతాన్నే చేసింది. కేవలం 11 ఏళ్ల వయస్సు లో ఆమె పిల్లల కోసం ఒకటి కాదు, రెండు కాదు- ఏడు పుస్తకాలయాల ను నిర్వహిస్తోంది అని తెలిస్తే మీరు ఆశ్చర్యం కలగవచ్చును. రెండేళ్ల క్రితం తల్లిదండ్రుల తో కలసి కేన్సర్‌ ఆసుపత్రి కి ఆకర్షణ వెళ్లిన సందర్భం లో, ఈ దిశ గా సాగేందుకు ప్రేరణ ఆమె కు లభించింది. ఆమె తండ్రి పేదవారి కి సహాయం చేయడానికని అక్కడ కు వెళ్ళారు. అక్కడి పిల్లలు వారి ని ‘కలరింగ్ బుక్స్’ కావాలి అని అడిగారు. ఈ విషయం చిన్నారి పొన్నారి ఆకర్షణ ను ఎంతగా హత్తుకుపోయింది అంటే ఆమె ఇక అప్పటి నుండి విధ విధాలైన పుస్తకాల ను సేకరించాలి అని తన మనస్సు లో గట్టి గా అనుకొంది. తన ఇరుగుపొరుగు ఇళ్ళ వారి వద్ద నుండి, బంధువుల దగ్గరి నుండి, స్నేహితుల వద్ద నుండి పుస్తకాల ను ఒక్కటొక్కటి గా సేకరించడం ప్రారంభించింది ఆకర్షణ. అదే కేన్సర్ ఆసుపత్రి లో బాలల కోసం మొదటి పుస్తకాలయాన్ని ప్రారంభించారు అని తెలిస్తే మీరు సంతోషిస్తారు. ఈ బాలిక నిరుపేద పిల్లల కోసం వివిధ ప్రదేశాల లో ఇప్పటివరకు ప్రారంభించిన ఏడు లైబ్రరీల లో ఇప్పుడు సుమారు ఆరు వేల పుస్తకాలు అందుబాటు లో ఉన్నాయి. పిల్లల భవిష్యత్తు ను తీర్చిదిద్దడం లో ఈ పాప విశేషం గా కృషి చేస్తున్న తీరు అందరిలో స్ఫూర్తి ని నింపేదే.

 

 

మిత్రులారా, నేటి యుగం డిజిటల్ టెక్నాలజీ, ఇ-బుక్స్‌ తో కూడుకున్నదనడం లో వాస్తవం ఉంది. అయితే ఇప్పటికీ పుస్తకాలు ఎల్లప్పుడూ మన జీవితం లో మంచి స్నేహితుని పాత్ర ను పోషిస్తాయి. అందుకే పిల్లల ను పుస్తకాలు చదివేలా ప్రేరేపించాలి.

 

నా కుటుంబ సభ్యులారా, మన గ్రంథాల లో -

జీవేషు కరుణా చాపి, మైత్రీ తేషు విధీయతామ్ అని చెప్పడం జరిగింది.

అంటే ప్రాణుల పై కరుణ ను చూపి వాటిని మిత్రులు గా చేసుకొమ్మని అర్థం. మన దేవత ల వాహనాలు చాలా వరకు పశువులు, పక్షులు. చాలా మంది గుడి కి వెళ్తారు. దైవాన్ని దర్శించుకొంటారు. అయితే దేవీదేవతల కు వాహనాలు గా ఉండే జీవాల ను గురించి మాత్రం పెద్ద గా పట్టించుకోరు. ఈ జీవాలు మన విశ్వాసాల కు కేంద్రాలు గా ఉంటాయి. మనం వాటిని అన్ని విధాలు గా రక్షించుకోవాలి. గత కొన్ని సంవత్సరాలు గా దేశం లో సింహాలు, పులులు, చిరుత లు, ఏనుగు ల సంఖ్య గణనీయం గా పెరిగింది. ఈ భూమి మీద నివసించే ఇతర పశువుల ను రక్షించడానికి అనేక ఇతర ప్రయత్నాలు కూడా నిరంతరం జరుగుతున్నాయి. రాజస్థాన్‌ లోని పుష్కర్‌ లో కూడా ఇలాంటి ప్రత్యేక ప్రయత్నం జరుగుతోంది. ఇక్కడ వన్య జీవుల ను రక్షించడానికి సుఖ్‌దేవ్ భట్ గారి తో పాటు ఆయన బృందం కలిసికట్టు గా పని చేస్తోంది. వారి బృందం పేరు ఏమిటో మీకు తెలుసా? ఆ బృందం పేరు కోబ్రా. ఈ ప్రమాదకరమైన పేరు ఎందుకు అంటే ఆయన బృందం కూడా ఈ ప్రాంతం లో ప్రమాదకరమైన పాముల ను రక్షించడానికి పని చేస్తున్నది. ఈ బృందం లో ప్రజలు పెద్ద సంఖ్య లో పాల్గొంటున్నారు. వారు కేవలం ఒక్క కాల్ చేస్తే చాలు, సకాలం లో చేరుకొని మరి వారి యొక్క మిశన్ లో లీనం అయిపోతారు. సుఖ్‌దేవ్ జీ యొక్క ఈ బృందం ఇప్పటి వరకు ముప్ఫయ్ వేల కు పైచిలుకు విష సర్పాల ప్రాణాల ను కాపాడింది. ఈ ప్రయాస ద్వారా ప్రజలకు ప్రమాదం తొలగి పోవడంతో పాటు ప్రకృతి పరిరక్షణ కూడా సాధ్యపడుతున్నది. ఈ బృందం ఇతర జబ్బుపడిన జంతువుల కు సేవ చేసే పని లో సైతం పాల్గొంటున్నది.

 

మిత్రులారా, తమిళనాడు లోని చెన్నయ్ లో ఉండే ఆటో డ్రైవర్ ఎం. రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఒక ప్రత్యేకమైన పని ని చేస్తున్నారు. ఆయన గత 25- 30 సంవత్సరాలు గా పావురాల కు సేవ చేయడం లో నిమగ్నమై ఉన్నారు. ఆయన ఇంట్లో 200 కు పైగా పావురాలు ఉన్నాయి. పక్షుల కు ఆహారం, నీరు, ఆరోగ్యం మొదలైన ప్రతి అవసరాన్ని వారు పూర్తి గా చూసుకుంటారు. దీని కోసం చాలా డబ్బు ను ఖర్చు పెడతారు. ఖర్చు కు వెనుకాడకుండా తన పని లో అంకితభావం తో ఉంటారు. మిత్రులారా, మంచి ఉద్దేశ్యం తో ఇటువంటి పని ని చేస్తున్న వారిని చూడడం నిజం గా చాలా ప్రశాంతత ను, చాలా సంతోషాన్ని ఇస్తుంది. మీ వద్ద ఆ తరహా కొన్ని ప్రత్యేకమైన ప్రయత్నాల ను గురించేన సమాచారం ఉందీ అంటే గనక దానిని తప్పక తెలియజేయండి.

 

ప్రియమైన నా కుటుంబ సభ్యులారా, ఈ స్వాతంత్య్ర అమృత కాలం దేశం కోసం ప్రతి పౌరుని/ప్రతి పౌరురాలి కర్తవ్య కాలం కూడాను. మన విధుల ను నిర్వర్తించడం ద్వారా మాత్రమే మనం మన లక్ష్యాల ను సాధించగలం. మన గమ్యాన్ని చేరుకోగలం. కర్తవ్య భావన మనందరిని కలుపుతుంది. ఉత్తర్ ప్రదేశ్ లోని సంభల్‌ లో దేశం అటువంటి కర్తవ్య భావానికి ఉదాహరణ ను చూసింది. నేను ఆ విషయాన్ని మీ దృష్టి కి తీసుకురావాలి అని అనుకొంటున్నాను. ఒక్కసారి ఊహించుకోండి. అక్కడ 70 కి పైగా గ్రామాలు ఉన్నాయి. వేల కొద్దీ జనాభా ఉంది. అయినా ప్రజలంతా కలసి ఒక లక్ష్యాన్ని సాధించడానికి ఏకం అయ్యారు. ఇది చాలా అరుదు గా జరుగుతుంది. కానీ సంభల్ ప్రజలు దీనిని చేసి చూపెట్టారు. ఈ వ్యక్తులు ఒక్కటై ప్రజల భాగస్వామ్యాని కి, సమష్టితత్వాని కి అద్భుతమైన ఉదాహరణ గా నిలచారు. దశాబ్దాల క్రితం ఈ ప్రాంతం లో 'సోత్' అనే పేరు కల నది ఒకటి ఉండేది. అమ్ రోహా నుండి మొదలై సంభల్ గుండా బదాయూఁ వరకు ప్రవహించే ఈ నది కి ఒకప్పుడు ఈ ప్రాంతం లో ప్రాణదాత అని పేరుండేది. ఇక్కడి రైతుల కు వ్యవసాయాని కి ప్రధాన ఆధారమైన ఈ నది లో నీరు నిరంతరం ప్రవహించేది. కాలక్రమం లో నది లో ప్రవాహం తగ్గిపోయింది. నది ప్రవహించే మార్గాలు ఆక్రమణ కు గురి అయ్యాయి. ఈ నది అంతరించిపోయింది. నది ని తల్లి గా భావించే మన దేశం లో సంభల్ ప్రజలు ఈ సోత్ నది ని పునరుద్ధరించాలి అని సంకల్పం చెప్పుకొన్నారు. గత ఏడాది డిసెంబరు లో 70 కి పైగా గ్రామ పంచాయతీ లు కలసి సోత్ నది పునరుద్ధరణ పనుల ను మొదలుపెట్టాయి. గ్రామ పంచాయతీ ల ప్రజలు వారి తో పాటుగా ప్రభుత్వ శాఖల ను కూడా భాగస్వాములు గా చేశారు. ఈ సంవత్సరం మొదటి ఆరు నెలల్లో ఈ ప్రజలు నది లో 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ భాగాన్ని పునరుద్ధరించగలిగారు. వర్ష కాలం మొదలవడంతోనే ఇక్కడి ప్రజల శ్రమ ఫలించి, సోత్ నది నిండుకుండ లా నీటి తో నిండిపోయింది. ఇది ఇక్కడి రైతుల కు సంతోషం కలిగించే పెద్ద సందర్భం. ప్రజలు నది తీరం పూర్తి గా సురక్షితం గా ఉండేందుకు ఒడ్డు మీద పది వేల కు పైగా మొక్కల ను నాటారు. దోమ లు వృద్ధి చెందకుండా ముప్పై వేల కు పైగా గంబూసియా చేపల ను కూడా నది నీటి లోకి వదలిపెట్టారు. మిత్రులారా, మనం దృఢ సంకల్పం తో ఉంటే అతి పెద్ద సవాళ్ల ను అతిగమించి పెద్ద మార్పు ను తీసుకు రాగలుగుతాం అని సోత్ నది ఉదాహరణ మనకు చాటిచెబుతున్నది. కర్తవ్య పథం లో నడుస్తూ మీరు సైతం మీ చుట్టుప్రక్కల ప్రాంతాల లో ఈ తరహా అనేకమైన మార్పుల కు వాహకం గా మారగలుగుతారు.

 

నా కుటుంబ సభ్యులారా, ఉద్దేశాలు దృఢం గా ఉండి ఏదైనా నేర్చుకోవాలి అనే తపన ఉంటే గనక ఏ పనీ కూడా కష్టం గా ఉండదు. పశ్చిమ బంగాల్‌ కు చెందిన శ్రీమతి శకుంతలా సర్ దార్ ఇది కచ్చితం గా సరైంది అని నిరూపించారు. ఈ రోజు ఆమె ఎందరో మహిళల కు స్ఫూర్తి గా నిలచారు. శకుంతల గారు జంగల్ మహల్‌ లోని శాతనాల గ్రామ నివాసి. చాలా కాలం గా ఆమె కుటుంబం ప్రతి రోజు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేది. ఆమె కుటుంబానికి బ్రతకడం కూడా కష్టం అయింది. ఆ తరువాత కొత్త బాట లో నడవాలి అని నిర్ణయించుకొని విజయాన్ని సాధించి, అందరిని ఆశ్చర్యపరిచారు. ఆమె ఈ విజయాన్ని ఎలా సాధించారో మీరు తెలుసుకొని తీరాలి అని అనుకొంటున్నారు. దీనికి సమాధానం ఏమిటి అంటే అది ఒక కుట్టు యంత్రం. సోయింగ్ మెశీన్ ను యఉపయోగించి 'సాల్' ఆకుల మీద అందమైన డిజైన్ లను తీర్చిదిద్దడాన్ని మొదలుపెట్టారు. ఆమె నైపుణ్యం కుటుంబ జీవనాన్ని మార్చివేసింది. ఆమె తయారు చేసిన ఈ అద్భుతమైన క్రాఫ్ట్‌ కు డిమాండ్ నిరంతరం పెరుగుతున్నది. శకుంతల గారి ఈ నైపుణ్యం ఆమె జీవితాన్నే కాకుండా 'సాల్' ఆకుల ను సేకరించే చాలా మంది జీవితాల ను కూడా మార్చివేసింది. ఇప్పుడు ఆమె చాలా మంది మహిళల కు శిక్షణ ను ఇచ్చే పని లో ఉన్నారు. మీరు ఊహించవచ్చు- ఒకప్పుడు వేతనాల పై ఆధారపడ్డ కుటుంబం ఇప్పుడు ఇతరుల కు ఉపాధి లభించేటటట్టు ప్రేరణ ను అందిస్తోంది. రోజువారి కూలి మీద ఆధారపడి మనుగడ సాగిస్తున్న వారి కుటుంబాన్ని వారి సొంత కాళ్ల మీద నిలబెట్టింది. దీంతో ఆమె కుటుంబానికి ఇతర విషయాలపైన కూడా దృష్టి పెట్టే అవకాశం వచ్చింది. ఇంకో విషయం శకుంతల గారి పరిస్థితి మెరుగుపడిన వెంటనే ఆమె పొదుపు చేయడం కూడా ప్రారంభించారు. ఇప్పుడు ఆమె జీవిత బీమా పథకాల లో పెట్టుబడి ని పెట్టడం ప్రారంభించారు. తద్వారా తన పిల్లల భవిష్యత్తు కూడా ఉజ్వలం గా ఉంటుంది. శకుంతల గారి అభిరుచి ని ఎంత ప్రశంసించినా అది తక్కువే అవుతుంది. భారతదేశం ప్రజలు అటువంటి ప్రతిభ తో నిండి ఉన్నారు. మీరు వారికి అవకాశం ఇవ్వండి. ఇక చూడండి, వారు ఎటువంటి అద్భుతాల ను చేసి చూపిస్తారో.

 

నా కుటుంబ సభ్యులారా, దిల్లీ లో జరిగిన జి-20 శిఖర సమ్మేళనం సందర్భం లో పలువురు ప్రపంచ నేత లు రాజ్‌ఘాట్‌ కు చేరుకొని బాపూ జీ కి శ్రద్ధాంజలి ని అర్పించిన ఆ దృశ్యాన్ని ఎవరు మాత్రం మరిచిపోగలరు! బాపూ జీ ఆలోచన లు ప్రపంచవ్యాప్తం గా నేటికీ ఎంత సందర్భోచితం గా ఉన్నాయో అనడానికి ఇదే పెద్ద నిదర్శనం. గాంధీ జయంతి మొదలుకొని దేశమంతటా పరిశుభ్రత కు సంబంధించిన అనేక కార్యక్రమాలు మొదలవుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను. కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు అన్నిటి లో స్వచ్ఛతా హీ సేవా అభియాన్అత్యంత ఉత్సాహం గా సాగుతున్నది. ఇండియన్ స్వచ్ఛతా లీగ్‌ లో కూడా చాలా మంచి భాగస్వామ్యం కనిపిస్తోంది. ఈ రోజు న నేను మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం ద్వారా దేశప్రజలందరికీ ఒక అభ్యర్థన ను చేయాలి అని అనుకొంటున్నాను. పరిశుభ్రత పై పెద్ద కార్యక్రమాన్ని అక్టోబర్ 1 వ తేదీ నాడు ఆదివారం ఉదయం 10 గంటల కు నిర్వహించడం జరగబోతున్నది. మీరు కూడా మీ సమయాన్ని వెచ్చించి పరిశుభ్రత కు సంబంధించినటువంటి ఈ ప్రచారం లో సహకరించండి. మీరు మీ వీధి, పరిసరాలు, పార్కు లు, నది, సరస్సు లేదా ఏదైనా ఇతర బహిరంగ ప్రదేశం లో ఈ స్వచ్ఛత ప్రచారం లో జతపడవచ్చును. అమృత్ సరోవర్ ల నిర్మాణం జరిగిన ప్రదేశాల లో పరిశుభ్రత ను పాటించాలి. ఈ పరిశుభ్రత చర్య గాంధీ జీ కి నిజమైన శ్రద్ధాంజలి అవుతుంది. గాంధీ జయంతి సందర్భం లో తప్పనిసరి గా ఏవైనా ఖాదీ ఉత్పత్తుల ను కొనుగోలు చేయండి అంటూ మీకు నేను మరోసారి గుర్తు చేయాలి అని అనుకొంటున్నాను.

 

నా కుటుంబ సభ్యులారా, మన దేశం లో పండుగ ల కాలం కూడా ప్రారంభమైంది. మీరంతా కూడా ఇంట్లోకి ఏదైనా కొత్త వస్తువు ను కొనాలి అని ఆలోచిస్తూ ఉండి ఉండవచ్చును. నవరాత్రుల లో ఏవైనా శుభకార్యాలను మొదలుపెట్టాలి అని ఎదురుచూస్తూ ఉండి ఉండవచ్చును. ఉల్లాసం తో, ఉత్సాహంతో కూడిన ఈ వాతావరణం లో మీరు వోకల్ ఫర్ లోకల్ మంత్రాన్ని కూడా గుర్తు పెట్టుకోవాలి. వీలు అయినంత వరకు మీరు భారతదేశం లో తయారైన వస్తువుల ను కొనుగోలు చేయాలి. భారతీయ ఉత్పత్తుల ను ఉపయోగించాలి. భారతదేశం లో తయారు చేసిన వస్తువుల ను మాత్రమే బహుమతి గా ఇవ్వాలి. మీ చిన్న ఆనందం వేరొకరి కుటుంబం లో గొప్ప ఆనందాని కి కారణం అవుతుంది. మీరు కొనుగోలు చేసే భారతీయ వస్తువులు నేరుగా మన శ్రమికుల కు, కార్మికుల కు, శిల్పకారుల కు, ఇతర విశ్వకర్మ సోదరుల కు, సోదరీమణుల కు ప్రయోజనం కలుగుతుంది. ప్రస్తుతం చాలా స్టార్ట్- అప్స్ కూడా స్థానిక ఉత్పత్తుల కు ప్రోత్సాహాన్ని ఇస్తున్నాయి. మీరు స్థానిక వస్తువుల ను కొనుగోలు చేస్తే స్టార్ట్- అప్స్ ను నడుపుతున్న యువతీయువకుల కు కూడా ప్రయోజనం అందుతుంది.

 

ప్రియమైన నా కుటుంబ సభ్యులారా, ఈ నాటి మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో ఇప్పటికి ఇంతే. వచ్చేసారి మన్ కీ బాత్’ (మనసు లో మాట) కార్యక్రమం లో మీతో నేను భేటీ అయ్యేటప్పటికి నవరాత్రులు, దసరా గడిచిపోతాయి. ఈ పండుగ ల కాలం లో మీరు కూడాను ప్రతి ఒక్క పండుగ ను ఉత్సాహం తో జరుపుకోవాలి, మీ కుటుంబం లో సంతోషాలు నిండాలి ఇదే ఇదే నేను కోరుకొంటున్నది. ఈ పండుగ ల సందర్భం లో మీకు అనేకానేక శుభాకాంక్షలు. మరిన్ని క్రొత్త అంశాల తో, దేశ ప్రజల కొత్త విజయాల తో మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. మీరు మీ సందేశాల ను నాకు పంపుతూనే ఉండండి. మీ అనుభవాల ను వెల్లడి చేయడం మరువకండి. నేను వేచి ఉంటాను.

 

చాలా చాలా ధన్యవాదాలు.

 

నమస్కారం.

 

 

***


(Release ID: 1960080) Visitor Counter : 202